మనం అమాయకంగా కలుపును చంపుదామని గ్లైఫొసేట్ రసాయనాన్ని చల్లుతున్నాం.. అది మనందరి దేహాల్లోకీ చొరబడి కేన్సర్‌ను, ఇంకా ఎన్నో మాయ రోగాలను పుట్టిస్తోంది.. మన భూముల్లోకి, నీటిలోకి, గాలిలోకి.. మనుషులు, జంతువుల మూత్రంలోకి.. చివరకు తల్లి పాలల్లోకీ చేరిపోయింది.. పంట భూములకు ప్రాణప్రదమైన వానపాములను, సూక్ష్మజీవరాశిని మట్టుబెట్టి నేలను నిర్జీవంగా మార్చేస్తున్నది. దీనివల్ల కేన్సర్ వస్తున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధారసహితంగా ప్రకటించి ఏళ్లు గడిచిపోతున్నాయి.. ఇరవయ్యేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా చావు డప్పు కొడుతోంది! అయినా, దీన్ని నిషేధించడానికి పాలకులు తటపటాయిస్తున్నారు.
అదీ.. బహుళజాతి కంపెనీల సత్తా! కొన్ని దేశాలు నిషేధిస్తున్నాయి, ఎత్తివేస్తున్నాయి. మన దేశపు పంట పొలాల్లో ఈ కిల్లర్ కెమికల్ ఐదేళ్లుగా అక్రమంగా హల్‌చల్ చేస్తున్నా మన పాలకులు నిద్రనటించారు. కలుపు చప్పున చస్తుందన్న ఒక్క సంగతి తప్ప.. అది మన మూలుగల్నే పీల్చేస్తుందన్న సంగతి అమాయక రైతులకు తెలియజెప్పకపోవడం వల్ల దీని వాడకం విచ్చలవిడిగా పెరిగింది.. కూలీలు లేరు.. ఇదీ లేకపోతే సేద్యం ఎలా? అనే వరకు వచ్చింది. ఇన్నాళ్లూ చలనం లేని ప్రభుత్వాలు ఎట్టకేలకు ‘నిషేధం లాంటి ఆంక్షలు’ విధించిన నేపథ్యంలో.. కచ్చితంగా ఏరిపారేయాల్సిన గ్లైఫొసేట్‌పై ‘సాగుబడి’ ఫోకస్!∙
కలుపు మందులు మార్కెట్లో చాలా రకాలున్నాయి కదా.. గ్లైఫొసేట్‌పైనే ఎందుకింత రగడ జరుగుతున్నట్లు?
ఎందుకంటే.. ఇది మామూలు కలుపు మందు కాదు. సాధారణ కలుపు మందు అయితే పిచికారీ చేసినప్పుడు ఏయే మొక్కలపై ఏయే ఆకులపై పడిందో అవి మాత్రమే ఎండిపోతాయి. ఆ మొక్క మొత్తం నిలువెల్లా ఎండిపోదు. దీన్నే ‘కాంటాక్ట్’ కెమికల్ అంటారు. ఇది అంతర్వాహిక(సిస్టమిక్) స్వభావం కలిగినది. అంటే.. గ్లైఫొసేట్ మొక్కపైన ఆకుల మీద పడినా చాలు.. దాని కాండం నుంచి పిల్ల వేర్ల వరకు నిలువునా ఎండిపోతుంది. అంటే.. ఇది చల్లిన పొలంలో మట్టిలోని వానపాములు, సూక్ష్మజీవరాశి కూడా చనిపోతుంది. దీని అవశేషాలు భూగర్భ నీటిని, వాగులు, వంకలు, చెరువు నీటిని కూడా కలుషితం చేస్తుంది. గ్లైఫొసేట్ పిచికారీ చేసే కార్మికులు ఏమాత్రం పీల్చినా తీవ్ర అనారోగ్యానికి గురవుతారు. మూత్రపిండాలు, కాలేయం, పెద్దపేగులో సూక్ష్మజీవరాశి దెబ్బతింటాయి. కేన్సర్ వస్తుంది. నాడీ వ్యవస్థ, నిర్ణాళ గ్రంథుల వ్యవస్థ అస్థవ్యస్థమవుతాయి. రోగనిరోధక శక్తి నశిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
కేన్సర్ కారకమని ప్రకటించిన డబ్లు్య.హెచ్.ఓ.
అత్యంత ప్రమాదకరమైన వ్యవసాయ పురుగుమందులు/కలుపు మందులుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్లు్య.హెచ్.ఓ.) ప్రకటించిన 15 రకాల్లో గ్లైఫొసేట్ ముఖ్యమైనది. డబ్లు్య.హెచ్.ఓ. అనుబంధ సంస్థ అయిన అంతర్జాతీయ కేన్సర్ పరిశోధనా సంస్థ(ఐ.ఎ.ఆర్.సి.) తర్జనభర్జనల తర్వాత 2017లో ఇది వాడిన చోట కేన్సర్ వ్యాపిస్తోందని తేల్చిచెప్పింది. గ్లైఫొసేట్‌పై ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత పెరుగుతోంది. అమెరికాలో మోన్‌శాంటో కంపెనీపై సుమారు 4 వేల కేసులు దాఖలయ్యాయి. గ్లైఫొసేట్ వల్లనే తనకు కేన్సర్ సోకిందని ఆరోపిస్తూ డి వేనె జాన్సన్(46) అనే కార్మికుడు దావా వేశాడు. అయినా, కంపెనీల ఒత్తిళ్ల నేపథ్యంలో గ్లైఫొసేట్‌ను పూర్తిగా నిషేధించడానికి ప్రభుత్వాలు తటపటాయిస్తూ.. నామమాత్రపు ఆంక్షలతో సరిపెడుతున్నాయి.
1974 నుంచి మార్కెట్లో..
కొత్త ఔషధం కనుగొనే ప్రయోగాల్లో అనుకోకుండా గ్లైఫొసేట్ 1950లో వెలుగుచూసింది. అయితే, ఇది కలుపుమందుగా పనికొస్తుందన్న సంగతి 1970లో బయటపడింది. మోన్‌శాంటో కంపెనీ 1974లో దీన్ని కలుపుమందుగా ప్రపంచవ్యాప్తంగా అమ్మటం మొదలు పెట్టింది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ముఖ్యంగా జన్యుమార్పిడి పంటలు ఎక్కువగా సాగయ్యే దేశాల్లో గ్లైఫొసేట్ ఎక్కువ వాడుకలో ఉంది. ఇప్పటి వరకు 860 కోట్ల లీటర్లు వాడగా.. గత పదేళ్లలోనే ఇందులో 72% వాడారు. అమెరికా, అర్జెంటీనా, ఐరోపా దేశాలు, ఆస్ట్రేలియా,కొలంబియా, దక్షిణాఫ్రికాతోపాటు భారత్, శ్రీలంక దేశాల్లో విరివిగా వాడుతున్నారు. దీని వాడకంపై అమెరికాలోని 18 రాష్ట్రాల్లో, కెనడాలో 8 రాష్ట్రాల్లో ఆంక్షలున్నాయి. కొలంబియా, శ్రీలంకల్లో నిషేధం విధించినా తర్వాత తొలగించారు. ఐరోపా యూనియన్ కూటమిలోని 9 దేశాలు గ్లైఫొసేట్ విక్రయ లైసెన్సులను రెన్యువల్ చేయరాదని నిర్ణయించాయి. మూడేళ్లలో నిషేధిస్తామని ఫ్రాన్స్ ప్రకటించగా, సాధ్యమైనంత త్వరగా దీని వాడకం నిలిపేయాలని నిర్ణయించింది.
తెలుగు రాష్ట్రాల్లో ఐదేళ్లుగా..
పత్తి పొలాల్లో కలుపు మందులు చల్లుతూ విషప్రభావంతో నేలకొరిగిన/తీవ్ర అనారోగ్యం పాలైన రైతులు, రైతు కూలీల ఉదంతాలు మహారాష్ట్రలోని యావత్‌మాల్ తదితర ప్రాంతాల్లో గత ఏడాది వెల్లువెత్తిన ఉదంతాలతో గ్లైఫొసేట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తెలుగు రాష్ట్రాల్లో 2013 నుంచి అక్రమంగా సాగులోకి వచ్చిన బీజీ–3 పత్తి వంగడంతో దీని వినియోగం కూడా పెరుగుతూ వచ్చింది. రెండు, మూడేళ్లుగా అక్రమ బీజీ–3 పత్తి తోడై.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో లక్షలాది ఎకరాల నల్లరేగడి భూముల్లో గ్లైఫొసేట్ కలుపుమందు విచ్చలవిడిగా మరణమృదంగం మోగిస్తోంది. దీని వాడకంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి.
మన దేశంలో గ్లైఫొసేట్‌ను తేయాకు తోటల్లో, ‘పంట లేని ప్రదేశాల్లో’నూ వాడొచ్చని కేంద్ర వ్యవసాయ శాఖ అనుమతి ఇచ్చింది. అయితే, అధికారుల అసలత్వం వల్ల ఇది బీజీ–3 పత్తితోపాటు సోయా, బత్తాయి, మామిడి తదితర తోటల్లో కూడా కలుపు నివారణకు ఇది వాడుతున్నారు. రైతులు అప్పటికప్పుడు కలుపు బాధ పోతుందన్న సౌలభ్యం చేస్తున్నారే తప్ప.. దీర్ఘకాలం పాటు అది తెచ్చే చేటును గ్రహించలేకపోతున్నారు. వీరికి అవగాహన కలిగించాల్సిన వ్యవసాయ శాఖలు నిమ్మకునీరెత్తినట్టు ఉండడంతో రైతులు ప్రత్యామ్నాయ కలుపు నివారణ పద్ధతుల వైపు దృష్టి సారించలేకపోతున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ గ్లైఫొసేట్‌పై పూర్తిస్థాయి నిషేధం విధించడమే ఈ సమస్యకు పరిష్కారం.
ప్రత్యామ్నాయాలు ఏమిటి?
అయితే, రైతులకు ప్రత్యామ్నాయం ఏమిటి? అన్నది ప్రశ్న. గ్లైఫొసేట్ వల్ల పొంచిఉన్న పర్యావరణ సంక్షోభం, కేన్సర్ తదితర జబ్బుల ముప్పు గురించి ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారోద్యమాన్ని చేపట్టాలి. రైతుల పొలాల్లో, తోటల్లో కలుపు తీతకు ఉపాధి కూలీలను ఉపయోగించేలా కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవాలి. దీనితో పాటు.. చిన్న, మధ్యతరహా రైతులకు అందుబాటులో ఉండే సులభంగా కలుపు తీసే పరికరాలు, చిన్న తరహా కలుపు యంత్రాలను ప్రభుత్వం విరివిగా అందుబాటులోకి తేవాలి.
వచ్చే ఏడాది బీజీ–3తో గ్లైఫొసేట్ కూడా పోతుంది
ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రంలో సాగవుతున్న పత్తిలో 85% బీజీ–2 ఉంటుంది.. 15% వరకు బీజీ–3 ఉంటుంది. కలుపుమందును తట్టుకునే బీజీ–3 పత్తి విత్తనాల వల్లనే రైతులు గ్లైఫొసేట్ పిచికారీ చేస్తున్నారు. గ్లైఫొసేట్‌ను దాదాపు నిషేధిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కాబట్టి వచ్చే ఏడాది నాటికి.. బీజీ–3 పత్తి విత్తనాలను విత్తన కంపెనీలు తయారు చేయవు, గ్లైఫొసేట్ కూడా అందుబాటులో ఉండదు, రైతులు కూడా కొనరు. కలుపు తీతకు ఎకరానికి రూ.15 వేల వరకు ఖర్చవుతుందని, కలుపుమందుతో రూ.2 వేలతో పోతుందని, అందుకే గ్లైఫొసేట్ వాడుతున్నామని రైతులు అంటున్నారు. అయితే, ఎకరానికి రూ.4 వేలు ఖర్చయినా గుంటకతోనో ట్రాక్టరుతోనో, కూలీలతోనో కలుపు నివారించుకోవాలే తప్ప గ్లైఫోసేట్ వంటి ప్రమాదకరమైన కలుపుమందులు వాడకూడదు. వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్తలు సూచించిన వివిధ పద్ధతుల్లోనే రైతులు కలుపు నివారించుకునే ప్రయత్నం చేయటం రైతులకు, పర్యావరణానికి కూడా మంచిది.
– డా. కేశవులు, తెలంగాణ విత్తన, సేంద్రియ విత్తన ధృవీకరణ ప్రాధికార సంస్థ, హైదరాబాద్
బీజీ–3 పత్తిపై ఐదేళ్లుగా నిర్లక్ష్యం
ప్రపంచ ఆహార సంస్థ గ్లైఫొసేట్ కలుపుమందు వల్ల మనుషులకు కేన్సర్ వస్తున్నదని గత ఏడాది నిర్థారించింది. దీన్ని తట్టుకునే పత్తి హైబ్రిడ్ (బీజీ–3) పంట తెలుగు రాష్ట్రాల్లో ఐదేళ్ల క్రితం నుంచే సాగులో ఉంది. 2013 నుంచి అనేక దఫాలు పూర్తి ఆధారాలతో మేం వ్యవసాయ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చాం. పట్టించుకోనందునే గత రెండేళ్లలో లక్షలాది ఎకరాలకు విస్తరించింది. మన దగ్గర పంటల్లో వాడటంతోపాటు.. కెనడా తదితర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్న కందిపప్పు, బఠాణీలు, సోయా నూనెలు కలుపుమందులను తట్టుకునేలా జన్యుమార్పిడి చేసిన పంటలవే. వీటిల్లో గ్లైఫొసేట్ అవశేషాలు అత్యధిక పరిమాణంలో ఉన్నట్లు ఇటీవల వెలుగులోకి రావడం అత్యంత ఆందోళన కలిగించే విషయం. వీటిని దిగుమతి చేసుకునే ముందే కఠినమైన పరీక్షలు జరిపి అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. జన్యుమార్పిడి ఆహారంపై కచ్చితంగా లేబుల్ ముద్రించాలని మన చట్టం చెబుతున్నా పట్టించుకున్న నాధుడు లేడు. మనం గ్లైఫొసేట్ వాడమని చెప్పలేదు కాబట్టి, దీని వల్ల భూమిలో జీవరాశికి, నీటి వనరులకు, మనుషులు, పశువుల ఆరోగ్యానికి ఎటువంటి హాని జరుగుతుందో ప్రభుత్వం కనీస అధ్యయనం కూడా చేయకపోవడం విడ్డూరం. సోయా, నువ్వు పంటలను నూర్పిడి చేయడంలో సౌలభ్యం కోసం కూడా పంటపైనే గ్లైఫొసేట్ పిచికారీ(డెస్సికేషన్) చేస్తున్నారు. ప్రజారోగ్యంపై ఈ అవశేషాల ప్రభావం ఏమిటన్నది ఆందోళనకరం.
– డా. జీవీ రామాంజనేయులు (90006 99702), సుస్థిర వ్యవసాయ కేంద్రం, సికింద్రాబాద్
గ్లైఫొసేట్‌ను కేంద్రం నిషేధించాలి ఉపాధి కూలీలతో కలుపు తీయించాలి
గ్లైఫొసేట్ కలుపుమందు వాడకం ఇంతకు ముందు నుంచే వున్నా.. కలుపుమందును తట్టుకునే బీజీ–3 పత్తి వల్ల రెండేళ్లుగా బాగా పెరిగింది. మహారాష్ట్రలోని యావత్‌మాల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఇటీవల సర్వే చేసినప్పుడు ఆశ్చర్యకరమైన సంగతులు తెలిశాయి. ప్రభుత్వం ఆంక్షలు విధించినా అధికారుల ఉదాసీనత వల్ల దీని అమ్మకాలు జోరుగానే సాగుతున్నాయి. పంట వేయడానికి ముందు, మొలక దశలో గడ్డి మొలిచినప్పుడు గ్లైఫొసేట్ కొడుతున్నారు. పాములు, పురుగూ పుట్రా చేరతాయని భయంతో కొడుతున్నారు. ఇదేమో కలుపును చంపే మందు.. అయితే, గులాబీ పురుగుకు కూడా గ్లైఫొసేట్ వాడుతున్నారని, ఇది పురుగుమందులకూ లొంగకుండా పోవడానికి ఇదే కారణమని చెబుతున్నారు. యావత్‌మాల్ ప్రాంతంలో పత్తి చేలల్లో వీళ్లు కలుపు అని చెబుతున్న మొక్కల్లో ఎక్కువ భాగం కొయ్య (తోట)కూర ఉంది. కొందరు రైతులు, కూలీలు దీన్ని పీకి ఇంటికి తీసుకెళ్తున్నారు.. వండుకు తినడానికి.
అటువంటి దానిపై అత్యంత ప్రమాదకరమైన రసాయనంగా, కేన్సర్ కారకంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన గ్లైఫొసేట్‌ను చల్లుతున్నారు. ఈ పూట కలుపు చావడం గురించే ఆలోచిస్తున్నారు తప్ప.. భూమిలో వానపాములు, సూక్ష్మజీవరాశి నశించి మంచి నల్లరేగడి భూములు కూడా నిస్సారమైపోతున్న సంగతి.. నీరు, గాలి కలుషితమవుతున్న సంగతిని ఎవరూ పట్టించుకోవడం లేదు.గ్లైఫొసేట్ చల్లుతూ ఉంటే కొన్నాళ్లకు కొయ్య తోట కూర వంటి కొన్ని రకాల మొక్కలే కొరకరాని కొయ్యలవుతాయి. అమెరికా పొలాల్లో కొన్ని రకాల కలుపు మొక్కలు 20 అడుగుల ఎత్తు వరకు బలిసిపోతున్నాయి. ఇప్పుడు చల్లితే మున్ముందు వేసే పంటల మీద కూడా దీని దుష్ప్రభావం తీవ్రంగా ఉంటుందని తెలుసుకోలేకపోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్లైఫోసేట్‌ను నిషేధించి, సక్రమంగా అమలు చేయాలి. ఉపాధి హామీ పథకాన్ని కలుపుతీతకు అనుసంధానం చేస్తే రైతులపై ఆర్థిక భారం తగ్గుతుంది. యంత్రం అవసరం లేకుండా నడిచే కలుపుతీత పరికరాలను రైతులకు విరివిగా అందించాలి.
– డా. దొంతి నరసింహారెడ్డి (90102 05742), డైరెక్టర్, పెస్టిసైడ్ యాక్షన్ నెట్‌వర్క్ ఇండియా
– పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్
Comments
Please login to add a commentAdd a comment