Madhya Pradesh: Woman Police Anila Parashar donate blankets to homeless people: నిరాశ్రయులై వీధుల్లో తలదాచుకునేవారికి ఒంటిమీద బట్టలే సరిగా ఉండవు. ఇక చలి నుంచి రక్షణకు కంబళ్లు, దుప్పట్లు అంటే కష్టమైన పనే. అలాంటి వారు పడే ఇబ్బందులను గుర్తించిన మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లో మహిళా సబ్ ఇన్‌స్పెక్టర్ అనిలా పరాశర్ రాత్రిపూట వీధుల్లో పడుకునే నిరాశ్రయులకు దుప్పట్లు, రగ్గులు పంచుతూ ఉదారతను చాటుకుంటోంది. ఈ మహిళా పోలీస్ చేసే పని పై అధికారులను కూడా కదిలించింది. పోలీసులే బృందాలుగా ఏర్పడి ఈ కార్యక్రమాన్ని మూడేళ్ల నుంచి నిర్విఘ్నంగా కొనసాగేలా చేస్తోంది. అనిలా పరాశర్ చేస్తున్న ఈ దాతృత్వాన్ని తెలుసుకోవడానికి అక్కడి ఏ పోలీసును అడిగినా ఆమె గొప్పతనాన్ని చెబుతారు.
కదిలించిన సంఘటనలు
మూడేళ్ల క్రితం చలికాలంలో రాత్రిపూట ఆమె విధుల్లో భాగంగా పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు విపరీతమైన చలి కారణంగా కొందరు మహిళలు, వృద్థులు చనిపోవడం చూశామని చెబుతారు అనిల. ‘ఆ హృదయవిదారక సంఘటనలు ఇప్పటికీ నా కళ్లముందు కదులుతూనే ఉంటాయి. ఆ పరిస్థితులను గమనించాక ఇంటి నుంచి దుప్పట్లు, కంబళ్లు తీసుకెళ్లి పంచేదాన్ని.
పోలీసుల బృందాలనే కదిలించి..
అది కాస్తా ఓ కార్యక్రమంగా ప్రారంభమైంది. పరిస్థితి వివరించినప్పుడు నా భర్త వికాస్ పరాశర్ కూడా ఇందుకు సాయం చేస్తా అని చెప్పాడు. దీంతో ‘తాండ్ కే సిపాయ్’ (శీతల సైనికుడు) అనే పేరుతో ఓ కార్యక్రమం ఏర్పాటు చేశాం. మా పోలీసులూ ఇందుకు ముందుకు వచ్చారు. ఒక బృందం ఏయే ప్రాంతాల్లో నిరాశ్రయులు ఉన్నారో గుర్తిస్తుంది. ఆ పై నిర్దిష్ట ప్రాంతాల్లో మరో బృందం దుప్పట్లు, కంబళ్లు పంపిణీ డ్రైవ్ నిర్వహిస్తుంది’ అని వివరిస్తారు ఈ మహిళా పోలీస్.
సామాజిక సంస్థలూ చేయూత
‘ఈ ధార్మిక కార్యక్రమంలో నేనూ పాలుపంచుకోవడం అనిల భర్తగా పిలిపించుకోవడం నాకు చాలా గర్వంగా ఉందంటారు ఈ మహిళా పోలీస్ భర్త వికాస్ పరాశర్. అనిలా ప్రారంభించిన ఈ కార్యక్రమం మూడేళ్లుగా తన సేవలు అందిస్తోంది. కిందటేడాది ఎనిమిది వేలకు పైగా దుప్పట్లు, కంబ్లళ్లను పంచింది. ‘ఇండోర్‌లో రాత్రిళ్లు పనిచేసే సమయాల్లో అధికారులు సైతం చలిలో వణుకుతూ విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితులు ఎదురవు తుంటాయి. అలాంటి పరిస్థితిలో పోలీసులకు దుప్పట్లను ఇచ్చేవారు. అందులో భాగంగానే పోలీసులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారు.
ఇప్పుడు కొన్ని సామాజిక సంస్థలు కూడా చేరాయి. దీంతో ఈ కార్యక్రమం ద్వారా అసుపత్రులు, అనాథ శరణాలయాల్లోనూ దుప్పట్లు, కంబళ్లు పంపిణీ చేస్తున్నారు. సాధారణంగా ఖాకీ డ్రెస్ వేసుకున్నవారిలో కాఠిన్యమే కనిపిస్తుంది అనుకుంటారు చాలా మంది. కానీ, సమాజ రక్షణలో నలుదిక్కులను గమనించేవారికే సమస్యలు బాగా కనిపిస్తాయని, వాటికి పరిష్కార మార్గం కూడా వారికే బాగా తెలుస్తుందని నిరూపిస్తుంది అనిలా పరాశర్. మహిళా పోలీసుగా ఒక చిన్న అడుగుతో మొదలైన ఈ కార్యక్రమం ఇప్పుడు పోలీసు బృందాలే పనిచేసే దిశగా ఎదిగింది.
Comments
Please login to add a commentAdd a comment