పంటల శత్రువు ‘వయ్యారి భామ’
* జగమొండి కలుపుతో 40% దిగుబడి నష్టం
* నత్రజనిని స్థిరీకరించే సూక్ష్మజీవులకు హాని
‘వాడు నడచిన చోట గడ్డి కూడా మొలవదురా..’ అంటూ ఉంటారు. నిలువెల్లా జీవన వ్యతిరేకతతో కూడిన నడవడిక గల వారి గురించి ఇలా అంటూ ఉంటారు. వినాశకరమైన కలుపు మొక్క వయ్యారి భామ కూడా ఇటువంటిదే. పార్ధీనియం, కాంగ్రెస్ గడ్డి, మాచర్ల కలుపు, ముక్కుపుడక, నక్షత్ర గడ్డి, క్యారట్ ఘాస్ వంటి అనేక పేర్లతో దీన్ని పిలుస్తారు. ఎటువంటి ప్రతికూల వాతావరణాన్నయినా తట్టుకొని.. మొలకెత్తిన తర్వాత 4 వారాల్లో 10 వేల నుంచి 50 వేల విత్తనాలను ఉత్పత్తి చేస్తుంది.
ఈ విత్తనం రెండేళ్ల వరకు నిద్రావస్థలో ఉండి, అనుకూల పరిస్థితులు వచ్చిన వెంటనే మొలకెత్తుతుంది. 1950లో అమెరికా నుంచి గోధుమ గింజలతో పాటు దిగుమతైంది మొదలు.. ఇబ్బడి ముబ్బడిగా విస్తరిస్తూ మన దేశానికి గుదిబండగా మారింది. ఆస్ట్రేలియా వంటి అనేక ఇతర దేశాలకూ తలనొప్పిగా మారింది. దీని వల్ల జీవవైవిధ్యానికి, మనుషులు, పశువుల ఆరోగ్యానికే కాకుండా పంటలకూ తీరని నష్టం వాటిల్లుతోంది.
పంటలకు నష్టం జరిగేదిలా: పార్థీనియం మొక్కలున్న పొలంలో దిగుబడి 40% వరకు తగ్గిపోయినట్లు శాస్త్రవేత్తల అధ్యయనాల్లో తేలింది. పశుగ్రాస పంటల్లో అయితే ఏకంగా 90% దిగుబడి తగ్గింది. ఈ మొక్క వేళ్ల నుంచి స్రవించే రసాయనాలు పక్కనే ఉన్న పంట మొక్కలను పెరగనీయవు. ఇతర మొక్కలను కూడా మొలవ నీయవు. పచ్చిక బయళ్లలో గడ్డినీ పెరగనీయవు. దీని పుప్పొడి టమాటా, వంగ, చిక్కుడు, మిరప వంటి పెరటి కాయగూరల పుప్పొడి పైన పడి.. కాయలు ఏర్పడకుండా అడ్డుకుంటుంది. గాలి నుంచి నత్రజనిని గ్రహించి అపరాల పంట మొక్కల వేళ్లకు అందించే సూక్ష్మజీవులను నిరోధిస్తుంది. వివిధ రకాల వైరస్ తెగుళ్లు, పిండినల్లి వ్యాప్తికి దోహదపడుతుంది. ప్రతికూల వాతావరణాన్ని తట్టుకోగలిగే అంతర్గత వ్యవస్థ పార్థీనియం సొంతం. పైర్లతో పోటీపడి పెరిగి పంటల దిగుబడిని తగ్గిస్తుంది.
నిర్మూలన ఎలా?
పూత రాకముందే పార్థీనియం మొక్కను పీకి పచ్చిరొట్ట ఎరువుగా వినియోగించుకోవడం మేలు. జైగోగ్రామా బైకొలరేటా అనే పెంకు పురుగులు మాత్రమే దీని ఆకులను తింటాయి. కసవిందా(కేస్సియం సెరిషియా) మొక్కల వేళ్లు స్రవించే కొన్ని రసాయనాలు పార్థీనియం పెరుగుదలను, బీజోత్పత్తి శక్తిని తగ్గిస్తాయి. వెంపలి, స్టైలో, గాలివాన మొక్క, పిచ్చితులసి, తోటకూర, పసర కంప కూడా దీన్ని అణచివేస్తాయి. దీని నిర్మూలనకు వ్యవసాయ వర్సిటీ ఆగస్టు 16 నుంచి ప్రచార వారోత్సవాలు నిర్వహిస్తోంది. వివరాలకు: కలుపు మొక్కల పరిశోధన కేంద్రం (రాజేంద్రనగర్) అధిపతి, ముఖ్య శాస్త్రవేత్త డా. ఎం. ఏకాద్రి(98664 58165)ని సంప్రదించవచ్చు.
- సాగుబడి డెస్క్