ఇలాంటి అభాగ్యులెందరో..
ఈ ఫొటోను ఒక ఫౌండేషన్ వారు పోలీసులకు ట్విట్టర్‌లో షేర్ చేయగా, స్పందించిన మంత్రి కేటీఆర్ కూకట్‌పల్లి జోనల్ అధికారులను ఆదేశించడంతో.. ఫతేనగర్ బ్రిడ్జి సమీపంలో ఉన్న ఈమెను షెల్టర్‌హోమ్‌కు తరలించారు. ఇలా ఏ నీడా లేకుండా ఉంటున్నవారు నగరంలో వందలు, వేలసంఖ్యలో ఉన్నారు. మంత్రిలాంటి వారి ఆదేశాలకు స్పందించిన అధికారులు.. అసలు ఇలాంటి వారెందరున్నారో సర్వే చేస్తే ఎక్కువ మందికి ఉపయోగం ఉంటుంది. అడపాదడపా చేసే సర్వేల్లోనూ చాలా తక్కువమంది మాత్రమే లెక్కల్లో ఉంటారు. కారణాలేమిటో తెలియదు. ఉన్న షెల్టర్‌హోమ్‌లనైనా అవసరమైన వారు అందరూ ఉపయోగించుకునందుకు జీహెచ్‌ఎంసీ నుంచి జరిగిన ప్రయత్నాలు లేవు. ప్రతి చలికాలంలో ఒక మొక్కుబడి కార్యక్రమంగా మాత్రమే స్పందిస్తున్నారు.
సాక్షి, హైదరాబాద్: అసలే శీతాకాలం.. రాత్రి వేళ చలి గజగజ వణికించే కాలం.. నగరంలో ఇప్పుడు ఎక్క డ చూసినా.. చలికి గిజగిజలాడుతున్న దేహాలు.. చిక్కి శల్యమైన శరీరాలు.. రోడ్ల మధ్య డివైడర్లపై, ఫుట్‌పాత్‌లతోపాటు ఎక్కడ పడితే అక్కడ విసిరేసినట్లు కనిపిస్తుంటాయి. చలి గాలులకు తట్టుకోలేక, మంచుకత్తులనెదుర్కొనేందుకు ఉన్న శక్తినంతా ముడుచుకోవడానికే వినియోగిస్తాయి. అయినా సంబంధిత యంత్రాంగానికి ఈ దృశ్యాలు కనిపించవు. గ్రేటర్ జనాభాకు అనుగుణంగా సుమారు 200 షెల్టర్‌హోమ్స్ ఏర్పాటు చేయాలి.
చదవండి: వృద్ధురాలిపై పైశాచికం: మద్యం తాగించి.. లైంగిక దాడికి పాల్పడి..
కానీ.. 13 శాశ్వత, 5 తాత్కాలిక షెల్టర్ హోమ్స్ మాత్రమే ఉన్నాయి. ఇవి సైతం అంకెల్లో చెప్పుకోవడానికి తప్ప వాటిలో ఉంటున్నది కొందరే. ఒకప్పుడు నైట్ షెల్టర్లుగా వ్యవహరించిన వీటిని కరోనా అనంతరం షెల్టర్ హోమ్స్‌గా పరిగణిస్తున్నారు. రాత్రివేళల్లోనే కాకుండా ఏ నీడా లేనివారికి రక్షణనిచ్చే షెల్టర్‌హోమ్స్‌గా వీటిని చెబుతున్నారు. అన్ని హోమ్‌లలో కలిపి 960 మందికి వసతి సదుపాయం ఉండగా.. ప్రస్తుతం 323 మంది ఉన్నారు.
ఎందుకిలా..?
ఠిఫుట్‌పాత్‌లపైనే రోజులు వెళ్లదీస్తున్నవారికి షెల్టర్‌హోమ్స్ ఉన్నట్లు తెలియదు. పైనుంచి ఆదేశాలందితే కానీ.. రోడ్లపై ఉన్నవారిని హోమ్స్‌లోకి బల్దియా యంత్రాంగం తరలించదు. ఇది ఓవైపు దృశ్యమైతే.. ఇలాంటివారు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తే ప్రయోజనకరంగా ఉండేదని ఒక స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి వంశీ పేర్కొన్నారు. వీటిని ఏర్పాటు చేసిన ప్రాంతాలకు చాలామంది వెళ్లలేకపోవడంతో అవి పూర్తిస్థాయిలో ఉపయోగపడటం లేదు.
చదవండి: ముసురు వానకు పాడైన పంట.. ఆగిన రైతు గుండె
ఇదే తంతు..
ప్రభుత్వ ఉన్నతస్థాయిలోనూ ఇదే పరిస్థితి. నగరంలో షెల్టర్లు లేనివారికి ఆసరా కల్పించాలని జీహెచ్‌ఎంసీని ఆదేశించారు. షెల్టర్ ఫర్ అర్బన్ హోమ్‌లెస్ (ఎస్‌యూహెచ్) ఏర్పాటు చేయాలని, వాటిల్లో తగిన సదుపాయాలుండాలని ఆదేశించారు. దాంతోపాటు వాటి గురించి తగినంత ప్రచారం చేయాలని, అందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని కోరారు. గత అనుభవాలతో కాబోలు అలాంటి వారు ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించి, వాటిని హాట్‌స్పాట్స్‌గా పరిగణించి వారంలో రెండు పర్యాయాలు సర్వే నిర్వహించి, గుర్తించిన వారిని షెల్టర్‌హోమ్స్‌లోకి తరలించాలని, గుర్తించిన వారి వివరాలతో డేటాబేస్ నిర్వహించాలని సూచించారు.
నైట్ షెల్టర్లున్న ప్రాంతాలివే..
ఉప్పల్ మార్కెట్, సరూర్‌నగర్, పేట్లబుర్జు, శివరాంపల్లి, టప్పాచబుత్రా, గోల్నాక, బేగంపేట ఫ్లై ఓవర్, యూసుఫ్‌గూడ, శేరిలింగంపల్లి, ఆర్‌కేపురం బ్రిడ్జి, బౌద్ధనగర్, మహవీర్ హాస్పిటల్, నిలోఫర్ హాస్పిటల్, కోఠి మెటర్నిటీ హాస్పిటల్, ఈఎన్‌టీ హాస్పిటల్, సయోధ్య ఇనిస్టిట్యూట్.
ఎవరైనా కనిపిస్తే తీసుకొస్తాం..
కొందరు ఒక్కరోజు రాత్రి మాత్రమే ఉంటారు. ఉపాధి కోసం వచ్చేవారు రెండు మూడు నెలలు సైతం ఉంటారు. ఎవరు ఎన్ని రోజులనేది చెప్పలేం. కచ్చితంగా అవసరమైన వారు మాత్రం ఉంటారు. వారంతట వారే వచ్చేవారితోపాటు సమీపంలోని రైల్వేస్టేషన్లు, తదితర ప్రాంతాల్లో ఎవరైనా కనిపిస్తే.. షెల్టర్‌హోమ్‌కు రప్పిస్తాం.
– విష్ణుసాగర్, శేరిలింగంపల్లి షెల్టర్‌హోమ్ మేనేజర్
Comments
Please login to add a commentAdd a comment