ప్రపంచంలో అగ్రరాజ్యమైన అమెరికాలో ఆర్థిక అసమానతలు రోజు రోజుకు పెరుగుతున్నాయని ఐక్యరాజ్యసమితి తాజా నివేదికలో తేలింది. పేదరికంలో మగ్గుతున్న 4.1 కోట్ల మందికి ఆ దేశంలోని అపార సంపద, ఆధునిక సాంకేతికత, ప్రభుత్వ విధానాలు ఏ విధంగానూ సాయపడటం లేదని వెల్లడైంది. త్వరలో అమల్లోకి రానున్న పన్ను సంస్కరణల చట్టంతో అమెరికా సమాజంలో ఇప్పటికే పెరిగిన ధనిక–పేద తారతమ్యాలు మరింత ఎక్కువ అవుతాయని నివేదికలో ఐరాస ప్రత్యేక ప్రతినిధి ఫిలిప్ ఆల్స్‌టన్ హెచ్చరించారు.
అమెరికాలోని పేదరికం, మానవ హక్కుల అమలును పరిశీలించేందుకు ఆల్స్‌టన్ ఆధ్వర్యంలో ఐక్యరాజ్యసమితి నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఎంతటి శక్తివంతమైన దేశమైనా మానవహక్కుల చట్టాల పరిధిలోనే పనిచేయాల్సిందేనన్న సందేశాన్నిచ్చేలా ఈ కమిటీ పర్యటన సాగింది. అమెరికాలోని సామాజిక, ఆర్థిక అసమానతలు, ఇళ్లూ వాకిలి లేని వారు ఎదుర్కొంటున్న సమస్యలు, వర్ణవివక్ష, పరిశ్రమల్లో ఉద్యోగాల తగ్గుదల వంటి అంశాలపై ఆల్స్‌టన్ దృష్టి సారించారు.
కాలిఫోర్నియా, అలబామా, జార్జియా, పశ్చిమ వర్జీనియా, వాషింగ్టన్ డీసీ, అమెరికా పాలనలో ఉన్న ప్యూర్టోరికోల్లో పర్యటించి పేదలు, నిరాశ్రయులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వారి దుర్భర జీవితాల్ని పరిశీలించి ప్రాథమిక నివేదిక విడుదల చేశారు. అమెరికన్ల పౌర, రాజకీయ హక్కులపై పేదరికం ప్రభావాన్ని ఇందులో ప్రస్తావించారు. అమెరికా ప్రజలకు వైద్య సంరక్షణ హక్కు, సొంతిల్లు, ఆహారం వంటి ప్రాథమిక సామాజిక, ఆర్థికహక్కులు కొరవడుతున్న నేపథ్యంలో ఈ నివేదిక ప్రాముఖ్యతను సంతరించుకుంది.
సంపన్నులు, పేదల మధ్య అంతరం
‘అసమానతలు, పేదరికంపై అమెరికా ప్రభుత్వ విధానాల్లో మార్పులు చోటు చేసుకుంటున్న తరుణంలో తాజా పన్నుల విధానం ప్రజల సంపద, ఆదాయ వ్యత్యాసాల్ని మరింత పెంచుతుంది. ఒక శాతం సంపన్నులు, పేదరికంలో ఉన్న అమెరికన్ల మధ్య అంతరం మరింత పెరుగుతుంది. సంక్షేమరంగంపై విధించే కోతలు సామాజిక భద్రతను మరింత హరిస్తాయి. చైనా, సౌదీ అరేబియా, రష్యా, యూకే, ఇండియా, ఫ్రాన్స్, జపాన్‌ల మొత్తం రక్షణ రంగం వ్యయం కంటే అమెరికా అధికంగా ఖర్చు చేస్తోంది. 2013లో శిశు మరణాలు అభివృద్ధి చెందిన ఇతర దేశాలతో పోల్చితే అమెరికాలోనే అత్యధికం.
మిగతా ఐరోపా దేశాలతో పోల్చితే అసమానతల స్థాయి ఎంతో ఎక్కువగా ఉంది. ప్రజలందరికీ మంచి నీరు, పారిశుద్ధ్యం అందుబాటులో ఉన్న దేశాల్లో అమెరికా ఇంకా 36వ ర్యాంక్‌లోనే ఉంది. తుర్కెమినిస్తాన్, ఎల్ సాల్వడార్, క్యూబా, థాయ్‌లాండ్, రష్యాల్లోని జైళ్లలో కంటే అమెరికా జైళ్లలోనే ఖైదీల సంఖ్య ఎక్కువ. ఓఈసీడీ(ఆర్థికంగా అభివృద్ధి చెందిన 35 దేశాల కూటమి) దేశాలతో పోలిస్తే అమెరికాలోనే ఎక్కువ శాతం యువత దారిద్య్రంలో ఉన్నారు. కెనడా, యూకే, ఐర్లాండ్, స్వీడన్, నార్వేలతో పోల్చితే అమెరికా పిల్లల్లో పేదరికం ఎక్కువ’ అని నివేదికలో పేర్కొన్నారు.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్
అమెరికాలో పేదలపై వివక్ష
Published Mon, Dec 18 2017 1:39 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment