లియోన్: డైట్ సోడా తదితర ఎన్నో ఆహారపదార్థాల్లో వాడే నాన్ షుగర్ స్వీట్‌నర్(ఎన్‌ఎస్‌ఎస్) ఆస్పర్టెమ్‌తో కేన్సర్ వచ్చేందుకు అవకాశాలున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) హెచ్చరించింది. తమ అధ్యయనంలో తేలిందని డబ్ల్యూహెచ్‌వో అనుబంధ విభాగమైన ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ కేన్సర్(ఐఏఆర్‌సీ) తెలిపింది. ఆస్పర్టెమ్‌లో కేన్సర్ కారకాలుండేందుకు అవకాశమున్నట్లు మనుషులు, జంతువులపై జరిపిన అధ్యయనాల్లో తేలిందని ఐఏఆర్‌సీ తెలిపింది.
అయితే, ఆస్పర్టెమ్ పరిమిత వాడకం సురక్షితమేనంటూ ఐరాసలోని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(ఎఫ్‌ఏఓ), డబ్ల్యూహెచ్‌వో ఎంపిక చేసిన నిపుణుల కమిటీ నిగ్గు తేల్చింది. దీనిపై డబ్ల్యూహెచ్‌వో న్యూట్రిషన్ డైరెక్టర్ డాక్టర్ ప్రాన్సెస్కో బ్రాంకా మాట్లాడుతూ.. ఆస్పర్టెమ్‌ను మొత్తానికే మానేయాలని అనడం లేదు, మితంగా వాడాలని మాత్రమే చెబుతున్నామన్నారు. అత్యధికంగా వాడే వారు మాత్రమే తగ్గించుకోవాల్సి ఉంటుంది. కాస్త ఎక్కువగా వాడినా ఎటుంటి అనర్థాలు ఉండవని బ్రాంకా చెప్పారు.
‘ఆస్పర్టెమ్‌తో కాలేయ క్యాన్సర్ రావొచ్చనేందుకు మాత్రం ఆధారాలు పరిమితంగానే లభించాయి. ప్రస్తుతం వినియోగించే స్థాయిల్లో ఆస్పర్టెమ్ ప్రమాదకరమని చెప్పేందుకు బలమైన ఆధారం దొరకలేదు. ఆమోదయోగ్యమైన వినియోగ స్థాయిలకు సంబంధించిన మార్గదర్శకాల్లో మార్పులేదు. పరిమితంగా, మార్గదర్శకాలకు లోబడి వాడితే ఆస్పర్టెమ్ వల్ల సాధారణంగా ఎటువంటి హాని కలగదు’అని ఎఫ్‌డీఏ తెలిపింది. సాధారణంగా రోజుకు 14 కేన్ల వరకు ఆస్పర్టెమ్ ఉన్న డ్రింకులను తాగొచ్చునని కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రొఫెసర్ డేవిడ్ స్పీగెల్‌హాల్టెర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment