Weed drug
-
ఇలా కూడా పగ తీర్చుకోవచ్చా..!
ఏర్పేడు(తిరుపతి జిల్లా): మనకు సరిపడని వ్యక్తిపై ఎలా అయినా పగ తీర్చుకోవచ్చు. అలాంటి సంఘటనే మండలంలోని గోవిందవరం పంచాయతీ జింకలమిట్ట గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతులు సుబ్రహ్మణ్యం నాయుడుకు, రాధికా కిరణ్కు మధ్య గత కొంతకాలంగా భూతగాదా నడుస్తోంది. అయితే తన పొలంలో సాగు చేసిన వరినారుపై రెండు రోజుల క్రితం రాధికాకిరణ్ కూలీలతో రాత్రిళ్లు కలుపు మందు పిచికారీ చేయించడంతో నారు ఎండిపోయిందని బాధితుడు ఏర్పేడు సీఐ శ్రీహరికి మంగళవారం ఫిర్యాదు చేశాడు. సుబ్రహ్మణ్యం నాయుడుకు 6 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. రబీ సీజన్లో వరి వేసుకునేందుకు నారు మడిని సిద్ధం చేసుకున్నాడు. అయితే భూతగాదా నడుస్తున్న నేపథ్యంలో అతను వరి నాట్లు వేయడానికి సాగు చేసిన నారుపై కలుపు మందు పిచికారీ చేయడంతో ఎండిపోయింది. అతని ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని సీఐ చెప్పారు. చదవండి: ఇద్దరు కుమార్తెలపై పెట్రోల్ పోసి నిప్పంటించిన తల్లి -
కిల్లర్ కలుపు.. గ్లైఫొసేట్!
మనం అమాయకంగా కలుపును చంపుదామని గ్లైఫొసేట్ రసాయనాన్ని చల్లుతున్నాం.. అది మనందరి దేహాల్లోకీ చొరబడి కేన్సర్ను, ఇంకా ఎన్నో మాయ రోగాలను పుట్టిస్తోంది.. మన భూముల్లోకి, నీటిలోకి, గాలిలోకి.. మనుషులు, జంతువుల మూత్రంలోకి.. చివరకు తల్లి పాలల్లోకీ చేరిపోయింది.. పంట భూములకు ప్రాణప్రదమైన వానపాములను, సూక్ష్మజీవరాశిని మట్టుబెట్టి నేలను నిర్జీవంగా మార్చేస్తున్నది. దీనివల్ల కేన్సర్ వస్తున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధారసహితంగా ప్రకటించి ఏళ్లు గడిచిపోతున్నాయి.. ఇరవయ్యేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా చావు డప్పు కొడుతోంది! అయినా, దీన్ని నిషేధించడానికి పాలకులు తటపటాయిస్తున్నారు. అదీ.. బహుళజాతి కంపెనీల సత్తా! కొన్ని దేశాలు నిషేధిస్తున్నాయి, ఎత్తివేస్తున్నాయి. మన దేశపు పంట పొలాల్లో ఈ కిల్లర్ కెమికల్ ఐదేళ్లుగా అక్రమంగా హల్చల్ చేస్తున్నా మన పాలకులు నిద్రనటించారు. కలుపు చప్పున చస్తుందన్న ఒక్క సంగతి తప్ప.. అది మన మూలుగల్నే పీల్చేస్తుందన్న సంగతి అమాయక రైతులకు తెలియజెప్పకపోవడం వల్ల దీని వాడకం విచ్చలవిడిగా పెరిగింది.. కూలీలు లేరు.. ఇదీ లేకపోతే సేద్యం ఎలా? అనే వరకు వచ్చింది. ఇన్నాళ్లూ చలనం లేని ప్రభుత్వాలు ఎట్టకేలకు ‘నిషేధం లాంటి ఆంక్షలు’ విధించిన నేపథ్యంలో.. కచ్చితంగా ఏరిపారేయాల్సిన గ్లైఫొసేట్పై ‘సాగుబడి’ ఫోకస్!∙ కలుపు మందులు మార్కెట్లో చాలా రకాలున్నాయి కదా.. గ్లైఫొసేట్పైనే ఎందుకింత రగడ జరుగుతున్నట్లు? ఎందుకంటే.. ఇది మామూలు కలుపు మందు కాదు. సాధారణ కలుపు మందు అయితే పిచికారీ చేసినప్పుడు ఏయే మొక్కలపై ఏయే ఆకులపై పడిందో అవి మాత్రమే ఎండిపోతాయి. ఆ మొక్క మొత్తం నిలువెల్లా ఎండిపోదు. దీన్నే ‘కాంటాక్ట్’ కెమికల్ అంటారు. ఇది అంతర్వాహిక(సిస్టమిక్) స్వభావం కలిగినది. అంటే.. గ్లైఫొసేట్ మొక్కపైన ఆకుల మీద పడినా చాలు.. దాని కాండం నుంచి పిల్ల వేర్ల వరకు నిలువునా ఎండిపోతుంది. అంటే.. ఇది చల్లిన పొలంలో మట్టిలోని వానపాములు, సూక్ష్మజీవరాశి కూడా చనిపోతుంది. దీని అవశేషాలు భూగర్భ నీటిని, వాగులు, వంకలు, చెరువు నీటిని కూడా కలుషితం చేస్తుంది. గ్లైఫొసేట్ పిచికారీ చేసే కార్మికులు ఏమాత్రం పీల్చినా తీవ్ర అనారోగ్యానికి గురవుతారు. మూత్రపిండాలు, కాలేయం, పెద్దపేగులో సూక్ష్మజీవరాశి దెబ్బతింటాయి. కేన్సర్ వస్తుంది. నాడీ వ్యవస్థ, నిర్ణాళ గ్రంథుల వ్యవస్థ అస్థవ్యస్థమవుతాయి. రోగనిరోధక శక్తి నశిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కేన్సర్ కారకమని ప్రకటించిన డబ్లు్య.హెచ్.ఓ. అత్యంత ప్రమాదకరమైన వ్యవసాయ పురుగుమందులు/కలుపు మందులుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్లు్య.హెచ్.ఓ.) ప్రకటించిన 15 రకాల్లో గ్లైఫొసేట్ ముఖ్యమైనది. డబ్లు్య.హెచ్.ఓ. అనుబంధ సంస్థ అయిన అంతర్జాతీయ కేన్సర్ పరిశోధనా సంస్థ(ఐ.ఎ.ఆర్.సి.) తర్జనభర్జనల తర్వాత 2017లో ఇది వాడిన చోట కేన్సర్ వ్యాపిస్తోందని తేల్చిచెప్పింది. గ్లైఫొసేట్పై ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత పెరుగుతోంది. అమెరికాలో మోన్శాంటో కంపెనీపై సుమారు 4 వేల కేసులు దాఖలయ్యాయి. గ్లైఫొసేట్ వల్లనే తనకు కేన్సర్ సోకిందని ఆరోపిస్తూ డి వేనె జాన్సన్(46) అనే కార్మికుడు దావా వేశాడు. అయినా, కంపెనీల ఒత్తిళ్ల నేపథ్యంలో గ్లైఫొసేట్ను పూర్తిగా నిషేధించడానికి ప్రభుత్వాలు తటపటాయిస్తూ.. నామమాత్రపు ఆంక్షలతో సరిపెడుతున్నాయి. 1974 నుంచి మార్కెట్లో.. కొత్త ఔషధం కనుగొనే ప్రయోగాల్లో అనుకోకుండా గ్లైఫొసేట్ 1950లో వెలుగుచూసింది. అయితే, ఇది కలుపుమందుగా పనికొస్తుందన్న సంగతి 1970లో బయటపడింది. మోన్శాంటో కంపెనీ 1974లో దీన్ని కలుపుమందుగా ప్రపంచవ్యాప్తంగా అమ్మటం మొదలు పెట్టింది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ముఖ్యంగా జన్యుమార్పిడి పంటలు ఎక్కువగా సాగయ్యే దేశాల్లో గ్లైఫొసేట్ ఎక్కువ వాడుకలో ఉంది. ఇప్పటి వరకు 860 కోట్ల లీటర్లు వాడగా.. గత పదేళ్లలోనే ఇందులో 72% వాడారు. అమెరికా, అర్జెంటీనా, ఐరోపా దేశాలు, ఆస్ట్రేలియా,కొలంబియా, దక్షిణాఫ్రికాతోపాటు భారత్, శ్రీలంక దేశాల్లో విరివిగా వాడుతున్నారు. దీని వాడకంపై అమెరికాలోని 18 రాష్ట్రాల్లో, కెనడాలో 8 రాష్ట్రాల్లో ఆంక్షలున్నాయి. కొలంబియా, శ్రీలంకల్లో నిషేధం విధించినా తర్వాత తొలగించారు. ఐరోపా యూనియన్ కూటమిలోని 9 దేశాలు గ్లైఫొసేట్ విక్రయ లైసెన్సులను రెన్యువల్ చేయరాదని నిర్ణయించాయి. మూడేళ్లలో నిషేధిస్తామని ఫ్రాన్స్ ప్రకటించగా, సాధ్యమైనంత త్వరగా దీని వాడకం నిలిపేయాలని నిర్ణయించింది. తెలుగు రాష్ట్రాల్లో ఐదేళ్లుగా.. పత్తి పొలాల్లో కలుపు మందులు చల్లుతూ విషప్రభావంతో నేలకొరిగిన/తీవ్ర అనారోగ్యం పాలైన రైతులు, రైతు కూలీల ఉదంతాలు మహారాష్ట్రలోని యావత్మాల్ తదితర ప్రాంతాల్లో గత ఏడాది వెల్లువెత్తిన ఉదంతాలతో గ్లైఫొసేట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తెలుగు రాష్ట్రాల్లో 2013 నుంచి అక్రమంగా సాగులోకి వచ్చిన బీజీ–3 పత్తి వంగడంతో దీని వినియోగం కూడా పెరుగుతూ వచ్చింది. రెండు, మూడేళ్లుగా అక్రమ బీజీ–3 పత్తి తోడై.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో లక్షలాది ఎకరాల నల్లరేగడి భూముల్లో గ్లైఫొసేట్ కలుపుమందు విచ్చలవిడిగా మరణమృదంగం మోగిస్తోంది. దీని వాడకంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి. మన దేశంలో గ్లైఫొసేట్ను తేయాకు తోటల్లో, ‘పంట లేని ప్రదేశాల్లో’నూ వాడొచ్చని కేంద్ర వ్యవసాయ శాఖ అనుమతి ఇచ్చింది. అయితే, అధికారుల అసలత్వం వల్ల ఇది బీజీ–3 పత్తితోపాటు సోయా, బత్తాయి, మామిడి తదితర తోటల్లో కూడా కలుపు నివారణకు ఇది వాడుతున్నారు. రైతులు అప్పటికప్పుడు కలుపు బాధ పోతుందన్న సౌలభ్యం చేస్తున్నారే తప్ప.. దీర్ఘకాలం పాటు అది తెచ్చే చేటును గ్రహించలేకపోతున్నారు. వీరికి అవగాహన కలిగించాల్సిన వ్యవసాయ శాఖలు నిమ్మకునీరెత్తినట్టు ఉండడంతో రైతులు ప్రత్యామ్నాయ కలుపు నివారణ పద్ధతుల వైపు దృష్టి సారించలేకపోతున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ గ్లైఫొసేట్పై పూర్తిస్థాయి నిషేధం విధించడమే ఈ సమస్యకు పరిష్కారం. ప్రత్యామ్నాయాలు ఏమిటి? అయితే, రైతులకు ప్రత్యామ్నాయం ఏమిటి? అన్నది ప్రశ్న. గ్లైఫొసేట్ వల్ల పొంచిఉన్న పర్యావరణ సంక్షోభం, కేన్సర్ తదితర జబ్బుల ముప్పు గురించి ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారోద్యమాన్ని చేపట్టాలి. రైతుల పొలాల్లో, తోటల్లో కలుపు తీతకు ఉపాధి కూలీలను ఉపయోగించేలా కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవాలి. దీనితో పాటు.. చిన్న, మధ్యతరహా రైతులకు అందుబాటులో ఉండే సులభంగా కలుపు తీసే పరికరాలు, చిన్న తరహా కలుపు యంత్రాలను ప్రభుత్వం విరివిగా అందుబాటులోకి తేవాలి. వచ్చే ఏడాది బీజీ–3తో గ్లైఫొసేట్ కూడా పోతుంది ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రంలో సాగవుతున్న పత్తిలో 85% బీజీ–2 ఉంటుంది.. 15% వరకు బీజీ–3 ఉంటుంది. కలుపుమందును తట్టుకునే బీజీ–3 పత్తి విత్తనాల వల్లనే రైతులు గ్లైఫొసేట్ పిచికారీ చేస్తున్నారు. గ్లైఫొసేట్ను దాదాపు నిషేధిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కాబట్టి వచ్చే ఏడాది నాటికి.. బీజీ–3 పత్తి విత్తనాలను విత్తన కంపెనీలు తయారు చేయవు, గ్లైఫొసేట్ కూడా అందుబాటులో ఉండదు, రైతులు కూడా కొనరు. కలుపు తీతకు ఎకరానికి రూ.15 వేల వరకు ఖర్చవుతుందని, కలుపుమందుతో రూ.2 వేలతో పోతుందని, అందుకే గ్లైఫొసేట్ వాడుతున్నామని రైతులు అంటున్నారు. అయితే, ఎకరానికి రూ.4 వేలు ఖర్చయినా గుంటకతోనో ట్రాక్టరుతోనో, కూలీలతోనో కలుపు నివారించుకోవాలే తప్ప గ్లైఫోసేట్ వంటి ప్రమాదకరమైన కలుపుమందులు వాడకూడదు. వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్తలు సూచించిన వివిధ పద్ధతుల్లోనే రైతులు కలుపు నివారించుకునే ప్రయత్నం చేయటం రైతులకు, పర్యావరణానికి కూడా మంచిది. – డా. కేశవులు, తెలంగాణ విత్తన, సేంద్రియ విత్తన ధృవీకరణ ప్రాధికార సంస్థ, హైదరాబాద్ బీజీ–3 పత్తిపై ఐదేళ్లుగా నిర్లక్ష్యం ప్రపంచ ఆహార సంస్థ గ్లైఫొసేట్ కలుపుమందు వల్ల మనుషులకు కేన్సర్ వస్తున్నదని గత ఏడాది నిర్థారించింది. దీన్ని తట్టుకునే పత్తి హైబ్రిడ్ (బీజీ–3) పంట తెలుగు రాష్ట్రాల్లో ఐదేళ్ల క్రితం నుంచే సాగులో ఉంది. 2013 నుంచి అనేక దఫాలు పూర్తి ఆధారాలతో మేం వ్యవసాయ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చాం. పట్టించుకోనందునే గత రెండేళ్లలో లక్షలాది ఎకరాలకు విస్తరించింది. మన దగ్గర పంటల్లో వాడటంతోపాటు.. కెనడా తదితర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్న కందిపప్పు, బఠాణీలు, సోయా నూనెలు కలుపుమందులను తట్టుకునేలా జన్యుమార్పిడి చేసిన పంటలవే. వీటిల్లో గ్లైఫొసేట్ అవశేషాలు అత్యధిక పరిమాణంలో ఉన్నట్లు ఇటీవల వెలుగులోకి రావడం అత్యంత ఆందోళన కలిగించే విషయం. వీటిని దిగుమతి చేసుకునే ముందే కఠినమైన పరీక్షలు జరిపి అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. జన్యుమార్పిడి ఆహారంపై కచ్చితంగా లేబుల్ ముద్రించాలని మన చట్టం చెబుతున్నా పట్టించుకున్న నాధుడు లేడు. మనం గ్లైఫొసేట్ వాడమని చెప్పలేదు కాబట్టి, దీని వల్ల భూమిలో జీవరాశికి, నీటి వనరులకు, మనుషులు, పశువుల ఆరోగ్యానికి ఎటువంటి హాని జరుగుతుందో ప్రభుత్వం కనీస అధ్యయనం కూడా చేయకపోవడం విడ్డూరం. సోయా, నువ్వు పంటలను నూర్పిడి చేయడంలో సౌలభ్యం కోసం కూడా పంటపైనే గ్లైఫొసేట్ పిచికారీ(డెస్సికేషన్) చేస్తున్నారు. ప్రజారోగ్యంపై ఈ అవశేషాల ప్రభావం ఏమిటన్నది ఆందోళనకరం. – డా. జీవీ రామాంజనేయులు (90006 99702), సుస్థిర వ్యవసాయ కేంద్రం, సికింద్రాబాద్ గ్లైఫొసేట్ను కేంద్రం నిషేధించాలి ఉపాధి కూలీలతో కలుపు తీయించాలి గ్లైఫొసేట్ కలుపుమందు వాడకం ఇంతకు ముందు నుంచే వున్నా.. కలుపుమందును తట్టుకునే బీజీ–3 పత్తి వల్ల రెండేళ్లుగా బాగా పెరిగింది. మహారాష్ట్రలోని యావత్మాల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఇటీవల సర్వే చేసినప్పుడు ఆశ్చర్యకరమైన సంగతులు తెలిశాయి. ప్రభుత్వం ఆంక్షలు విధించినా అధికారుల ఉదాసీనత వల్ల దీని అమ్మకాలు జోరుగానే సాగుతున్నాయి. పంట వేయడానికి ముందు, మొలక దశలో గడ్డి మొలిచినప్పుడు గ్లైఫొసేట్ కొడుతున్నారు. పాములు, పురుగూ పుట్రా చేరతాయని భయంతో కొడుతున్నారు. ఇదేమో కలుపును చంపే మందు.. అయితే, గులాబీ పురుగుకు కూడా గ్లైఫొసేట్ వాడుతున్నారని, ఇది పురుగుమందులకూ లొంగకుండా పోవడానికి ఇదే కారణమని చెబుతున్నారు. యావత్మాల్ ప్రాంతంలో పత్తి చేలల్లో వీళ్లు కలుపు అని చెబుతున్న మొక్కల్లో ఎక్కువ భాగం కొయ్య (తోట)కూర ఉంది. కొందరు రైతులు, కూలీలు దీన్ని పీకి ఇంటికి తీసుకెళ్తున్నారు.. వండుకు తినడానికి. అటువంటి దానిపై అత్యంత ప్రమాదకరమైన రసాయనంగా, కేన్సర్ కారకంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన గ్లైఫొసేట్ను చల్లుతున్నారు. ఈ పూట కలుపు చావడం గురించే ఆలోచిస్తున్నారు తప్ప.. భూమిలో వానపాములు, సూక్ష్మజీవరాశి నశించి మంచి నల్లరేగడి భూములు కూడా నిస్సారమైపోతున్న సంగతి.. నీరు, గాలి కలుషితమవుతున్న సంగతిని ఎవరూ పట్టించుకోవడం లేదు.గ్లైఫొసేట్ చల్లుతూ ఉంటే కొన్నాళ్లకు కొయ్య తోట కూర వంటి కొన్ని రకాల మొక్కలే కొరకరాని కొయ్యలవుతాయి. అమెరికా పొలాల్లో కొన్ని రకాల కలుపు మొక్కలు 20 అడుగుల ఎత్తు వరకు బలిసిపోతున్నాయి. ఇప్పుడు చల్లితే మున్ముందు వేసే పంటల మీద కూడా దీని దుష్ప్రభావం తీవ్రంగా ఉంటుందని తెలుసుకోలేకపోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్లైఫోసేట్ను నిషేధించి, సక్రమంగా అమలు చేయాలి. ఉపాధి హామీ పథకాన్ని కలుపుతీతకు అనుసంధానం చేస్తే రైతులపై ఆర్థిక భారం తగ్గుతుంది. యంత్రం అవసరం లేకుండా నడిచే కలుపుతీత పరికరాలను రైతులకు విరివిగా అందించాలి. – డా. దొంతి నరసింహారెడ్డి (90102 05742), డైరెక్టర్, పెస్టిసైడ్ యాక్షన్ నెట్వర్క్ ఇండియా – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
కాటేస్తున్న కలుపు మందు!
* గ్లైఫొసేట్ పిచికారీలో తప్పిదాలు.. నాశనమవుతున్న ఉద్యాన తోటలు.. నష్టపోతున్న రైతులు * కళతప్పిన తోటలకు జీవామృతం, మల్చింగ్ పద్ధతులతో పునరుజ్జీవనం * డాక్టర్ శ్యామసుందర్రెడ్డి సుదీర్ఘ క్షేత్రస్థాయి పరిశోధనలో వెల్లడైన ఆశ్చర్యకరమైన నిజాలు రైతులకు నిలకడగా, గణనీయమైన ఆదాయాన్నిస్తూ దీర్ఘకాలం మనగలిగిన పంట బత్తాయి. కానీ నేడు బత్తాయి రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారు. చేతికొచ్చిన చెట్లు నిలువునా ఎండిపోతుండడంతో ఏటా వేల ఎకరాల్లో బత్తాయి తోటలు తీసేస్తున్నారు. కర్ణుడి చావు లాగా దీనికీ కారణాలు అనేకం. అనుకూలం కాని నేలలు, నాణ్యత లేని అంటు మొక్కలు, అసంపూర్ణమైన నీటి యాజమాన్యం.. వెరసి వివిధ రకాల తెగుళ్లు. అయితే.. బొత్తిగా ఈ సమస్యలేవీ లేని బత్తాయి తోటలు కూడా కళతప్పి.. నిలువునా ఎండిపోతున్నాయి. రైతుల పచ్చని కలల సౌధాలను నిట్టనిలువునా కూల్చుతున్నాయి.. ఎందుకని?? ఈ వ్యథకు మూల కారణం.. గ్లైఫొసేట్ అనే ఒక కలుపు మందు! నిజానికి ఇక్కడ సమస్య మందు కాదు.. దాన్ని వాడే విధానం అంటే ఆశ్చర్యం కలగక మానదు! కానీ, ఇది ముమ్మాటికీ నిజం. హైదరాబాద్లోని ఐఐఐటీకి చెందిన ‘ప్లాంట్ డాక్టర్’ డా. గున్నంరెడ్డి శ్యామసుందర్రెడ్డి ఆరు జిల్లాల్లోని బత్తాయి రైతులతో పనిచేస్తూ క్షేత్రస్థాయిలో నాలుగేళ్ల పాటు జరిపిన పరిశోధనలో ఈ ఆశ్చర్యకరమైన నిజాలు వెలుగుచూశాయి. సమస్య మూలాన్ని గుర్తించడంతోపాటు.. ప్రభావశీలమైన రసాయన రహిత పరిష్కార మార్గాలను కూడా అనుభవపూర్వకంగా సూచిస్తున్నారు. ఇవీ ఆయన పరిశోధనలో వెలుగుచూసిన ముఖ్యాంశాలు.. గ్లైఫోసేట్ ప్రభావానికి గురైన చెట్లు కళ తప్పి ఉంటాయి. నేలలో తగినంత తేమ ఉన్నప్పటికీ బెట్టకు వచ్చినట్లు కన్పిస్తాయి. సూక్ష్మ పోషక లోపాలను అధికంగా కలిగి ఉంటాయి. తెగుళ్లను తట్టుకునే శక్తిని కోల్పోవడం వల్ల బంక కారడం, వేరుకుళ్లు తెగులు ఉధృతి పెరుగుతుంది. గ్లైఫోసేట్ ప్రభావం చిటారు కొమ్మలపై అధికంగా ఉండడం వల్ల ఎండుపుల్ల ఎక్కువగా వస్తుంది. కాయలున్న కొమ్మలు కూడా బలహీనంగా ఉండడం వల్ల కాయల సైజు అంతంత మాత్రంగానే ఉండి, త్వరగా లేత పసుపు రంగుకు మారిపోతాయి. చాలా సందర్భాల్లో వడప లేదా బొడ్డుకుళ్లు తెగులు సోకి కాయలు రాలిపోతాయి. కొన్ని సందర్భాల్లో పుల్ల ఎండడం వల్ల వాటికి ఉన్న కాయలు కూడా ఎండిపోతాయి. ‘జీవామృతం’ ఒక అద్భుత పరిష్కారం! గ్లైఫోసేట్ వల్ల దెబ్బతిన్న తోటల్లో జీవామృతంతో చేసిన ప్రయోగాలు అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి. జీవామృతాన్ని 1:4 నిష్పత్తిలో నీటిలో కలిపి 15 రోజుల కొకసారి పిచికారీ చేయాలి. చెట్టుతో సహా పాదు పూర్తిగా తడిసేలా పిచికారీ చేయాలి. ఇలా కనీసం ఐదుసార్లు పిచికారీ చేసిన తోటలు ముదురు ఆకుపచ్చ రంగుకు మారాయి. 120 నుంచి 150 గ్రాముల బరువున్న బత్తాయిలు తిరిగి ఆకుపచ్చ రంగులోకి మారి 200 నుంచి 250 గ్రాముల బరువుకు పెరిగాయి. ఎండిన కొమ్మలకు ఆరోగ్యవంతమైన చిగుళ్లొచ్చాయి. చుట్టుపక్కల చాలా తోటల్లో వడప తెగులు సోకి కాయలు గణనీయంగా రాలిపోయినా.. జీవామృతం పిచికారీ చేసిన తోటలో మాత్రం రాలిన కాయలు అతి తక్కువ. మహబూబ్నగర్ జిల్లా కురుమూర్తి గ్రామానికి చెందిన అజయ్ కుమార్రెడ్డి(96663 93070) తోటలో మోడుబారిన కొమ్మలకు సైతం ఆరోగ్యవంతమైన కాయలు కాస్తుండడం నిజంగా ఒక అద్భుతాన్నే తలపించింది. ఇదీ సమస్యకు మూలం.. గ్లైఫోసేట్ అత్యంత ప్రభావశీలి అయిన కలుపునాశిని. గత కొన్ని సంవత్సరాలుగా విపరీతంగా పెరిగిన కూలీల ఖర్చులు, కూలీల కొరత కారణంగా బత్తాయి తోటల్లో ఈ గడ్డి మందు వాడకం కూడా బాగా పెరిగింది. ఐదేళ్లు, అంతకన్నా ఎక్కువ వయసున్న తోటల్లో, అధిక సాంద్రత గల తోటల్లో చెట్లు కమ్ముకోవడంతో యంత్రాలతో అంతరకృషి చేయడం కష్టం. కాబట్టి గడ్డి మందు వాడకం తప్పనిసరైంది. గ్లైఫోసేట్ అంతర్వాహక చర్య కలిగినది. అంటే ఈ మందు చెట్టు లేదా మొక్క మీద ఏ భాగంలో పడినా సరే.. క్షణాల్లో వేర్లతో సహా చెట్టు అంతా వ్యాపిస్తుంది. ఇది అన్ని రకాల మొక్కలకూ హానికరమైనది. ఈ కలుపు మందు చెట్టు మీద పడిన వెంటనే మొక్కల శిఖర భాగాలకు... అంటే నేలలోని పీచు వేళ్ల నుంచి, చిటారు కొమ్మల చిగుళ్ల దాకా చేరుతుంది. చెట్టుకు అత్యంత ఆవశ్యకమైన అమైనో ఆమ్లాల తయారీని అడ్డుకుంటుంది. చెట్టుకు అవసరమైన జింకు, ఇనుము, రాగి తదితర లోహపు అయానులను నిర్వీర్యం చేస్తుంది. ఫలితంగా చెట్టు చివరి భాగాల నుంచి ఎండిపోతూ కొన్ని రోజులకు పూర్తిగా చనిపోతుంది. ఇటీవలి కాలంలో ఈ కలుపు మందు పిచికారీ కోసం తైవాన్ స్ప్రేయర్లు, ట్రాక్టర్ లేదా డీజిల్/పెట్రోల్ పంపులకు అమర్చిన స్ప్రేయర్ల వాడకం సర్వసాధారణమై పోయింది. ఈ స్ప్రేయర్లు అధిక ఒత్తిడిని కలిగి ఉండడం వల్ల ఎక్కువ తుంపరను ఉత్పత్తి చేస్తాయి. అందువల్ల మందు కలుపు మొక్కలతో పాటు బత్తాయి చెట్లపైన కూడా పడే అవకాశం చాలా ఎక్కువ. దీనికి గాలి తోడయితే ఇక చెప్పనవసరం లేదు. గడ్డి మందును కావాలనే బత్తాయి మొక్కలపై పిచికారీ చేసినట్లే ఉంటుంది పరిస్థితి. కొంతమంది రైతులు పాదుల్లో కూడా గడ్డి మందును పిచికారీ చేస్తున్నారు. మొదళ్లపై గాయాలున్న చెట్లకు ఇది అత్యంత ప్రమాదకరం. మరి కొంతమంది రైతులు మరింత వేగవంతమైన కలుపు నివారణకు 2, 4-డి కలుపు మందును కూడా గ్లైఫోసేట్తో కలిపి పిచికారీ చేస్తున్నారు (దీన్ని ఇంతవరకు ఎవరూ సిఫార్సు చేసిన దాఖలాల్లేవు). మల్చింగ్ ద్వారా కలుపునకు చెక్! వరి కోత తర్వాత గడ్డిని కాల్చివేయడం కన్నా ఉద్యాన పంటల్లో మల్చింగ్ చేయడం చాలా ఉపయోగకరం. గడ్డిని ఏరి కట్టలు కట్టే యంత్ర పరికరాలు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. - వేరుశనగ పొట్టు, ఆముదం పొట్టును కూడా మల్చింగ్కు వాడవచ్చు. చెరకు సాగు అధికంగా ఉన్న చోట చెరకు ఆకు, వాడి పారేసిన లేత కొబ్బరి బోండాలను పీచుగా మార్చి (ష్రెడ్డింగ్ యంత్రాలు అందుబాటులో ఉన్నాయి) మల్చింగ్ చేయవచ్చు. - పొలం అంతటా మల్చింగ్ చేయనక్కర్లేదు. చెట్ల పాదుల్లో మాత్రమే చేయాలి. ఇలా చేయడం వల్ల అగ్ని ప్రమాదాల బెడద ఉండదు. - చెట్ల మధ్య ఉన్న సాళ్లలో బ్రష్ కట్టర్ వంటి పరికరం ద్వారా కలుపును నేలకు 3-4 ఇంచుల ఎత్తులో కత్తిరించవచ్చు. ఈ పని చేస్తే నేలను దున్నక్కర్లేదు లేదా అసలు తవ్వకుండా ఉండొచ్చు. అలా కుదరనప్పుడు చెట్ల మధ్యలో రోటోవేటర్ లేదా గుంటుక వంటి యంత్రాల సహాయంతో కలుపును నివారించాలి. ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న చెట్ల మధ్య కల్టివేటర్ లేదా డిస్క్ నాగళ్లతో దున్నడం అంత మంచిది కాదు. - మల్చింగ్ చేయడానికి కావాల్సిన గడ్డి దొరక్కపోయినా లేదా ఖరీదు అనిపించినా వర్షాకాలంలో జనుము, జీలుగ, జొన్న, సజ్జ వంటి అంతరపంటలు సాగు చేసి, నిర్ణీత సమయంలో వాటిని కత్తిరించి, పాదుల్లో మల్చింగ్ చేయాలి. వర్షాకాలంలో రెండుసార్లు ఇలా చేయవచ్చు. - నీటి వసతి ఉన్న చోట కొంత భూమిని కేవలం పచ్చిరొట్ట పైర్ల సాగుకు కేటాయించి, క్రమం తప్పకుండా కత్తిరించి మల్చింగ్ చేస్తే చక్కని ఫలితాలు వస్తాయి. - అన్నిటి కన్నా సులువైనది... పాదుల్లో, సాళ్ల మధ్య పెరిగిన కలుపును పూర్తిగా పీకేసి దట్టంగా(12-15 ఇంచుల మందం) మల్చింగ్ చేయాలి. పలచగా వేస్తే పాదుల్లో కలుపు పెరుగుతుంది. దట్టంగా వేయడం వల్ల కింది వరుసల్లో ఉన్న కలుపు కుళ్లిపోతుంది. పైవరుసల్లో ఉన్నది ఎండిపోతుంది. దట్టంగా ఉన్న మల్చింగ్ కింద మొలిచిన కలుపు గింజలు పైకి రాలేక చనిపోతాయి. - ఈ పద్ధతిలో గింజల ద్వారా లేదా శాఖీయ పద్ధతిలో మొలకెత్తే కలుపు ఎక్కువగా ఉన్నట్లయితే అటువంటి కలుపు మీద వరిగడ్డి, వరిపొట్టు, చెరకు ఆకు, వేప, గానుగ వంటి చెట్ల ఆకులను ఒక చిక్కటి పొరగా వేస్తే పాదుల్లో కలుపును సమర్థ్ధవంతంగా నివారించవచ్చు. - మహబూబ్నగర్ జిల్లా రాయికోడ్కు చెందిన బత్తాయి రైతు శ్రీనివాసరెడ్డి(77024 05400) రోటోవేటర్, బ్రష్ కట్టర్ ద్వారా కలుపు సమస్యను పూర్తిగా జయిస్తున్నారు. గ్లైఫోసేట్ అనివార్యమైతే..? మల్చింగ్ చేయని తోటల్లో విధిలేని పరిస్థితుల్లో గ్లైఫోసేట్ వాడాల్సి వస్తే కింది జాగ్రత్తలు తీసుకోవాలి: - న్యాప్పాక్/హ్యాండ్ స్ప్రేయర్ సహాయంతో నాజిల్కు హుడ్ను అమర్చి గాలి నిలకడగా ఉన్న సమయంలో మాత్రమే గ్లైఫోసేట్ను పిచికారీ చేయాలి. - ఎట్టి పరిస్థితుల్లోనూ మందు తుంపరలు బత్తాయి కొమ్మలు/ఆకులపై పడకూడదు. రంగపూర్ నిమ్మపై కట్టిన తీగ అంట్లు, నేలకు వాలిన కొమ్మలను కత్తిరించని తోటల్లో.. అధిక సాంద్రతలో మొక్కలను కలిగిన తోటల్లో జాగరూకత చాలా అవసరం. - గ్లైఫోసేట్ వద్దనుకుంటే పారాక్వాట్ డైక్లోరైడ్ను వాడవచ్చు. కానీ ఇది తుంగను, వయ్యారిభామను సమర్థవంతంగా నివారించలేదు. పైగా ఆకులపై, కాయలపై పడితే కాలిన మచ్చలు ఏర్పడతాయి. - గ్లైఫోసేట్ను పిచికారీ చేసిన 3 నుంచి 5 రోజుల లోపు జీవామృతాన్ని లేదా అమైనో ఆమ్లాలతో కూడిన సూక్ష్మ పోషక మిశ్రమాన్ని బత్తాయి చెట్లపై పిచికారీ చేస్తే వాటికి ఉపశమనం లభిస్తుంది. - పాదుల్లో కూడా గ్లైఫోసేట్ను పిచికారీ చేయాల్సి వస్తే ఆవుపేడ, పుట్టమట్టిని రెండు సమాన భాగాలుగా తీసుకొని తగినంత నీరు కలిపి పేస్టు మాదిరిగా చేసి కాండానికి ఒక మీటరు ఎత్తు వరకు పూత పూయాలి. ఈ పేస్టును తయారు చేసేటప్పుడు కాస్త గోమూత్రాన్ని కూడా కలిపితే మంచి ఫలితం ఉంటుంది. గ్లైఫోసేట్ను ఈ పొర విరగగొట్టి, గాయాల ద్వారా కాండం లోపలికి ప్రవేశించకుండా అడ్డుకుంటుంది. - తోట పూత, పిందె మీద ఉన్నప్పుడు, తోటను బెట్టకు విడిచిన సమయాల్లో తప్ప- జీవామృతాన్ని క్రమం తప్పకుండా చెట్లు, పాదులు తడిసేలా పిచికారీ చేయాలి. - మహబూబ్నగర్ జిల్లా గుమ్మడానికి చెందిన రైతు కృష్ణారెడ్డి (99890 40309) బత్తాయి చెట్ల మొదళ్లకు ఆవుపేడ, మట్టి పూసి చక్కని ఫలితం పొందుతున్నారు. పిచికారీ తీరును చూసి విస్తుపోయా! బత్తాయి తోటల సమస్యలపై గత కొన్నేళ్లుగా నల్లగొండ, మహబూబ్నగర్, అనంతపురం, వైఎస్ఆర్ జిల్లా, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో విస్తృత ప్రయోగాలు చేస్తున్నాం. అందులో భాగంగా క్షేత్ర పరిశీలన చేసినప్పుడు.. గ్లైఫోసేట్ మందును రైతులు పిచికారీ చేస్తున్న అపసవ్య పద్ధతులను చూసి విస్తుపోయా. కొన్నిచోట్ల 2, 4-డి మందును కూడా దీంట్లో కలిపి చల్లడం నన్ను హతాశుడ్ని చేసింది. కొందరు రైతులకు నచ్చజెప్పి ప్రత్యామ్నాయాల వైపు అడుగులు వేయించా. ‘జీవామృతం’ ఊహించని ఫలితాలనిస్తోంది. ‘మల్చింగ్’ సంగతి సరేసరి. కలుపు మందులు వాడే రైతులు పూర్తి అవగాహన పెంచుకోవాలి. - డాక్టర్ గున్నంరెడ్డి శ్యామసుందర్ రెడ్డి (99082 24649), ప్లాంట్ పాథాలజిస్ట్, ఐఐఐటీ, గచ్చిబౌలి, హైదరాబాద్ ప్రకృతి సేద్యంలో సమస్యలపై 25న నెల్లూరులో చర్చాగోష్టి! తెలుగు రాష్ట్రాల్లో సుభాష్ పాలేకర్ పద్ధతిలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు ఆచరణలో ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై నెల్లూరులో ఈ నెల 25న చర్చాగోష్టి జరగనుంది. ఆంధ్రప్రదేశ్ గోఆధారిత వ్యవసాయదారుల సంఘం తొలిసారి ఈ చర్చాగోష్టిని నిర్వహిస్తోంది. నెల్లూరులోని టీటీడీ కల్యాణమండపం ఎదురుగా గల సాయి కంటి ఆసుపత్రి ఆవరణలో ఈ సమావేశం జరుగుతుంది. ప్రవేశం ఉచితం. పాల్గొనదలచిన రైతులు ఈనెల 24వ తేదీలోగా తప్పకుండా తమ పేర్లను నమోదు చేయించుకోవాలని నిర్వాహకులు పి.రామ్మోహన్ (98667 60498), కుమారస్వామి(94401 27151) విజ్ఞప్తి చేశారు. కొత్తగా ప్రకృతి వ్యవసాయం చేయదలచిన రైతులకు 25 నాటి సమావేశంలోకి ప్రవేశం లేదని వారు స్పష్టం చేశారు. కొత్త రైతుల కోసం ఆ మర్నాడు(26న) టీటీడీ కల్యాణమండపంలో శిక్షణా శిబిరం నిర్వహిస్తున్నామన్నారు.