ప్రతీకాత్మక చిత్రం
వాషింగ్టన్: కరోనా మహమ్మారిపై పోరాటంలో వైద్యులు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు కీలకంగా పనిచేస్తున్నారు. వారంతా తమ ప్రాణాలను పణంగా పెడుతూ కరోనా బాధితులకు వైద్య సేవలందిస్తున్నారు. విధి నిర్వహణలో ఉండగా కరోనా వైరస్ సోకి అర్ధాంతరంగా మరణిస్తున్నారు. ప్రపంచంలో ఇప్పటిదాకా 1,500 మంది నర్సులు కరోనా బారినపడి ప్రాణాలు వదిలారని ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సెస్(ఐసీఎన్) తాజాగా వెల్లడించింది.
ఇవి కేవలం 44 దేశాలకు సంబంధించిన గణాంకాలే. 1914 నుంచి 1918 దాకా నాలుగేళ్లపాటు జరిగిన మొదటి ప్రపంచ యుద్ధంలోనూ దాదాపు 1,500 మంది నర్సులు మరణించారని అంచనా. మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూస్తే కరోనా కాటుకు ప్రాణాలు కోల్పోయిన నర్సుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని సీఏసీఎన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ హోవార్డ్ కాటన్ చెప్పారు. అన్ని దేశాల్లో నర్సుల మరణాలను పూర్తి స్థాయిలో నమోదు చేయకపోవడం బాధాకరమని అన్నారు. మొదటి ప్రపంచ యుద్ధం కంటే ఇప్పుడు కరోనా రక్కసి ఎక్కువ మంది నర్సుల ప్రాణాలను బలిగొన్నట్లు స్పష్టమవుతోంది.
చాలా దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ మొదలైనట్లు వార్తలొస్తున్నాయి. నర్సుల మరణాలు ఎన్నో రెట్లు పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 2020 సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద నర్సు అండ్ మిడ్‌వైఫ్‌గా జరుపుకుంటున్నారు. అలాగే ఆధునిక నర్సింగ్ వ్యవస్థకు ఆద్యురాలైన ఫ్లోరెన్స్ నైటింగేల్ 200వ జయంతి కూడా ఈ సంవత్సరమే. ఒకవేళ ఫ్లోరెన్స్ నైటింగేల్ ఇప్పుడు జీవించి ఉంటే.. కరోనాపై పోరాటంలో ప్రాణాలు కోల్పోతున్న నర్సుల పరిస్థితి చూసి తీవ్రంగా చలించిపోయేవారని హోవార్డ్ కాటన్ వ్యాఖ్యానించారు.
బ్రిటన్‌లో లాక్‌డౌన్
లండన్: కరోనా వైరస్ పంజా విసురుతుండడంతో బ్రిటన్ వణికిపోతోంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10 లక్షల మార్కును దాటేసింది. వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి మరోసారి పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. గురువారం నుంచి జనమంతా ఇళ్లకే పరిమితం కావాలని, అనవసరంగా బయటకు రావొద్దని యూకే ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు స్టే ఎట్ హోం(లాక్‌డౌన్) నిబంధనలు జారీ చేశారు. డిసెంబర్ 2వ తేదీ వరకు ఇవి అమల్లో ఉంటాయి. అంటే దాదాపు నెల రోజులపాటు లాక్‌డౌన్ అమలు చేయనున్నారు. ఏప్రిల్‌లో బయటపడిన కరోనా కేసుల కంటే ఇప్పుడు మరిన్ని కేసులు నమోదవుతున్నాయని బోరిస్ జాన్సన్ చెప్పారు. మరణాల సంఖ్య సైతం అదేస్థాయిలో పెరుగుతోందని అన్నారు. మహమ్మారి వ్యాప్తిని అరికట్టాలంటే ప్రస్తుతం మన ముందున్న ఏకైక మార్గం సంపూర్ణ లాక్‌డౌన్ మాత్రమే అని స్పష్టం చేశారు. ప్రజలంతా సహకరించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment