తుర్కియే- సిరియా భూకంపాలు: కదిలే భూమిని కనిపెట్టలేమా! | Turkey Syria Earthquake How Prevent Deadly Damage Funday Cover Story | Sakshi
Sakshi News home page

తుర్కియే- సిరియా భూకంపాలు: కదిలే భూమిని కనిపెట్టలేమా!

Published Sun, Feb 26 2023 11:37 AM | Last Updated on Sun, Feb 26 2023 12:00 PM

Turkey Syria Earthquake How Prevent Deadly Damage Funday Cover Story - Sakshi

మనిషి చూపులు అంతరిక్షం అంచులను తాకుతున్నాయి!
కోటానుకోట్ల కిలోమీటర్ల దూరంలో ఏముందో? ఏం జరుగుతుందో..
దుర్భిణుల సాయంతో ఇట్టే పసిగట్టగలుగుతున్నాం! కానీ..
మన కాళ్లకింద నేల లోపలి రహాస్యాలు మాత్రం..
ఇప్పటికీ చేతికి చిక్కకుండానే ఉన్నాయి!
తుర్కియే- సిరియాల్లో ఇటీవలి భూకంపాలు రెండూ.. ఇందుకు తాజా నిదర్శనం!
వాన రాకడ.. ప్రాణం పోకడలను కొంచెం అటు ఇటుగానైనా గుర్తించగల మానవ మేధ..భూకంపాల విషయానికి వచ్చేసరికి ఎందుకు విఫలమవుతోంది?

ఫిబ్రవరి ఆరు.. 2023..
తెలతెలవారుతుండగానే తుర్కియే ఆగ్నేయ ప్రాంతాన్ని మహా భూకంపం కుదిపేసింది. ప్రజలింకా నిద్రలో ఉండగానే.. భవనాలు పేకమేడల్లా కుప్పకూలిపోయాయి. ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా ముంచుకొచ్చిన ఈ విలయం తాకిడికి వేలమంది ప్రాణాలు కోల్పోయారు. ఎలక్ట్రానిక్‌ పరికరాలపై 7.8 తీవ్రతతో నమోదైన భూకంపం గురించి ప్రపంచానికి తెలిసింది కూడా ప్రకంపనల ద్వారానే అంటేనే ఈ భూకంపాలు ఎంత నిశ్శబ్దంగా మనిషిని కబళించగలవో ఇట్టే అర్థమైపోతుంది. తుర్కియేలో తొలి భూకంపం సంభవించిన కొన్ని గంటల తరువాత సిరియా ఉత్తర ప్రాంతంలో సుమారు 7.5 తీవ్రతతో రెండో భూకంపం సంభవించింది. 



రెండు భూకంపాల కేంద్రాలూ భూమికి అతితక్కువ లోతులోనే పుట్టాయి. దీంతో కదలికల తీవ్రత ఎక్కువగా ఉండింది. ప్రధాన భూకంపం తరువాత వచ్చిన ప్రకంపనలూ ఎక్కువ కాలం కొనసాగాయి. రక్షణ చర్యలకు విఘాతం కలిగించే స్థాయిలో ఇవి ఉండటం గమనార్హం. సహాయక పనుల కోసం అక్కడికి చేరుకున్న వారు కూడా..  నేల కుప్పకూలిపోవడం, గ్రౌండ్‌ లిక్విఫికేష¯Œ  వంటి ప్రమాదాల్లో చిక్కుకునే రిస్క్‌ ఉందని అమెరికా జియలాజికల్‌ సర్వే హెచ్చరించింది కూడా. రోజులు గడుస్తున్న కొద్దీ శిథిలాల మధ్య చిక్కుకున్న వారిని రక్షించడం వీలైంది. 228 గంటల తరువాత కూడా కొంతమంది ప్రాణాలతో బయటపడటం అందరికీ ఊరటనిచ్చింది కానీ.. అప్పటి నుంచి ఇప్పటివరకూ అందరి మనసులను.. ఈ భూకంపాలను ముందుగానే ఎందుకు గుర్తించలేకపోయామన్న ప్రశ్న మాత్రం వేధిస్తూనే ఉంది.

తుర్కియే, సిరియాల్లో సంభవించిన భూకంపాలతో సుమారు 41 వేల మంది మరణించినట్లు లెక్కలు చెబుతున్నాయి. గాజియాన్‌టెప్‌ పట్టణం సమీపంలో తొలి భూకంపం తరువాత కూడా పలుమార్లు భూమి కంపించింది. ఈ ఆఫ్టర్‌షాక్స్‌ మధ్యలోనే ఇంకో భూకంపమూ సంభవించింది. తొలి భూకంపం తీవ్రత 7.8. ఆ లెక్కల ప్రకారం ఇది చాలా పెద్ద భూకంపం. భూమి లోపల వంద కిలోమీటర్ల పొడవైన ఫాల్ట్‌లైన్‌ లో రావడంతో పరిసరాల్లోని భవనాలకు తీవ్ర నష్టం జరిగింది.

ఏటా సంభవించే అత్యంత ప్రమాదకరమైన భూకంపాలను పరిగణనలోకి తీసుకుంటే గత పదేళ్లలో కేవలం రెండు మాత్రమే ఈ స్థాయిలో ఉండటం, అంతకుముందు పదేళ్లలోనూ నాలుగు మాత్రమే ఈ స్థాయిలో ఉండటం గమనార్హం. అలాగని కేవలం ప్రకంపనల ఫలితంగానే ప్రాణ నష్టం ఎక్కువగా ఉందని కూడా చెప్పలేం. ఎందుకంటే ప్రజలు ఇళ్లల్లో నిద్రలో ఉన్న సమయంలోనే ప్రమాదం జరగడం వల్ల ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఇంకో కారణం.. ఆ ప్రాంతాల్లోని భవనాల దృఢత్వం! తుర్కియే, సిరియా.. రెండింటిలోనూ భూకంపాలను తట్టుకోగల భవనాలు దాదాపుగా లేవని నిపుణులు గుర్తు చేస్తున్నారు.



200 ఏళ్లుగా భూకంపాల్లేవు..
తుర్కియే, సిరియాల్లో గత 200 ఏళ్లుగా చెప్పుకోదగ్గ తీవ్రతతో భూకంపాలు లేవు. పోనీ చిన్నస్థాయిలోనైనా ప్రకంపనలేవైనా నమోదయ్యాయా? అంటే అదీ లేదు. దీంతో ఆ ప్రాంతంలో భూకంపాల సన్నద్ధత కూడా తక్కువగానే ఉండింది. 1970 నుంచి ఈ ప్రాంతంలో ఆరు కంటే ఎక్కువ తీవ్రత కలిగిన భూకంపాలు మూడే మూడు నమోదయ్యాయి. ఇంతకీ భూకంపాలు ఎందుకొస్తాయి? ఎలా వస్తాయన్న అనుమానం కలుగుతోందా? సమాధానాలు తెలుసుకుందాం! కాకపోతే ఇందుకోసం భూమి నిర్మాణాన్ని కొంచెం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

ఉల్లిపాయ మాదిరిగానే భూమి కూడా పొరలు పొరలుగా ఉంటుందని మనం చదువుకుని ఉంటాం. ఈ పొరల్లో అన్నింటికంటే పైన ఉన్నదాన్ని క్రస్ట్‌ అంటారు. మన కాళ్ల కింద మొదలై కొన్ని కిలోమీటర్ల లోతు వరకూ ఉంటుంది ఈ పొర. దాని దిగువన మాంటెల్, అంతకంటే దిగువన కోర్‌ అని పేర్లున్న పొరలు ఉంటాయి. ఇప్పుడు పై పొర క్రస్ట్‌ గురించి కొంచెం వివరంగా.. భూమి మొత్తం ఇది ఒకే ఒక్కటిగా ఉండదు.

ముక్కలు ముక్కలుగా ఉంటుంది. ఒక్కో ముక్కను టెక్టానిక్‌ ప్లేట్‌ అని అంటారు. ఈ ప్లేట్లు స్థిరంగా కాకుండా.. కదులుతూ ఉంటాయి. టెక్టానిక్‌ ప్లేట్లు కదిలే క్రమంలో ఘర్షణ పుడుతూంటుంది. రెండు ప్లేట్లు ఢీకొనడం.. లేదా ఒకదాని కిందకు ఒకటి చేరడం.. లేదా ఒకదానికి ఒకటి దూరంగా జరగడం వంటి నాలుగు రకాల కదలికల కారణంగా ఆయా ప్రాంతాల్లో ఘర్షణ జరగుతూ ఉంటుంది. అత్యధిక పీడనం నిల్వ అవుతూ వస్తుంది. ఈ పీడనం కారణంగా ఒక్కోసారి ఒక ప్లేట్‌ అకస్మాత్తుగా ఇంకోదానిపై జరగడం వల్ల అప్పటివరకూ అక్కడ నిల్వ ఉన్న పీడనం భూకంపం రూపంలో విడుదల అవుతుంది. 

తుర్కియే, సిరియాల్లో భూకంపాలు సంభవించిన ప్రాంతం మూడు టెక్టానిక్‌ ప్లేట్ల సంగమ స్థలం. అనటోలియా, అరేబియన్‌ , ఆఫ్రికా ప్లేట్లు కలిసే చోటనే భూకంపాలు సంభవించాయి. అరేబియా ప్లేట్‌ ఉత్తరం వైపు కదులుతూ అనటోలియన్‌  ప్లేట్‌పై ఒత్తిడి తెచ్చిన కారణంగా భూకంపం సంభవించింది. 

1822 ఆగస్టు 13న ఈ ప్రాంతంలోనే 7.4 తీవ్రతతో ఒక భూకంపం సంభవించింది. ఆ తరువాత ఆ స్థాయి భూకంపం వచ్చింది ఈ ఏడాదే. 1822 నాటి భూకంపంలోనూ ఈ ప్రాంతంలో ప్రాణనష్టం, విధ్వంసం ఎక్కువగానే నమోదైంది. ఒక్క అలెప్పో నగరంలోనే 7000 మంది ప్రాణాలు కోల్పోయినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఏడాది పాటు కొనసాగిన ప్రకంపనలు మరింత విధ్వంసం సృష్టించాయి. తాజాగానూ ప్రకంపనలు మరికొంత కాలం కొనసాగుతాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 

ముందుగానే ఎందుకు గుర్తించలేకపోయాం?
వాస్తవానికి భూకంపాలను ముందుగానే గుర్తించేందుకు ఇప్పటివరకూ ఎలాంటి టెక్నాలజీ లేదు. చాలా చాలా కష్టమైన వ్యవహారమీ భూకంపాలు. భూకంపం జరిగిన తరువాత కూడా కేవలం ఒకట్రెండు నిమిషాలు మాత్రమే దాని సంకేతాలు మనకు తెలుస్తూంటాయి. అందుకే భూకంపాల గురించి తెలిసే ఈ అతికొద్ది సమాచారం ఆధారంగా వాటిని ముందుగానే గుర్తించడం పెను సవాలుగా మారింది. నిజానికి 1960ల నుంచే భూకంపాలను ముందుగా గుర్తించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి.

టెక్టానిక్‌ ప్లేట్ల అమరిక, లోటుపాట్లు (ఫాల్ట్‌లైన్స్‌) అత్యంత సంక్లిష్టంగా ఉన్న కారణంగా ఇప్పటివరకూ సాధించింది కొంతే. ప్రపంచం మొత్తం వ్యాపించిన ఫాల్ట్‌లైన్లకు తోడు భూమి లోపలి నుంచి పలు రకాల శబ్దాలు, సంకేతాలు వెలువడుతూండటం కూడా పరిస్థితిని మరింత జటిలం చేశాయి. భూకంపం ఎక్కడ వస్తుంది? ఎప్పుడు వస్తుంది? తీవ్రత ఎంత? అన్న మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పగల పద్ధతిని ఆవిష్కరించగలిగితే మానవాళికి ఎంతో మేలు జరుగుతుంది. కానీ ఇప్పటివరకూ ఈ ప్రశ్నలకు సమాధానం లభించలేదు.

జంతువుల ప్రవర్తన నుంచి అయనోస్ఫియర్‌ వరకూ..
భూకంపాలను ముందుగానే గుర్తించేందుకు శాస్త్రవేత్తలు ఇప్పటివరకూ అనేక ప్రయత్నాలు చేశారు. భూకంపం వచ్చే ముందు జంతువులు ప్రవర్తించే తీరుతో మొదలుపెట్టి భూ వాతావరణపు పైపొర అయనోస్ఫియర్‌లోని కణాల పరిశీలన వరకూ అనేక రకాలుగా యత్నిస్తున్నారు. తాజాగా మనుషులు గుర్తించలేరేమో అని.. సూక్ష్మమైన సంకేతాలను గుర్తించేందుకు కృత్రిమ మేధను వాడే ప్రయత్నమూ జరుగుతోంది. భూమి మాదిరిగానే ఉండే మోడల్‌ను ఉపయోగించి మెషిన్‌  లెర్నింగ్‌ సాయంతో ఇటలీలోని సేపియేంజా యూనివర్సిటీ అధ్యాపకుడు క్రిస్‌ మరోన్‌  ప్రయత్నిస్తున్నారు. అయితే పరిశోధనశాలలో తాము భూకంపాలను బాగానే గుర్తించగలగుతున్నామని, వాస్తవ పరిస్థితుల్లో మాత్రం విఫలమవుతున్నామని మరోన్‌  తెలిపారు.

చైనాలో శాస్త్రవేత్తలు అయనోస్ఫియర్‌లో విద్యుదావేశంతో కూడిన కణాలు భూకంపాల వల్ల ఏవైనా కంపనలు సృష్టించాయా? వాటి ద్వారా ముందస్తు గుర్తింపు వీలవుతుందా? అన్నది పరిశీలిస్తున్నారు. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎర్త్‌ క్వేక్‌ ఫోర్‌క్యాస్టింగ్‌కు చెందిన జింగ్‌ లియూ అంచనా ప్రకారం భూకంపానికి ముందు రోజుల్లో అయనోస్ఫియర్‌లో మార్పులు జరుగుతాయి. ఫాల్ట్‌ జోన్ల ప్రాంతం పైన భూ అయస్కాంత క్షేత్రంలో మార్పులు రావడం వల్ల విద్యుదావేశ కణాలు కంపనలు సృష్టిస్తాయి. 2010 ఏప్రిల్‌లో కాలిఫోర్నియాలోని బాజా ప్రాంతంలో భూకంపం వచ్చింది.

దానికి  పది రోజుల ముందే అయనోస్ఫియర్‌లో మార్పులను గమనించామని ఆయన చెబుతున్నారు. చైనా ఇంకో అడుగు ముందుకేసి అయనోస్ఫియర్‌లో జరిగే ఎలక్ట్రికల్‌ తేడాలను గుర్తించేందుకు 2018లో ‘చైనా సెసిమో ఎలక్ట్రోమ్యాగ్నెటిక్‌ శాటిలైట్‌’ను ప్రయోగించింది కూడా. గత ఏడాది చైనా ఎర్త్‌క్వేక్‌ నెట్‌వర్క్‌ సెంటర్‌ శాస్త్రవేత్తలు ఒక ప్రకటన చేస్తూ భూకంపానికి 15 రోజుల ముందు అయనోస్ఫియర్‌లోని ఎలక్ట్రాన్ల సాంద్రత గణనీయంగా తగ్గిందని తెలిపారు. 2021 మే, 2022 జనవరి నెలల్లో చైనాలో వచ్చిన భూకంపాలకు ముందు ఈ పరిశీలనలు జరిగాయి. 

ఇజ్రాయెల్‌లోని ఏరియల్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తాము భూకంపాలను 48 గంటల ముందే 83 శాతం కచ్చితత్వంతో గుర్తించగలమని ఇటీవలే ప్రకటించారు. గత 20 ఏళ్లలో అయనోస్ఫియర్‌లోని ఎలక్ట్రాన్‌  కంటెంట్‌లో వచ్చిన మార్పులకు కృత్రిమ మేధను జోడించడం ద్వారా ఇది సాధ్యమైందని వారు చెబుతున్నారు.

ఇవన్నీ ఇలా ఉంటే.. జపాన్‌లో కొంతమంది కొన్ని విచిత్రమైన సూచనలు చేస్తున్నారు. భూకంపాలు వచ్చే అవకాశమున్న ప్రాంతాల్లో నీటి ఆవిరి ఆధారంగా భూకంపాలను ముందుగానే గుర్తించవచ్చునని, అది కూడా 70 శాతం కచ్చితత్వంతో చేయవచ్చునని చెబుతూండటం విశేషం. కాకపోతే ఈ పద్ధతిలో నెల రోజులు ముందు మాత్రమే భూకంపాన్ని గుర్తించ వచ్చు. మరికొందరు భూ గురుత్వాకర్షణ శక్తిలో వచ్చే మార్పుల ఆధారంగా భూకంపాలను గుర్తించవచ్చునని చెబుతున్నారు. మొత్తమ్మీద చూస్తే.. శాస్త్రవేత్తలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఇప్పటికీ భూకంపాలను అవి సంభవించేందుకు ముందుగానే కచ్చితంగా గుర్తించడం సాధ్యంకావడం లేదనేది నిష్ఠుర సత్యం!!

మీకు తెలుసా..?
► యునైటెడ్‌ స్టేట్స్‌ జియలాజికల్‌ సర్వే లెక్కల ప్రకారం భూమి ఏటా కొన్ని లక్షల సార్లు కంపిస్తూంటుంది. వీటిల్లో చాలావాటిని మనం అస్సలు గుర్తించం. తీవ్రత తక్కువగా ఉండటం, లేదా జనావాసాలకు దూరంగా సంభవించడం దీనికి కారణం. అయితే ఏటా సంభవించే భూకంపాల్లో ఏడు లేదా అంతకంటే ఎక్కువ తీవ్రత కలిగినవని దాదాపు 17 వరకూ ఉంటాయి. ఎనిమిది స్థాయి తీవ్రత ఉన్నది ఒక్కటైనా ఉంటుంది. 

► టెక్టానిక్‌ ప్లేట్ల కదలికల కారణంగా హిమాలయాల ఎత్తు పెరుగుతోందని మనం చిన్నప్పుడు చదువుకుని ఉంటాం. అలాగే అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నగరం మొత్తం లాస్‌ ఏంజిలెస్‌ వైపు కదులుతోంది. మన గోళ్లు పెరిగినంత  వేగంగా అంటే ఏడాదికి రెండు అంగుళాల చొప్పున ఈ కదలిక ఉన్నట్లు అంచనా. సా¯Œ  ఆండ్రియాస్‌ ఫాల్ట్‌ రెండు వైపులు ఒకదాని కింద ఒకటి జారిపోతూండటం వల్ల ఇలా జరుగుతోంది. అయితే ఈ రెండు నగరాలు కలిసిపోయేందుకు ఇంకా కొన్ని కోట్ల సంవత్సరాల సమయం ఉందిలెండి!

► 2011 మార్చి 11న జపాన్‌  తీరంలో 8.9 తీవ్రతతో వచ్చిన భూకంపం మన రోజు లెక్కను మార్చేసింది. భూమిలోపలి పదార్థం పంపిణీ అయిన తీరులో భూకంపం మార్పు తేవడంతో భూమి కొంచెం వేగంగా

► భూకంపం తరువాత ఆ ప్రాంతాల్లోని కాలువలు, చెరువుల్లోని నీరు కొంచెం కంపు కొడతాయి. అడుగున ఉన్న టెక్టానిక్‌ ప్లేట్లు కదిలినప్పుడు అక్కడ చిక్కుకుపోయి ఉన్న వాయువులు పైకి రావడం దీనికి కారణం. 

► 2010 ఫిబ్రవరి 27న సంభవించిన 8.8 స్థాయి తీవ్రమైన భూకంపం కారణంగా చిలీలోని కోన్‌ సెప్కియాన్‌  నగరం పశ్చిమం దిక్కుగా సుమారు పది అడుగులు జరిగింది!
మొత్తం భూకంపాల్లో 90 శాతం పసిఫిక్‌ మహా సముద్రంలోని రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ వెంబడి వస్తూంటాయి. 

► 2015లో నేపాల్‌లో వచ్చిన  7.8 స్థాయి తీవ్రమైన భూకంపం కారణంగా పలు హిమాలయ పర్వతాలు కుంగిపోయాయి. ఇందులో ఎవరెస్టు కూడా ఉంది. కనీసం ఒక్క అంగుళం మేర దీని ఎత్తు తగ్గినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
-గిళియారు గోపాలకృష్ణ మయ్యా 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement