Weed plant
-
కలుపు మొక్కలు కావు.. కలిమి పంటలు!
అనేక ఆకుకూర పంటలు మనం విత్తనాలు వేసి సాగుచేసుకొని తింటున్నారు. అయితే, అంతకన్నా పోషక, ఔషధ విలువలున్న ‘సాగు చేయని ఆకుకూర పంటల’ ముచ్చట ఇది! సేంద్రియ జీవవైవిధ్య పంటలు సాగయ్యే పొలాల్లో నిశ్చింతగా ఇవి పెరుగుతున్నాయి..!! పంట పొలాల్లో వాటంతట అవే మొలిచే అనేక రకాల మొక్కలను కలుపు మొక్కలని పీకేస్తున్నాం లేదా కలుపు మందులు చల్లి చంపేస్తున్నాం. అయితే, ఇవి దేవుడిచ్చిన భాగ్యపు పంటలని జహీరాబాద్ ప్రాంత మహిళా రైతులు భావిస్తున్నారు. తమ మెట్ట భూముల్లో ఇరవై వరకు చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజల పంటలు కలిపి పండిస్తున్నారు. ఈ సాగు చేయని ఆకుకూర పంటలను తరతరాలుగా తింటూ ఇంటిల్లపాదీ ఆరోగ్యంగా ఉన్నారు. మనం పనిగట్టుకొని పండించుకొని తింటున్న పాలకూర, తోటకూర వంటి ఆకుకూరల్లో కన్నా ఈ సాగు చేయని ఆకుకూరల్లో అనేక పోషకాలు ఎన్నో రెట్లు ఎక్కువ పాళ్లలో ఉన్నాయని జాతీయ పోషకాహార సంస్థ(ఎన్.ఐ.ఎన్.)నిపుణులు తేల్చటం విశేషం. మరుగున పడిపోయిన ఈ అపురూపమైన ఆకుకూరల ప్రాధాన్యాన్ని చాటిచెప్పేందుకు దిశ బియాండ్ ఆర్గానిక్స్, డక్కన్ డవలప్మెంట్ సొసైటీ ఇటీవల తెల్లాపూర్‌లోని ‘పాక’ సేంద్రియ హోటల్లో ‘సాగు చేయని ఆకుకూరల పండుగ’ కన్నుల పండువగా జరిపారు. దేశంలోనే ఇది ఈ తరహా తొలి పండుగ కావటం విశేషం. పొలాల్లోనే కాదు ఖాళీ ప్రదేశాల్లో, బంజర్లలో, పెరటి తోటల్లోనూ ‘సాగు చేయని ఆకుకూర మొక్కలు’ ఉంటాయి. వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం చెయ్యకుండా.. పీకి పారెయ్యడమో.. కలుపుమందులు చల్లి నాశనం చేయడమో అవివేకమైన పని. కళ్ల ముందున్న సమృద్ధి పోషకాహారాన్ని తినకుండా.. పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నాం. ఇకనైనా ఈ నిర్లక్ష్యాన్ని వదిలేద్దాం. దేవుడిచ్చిన ఈ ఆకుకూరలను కాపాడుకుందాం.. ఆరోగ్యంగా జీవిద్దాం.. జీవవైవిధ్యాన్ని కాపాడుదాం.. ఈ స్ఫూర్తిని ‘సాగు చెయ్యని ఆకుకూరల పండుగ’ ఎలుగెత్తి చాటి చెప్పింది! జహీరాబాద్ మహిళా రైతులకు, డీడీఎస్‌కు, దిశ బియాండ్ ఆర్గానిక్స్ నిర్వాహకులకు జేజేలు!! కరువును జయించే పంటలు.. ఎకరానికి ఎన్ని జొన్నలు పండించారని వ్యవసాయ శాస్త్రవేత్తలు లెక్కలు అడుగుతుంటారు. అయితే, జహీరాబాద్ మహిళా రైతులు తమ మెట్ట భూముల్లో 20 రకాల పంటలను విత్తనాలు చల్లి పండిస్తున్నారు. వీటితోపాటు.. వాటంతట అవే మొలిచి పెరిగే ఆకుకూర పంటలు 50 రకాల వరకు ఉంటాయని మేం అధ్యయనం చేసినప్పుడు తెలిసింది. డబ్బు రూపకంగా విలువ కట్టలేని పంటలివి. దేవుడిచ్చిన పంటలు. ఎంత డబ్బొచ్చింది అని మాత్రమే చూసే పాశ్చాత్య ధోరణి కలిగిన వారికి జీవవైవిధ్య సేంద్రియ వ్యవసాయం వల్ల జరిగే మేలు ఏమిటో బోధపడదు. కరువును జయించడంలో ఈ ‘అన్కల్టివేటెడ్ క్రాప్స్’ కీలకపాత్ర పోషిస్తాయి. వీటిని పరిరక్షించుకోవాలంటే రసాయనిక వ్యవసాయ పద్ధతులను వదిలేసి జీవవైవిధ్య సేంద్రియ వ్యవసాయం చేపట్టాలి. సేంద్రియ దిగుబడి ఒక్క దాని గురించే కాకుండా ఇతరత్రా ప్రకృతి సేవల విలువను కూడా గుర్తించడం మనం నేర్చుకోవాలి. – పి. వి. సతీష్, డైరెక్టర్, డెక్కన్ డవలప్మెంట్ సొసైటీ వ్యవసాయ వర్సిటీలు ఇవి దేవుడిచ్చిన ఆకుకూరలు.. సర్కారీ ఎరువులేస్తే రావు.. ఇవి దేవుడిచ్చిన ఆకుకూర మొక్కలు. ఇవి మంచి బలమైన ఆకుకూరలు. పెంట ఎరువులేస్తే బాగా వస్తాయి. సర్కారీ ఎరువులేస్తే ఇవి రావు. మేం రోజుకో రకం తింటాం. ఇసువంటి కూరలే మాకు రోజూ దొరికే మాంసం. గట్టిగ ఉన్నాం. దవాఖానా అక్కర్లేదు. దొగ్గల కూరలో ఇనుముంటది.. 