ఒకప్పుడు ప్రపంపంచంలో తన కంటూ ఒక చిరునామా లేని జాతి అది. అనేక రకాలుగా చరిత్రలో అవమానాలూ, బాధలూ ఎదుర్కొని చివరికి పాలస్తీనియన్ల చెంతకు చేరింది. తాము ఉండడానికి కాసింత స్థలం అడిగింది. తమ పవిత్ర గ్రంథం ఆ ప్రాంతం తమ పూర్వీకులదని చెబుతోందనీ,అందువల్ల ఈ ప్రాతం తమదేననీ పేచీపెట్టి పాలస్తీనియన్లతో కయ్యానికి దిగింది.
అమెరికా వెన్నుదన్నుతో ఐక్యరాజ్యసమితి చేత తాను ఆక్రమించు కున్న ప్రాంతాన్ని 1947లో ఒక దేశంగా ప్రకటింపజేసుకొంది. ఆ జాతే యూదు జాతి. వారిదేశమే ‘ఇజ్రాయెల్’. ఇక ఆతిథ్యం ఇచ్చి మోసపోయిన అరబ్ ప్రజలు మాత్రం ‘పాలస్తీనా’ పేరుతో ఉన్న అతి చిన్న ప్రాంతానికి పరిమితమై అనేక అగచాట్లు పడుతూ ఇజ్రాయెల్‌పై దాడులకు దిగుతున్నారు.
మానవాళిని పట్టి పీడిస్తున్న యుద్ధాలు మానవత్వాన్ని మట్టుపెడుతున్నాయి. జంతు దశ నుంచి నాగరికత కలిగిన ఆధునిక మానవునిగా ఎదిగిన మాన వుడు తాను అభివృద్ధి చేసుకున్న ఆయుధాలు, శాస్త్త్ర విజ్ఞానంతో తన అభివృద్ధిని తానే నాశనం చేసుకొంటున్నాడు. ఇందుకు తాజా ఉదాహరణ ఇజ్రాయెల్–పాలస్తీనా మధ్య చెలరేగిన ప్రస్తుత యుద్ధం.
ప్రపంచంలో ఏ యుద్ధం జరిగినా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అమెరికా వంటి అగ్రరాజ్య హస్తం ఉండడం మామూలయ్యింది. ఇజ్రాయెల్‌ను మొదటి నుంచీ అమెరికా అన్ని విధాలా వెనకేసుకొస్తోంది. అమెరికా, దాని మిత్రదేశాలు పాలస్తీనాను భౌగోళికంగా గుర్తించకుండా కేవలం ఇజ్రాయెల్‌ను మాత్రమే ఒక దేశంగా గుర్తిస్తూ 1948లో ఐక్యరాజ్య సమితితో ప్రకటన చేయించటం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది.
ఇజ్రాయెల్‌తో పాటుగా పాలస్తీనాను కూడా భౌగోళికంగా గుర్తించి ఉంటే ఈ యుద్ధం జరిగేదే కాదు. వారి నిర్లక్ష్య ఫలితమే నేడు ఇజ్రాయెల్–పాలస్తీనా యుద్ధం. ఇజ్రాయెల్ రిపబ్లిక్ అయిన తర్వాత పాలస్తీనియన్లు ఇజ్రాయెల్‌పై యుద్ధం ప్రకటించటం అనంతరం పాల స్తీనా ఓడిపోవటం జరిగింది.
అయితే అప్పటినుంచీ పాలస్తీనా ప్రజల్లో అసంతృప్తి, ఆవేశం, అస్థిరత గూడు కట్టుకోవడం క్రమంగా పెరిగింది. దీంతో అవకాశం దొరికినప్పుడల్లా పాలస్తీనా తిరుగుబాటు దారులు ఇజ్రాయెల్‌పై దాడిచేసి హింసకు పాల్పడుతున్నారు. అందులో భాగమే ఇటీవల వందలాది రాకెట్లను ప్రయోగించి ఇజ్రాయెల్‌ను బెంబేలెత్తించిన ఘటనను చూడాలి.
1948లో ఇజ్రాయెల్ ఏర్పడిన వెంటనే పాలస్తీనాకు మద్దతుగా ఐదు అరబ్ దేశాలు ఇజ్రాయెల్‌పై యుద్ధానికి దిగాయి. కాని, ఇజ్రా యెల్ అరబ్ దేశాలపై విజయం సాధించింది. ఐక్యరాజ్య సమితి పాల స్తీనా సమస్యను ప్రపంచ శాంతి భద్రతల సమస్యగా పరిగణించి పరిష్కరించకపోవటం చారిత్రక తప్పిదంగా చెప్పుకోవాలి.
తమ సొంత భూభాగంలోనే ఒక మూల పరాయి వాళ్లుగా జీవించవలసి రావడం, గాజాను దాటాలంటే ఇజ్రాయెల్ ఆధికారుల అనుమతి తీసుకోవలసి ఉండడం, తనిఖీల పేరుతో పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ సైన్యం ఇబ్బంది పెట్టడం, తమ ఆంక్షలను ధిక్కరిస్తే అమాన వీయంగా చంపివేయడం, ఇళ్లను కూల్చడం వంటి అనేక అంశాలు స్వతంత్ర పాలస్తీనా కోరికను మరింత బలపడేలా చేసింది. గాజాలోని ‘‘అల్ అఖ్సా’’ మసీదులోకి వెళ్ళాలంటే కూడా ఇజ్రాయెల్ పోలీసుల అనుమతి తీసుకొని రావాల్సి ఉండటం పాలస్తీనియన్లకు అత్యంత బాధ కల్గిస్తున్న విషయం.
ఈ క్రమంలోనే ‘పాలస్తీనా లిబరేషన్ ఫ్రంట్’, ‘పాపులర్ ఫ్రంట్ ఫర్ ది లిబరేషన్ ఆఫ్ పాలస్తీనా’, ‘పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్’ వంటి సంస్థలు ఆవిర్భవించాయి. యాసర్ అరాఫత్ నేతృత్వంలో (1969–2004) ఇజ్రాయెల్–పాలస్తీనా మధ్య 1993, 1995లలో శాంతి ఒప్పందాలు కుదిరాయి.
దీంతో 1994లో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి ఇత్జాక్ రాబిన్, ఆ దేశ విదేశాంగ మంత్రి షిమన్ పెరెస్, పాలస్తీనా విమోచనా సంస్థ నాయకుడు యాసర్ అరాఫత్‌లకు నోబెల్ శాంతి బహుమతి సంయుక్తంగా లభించింది. అయితే 1995లో రాబిన్ హత్యకు గురయ్యాడు. అనంతరం జరిగిన పరిణామాల్లో 2004లో యాసర్ అరాఫత్ అనుమానాస్పదంగా మరణించాడు. ఫలితంగా సమస్య మళ్ళీ మొదటి కొచ్చింది. రెండు వైపులా రైట్ వింగ్‌కు చెందిన వారు సమస్యను ప్రస్తుత స్థితికి సాగదీస్తూ వచ్చారు.
ఇజ్రాయెల్ – పాలస్తీనా సమస్యను రెండు ప్రాంతాల మధ్య మత ఘర్షణలుగా చూడడం సరికాదు. పాలస్తీనియన్లు భౌగోళికమైన ఉనికి, అస్తిత్వం, ఆత్మగౌరవం కోసం చేస్తున్న పోరాటంగా మాత్రమే పరిగ ణించాలి. ‘భద్రతలను కలిగి ఉండటం వలన వ్యక్తిలో ఉద్భవించే మానసిక ప్రశాంతతయే స్వేచ్చ’ అంటాడు అమెరికన్ రాజకీయవేత్త మాంటెస్క్యూ.
ఇక్కడ పాలస్తీనీయన్లు అభద్రతాభావానికి గురైన సందర్భంలోంచి వచ్చినదే నేటి ‘హమాస్’ సంస్థ. ‘ఆరు భద్రతా మండలి తీర్మానాల’నూ, 1993 పాలస్తీనాతో జరిగిన ‘‘ఓస్లో’’ ఒప్పందాన్ని కూడా ఇజ్రాయెల్ తుంగలో తొక్కింది. పైగా ఐక్యరాజ్యసమితి లోని వీటో అధికారం కల్గిన దేశాల మద్దతుతో తరచుగా ఇజ్రాయెల్ పాలస్తీనియన్లను ఉగ్రవాదం పేరుతో వేధించటం, చంపటం, పాల స్తీనా భూభాగాన్ని ఆక్రమించటం చేసింది.
పాలస్తీనాతో ఘర్షణ తలెత్తిన దాదాపు ప్రతిసారీ ఎంతో కొంత వారి భూభాగాన్ని ఆక్రమించడం పనిగా పెట్టుకొంది ఇజ్రాయెల్ ఆ విధంగా ఇజ్రాయెల్ తన భూభాగాన్ని విస్తరిస్తూపోయి పాలస్తీనా ప్రజలను కొన్ని మైళ్ల భూభాగానికి పరిమితం చేసింది. అందుకే పాలస్తీనియన్లలో ఇజ్రా యెల్ అంటే విపరీతమైన ద్వేషం! ఆ ద్వేషం మరోసారి ప్రకోపించి ఇజ్రాయెల్‌పై తాజా దాడికి దారితీసింది.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజ మిన్ నెత న్యాహూ ఈ సందర్భాన్ని అచ్చమైన రాజకీయ నాయకునిగా తనకు అనుకూలంగా మలచుకొంటున్నాడని విశ్లేషకుల మాట. తనపై ప్రజలలో పెరుగుతున్న అసమ్మతిని పాలస్తీనియన్లపై భీకర యుద్ధం చేయడం ద్వారా తగ్గించి, వారిని మళ్ళీ తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారనేది వారి అభిప్రాయం.
యుద్ధం ఎవరి వైపు నుండి మొద లైనా నష్టపోయేది సాధారణ పౌరులే, సంవత్సరాలుగా కష్టపడి నిర్మించుకున్న ఇళ్లు, ఇతర భవనాలూ పేకమేడల్లా కూలుతున్న దృశ్యాలూ, శిథిల భవనాల్లోంచి వినిపిస్తున్న చిన్న పిల్లల, మహిళల, వృద్ధుల హాహాకారాలూ మనసును చలింపజేసే విధంగా ఉన్నాయి.
ప్రపంచ శాంతి కోసం పుట్టుకొచ్చిన ఐక్యరాజ్య సమితి కోరలు లేని సింహం అయినందు వల్లనే ఇవాళ ప్రపంచంలో అనేక చోట్ల అశాంతి, అభద్రతలు రాజ్యమేలుతున్నాయి, ఒక్క ఇజ్రాయెల్ – పాలస్తీనా ప్రాంతమే కాదు... రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, చైనా – వియత్నాం సమస్య, ఉత్తర కొరియా – దక్షిణ కొరియా, చైనా – అమె రికా, ఉత్తర కొరియా – అమెరికాల మధ్య కొనసాగుతున్న వివా దాలూ, అలాగే భారత్ – చైనా సరిహద్దు వివాదం, భారత్ – పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ‘కశ్మీర్’ సరిహద్దు వివాదం... వంటివన్నీ ఐక్య రాజ్యసమితి నిష్క్రియాపరత్వం, బలహీనతల కారణంగా భవిష్య త్తులో ఏదో ఒకరోజు అగ్ని పర్వతం బద్దలైనట్లుగా హింసకు దారి తీసేవే అనేది విశ్లేషకుల అంచనా.
2001 సెప్టెంబర్ 11న అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట భవనాలపై జరిగిన దాడి తర్వాత అమెరికా ‘అల్ ఖైదా’ ఉగ్రవాదు లపై యుద్ధం పేరుతో ఒసామా బిన్ లాడెన్‌ను మట్టుబెట్టడం పైకి చూడడానికి బాగానే ఉన్నా ఈ పని చేయవలసింది ఐక్యరాజ్యసమితి. కానీ అమెరికా ఆర్థిక సహాయంపై అధికంగా ఆధారపడి ఉన్న ఐరాస నోరు మెదపకుండా ఉండిపోయింది.
అలాగే ఇరాక్ ప్రమాదకర జీవ రసాయన ఆయుధాలు తయారు చేసిందని దానిపై దాడిచేసి పాలకుడైన సద్దాం హుస్సేన్‌ను ఉరితీయించడం వంటి దుశ్చర్యలు సూపర్ పవర్‌గా ఎదిగిన దేశం తన ఇష్టం వచ్చినట్లు చిన్న దేశా లపైనా, ప్రజా ఉద్యమాలపైనా ఉక్కుపాదం మోపిందని చెప్పడానికి ఉదాహరణ. ఐక్యరాజ్య సమితి బలంగా ఉంటే ఇటువంటి సంఘ టనలు చోటు చేసుకునేవేనా?
ఇక ఇజ్రాయెల్ – పాలస్తీనా సమస్య దగ్గరకు వస్తే... దీన్ని అత్యంత పాధాన్యం గల అంతర్జాతీయ సమస్యగా అన్ని దేశాలూ పరిగణించాలి. పాలస్తీనాను ఒక దేశంగా గుర్తిస్తే ఐక్యరాజ్య సమితి కొంత వరకూ పాలస్తీనియన్లకు అండగా నిలిచే అవకాశం ఉంది.
పది సంవత్సరాల పాలస్తీనా బాలిక నేలమట్టమైన ఇంటి ముందు నిలబడి ‘నేను ఏం పాపం చేశాను? ఏం తప్పు చేశాను? నా వాళ్ళందరూ ఇజ్రాయెల్ సైన్యం దాడిలో చనిపోయారు. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి’ అని ప్రపంచాన్ని ప్రశ్నించింది. దీనికి ఎవరు, ఏమని సమా ధానం చెబుతారు ఆ చిట్టి తల్లికి?
డా‘‘ మహ్మద్ హసన్
వ్యాసకర్త నల్గొండ ప్రభుత్వ మహిళా కళాశాల అధ్యాపకుడు
Comments
Please login to add a commentAdd a comment