కరీంనగర్ పట్టణంలో నిరాశ్రయులను నైట్‌షెల్టర్లకు తరలిస్తున్న మెప్మా సిబ్బంది
సాక్షి, హైదరాబాద్: ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ.. చలికి వణుకుతూ ఫుట్‌పాత్‌ల మీద, రోడ్ల పక్కన నరకయాతన అనుభవించే అభాగ్యులను హైదరాబాద్‌తో పాటు అన్ని పట్టణాల్లో చూస్తుంటాం. ఈవిధంగా తల దాచుకునేందుకు అగచాట్లు పడే అనాథలు, ఒంటరి యాచకులు, అభాగ్యులు, మానసిక రుగ్మతలతో బాధపడేవారికి అండగా నిలవాల్సిన బాధ్యత స్థానిక పాలకుల దేనని గతంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కానీ సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఆచరణలోకి తీసుకురావడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి.
వాస్తవానికి ఇలాంటి వారి కోసం జాతీయ పట్టణ జీవనోపాధి పథకం (నేషనల్ అర్బన్ లైవ్‌లీహుడ్ మిషన్ – ఎన్‌యూఎల్‌ఎం) కింద రాత్రి ఆవాసాలు (నైట్ షెల్టర్లు) ఏర్పాటు చేయాల్సిన బాధ్యత పట్టణ పాలక సంస్థలదే. ఈ విధంగా నైట్ షెల్టర్లు ఏర్పాటు చేసే ప్రక్రియకు 2014లో శ్రీకారం చుట్టినా.. పట్టణ సంస్థల చిత్తశుద్ధి లోపంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కేవలం 35 నైట్ షెల్టర్లు మాత్రమే ఏర్పాటయ్యాయి. వీటిలో 17 సెంటర్లు జీహెచ్‌ఎంసీ పరిధిలోని వివిధ సర్కిళ్లలో ఉండగా, మిగతా 141 పట్టణ స్థానిక సంస్థల్లో ఉన్న నైట్ షెల్టర్లు కేవలం 18 మాత్రమే కావడం గమనార్హం. కాగా ఉన్న నైట్ షెల్టర్లు కూడా సరైన నిధుల లేమి, నిర్వహణ లోపంతో ఓ ఉదాత్త కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో విఫలమవుతున్నాయి.
ఖమ్మం నైట్‌షెల్టర్‌లో ఆశ్రయం పొందుతున్న నిరాశ్రయులు
నవంబర్‌లో ర్యాపిడ్ సర్వే
రాష్ట్ర వ్యాప్తంగా మరో 23 కేంద్రాల ఏర్పాటు ప్రక్రియ వేగంగా సాగుతోంది. మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ అండ్ కమిషనర్ (సీడీఎంఏ) సత్యనారాయణ నేతృత్వంలో ఈ కొత్త సెంటర్ల నిర్మాణం జరుగుతోంది. తాజాగా రాష్ట్రంలో నిరాశ్రయుల ర్యాపిడ్ సర్వే ప్రక్రియ నవంబర్ నెలలో ప్రారంభం కానుంది. తదనుగుణంగా 6 కొత్త సెంటర్లను జనవరి నాటికి ప్రారంభించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
అన్ని షెల్టర్లలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తూ, బెడ్లు, ట్రంకులు, బాత్ రూం సదుపాయం కల్పించాలి. ఆశ్రయం పొందేవారిలో పనిచేసుకోలేని పరిస్థితుల్లో ఉన్న 10 శాతం మందికి ఆహారాన్ని అందించాల్సి ఉంటుంది. చాలాచోట్ల ఈ పరిస్థితి లేదన్న ఫిర్యాదుపై ... ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే గుర్తించి తగిన చర్యలు తీసుకోనున్నట్లు ఓ అధికారి తెలిపారు.
స్వచ్ఛంద సంస్థల నిర్వహణలో..
పలు స్వచ్ఛంద సంస్థలు ఈ నైట్ షెల్టర్లు నిర్వహిస్తున్నాయి. ఇందుకోసం మెప్మా ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. నైట్ షెల్టర్ నిర్వహణకు తొలి సంవత్సరం రూ. 6 లక్షలు, మరుసటి ఏడాది నుంచి ఏటా రూ.4 లక్షల చొప్పున చెల్లిస్తుంది. ఈ నిధులకు అదనంగా స్వచ్ఛంద సంస్థలు విరాళాలు సేకరించి నిర్వహణ బాధ్యతలు చూస్తాయి. షెల్టర్లలో ఆశ్రయం పొందేవారికి బ్లాంకెట్లు, ఫ్యాన్లు, ఇతర సౌకర్యాల కల్పనకు కొన్ని సంస్థలు దాతల నుంచి సహకారాన్ని తీసుకుంటున్నాయి.
రామగుండంలో మూడు షెల్టర్లున్నా..
రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో మూడు నైట్‌షెల్టర్ల ఏర్పాటుకు 2013లో ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఒక్కో నైట్‌షెల్టర్‌కు రూ.44 లక్షలు చొప్పున కేటాయించారు. గోదావరిఖని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో, ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రి ఆవరణలో, రామగుండం రైల్వే స్టేషన్ సమీపంలో 2019 నుంచి వీటిని వినియోగంలోకి తీసుకొచ్చారు.
ఒక్కో షెల్టర్‌లో 50 మంది వరకు ఆశ్రయం పొందే వీలుండగా ఇందులో ఐదుగురికి మాత్రం భోజనం పెడతారు. మరోవైపు సరైన సదుపాయాలు, టాయ్‌లెట్‌లు లేక బస చేయడానికి నిరాశ్రయులు పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. అధికారులు రాత్రుళ్లు సర్వే చేపట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు నైట్‌షెల్టర్ల గురించి ప్రచారం కూడా చేయకపోవడంతో నిరాశ్రయులకు రోడ్లు, ఫుట్‌పాత్‌లే దిక్కవుతున్నాయి.
ఖమ్మంలో భేష్..
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో రెండు నైట్ షెల్టర్లు ఉన్నా యి. ప్రభుత్వ ఆస్పత్రిలో మెప్మా ఆధ్వర్యంలో నైట్ షెల్టర్ ను ఏర్పాటు చేశారు. ఇక్కడ 20 మంది పడుకునేందుకు బెడ్‌లు ఏర్పాటు చేసి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఈ నైట్ షెల్టర్‌ను 5 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. మరొకటి బైపాస్ రోడ్డులోని ప్రభుత్వ భవనంలో ఏర్పాటు చేశారు. ఇక్కడ 200 మంది ఉండేలా సౌకర్యాలు కల్పించారు. భవనంలో పై అంతస్తులో 100 మంది మహిళలు, గ్రౌండ్ ఫ్లోర్‌లో 100 మంది పురుషులు ఉండొచ్చు. ఈ షెల్టర్‌ను అన్నం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.
ఎప్పటికప్పుడు జరగని సర్వే
ఎన్‌యూఎల్‌ఎం కింద రాష్ట్రంలో మున్సిపల్ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన మిషన్ (మెప్మా) ఆధ్వర్యంలో నడుస్తున్న 35 నైట్ షెల్టర్లలో 1,990 మంది మాత్రమే ఆశ్రయం పొందేందుకు అవకాశం ఉంది. ఖమ్మం బైపాస్ రోడ్డులోని టాకులపల్లి బ్రిడ్జి దగ్గర డాక్టర్ అన్నం సేవా ఫౌండేషన్ నిర్వహిస్తున్న నైట్‌షెల్టర్‌లో మాత్రమే అత్యధికంగా 350 మంది ఆవాసం ఉండేందుకు అవకాశం ఉంది.
ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆసు పత్రి వద్ద ఆదిలాబాద్ పట్టణ సమాఖ్య నిర్వహిస్తున్న కేంద్రంలో 100 మంది, హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రి కేంద్రంలో 118 మంది, బేగంపేట కంట్రీక్లబ్ వద్ద గల కేంద్రంలో 130 మంది, కోఠి ఆర్టీసీ బస్టాండ్ వద్ద సెంటర్‌లో 100 మంది నిరాశ్రయులు ఉండేందుకు వీలుగా నైట్ షెల్టర్లు ఉన్నాయి. మిగతా అన్ని చోట్లా 15 నుంచి అత్యధికంగా 77 మంది నిరాశ్రయులు మాత్రమే రాత్రి వేళల్లో ఉండేందుకు ఏర్పాట్లు ఉన్నా యి.
మెప్మా ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు సర్వే నిర్వహించి, ఆశ్రయం లేక ఇబ్బంది పడుతున్న వారిని గుర్తించి ఈ కేంద్రాల్లో చేర్చాల్సి ఉన్నప్పటికీ.. ఈ తర హా కసరత్తు సరిగా జరగడం లేదనే ఫిర్యాదులున్నాయి. ఉన్న కొన్ని షెల్టర్లలో ప్రజలు పూర్తిస్థాయిలో తలదాచుకునే పరిస్థితులు లేవనే విమర్శలు కూడా ఉన్నాయి.
నిధుల్లేవు.. వసతుల్లేవు..
కరీంనగర్, వరంగల్, సిద్దిపేట, ఆదిలాబాద్ వంటి చోట్ల మెప్మా పర్యవేక్షణ లోపంతో షెల్టర్లలో ఉన్న వారికి మౌలిక వసతుల కల్పన జరగడం లేదనే ఆరోపణలున్నాయి. కొన్నిచోట్ల నిర్వహణకు అవసరమైన సొమ్ము అందడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. వరంగల్‌లోని రెండు సెంటర్లలో ఒక సమయంలో 233 మంది నిరాశ్రయులకు నైట్‌షెల్టర్లు ఆశ్రయం కల్పించాయి. అయితే నెలకు రూ.33 వేల చొప్పున చెల్లించాల్సిన నిర్వహణ ఖర్చులను మెప్మా నుంచి అందలేదు. దీంతో నిర్వహణ గాడితప్పింది. రామగుండంలో ఒక్కో షెల్టర్‌లో 50 మంది వరకు ఉండే వీలున్నా, 10 మంది కూడా ఉండడం లేదు.
వాస్తవానికి గోదావరి ఖని, రామగుండం ప్రాంతాల్లో రోడ్లపక్కన చలికి గజగజ వణుకుతూ పడుకునేవారు కోకొల్లలు. ఇక రాష్ట్రవ్యాప్తంగా వీరిసంఖ్య వేలల్లోనే ఉండే అవకాశం ఉండగా..వివిధ కారణాల రీత్యా ప్రస్తుతం నైట్‌షెల్టర్లలో ఆశ్రయం పొందుతున్నవారు కేవలం 1,500 మంది వరకు మాత్రమే ఉండటం శోచనీయం. అనా«థలకు నీడనిస్తున్న ఈ సెంటర్ల విషయంలో మెప్మా మరింత చిత్తశుద్ధితో వ్యవహరించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment