
తండ్రి ప్రాణం తీసిన కూతురు!
ఆస్తి కోసం ఆస్పత్రిలో కిరాతకం
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆస్తి కోసం ఓ కూతురు కన్నతండ్రి ప్రాణాలనే తీసింది. ఈ ఉదంతం చెన్నైలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గతేడాది సెప్టెంబర్ 5న జరిగిన ఈ దారుణం సీసీటీవీ పుటేజీలతో తాజాగా బయటపడింది. చెన్నైకి చెందిన డాక్టర్ రాజగోపాల్(82) అనారోగ్యానికి గురికావడంతో అతని కుమారుడు జయప్రకాష్ కీల్‌పాక్‌లో తాను నడుపుతున్న ఆదిత్యా ఆస్పత్రిలో ఐసీయూలో చేర్పించి చికిత్స చేస్తున్నారు. ఓ రోజు రాత్రి రాజగోపాల్ కుమార్తె డాక్టర్ జయసుధ, భర్త మనోహరన్, ఆమె కొడుకు డాక్టర్ హరిప్రసాద్‌తో కలసి ఆస్పత్రికి వచ్చింది.
తండ్రితో రహస్యంగా మాట్లాడాల్సి ఉందంటూ నర్సులను బయటకు పంపారు. వెంట తెచ్చుకున్న ఆస్తిపత్రాలపై సంతకం చేయాలని తండ్రిని కోరగా ఆయన నిరాకరించాడు. అయినా, బలవంతంగా అతని వేలిముద్రలు వేయించుకున్నారు. తర్వాత శ్వాస తీసుకునేందుకు సాయపడే ఆక్సిజన్ మాస్క్‌ను తొలగించారు. సెలైన్ పైప్‌నూ కత్తిరించడంతో ఆయనకు తీవ్రంగా రక్తంపోయింది.
ఇంతలో నర్సులు లోపలికి రావడంతో ముగ్గురూ పారిపోయారు. ఈ హత్యాయత్నం తర్వాత ఆయన ఆరోగ్యం మరింత క్షీణించి గత ఏడాది నవంబర్ 2న మరణించారు. ఆస్పత్రి సీసీటీవీ పుటేజీలను ఇటీవల పరిశీలించిన కొడుకు జయప్రకాష్ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు జయసుధ, ఆమె భర్త, ఆమె కొడుకుపై పోలీసులు కేసు పెట్టారు. నిందితులు పరారీలో ఉన్నారు.