70 ఏళ్లున్నా నాకు మోకాళ్ల నొప్పులు లేవు. మేం వంద రకాల విత్తనాలు దాచిపెడతాం. కానీ, దేవుడు వందల రకాలు దాచిపెడతడు. వాటికవే మొలిచి రెండు నెలలుండేవి ఆకుకూరలు కొన్ని, 4 నెలలుండేవి కొన్ని, ఏ కాలంలోనైనా అందుబాటు లో ఉండేవి ఇంకొన్ని.. చాలా రకాలున్నయి. ఇది చాలా మంచి పండుగ. – చంద్రమ్మ, జహీరాబాద్, సేంద్రియ మహిళా రైతు కలుపు మొక్కలుగా చూడటం బాధాకరం! పేదలకు వరప్రసాదం వంటి ఈ సాగు చేయని పంటలు. జహీరాబాద్ ప్రాంతంలో 1999లో ఒక అధ్యయనం చేసినప్పుడు ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. పేదలు సంవత్సరంలో కనీసం వంద రోజులైనా తుమ్మికూర, చెన్నంగి, పులిచింత/పుల్లకూర వంటి 15–20 రకాలు తింటారు. దొగ్గలి వంటి ఆకుకూరలను 30–40 సార్లయినా వండుకు తింటారు. వీటి ఆకులను జొన్న, సజ్జ రొట్టెల్లో కలుపుకొని తింటారు. జాతీయ పోషకాహార సంస్థ(ఎన్.ఐ.ఎన్.) వీటిపై అధ్యయనం చేసి పౌష్టికాహార విలువలు చాలా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించింది. ఖరీఫ్‌లో, రబీలో, నల్లరేగడి నేలల్లో, ఎర్ర నేలల్లో, మెట్ట భూముల్లో(41), సాగు నీటి సదుపాయం ఉన్న భూముల్లో పెరిగే(30) రకాలు వేర్వేరుగా ఉన్నాయి. మొక్కలే కాదు చాలా రకాల తీగజాతి ఆకుకూరలు కూడా ఉన్నాయి. ఎలుక చెవుల కూర నల్ల రేగడి నేలల్లో చెరువు కట్టలపై కనిపిస్తుంది. జహీరాబాద్ ప్రాంతంలో కొన్ని రకాలుంటే.. అనంతపురం ప్రాంతంలో మరికొన్ని రకాలు ఉంటాయి. కోస్తా జిల్లాల్లో వేరే రకాలు కూడా కనిపిస్తాయి. వీటిని వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఇప్పటికీ కలుపు మొక్కలుగానే చూస్తుండటం విషాదకరం. ఇవి పౌష్టికాహారంగా, ఔషధాలుగా ఉపయోగపడటమే కాకుండా భూసారాన్ని పెంపొందించేంకు కూడా ఉపయోగపడుతున్నాయని గుర్తించాలి. రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపుమందుల వల్ల అత్యంత విలువైన ఈ ఆకుకూరల సంపదను చాలా వరకు పోగొట్టుకున్నాం. ప్రకృతి/సేంద్రియ వ్యవసాయ పద్ధతులను పశువుల ఎరువు వాడకాన్ని ప్రోత్సహించడం ద్వారా వీటిని పరిరక్షించుకోవాలి. ట్రాక్టర్లలో బాగా లోతు దుక్కులు దున్నటం మాని నాగళ్లతో దుక్కి చేసుకోవాలి. ప్రభుత్వం పశుపోషణను ప్రోత్సహించాలి. వ్యవసాయ విశ్వవిద్యాలయాలు వీటిని కలుపు మొక్కలుగా చూడటం మానేసి, సేంద్రియ రైతుల సంప్రదాయ జ్ఞానాన్ని గుర్తించాలి. పౌష్టికాహారంగా వీటి ప్రాముఖ్యతను గుర్తించి, పరిరక్షించాలి. పట్టణాలు, నగరాల్లోనూ ఈ మొక్కలు కనిపిస్తాయి. వీటి విలువను సమాజంలో అందరూ గుర్తించి పరిరక్షించుకోవాలి. – డా. బస్వాపూర్ సురేశ్‌రెడ్డి (95505 58158), అసోసియేట్ ప్రొఫెసర్, ‘సెస్’, సుస్థిర అభివృద్ధి అధ్యయన విభాగం, హైదరాబాద్ -
కిల్లర్ కలుపు.. గ్లైఫొసేట్!
మనం అమాయకంగా కలుపును చంపుదామని గ్లైఫొసేట్ రసాయనాన్ని చల్లుతున్నాం.. అది మనందరి దేహాల్లోకీ చొరబడి కేన్సర్‌ను, ఇంకా ఎన్నో మాయ రోగాలను పుట్టిస్తోంది.. మన భూముల్లోకి, నీటిలోకి, గాలిలోకి.. మనుషులు, జంతువుల మూత్రంలోకి.. చివరకు తల్లి పాలల్లోకీ చేరిపోయింది.. పంట భూములకు ప్రాణప్రదమైన వానపాములను, సూక్ష్మజీవరాశిని మట్టుబెట్టి నేలను నిర్జీవంగా మార్చేస్తున్నది. దీనివల్ల కేన్సర్ వస్తున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధారసహితంగా ప్రకటించి ఏళ్లు గడిచిపోతున్నాయి.. ఇరవయ్యేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా చావు డప్పు కొడుతోంది! అయినా, దీన్ని నిషేధించడానికి పాలకులు తటపటాయిస్తున్నారు. అదీ.. బహుళజాతి కంపెనీల సత్తా! కొన్ని దేశాలు నిషేధిస్తున్నాయి, ఎత్తివేస్తున్నాయి. మన దేశపు పంట పొలాల్లో ఈ కిల్లర్ కెమికల్ ఐదేళ్లుగా అక్రమంగా హల్చల్ చేస్తున్నా మన పాలకులు నిద్రనటించారు. కలుపు చప్పున చస్తుందన్న ఒక్క సంగతి తప్ప.. అది మన మూలుగల్నే పీల్చేస్తుందన్న సంగతి అమాయక రైతులకు తెలియజెప్పకపోవడం వల్ల దీని వాడకం విచ్చలవిడిగా పెరిగింది.. కూలీలు లేరు.. ఇదీ లేకపోతే సేద్యం ఎలా? అనే వరకు వచ్చింది. ఇన్నాళ్లూ చలనం లేని ప్రభుత్వాలు ఎట్టకేలకు ‘నిషేధం లాంటి ఆంక్షలు’ విధించిన నేపథ్యంలో.. కచ్చితంగా ఏరిపారేయాల్సిన గ్లైఫొసేట్‌పై ‘సాగుబడి’ ఫోకస్!∙ కలుపు మందులు మార్కెట్లో చాలా రకాలున్నాయి కదా.. గ్లైఫొసేట్పైనే ఎందుకింత రగడ జరుగుతున్నట్లు? ఎందుకంటే.. ఇది మామూలు కలుపు మందు కాదు. సాధారణ కలుపు మందు అయితే పిచికారీ చేసినప్పుడు ఏయే మొక్కలపై ఏయే ఆకులపై పడిందో అవి మాత్రమే ఎండిపోతాయి. ఆ మొక్క మొత్తం నిలువెల్లా ఎండిపోదు. దీన్నే ‘కాంటాక్ట్’ కెమికల్ అంటారు. ఇది అంతర్వాహిక(సిస్టమిక్) స్వభావం కలిగినది. అంటే.. గ్లైఫొసేట్ మొక్కపైన ఆకుల మీద పడినా చాలు.. దాని కాండం నుంచి పిల్ల వేర్ల వరకు నిలువునా ఎండిపోతుంది. అంటే.. ఇది చల్లిన పొలంలో మట్టిలోని వానపాములు, సూక్ష్మజీవరాశి కూడా చనిపోతుంది. దీని అవశేషాలు భూగర్భ నీటిని, వాగులు, వంకలు, చెరువు నీటిని కూడా కలుషితం చేస్తుంది. గ్లైఫొసేట్ పిచికారీ చేసే కార్మికులు ఏమాత్రం పీల్చినా తీవ్ర అనారోగ్యానికి గురవుతారు. మూత్రపిండాలు, కాలేయం, పెద్దపేగులో సూక్ష్మజీవరాశి దెబ్బతింటాయి. కేన్సర్ వస్తుంది. నాడీ వ్యవస్థ, నిర్ణాళ గ్రంథుల వ్యవస్థ అస్థవ్యస్థమవుతాయి. రోగనిరోధక శక్తి నశిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కేన్సర్ కారకమని ప్రకటించిన డబ్లు్య.హెచ్.ఓ. అత్యంత ప్రమాదకరమైన వ్యవసాయ పురుగుమందులు/కలుపు మందులుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్లు్య.హెచ్.ఓ.) ప్రకటించిన 15 రకాల్లో గ్లైఫొసేట్ ముఖ్యమైనది. డబ్లు్య.హెచ్.ఓ. అనుబంధ సంస్థ అయిన అంతర్జాతీయ కేన్సర్ పరిశోధనా సంస్థ(ఐ.ఎ.ఆర్.సి.) తర్జనభర్జనల తర్వాత 2017లో ఇది వాడిన చోట కేన్సర్ వ్యాపిస్తోందని తేల్చిచెప్పింది. గ్లైఫొసేట్‌పై ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత పెరుగుతోంది. అమెరికాలో మోన్శాంటో కంపెనీపై సుమారు 4 వేల కేసులు దాఖలయ్యాయి. గ్లైఫొసేట్ వల్లనే తనకు కేన్సర్ సోకిందని ఆరోపిస్తూ డి వేనె జాన్సన్(46) అనే కార్మికుడు దావా వేశాడు. అయినా, కంపెనీల ఒత్తిళ్ల నేపథ్యంలో గ్లైఫొసేట్‌ను పూర్తిగా నిషేధించడానికి ప్రభుత్వాలు తటపటాయిస్తూ.. నామమాత్రపు ఆంక్షలతో సరిపెడుతున్నాయి. 1974 నుంచి మార్కెట్లో.. కొత్త ఔషధం కనుగొనే ప్రయోగాల్లో అనుకోకుండా గ్లైఫొసేట్ 1950లో వెలుగుచూసింది. అయితే, ఇది కలుపుమందుగా పనికొస్తుందన్న సంగతి 1970లో బయటపడింది. మోన్శాంటో కంపెనీ 1974లో దీన్ని కలుపుమందుగా ప్రపంచవ్యాప్తంగా అమ్మటం మొదలు పెట్టింది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ముఖ్యంగా జన్యుమార్పిడి పంటలు ఎక్కువగా సాగయ్యే దేశాల్లో గ్లైఫొసేట్ ఎక్కువ వాడుకలో ఉంది. ఇప్పటి వరకు 860 కోట్ల లీటర్లు వాడగా.. గత పదేళ్లలోనే ఇందులో 72% వాడారు. అమెరికా, అర్జెంటీనా, ఐరోపా దేశాలు, ఆస్ట్రేలియా,కొలంబియా, దక్షిణాఫ్రికాతోపాటు భారత్, శ్రీలంక దేశాల్లో విరివిగా వాడుతున్నారు. దీని వాడకంపై అమెరికాలోని 18 రాష్ట్రాల్లో, కెనడాలో 8 రాష్ట్రాల్లో ఆంక్షలున్నాయి. కొలంబియా, శ్రీలంకల్లో నిషేధం విధించినా తర్వాత తొలగించారు. ఐరోపా యూనియన్ కూటమిలోని 9 దేశాలు గ్లైఫొసేట్ విక్రయ లైసెన్సులను రెన్యువల్ చేయరాదని నిర్ణయించాయి. మూడేళ్లలో నిషేధిస్తామని ఫ్రాన్స్ ప్రకటించగా, సాధ్యమైనంత త్వరగా దీని వాడకం నిలిపేయాలని నిర్ణయించింది. తెలుగు రాష్ట్రాల్లో ఐదేళ్లుగా.. పత్తి పొలాల్లో కలుపు మందులు చల్లుతూ విషప్రభావంతో నేలకొరిగిన/తీవ్ర అనారోగ్యం పాలైన రైతులు, రైతు కూలీల ఉదంతాలు మహారాష్ట్రలోని యావత్మాల్ తదితర ప్రాంతాల్లో గత ఏడాది వెల్లువెత్తిన ఉదంతాలతో గ్లైఫొసేట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తెలుగు రాష్ట్రాల్లో 2013 నుంచి అక్రమంగా సాగులోకి వచ్చిన బీజీ–3 పత్తి వంగడంతో దీని వినియోగం కూడా పెరుగుతూ వచ్చింది. రెండు, మూడేళ్లుగా అక్రమ బీజీ–3 పత్తి తోడై.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో లక్షలాది ఎకరాల నల్లరేగడి భూముల్లో గ్లైఫొసేట్ కలుపుమందు విచ్చలవిడిగా మరణమృదంగం మోగిస్తోంది. దీని వాడకంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి. మన దేశంలో గ్లైఫొసేట్‌ను తేయాకు తోటల్లో, ‘పంట లేని ప్రదేశాల్లో’నూ వాడొచ్చని కేంద్ర వ్యవసాయ శాఖ అనుమతి ఇచ్చింది. అయితే, అధికారుల అసలత్వం వల్ల ఇది బీజీ–3 పత్తితోపాటు సోయా, బత్తాయి, మామిడి తదితర తోటల్లో కూడా కలుపు నివారణకు ఇది వాడుతున్నారు. రైతులు అప్పటికప్పుడు కలుపు బాధ పోతుందన్న సౌలభ్యం చేస్తున్నారే తప్ప.. దీర్ఘకాలం పాటు అది తెచ్చే చేటును గ్రహించలేకపోతున్నారు. వీరికి అవగాహన కలిగించాల్సిన వ్యవసాయ శాఖలు నిమ్మకునీరెత్తినట్టు ఉండడంతో రైతులు ప్రత్యామ్నాయ కలుపు నివారణ పద్ధతుల వైపు దృష్టి సారించలేకపోతున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ గ్లైఫొసేట్‌పై పూర్తిస్థాయి నిషేధం విధించడమే ఈ సమస్యకు పరిష్కారం. ప్రత్యామ్నాయాలు ఏమిటి? అయితే, రైతులకు ప్రత్యామ్నాయం ఏమిటి? అన్నది ప్రశ్న. గ్లైఫొసేట్ వల్ల పొంచిఉన్న పర్యావరణ సంక్షోభం, కేన్సర్ తదితర జబ్బుల ముప్పు గురించి ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారోద్యమాన్ని చేపట్టాలి. రైతుల పొలాల్లో, తోటల్లో కలుపు తీతకు ఉపాధి కూలీలను ఉపయోగించేలా కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవాలి. దీనితో పాటు.. చిన్న, మధ్యతరహా రైతులకు అందుబాటులో ఉండే సులభంగా కలుపు తీసే పరికరాలు, చిన్న తరహా కలుపు యంత్రాలను ప్రభుత్వం విరివిగా అందుబాటులోకి తేవాలి. వచ్చే ఏడాది బీజీ–3తో గ్లైఫొసేట్ కూడా పోతుంది ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రంలో సాగవుతున్న పత్తిలో 85% బీజీ–2 ఉంటుంది.. 15% వరకు బీజీ–3 ఉంటుంది. కలుపుమందును తట్టుకునే బీజీ–3 పత్తి విత్తనాల వల్లనే రైతులు గ్లైఫొసేట్ పిచికారీ చేస్తున్నారు. గ్లైఫొసేట్‌ను దాదాపు నిషేధిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కాబట్టి వచ్చే ఏడాది నాటికి.. బీజీ–3 పత్తి విత్తనాలను విత్తన కంపెనీలు తయారు చేయవు, గ్లైఫొసేట్ కూడా అందుబాటులో ఉండదు, రైతులు కూడా కొనరు. కలుపు తీతకు ఎకరానికి రూ.15 వేల వరకు ఖర్చవుతుందని, కలుపుమందుతో రూ.2 వేలతో పోతుందని, అందుకే గ్లైఫొసేట్ వాడుతున్నామని రైతులు అంటున్నారు. అయితే, ఎకరానికి రూ.4 వేలు ఖర్చయినా గుంటకతోనో ట్రాక్టరుతోనో, కూలీలతోనో కలుపు నివారించుకోవాలే తప్ప గ్లైఫోసేట్ వంటి ప్రమాదకరమైన కలుపుమందులు వాడకూడదు. వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్తలు సూచించిన వివిధ పద్ధతుల్లోనే రైతులు కలుపు నివారించుకునే ప్రయత్నం చేయటం రైతులకు, పర్యావరణానికి కూడా మంచిది. – డా. కేశవులు, తెలంగాణ విత్తన, సేంద్రియ విత్తన ధృవీకరణ ప్రాధికార సంస్థ, హైదరాబాద్ బీజీ–3 పత్తిపై ఐదేళ్లుగా నిర్లక్ష్యం ప్రపంచ ఆహార సంస్థ గ్లైఫొసేట్ కలుపుమందు వల్ల మనుషులకు కేన్సర్ వస్తున్నదని గత ఏడాది నిర్థారించింది. దీన్ని తట్టుకునే పత్తి హైబ్రిడ్ (బీజీ–3) పంట తెలుగు రాష్ట్రాల్లో ఐదేళ్ల క్రితం నుంచే సాగులో ఉంది. 2013 నుంచి అనేక దఫాలు పూర్తి ఆధారాలతో మేం వ్యవసాయ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చాం. పట్టించుకోనందునే గత రెండేళ్లలో లక్షలాది ఎకరాలకు విస్తరించింది. మన దగ్గర పంటల్లో వాడటంతోపాటు.. కెనడా తదితర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్న కందిపప్పు, బఠాణీలు, సోయా నూనెలు కలుపుమందులను తట్టుకునేలా జన్యుమార్పిడి చేసిన పంటలవే. వీటిల్లో గ్లైఫొసేట్ అవశేషాలు అత్యధిక పరిమాణంలో ఉన్నట్లు ఇటీవల వెలుగులోకి రావడం అత్యంత ఆందోళన కలిగించే విషయం. వీటిని దిగుమతి చేసుకునే ముందే కఠినమైన పరీక్షలు జరిపి అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. జన్యుమార్పిడి ఆహారంపై కచ్చితంగా లేబుల్ ముద్రించాలని మన చట్టం చెబుతున్నా పట్టించుకున్న నాధుడు లేడు. మనం గ్లైఫొసేట్ వాడమని చెప్పలేదు కాబట్టి, దీని వల్ల భూమిలో జీవరాశికి, నీటి వనరులకు, మనుషులు, పశువుల ఆరోగ్యానికి ఎటువంటి హాని జరుగుతుందో ప్రభుత్వం కనీస అధ్యయనం కూడా చేయకపోవడం విడ్డూరం. సోయా, నువ్వు పంటలను నూర్పిడి చేయడంలో సౌలభ్యం కోసం కూడా పంటపైనే గ్లైఫొసేట్ పిచికారీ(డెస్సికేషన్) చేస్తున్నారు. ప్రజారోగ్యంపై ఈ అవశేషాల ప్రభావం ఏమిటన్నది ఆందోళనకరం. – డా. జీవీ రామాంజనేయులు (90006 99702), సుస్థిర వ్యవసాయ కేంద్రం, సికింద్రాబాద్ గ్లైఫొసేట్‌ను కేంద్రం నిషేధించాలి ఉపాధి కూలీలతో కలుపు తీయించాలి గ్లైఫొసేట్ కలుపుమందు వాడకం ఇంతకు ముందు నుంచే వున్నా.. కలుపుమందును తట్టుకునే బీజీ–3 పత్తి వల్ల రెండేళ్లుగా బాగా పెరిగింది. మహారాష్ట్రలోని యావత్మాల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఇటీవల సర్వే చేసినప్పుడు ఆశ్చర్యకరమైన సంగతులు తెలిశాయి. ప్రభుత్వం ఆంక్షలు విధించినా అధికారుల ఉదాసీనత వల్ల దీని అమ్మకాలు జోరుగానే సాగుతున్నాయి. పంట వేయడానికి ముందు, మొలక దశలో గడ్డి మొలిచినప్పుడు గ్లైఫొసేట్ కొడుతున్నారు. పాములు, పురుగూ పుట్రా చేరతాయని భయంతో కొడుతున్నారు. ఇదేమో కలుపును చంపే మందు.. అయితే, గులాబీ పురుగుకు కూడా గ్లైఫొసేట్ వాడుతున్నారని, ఇది పురుగుమందులకూ లొంగకుండా పోవడానికి ఇదే కారణమని చెబుతున్నారు. యావత్మాల్ ప్రాంతంలో పత్తి చేలల్లో వీళ్లు కలుపు అని చెబుతున్న మొక్కల్లో ఎక్కువ భాగం కొయ్య (తోట)కూర ఉంది. కొందరు రైతులు, కూలీలు దీన్ని పీకి ఇంటికి తీసుకెళ్తున్నారు.. వండుకు తినడానికి. అటువంటి దానిపై అత్యంత ప్రమాదకరమైన రసాయనంగా, కేన్సర్ కారకంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన గ్లైఫొసేట్‌ను చల్లుతున్నారు. ఈ పూట కలుపు చావడం గురించే ఆలోచిస్తున్నారు తప్ప.. భూమిలో వానపాములు, సూక్ష్మజీవరాశి నశించి మంచి నల్లరేగడి భూములు కూడా నిస్సారమైపోతున్న సంగతి.. నీరు, గాలి కలుషితమవుతున్న సంగతిని ఎవరూ పట్టించుకోవడం లేదు.గ్లైఫొసేట్ చల్లుతూ ఉంటే కొన్నాళ్లకు కొయ్య తోట కూర వంటి కొన్ని రకాల మొక్కలే కొరకరాని కొయ్యలవుతాయి. అమెరికా పొలాల్లో కొన్ని రకాల కలుపు మొక్కలు 20 అడుగుల ఎత్తు వరకు బలిసిపోతున్నాయి. ఇప్పుడు చల్లితే మున్ముందు వేసే పంటల మీద కూడా దీని దుష్ప్రభావం తీవ్రంగా ఉంటుందని తెలుసుకోలేకపోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్లైఫోసేట్ను నిషేధించి, సక్రమంగా అమలు చేయాలి. ఉపాధి హామీ పథకాన్ని కలుపుతీతకు అనుసంధానం చేస్తే రైతులపై ఆర్థిక భారం తగ్గుతుంది. యంత్రం అవసరం లేకుండా నడిచే కలుపుతీత పరికరాలను రైతులకు విరివిగా అందించాలి. – డా. దొంతి నరసింహారెడ్డి (90102 05742), డైరెక్టర్, పెస్టిసైడ్ యాక్షన్ నెట్వర్క్ ఇండియా – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
ముంచుకొస్తున్న గ్లైఫొసేట్ ముప్పు!
నేలతల్లికి ఎప్పుడూ లేని కష్టం వచ్చిపడింది. ఎక్కడో అమెరికాలోనే, బ్రెజిల్‌లోనో, అర్జెంటీనాలోనో కాదు. మన తెలుగు రాష్ట్రాల్లోనే. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన కలుపు నిర్మూలన మందు వల్ల భూమి ఆరోగ్యానికి, పర్యావరణానికి, మనుషులు, పశువుల ఆరోగ్యానికి పెనుముప్పు వచ్చి పడింది.. ఆ పెనుముప్పు పేరే.. కలుపు మందు.. గ్లైఫొసేట్! దీన్ని పిచికారీ చేస్తే ఎంత పచ్చగా ఉన్న మొక్కయినా నిలువునా మాడి మసై పోతుంది. చట్ట ప్రకారం అయితే.. తేయాకు తోటల్లో తప్ప మరే పంట లేదా తోటలోనూ గ్లైఫొసేట్ కలుపు మందును వాడకూడదు. అటువంటిది, ఈ ఏడాది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సుమారు 15 లక్షల ఎకరాల్లో ఈ కలుపు మందును వాడుతున్నారు. ప్రభుత్వ అనుమతి లేని బీజీ–3 అనే జన్యుమార్పిడి పత్తిని తెలిసో తెలియకో నాటిన రైతులంతా గ్లైఫొసేట్‌ను తమ పొలాల్లో పిచికారీ చేస్తున్నారు. ఈ రకం పత్తి మొక్కపై గ్లైఫొసేట్ చల్లినా అది చనిపోకుండా ఉండేలా, కేవలం కలుపు మొక్కలన్నీ మాడిపోయేలా (ఈ అమెరికన్ హైబ్రిడ్ పత్తి రకానికి) జన్యుమార్పిడి చేశారని సమాచారం. తల్లి పాలల్లోనూ అవశేషాలు.. గ్లైఫొసేట్ అత్యంత ప్రమాదకరమైన కటిక విష రసాయనం. ఇది కేన్సర్ కారకమని ప్రపంచ ఆరోగ్య సంస్థ రెండేళ్ల నాడే ప్రకటించింది. దీన్ని పంట పొలాల్లో పిచికారీ చేయటమే కారణం. అమెరికా, బ్రెజిల్, అర్జెంటీనా తదితర దేశాల్లో విచ్చలవిడిగా దీన్ని తట్టుకునే పత్తి తదితర జన్యుమార్పిడి పంటలు సాగవుతున్నాయి. ఫలితంగా అక్కడి భూములు, భూగర్భ జలాలు కలుషితమైపోయాయి. చివరికి తల్లి పాలల్లోనూ, మనుషుల మూత్రంలోనూ గ్లైఫొసేట్ అవశేషాలు ఉన్నాయని తేలింది. కలుపు మందు చల్లితే భూమికి ఏమవుతుంది? పంట భూమి (అది మాగాణి అయినా, మెట్ట/చల్క భూమి అయినా సరే) ఆరోగ్యంగా ఉండాలంటే.. ఆ మట్టిలో వానపాములు, సూక్ష్మజీవరాశి పుష్కలంగా ఉండాలి. అప్పుడే నేల సజీవంగా, స్వయం సమృద్ధంగా ఉంటుంది. చెంచాడు మట్టిలో ఈ భూతలంపై మనుషులెందరు ఉన్నారో అన్ని సూక్ష్మజీవులు ఉంటాయని ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా ఉన్న ఆహార, వ్యవసాయ సంస్థ లెక్క తేల్చింది. ఇలాంటి పొలంలో కలుపు మందును చల్లితే ఆ భూమిపైన కలుపు మొక్కలతోపాటు భూమి లోపలి సూక్ష్మజీవరాశి, వానపాములు కూడా పూర్తిగా నశిస్తాయి. నిర్జీవంగా మారిన నేల గట్టిపడి చట్టుబండవుతుంది. నీటి ఎద్దడిని తట్టుకునే శక్తిని కోల్పోతుంది. కలుపు మందుల వాడకం ఎక్కువ కావడం వల్ల రైతులు, రైతు కూలీలు, సాధారణ ప్రజానీకం ఆరోగ్యం మరింత ప్రమాదంలో చిక్కుకుంటాయి. జగమొండి కలుపు మొక్కలు! కలుపు మొక్కల నిర్మూలనకు గ్లైఫొసేట్ మందును కొన్నేళ్లు చల్లుతూ ఉంటే∙‘జగమొండి కలుపు మొక్కలు’ పుట్టుకొస్తాయి. అమెరికా, బ్రెజిల్, అర్జెంటీనా.. తదితర దేశాల్లో ఇదే జరిగింది. తోటకూర వంటి సాధారణ జాతుల మొక్కలు కూడా గ్లైఫొసేట్ దెబ్బకు మొండి కలుపు చెట్లుగా అవతారం ఎత్తాయి. అమెరికాలోని సుమారు 6 కోట్ల ఎకరాల్లో వీటి బెడద తీవ్రంగా ఉందని యూనియన్ ఆఫ్ కన్సర్న్డ్ సైంటిస్ట్స్(యు.సి.ఎస్.) నివేదిక తెలిపింది. ఎంత తీవ్రమైన కలుపు మందులు చల్లినా ఈ కలుపు మొక్కలు చావకపోగా, ఆరేడు అడుగుల ఎత్తు పెరుగుతుండటంతో అక్కడి రైతులు సతమతమవుతున్నారు. కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త కలుపు మందులు కనిపెడుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు విషమిస్తున్నాయే తప్ప మెరుగవ్వటం లేదని యు.సి.ఎస్. శాస్త్రవేత్తలు తెలిపారు. కలుపు నిర్మూలనకు పైపాటు దుక్కికి అయ్యే ఖర్చులు గ్లైఫొసేట్ వల్ల తొలి దశలో తగ్గినప్పటికీ.. క్రమంగా జగమొండి కలుపుల బెడద ఎక్కువ అవుతున్నదని వారు తెలిపారు. గ్లైఫొసేట్ కలుపు మందును తట్టుకునేలా జన్యుమార్పిడి చేసిన పంటలను, ఏళ్ల తరబడి ఏక పంటలుగా విస్తారంగా సాగు చేస్తుండటమే ఈ ఉపద్రవానికి మూలకారణమని శాస్త్రవేత్తలు తేల్చటం విశేషం. అమెరికా తదితర దేశాల పొలాల్లో గ్లైఫొసేట్ కలిగించిన పెనునష్టం మన పాలకులకు, రైతులకు కనువిప్పు కావాలి. భూములు నాశనమవుతాయి.. కలుపు మందును తట్టుకునే బీజీ–3 రకం పత్తి పంటకు మన దేశంలో ప్రభుత్వ అనుమతి లేదు. గ్లైఫొసేట్ అత్యంత ప్రమాదకరమైన కలుపు మందు. పంట భూములు నాశనమవుతాయి. భూముల్లో సూక్ష్మజీవరాశి, వానపాములు, జీవవైవిధ్యం నశిస్తుంది. మన దేశంలో తేయాకు తోటల్లో తప్ప మరే పంటలోనైనా దీన్ని వాడటం నిషిద్ధం. పత్తి సాగు విస్తీర్ణంలో ఈ ఏడాది 20% వరకు బీజీ–3 రకం పత్తిని అక్రమంగా సాగు చేస్తున్నారు. ప్రభుత్వం కన్నుగప్పి విత్తనాలమ్మిన వారు, సాగు చేస్తున్నవారు, విత్తనాలు సేకరించి నిల్వచేసే వారు.. అందరూ నేరస్థులే. గ్లైఫొసేట్‌ను తట్టుకునే జన్యుమార్పిడి పంటలను అమెరికా, బ్రెజిల్, అర్జెంటీనా తదితర దేశాల్లో సాగు చేస్తున్నారు. అక్కడ మొండి కలుపు మొక్కలు కొరకరాని కొయ్యలుగా తయారయ్యాయి. మన దగ్గర రైతులకు సంతోషం ఒకటి, రెండేళ్ల కన్నా ఎక్కువ కాలం నిలవదు. దీర్ఘకాలంలో పర్యావరణం దెబ్బతింటుంది. ఇది కేన్సర్ కారకమని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రకటించింది. సీఐసీఆర్ పత్తి హైబ్రిడ్లే ప్రత్యామ్నాయం. – డా. కేశవులు, డైరెక్టర్, తెలంగాణ రాష్ట్ర విత్తన, సేంద్రియ ధృవీకరణ సంస్థ, హైదరాబాద్ -
పంటల శత్రువు ‘వయ్యారి భామ’
* జగమొండి కలుపుతో 40% దిగుబడి నష్టం * నత్రజనిని స్థిరీకరించే సూక్ష్మజీవులకు హాని ‘వాడు నడచిన చోట గడ్డి కూడా మొలవదురా..’ అంటూ ఉంటారు. నిలువెల్లా జీవన వ్యతిరేకతతో కూడిన నడవడిక గల వారి గురించి ఇలా అంటూ ఉంటారు. వినాశకరమైన కలుపు మొక్క వయ్యారి భామ కూడా ఇటువంటిదే. పార్ధీనియం, కాంగ్రెస్ గడ్డి, మాచర్ల కలుపు, ముక్కుపుడక, నక్షత్ర గడ్డి, క్యారట్ ఘాస్ వంటి అనేక పేర్లతో దీన్ని పిలుస్తారు. ఎటువంటి ప్రతికూల వాతావరణాన్నయినా తట్టుకొని.. మొలకెత్తిన తర్వాత 4 వారాల్లో 10 వేల నుంచి 50 వేల విత్తనాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ విత్తనం రెండేళ్ల వరకు నిద్రావస్థలో ఉండి, అనుకూల పరిస్థితులు వచ్చిన వెంటనే మొలకెత్తుతుంది. 1950లో అమెరికా నుంచి గోధుమ గింజలతో పాటు దిగుమతైంది మొదలు.. ఇబ్బడి ముబ్బడిగా విస్తరిస్తూ మన దేశానికి గుదిబండగా మారింది. ఆస్ట్రేలియా వంటి అనేక ఇతర దేశాలకూ తలనొప్పిగా మారింది. దీని వల్ల జీవవైవిధ్యానికి, మనుషులు, పశువుల ఆరోగ్యానికే కాకుండా పంటలకూ తీరని నష్టం వాటిల్లుతోంది. పంటలకు నష్టం జరిగేదిలా: పార్థీనియం మొక్కలున్న పొలంలో దిగుబడి 40% వరకు తగ్గిపోయినట్లు శాస్త్రవేత్తల అధ్యయనాల్లో తేలింది. పశుగ్రాస పంటల్లో అయితే ఏకంగా 90% దిగుబడి తగ్గింది. ఈ మొక్క వేళ్ల నుంచి స్రవించే రసాయనాలు పక్కనే ఉన్న పంట మొక్కలను పెరగనీయవు. ఇతర మొక్కలను కూడా మొలవ నీయవు. పచ్చిక బయళ్లలో గడ్డినీ పెరగనీయవు. దీని పుప్పొడి టమాటా, వంగ, చిక్కుడు, మిరప వంటి పెరటి కాయగూరల పుప్పొడి పైన పడి.. కాయలు ఏర్పడకుండా అడ్డుకుంటుంది. గాలి నుంచి నత్రజనిని గ్రహించి అపరాల పంట మొక్కల వేళ్లకు అందించే సూక్ష్మజీవులను నిరోధిస్తుంది. వివిధ రకాల వైరస్ తెగుళ్లు, పిండినల్లి వ్యాప్తికి దోహదపడుతుంది. ప్రతికూల వాతావరణాన్ని తట్టుకోగలిగే అంతర్గత వ్యవస్థ పార్థీనియం సొంతం. పైర్లతో పోటీపడి పెరిగి పంటల దిగుబడిని తగ్గిస్తుంది. నిర్మూలన ఎలా? పూత రాకముందే పార్థీనియం మొక్కను పీకి పచ్చిరొట్ట ఎరువుగా వినియోగించుకోవడం మేలు. జైగోగ్రామా బైకొలరేటా అనే పెంకు పురుగులు మాత్రమే దీని ఆకులను తింటాయి. కసవిందా(కేస్సియం సెరిషియా) మొక్కల వేళ్లు స్రవించే కొన్ని రసాయనాలు పార్థీనియం పెరుగుదలను, బీజోత్పత్తి శక్తిని తగ్గిస్తాయి. వెంపలి, స్టైలో, గాలివాన మొక్క, పిచ్చితులసి, తోటకూర, పసర కంప కూడా దీన్ని అణచివేస్తాయి. దీని నిర్మూలనకు వ్యవసాయ వర్సిటీ ఆగస్టు 16 నుంచి ప్రచార వారోత్సవాలు నిర్వహిస్తోంది. వివరాలకు: కలుపు మొక్కల పరిశోధన కేంద్రం (రాజేంద్రనగర్) అధిపతి, ముఖ్య శాస్త్రవేత్త డా. ఎం. ఏకాద్రి(98664 58165)ని సంప్రదించవచ్చు. - సాగుబడి డెస్క్ -
ఈ మొక్కలు దిగుబడులను హరిస్తాయి
పెనుగొండ (పశ్చిమ గోదావరి): వరి నాట్లు వేసిన 25-30 రోజులకు కూలీలతో కలుపు మొక్కలను తీయించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే అప్పటికే ఈ మొక్కలు భూమిలోని పోషకాలను చాలా వరకూ గ్రహిస్తాయి. దీంతో వరి పైరుకు నష్టం జరుగుతోంది. కలుపు వల్ల వరి దిగుబడి 20-34% తగ్గుతుందని పరిశోధనల్లో తేలింది. ఈ నేపథ్యంలో వరిలో కలుపు నివారణపై పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరులోని వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ మానుకొండ శ్రీనివాసు, ఆంధ్రప్రదేశ్ వరి పరిశోధనా సంస్థ డెరైక్టర్ డాక్టర్ ఎ.విష్ణువర్ధన రెడ్డి అందిస్తున్న సూచనలు... ఇవి మూడు జాతులు వరిని 3 జాతుల కలుపు మొక్కలు నష్టపరుస్తాయి. గడ్డి జాతికి చెందిన వరి మొక్క, అదే జాతికి చెందిన కలుపు మొక్క ఒకేలా ఉంటాయి. అందువల్ల వీటిని గుర్తించి తీసేయడం చాలా కష్టం. వరి చేలో ఊద, గరిక, కరిగడ్డి/కారిగడ్డి, నక్కపీచు/నక్కతోక, చిప్పర గడ్డి, ఉర్రంకి వంటి గడ్డి జాతి కలుపు మొక్కలు కన్పిస్తుంటాయి. ఇక తుంగ జాతి కలుపు మొక్కల వేర్లలో అక్కడక్కడ దుంపలు ఉంటాయి. వీటిలోని ఆహారాన్నే మొక్కలు నిల్వ చేసుకుంటూ పెరుగుతాయి. కాబట్టి ఈ మొక్కను దుంపతో సహా పీకేయాలి. వరి చేలో తుంగ, నీటి తుంగ, బొడ్డు తుంగ, చలి తుంగ, రాకాసి తుంగ వంటి తుంగ జాతి మొక్కలు కన్పిస్తుంటాయి. కొన్ని కలుపు మొక్కల ఆకులు వెడల్పుగా ఉంటాయి. ఈ మొక్కలు విత్తనాల ద్వారా వ్యాప్తి చెందుతాయి. తూటికూర, తూటికాడ, గుంట గలిజేరు, చిన్న నక్కపూత చెట్టు, పులిచింత, నీరుదంటు, ఆమడకాడ, తోటకూర వంటివి ఈ జాతికి చెందిన కలుపు మొక్కలు. యాజమాన్య పద్ధతులతో... గట్ల మీద, సాగు నీటి కాలువల్లో ఉన్న కలుపు మొక్కలను తొలగించాలి. పొలాన్ని బాగా దమ్ము చేస్తే కలుపు బెడద సగం తగ్గుతుంది. పోషకాలు, సాగు నీటి యాజమాన్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే పైరు నేలంతా కమ్ముకొని కలుపును పెరగనీయదు. ప్రతి సంవత్సరం వరి పైరునే వేయకుండా వరి తర్వాత వేరుశనగ లేదా ఇతర పంటలు వేసుకుంటే కలుపు తాకిడి తగ్గిపోతుంది. నాట్లు వేసిన తర్వాత 20, 30 రోజులప్పుడు కలుపు మొక్కలను వేర్లతో సహా తీసేయాలి. అవసరమైతే 40 రోజులప్పుడు మూడోసారి కలుపు తీయించాలి. మొదటిసారి కలుపు తీసిన తర్వాత నత్రజని ఎరువును పైపాటుగా వేస్తే మొక్కలకు ఎక్కువ పిలకలు వస్తాయి. కలుపు తీసిన తర్వాతే ఎరువు వేయాలి. రసాయనాలతో... ఎకరం విస్తీర్ణంలో నాటేందుకు సరిపడే నారుమడిలో విత్తనాలు చల్లిన 7-8 రోజులకు ఊద ని ర్మూలన కోసం 200 లీటర్ల నీటిలో 1.5-2 లీట ర్ల బ్యూటాక్లోర్ కలిపి పిచికారీ చేయాలి. లేకుం టే విత్తనాలు చల్లిన 14-15 రోజులప్పుడు 200 లీటర్ల నీటిలో 400 మిల్లీలీటర్ల సైహలోఫాప్ బ్యూటైల్ 10% కలిపి పిచికారీ చేసుకోవాలి. మాగాణి వరిలో ఊద వంటి ఏకవార్షిక గడ్డి జాతి మొక్కల నిర్మూలనకు నాట్లు వేసిన 3-5 రోజుల మధ్య ఎకరానికి 1-1.5 లీటర్ల బ్యూటాక్లోర్ 50% లేదా 500 మిల్లీలీటర్ల అనిలోఫాస్ 30% లేదా 500 మిల్లీలీటర్ల ప్రెటిలాక్లోర్ 50% లేదా 1.5-2 లీటర్ల బెంధియోకార్బ్ 50% మందును 25 కిలోల ఇసుకలో కలిపి వెదజల్లాలి. లేకుంటే ఎకరానికి 35-50 గ్రాముల ఆక్సాడయార్జిల్ 80% పొడి మందును 500 మిల్లీలీటర్ల నీటిలో కలిపి, ఆ ద్రావణాన్ని నాటిన 3-5 రోజుల మధ్య పొడి ఇసుకలో కలిపి చల్లాలి. చేలో తుంగ, గడ్డి, వెడల్పాటి ఆకులున్న కలుపు మొక్కలు సమానంగా ఉన్నప్పుడు నాట్లు వేసిన 3-5 రోజుల మధ్య ఎకరానికి 4 కిలోల బ్యూటాక్లోర్ 5% గుళికలు+4 కిలోల 2,4-డి ఇథైల్ ఎస్టర్ 4% గుళికలను 20 కిలోల పొడి ఇసుకలో కలిపి వెదజల్లాలి. విత్తనాలు వెదజల్లినప్పుడు... దమ్ము చేసిన పొలంలో నేరుగా విత్తనాలను వెదజల్లినప్పుడు... విత్తనాలు చల్లిన 8-10 రోజుల్లో బ్యూటాక్లోర్+సేఫ్‌నర్ కలిసిన మందు 1.25 లీటర్లు లేదా 500 మిల్లీలీటర్ల అనిలోఫాస్ లేదా ప్రెటిలాక్లోర్+సేఫ్‌నర్ కలిసిన మందు 600 మిల్లీలీటర్లు లేదా 400 మిల్లీలీటర్ల సైహలోఫాప్ బ్యూటైల్‌ను 25 కిలోల ఇసుకలో కలిపి వెదజల్లాలి. విత్తనాలు చల్లిన 15-20 రోజులకు ఎకరానికి 200 లీటర్ల నీటిలో 80 మిల్లీలీటర్ల బిస్ పైరిబాక్ సోడియం లేదా 400 మిల్లీలీటర్ల సైహలోఫాప్ బ్యూటైల్ కలిపి పిచికారీ చేయాలి. విత్తనాలు వేసిన 25-30 రోజులప్పుడు వెడల్పాటి ఆకులున్న కలుపు మొక్కల ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే ఎకరానికి 400 గ్రాముల 2,4-డి సోడియం సాల్ట్ 80% పొడి మందును 200 లీటర్ల నీటిలో కలిపి కలుపు మొక్కలపై పడేలా పిచికారీ చేసుకోవాలి. ఈ జాగ్రత్తలు అవసరం కలుపు మందు పిచికారీ చేయడానికి స్ప్రేయర్‌కు ఫ్లడ్జెట్ లేక ప్లేట్ఫేస్ నాజిల్‌ను ఉపయోగించాలి. నేల పొడిగా ఉన్నప్పుడు రసాయనాలు పిచికారీ చేసినా లేదా గుళికలు చల్లినా పనిచేయవు. కలుపు మందును ద్రవ/గుళికల రూపంలో ఇసుకలో కలిపి వాడినప్పుడు చేలో 2-5 సెంటీమీటర్ల వరకు నీటిని నిలగట్టాలి. మందును పొలమంతా సమానంగా పడేలా చల్లుకోవాలి. బయటి నీరు లోపలికి రాకుండా, లోపలి నీరు బయటికి వెళ్లకుండా గట్లను కట్టుదిట్టం చేయాలి. నాలుగైదు రోజుల వరకు ఆ నీటిని తీయకూడదు. పైరు దశ, కలుపు మొక్క జాతిని బట్టి తగిన మందులు వాడాలి.