
ఒక్లహామా, అమెరికా : నైట్రోజన్ గ్యాస్‌తో మరణ దండనను అమలు చేసే పద్దతిని పునరుద్దరిస్తున్నట్లు అమెరికాలోని ఒక్లహామా రాష్ట్ర అధికారులు ప్రకటించారు. అయితే, నైట్రోజన్ వాయువును మరణ శిక్షకు ఏ విధంగా వినియోగించాలనే దానిపై చర్చలు ఇంకా కొనసాగుతున్నట్లు తెలిపారు. దీంతో దాదాపు మూడేళ్ల అనంతరం ఒక్లహామాలో మరణ శిక్షలు అమలు కాబోతున్నాయి.
2015 నుంచి ఒక్లహామాలో ఒక్క మరణశిక్ష కూడా అమలు కాలేదు. అంతకుముందు ఓ దోషికి మరణదండన అమలు చేసేందుకు అధికారులు ఇంజెక్షన్‌ను ఎక్కించారు. అయితే, ఆ ఇంజక్షన్ వల్ల దోషి మరణించే ముందు తీవ్రంగా హింసకు గురయ్యాడు. దీంతో లెథల్ ఇంజెక్షన్‌ను తయారు చేస్తున్న ఫార్మా కంపెనీలు తమ మందులను మరణశిక్షకు వినియోగచడంపై అభ్యంతరం తెలిపాయి.
దీంతో 2015 నుంచి ఒక్లహామా రాష్ట్రంలో మరణశిక్షలు అమలు కావడం లేదు. ఒక్క ఒక్లహామాలోనే కాదు. అమెరికాలోని పలు రాష్ట్రాల పరిస్థితి కూడా ఇదే. మరణశిక్షను అమలు చేయడానికి ఇంజెక్షన్లు అందుబాటులో లేక శిక్ష అమలును వాయిదా వేస్తూ వస్తున్నాయి. తాజాగా ఇంజెక్షన్ అమలు లేకపోతే నైట్రోజన్ గ్యాస్‌ను వినియోగించి శిక్షను అమలు చేయాలని ఒక్లహామా తీసుకున్న నిర్ణయం మిగిలిన రాష్ట్రాలను సైతం అదే బాటలో నడపించొచ్చు.
వాతావరణంలో అత్యధికంగా లభ్యమయ్యే వాయువు నైట్రోజన్. ఆక్సిజన్ లేకుండా నైట్రోజన్ వాయువును పీల్చడం వలన వ్యక్తికి మరణం సంభవిస్తుంది.