వాంటెడ్‌.. నైటింగేల్స్‌! | The State Of The Worlds Nursing 2020 Report Over Nurses | Sakshi
Sakshi News home page

వాంటెడ్‌.. నైటింగేల్స్‌!

Published Sat, Apr 11 2020 1:28 AM | Last Updated on Sat, Apr 11 2020 4:58 AM

The State Of The Worlds Nursing 2020 Report Over Nurses - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ ప్రపంచ మానవాళిని గడగడలాడిస్తోంది. ఈ నేపథ్యంలోనే వైద్యరంగంలోని సదుపాయాలు, అనుకూలతలు, ప్రతికూలతలపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. అంతేకాదు.. ఈ ఆపత్కాలంలో ప్రాణాలు పణంగా పెట్టి సేవలందిస్తోన్న వైద్య సిబ్బందికి గుర్తింపూ వస్తోంది. ఇది ఒక్క మన దేశంలోనే కాదు.. భూమి మీద మనిషి మనుగడ ఉన్న ప్రతి దేశం వైద్య రంగానికి సెల్యూట్‌ చేస్తోంది. ఏ దేశంలో ఏం జరు గుతుంది.. ఎక్కడి వైద్య సిబ్బంది ఎలా పని చేస్తున్నారు.. ఆయా దేశాల్లో వైద్యులు తగినంత మంది ఉన్నారా.. వారికి సహాయకంగా ఉండే నర్సులు (మిడ్‌వైఫరీ) చాలినంత మంది ఉన్నారా? వైద్య పరికరాలున్నాయా..? విస్తృత పరిశోధనలకు అవకాశముందా? తగినన్ని ఆర్థిక, వైద్య వనరులున్న దేశాలేమిటీ... ఇలా చెప్పుకుంటూ పోతే వైద్యానికి సంబంధించిన ప్రతి చిన్న అంశమూ ఇప్పుడు చర్చనీయాంశమే.

ఆ కోవలోకే వస్తుంది ‘ది స్టేట్‌ ఆఫ్‌ ద వరల్డ్స్‌ నర్సింగ్‌–2020’నివేదిక. ప్రపంచంలో నర్సుల కొరత తీవ్రంగా ఉందని, రానున్న పదేళ్లలో ఇది చాలా తీవ్రతరమవుతుందని, భవిష్యత్తులో కరోనా లాంటి మహమ్మారులను ఎదుర్కోవాలంటే ‘నైటింగేల్స్‌’ కొరత ఉండొద్దని చెబుతోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇంటర్నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ నర్సెస్‌ (ఐసీఎన్‌), నర్సింగ్‌ నౌలు సంయుక్తంగా రూపొందించిన నివేదిక. ప్రతి యేటా ప్రతి దేశంలో 8 శాతం మంది నర్సులు పెరగాల్సిన ఆవశ్యకతను కూడా వివరిస్తోన్న ఈ రిపోర్ట్‌లోని

ముఖ్యాంశాలు:

  • ప్రపంచంలోని మొత్తం వైద్య సిబ్బందిలో సంఖ్యాపరంగా చూస్తే సగానికి పైగా నర్సులే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా వచ్చే అంటు వ్యాధులు, మహమ్మారులను పారదోలడంలో వీరిదే కీలకపాత్ర. ప్రపంచంలోని అన్ని దేశాల్లో కలిపి పనిచేస్తున్న నర్సులు 2.8 కోట్ల మంది. 2013–18 మధ్య కాలంలో ఈ వృత్తిలోకి వచ్చింది కేవలం 4.7 మిలియన్లే. ప్రస్తుత ప్రపంచ జనాభాను బట్టి మొత్తం 59 లక్షల మంది నర్సుల కొరత ఉంది. ముఖ్యంగా ఆఫ్రికా, ఆగ్నేయాసియా, తూర్పు మధ్యధరా దేశాల్లో నర్సుల కొరత తీవ్రంగా ఉంది. 
  • మొత్తం ప్రపంచంలో పనిచేస్తున్న నర్సుల్లో 80 శాతం మంది కొన్ని దేశాల్లోనే ఉన్నారు. ఆయా దేశాల్లోని జనాభాను కలిపితే ప్రపంచ జనాభాలో సగం కన్నా కొద్దిగా ఎక్కువుంటుంది. అంటే మిగిలిన ప్రపంచంలోని సగం కన్నా జనాభా ఉన్న అన్ని దేశాల్లో కలిపి ఉన్న నర్సులు 20 శాతం మందే. 
  • ప్రతి 8 మంది నర్సుల్లో ఒకరు తాము జన్మించి శిక్షణ పొందిన దేశాల్లో కాకుండా వేరే దేశాల్లో పనిచేస్తున్నారు. 
  • మరో విషయం ఏంటంటే.. ప్రతి ఆరుగురిలో ఒక నర్సు రానున్న పదేళ్లలో రిటైర్‌మెంట్‌ వయసు దాటబోతున్నారు. అంటే రానున్న పదేళ్లలో 17 శాతం మంది నర్సులు పదవీవిరమణ పొందబోతున్నారు. 
  • వైద్యరంగానికి తక్కువగా ఖర్చు పెడుతున్న దేశాలు తమ దేశంలో ఉన్న నర్సుల సంఖ్యలో ప్రతియేటా 8 శాతం పెంచుకోవాలి. ఆ మేరకు వారికి శిక్షణ ఇచ్చి వైద్య రంగంలో ఇముడ్చుకోవాలి. 
  • ఇందుకోసం ప్రతి మనిషి తలసరి ఆదాయంలో 10 యూఎస్‌ డాలర్లను ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంటే మన దేశ లెక్కల ప్రకారం దాదాపు 750 రూపాయల పైమాటే. 
  • ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న నర్సుల్లో 90 శాతం మంది మహిళలే ఉన్నారు. కానీ, కీలకమైన పోస్టుల్లో మాత్రం తక్కువ మంది ఉన్నారు. ఈ పోస్టుల్లో ఎక్కువమంది పురుషులుండటం మంచిది ప్రపంచంలోని దేశాల వారీ పరిస్థితులను, ఆయా దేశాల్లో నర్సింగ్‌ సౌకర్యాలు, తీసుకోవాల్సిన చర్యల గురించిన పూర్తి నివేదిక ఈ ఏడాది మేలో విడుదల కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement