'నర్సుల సంక్షేమానికి ప్రత్యేక డైరెక్టరేట్'
Published Mon, Oct 3 2016 6:16 PM | Last Updated on Mon, Sep 4 2017 4:02 PM
హైదరాబాద్: వైద్య, ఆరోగ్య రంగంలో డాక్టర్లతో పాటు నర్సుల పాత్ర కీలకమని, వారి సంక్షేమం కోసం అతి త్వరలోనే ప్రత్యేక డైరెక్టరేట్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వైద్య శాఖమంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. ట్రైన్డ్ నర్సెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (టీఎన్‌ఏఐ) తెలంగాణ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఫస్ట్ బైనియల్ కాన్ఫరెన్స్ ను ఎర్రగడ్డ సెయింట్ థెరిస్సా ప్రాంగణంలోని జేఎంజే కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై సదస్సును ప్రారంభించారు. అలాగే ‘నర్సెస్: ఏ ఫోర్స్ ఫర్ ఛేంజ్: ఇంఫ్రూవింగ్ హెల్త్ సిస్టమ్స్ రెజీలియన్స్’ అనే థీమ్‌ను మంత్రి ఆవిష్కరించారు.
అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో నర్సుల సంఖ్య ఉండాల్సిన సంఖ్య కంటే తక్కువగా ఉన్నప్పటికీ సమర్ధవంతంగా విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని రకాల వసతులను కల్పించడం జరుగుతుందన్నారు. దీని ద్వారా 20 శాతం అవుట్ పేషెంట్ రోగులు పెరిగారని చెప్పారు. కాళోజీ హెల్త్ వర్సిటీలో నర్సింగ్ విద్య కోసం ప్రత్యేకంగా రిజిస్ర్టార్ పోస్టును ఏర్పాటు చేయాలని అసోసియేషన్ ప్రతినిధులు విన్నవించారు. ఈ మేరకు త్వరలోనే ఆ పోస్టును కూడా ప్రవేశపెట్టి నియామకం జరపనున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం తపిస్తున్నారని తెలిపారు. దేశంలోనే తెలంగాణను గొప్ప రాష్ట్రంగా మార్చేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు.
Advertisement
Advertisement