అదే దైన్యం..! కోలుకోని తుర్కియే, సిరియా.. 33 వేలు దాటిన మృతుల సంఖ్య | Turkey-Syria earthquake: Death toll goes past 33,000 | Sakshi
Sakshi News home page

Turkey-Syria earthquake: అదే దైన్యం..! కోలుకోని తుర్కియే, సిరియా.. 33 వేలు దాటేసిన భూకంప మృతులు

Published Mon, Feb 13 2023 4:38 AM | Last Updated on Mon, Feb 13 2023 9:15 AM

Turkey-Syria earthquake: Death toll goes past 33,000 - Sakshi

అంటాక్యాలో ఆప్తులను కోల్పోయి రోదిస్తున్న మహిళ

అంటాక్యా (తుర్కియే): ఆరు రోజులు గడిచినా భూకంప ప్రకోపం ప్రభావం నుంచి తుర్కియే, సిరియా ఏమాత్రమూ తేరుకోలేదు. కుప్పకూలిన వేలాది భవనాల శిథిలాల నుంచి ఇంకా మృతదేహాలు బయట పడుతూనే ఉన్నాయి. మరోవైపు లక్షలాది మంది సర్వం పోగొట్టుకుని కట్టుబట్టలతో నిరాశ్రయులుగా మిగలడంతో ఈ విపత్తు క్రమంగా పెను మానవీయ సంక్షోభంగా మారుతోంది. వారికి కనీస వసతులు కల్పించడం కూడా ప్రభుత్వానికి సవాలుగా పరిణమిస్తోంది. దాంతో బాధితుల్లో ఆక్రోశం ఆగ్రహంగా మారి కట్టలు తెంచుకుంటోంది.

మరోవైపు రెండు దేశాల్లో మృతుల సంఖ్య ఇప్పటికే 33 వేలు దాటేసింది. తుర్కియేలోనే కనీసం 80 వేల మందికి పైగా గాయపడ్డారు. మృతదేహాలను సామూహికంగా ఖననం చేస్తున్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. వెలికితీత, సహాయ కార్యక్రమాలు నత్తనడకన నడుస్తుండటం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. భూకంపం రావచ్చని ముందే సమాచారమున్నా దాన్ని ఎదుర్కొనేందుకు సరైన చర్యలు తీసుకోలేదంటూ కూడా ఇంటా బయటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

భవన నిర్మాణ నిబంధనలను ఉల్లంఘించి భారీ జన నష్టానికి కారకులయ్యారంటూ తుర్కియేలో వందలాది మంది కాంట్రాక్టర్లను అరెస్టు చేస్తున్నారు. తుర్కియేలో ఈ శతాబ్ది విపత్తుగా పరిగణిస్తున్న ఈ భూకంపం ధాటికి 500 కిలోమీటర్ల పరిధిలో 1.3 కోట్ల మంది తీవ్రంగా ప్రభావితులయ్యారు. సిరియాలోనూ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. భూకంప ప్రభావిత ప్రాంతాలు ప్రభుత్వ, వేర్పాటువాదుల అధీనంలోని ప్రాంతాల మధ్య విస్తరించడం సహాయ చర్యలకు అడ్డంకిగా మారింది. ఇప్పటిదాకా 4,000కు పైగా మరణించారని అంచనా.

వీరంతా మృత్యుంజయులు
తుర్కియేలో ఓ రెండు నెలల చిన్నారిని ఏకంగా 128 గంటల తర్వాత శిథిలాల నుంచి సజీవంగా రక్షించారు! అదియమాన్‌ నగరంలో ఓ ఆరేళ్ల బాలున్ని ఏకంగా 151 గంటల అనంతరం ఆదివారం కాపాడారు. ఈ కార్యక్రమాన్ని టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేయడం విశేషం! మరో చిన్నారి బాలికను కూడా 150 గంటల తర్వాత కాపాడారు. అంటాక్యాలో మరో 35 ఏళ్ల వ్యక్తిని 149 గంటల తర్వాత కాపాడారు. శిథిలాల కింద చిక్కిన వారిని గుర్తించేందుకు థర్మల్‌ కెమెరాలు తదితర మార్గాల్లో తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. భారత్‌తో పాటు పలు దేశాల నుంచి వచ్చిన సిబ్బంది అహోరాత్రాలు సహాయ, పునరావాస కార్యక్రమాల్లో చెమటోడుస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement