ఇజ్రాయెల్, పాలస్తీనా రెండూ కూడా వేటికవి తామే బాధితులమని సంకేత పరచుకునే ప్రభామండలాన్ని తమ శిరస్సుల వెనుక నేడు ధరించి ఉన్నాయి. ఆ ఇద్దరు ప్రత్యర్థులు రాజీ పడటానికి సిద్ధపడకపోవడం మాత్రమే కాదు, రాజీకి ప్రయత్నించినప్పుడు వారి వారి కరడుగట్టిన సమూహాలు వారిని పూర్తిగా వెనక్కు లాగిపడేయటం కూడా జరిగింది. ఇంకా అధ్వాన్నమైన సంగతి ఏమిటంటే... వారి స్నేహితులు, మిత్ర పక్షాలు.. వారిని చెలిమి వైపు ప్రోత్సహించేందుకు ఇష్టపడే అవకాశం కనిపించకపోవడం! వాషింగ్టన్ లేదా లండన్ గానీ, అరబ్ కేంద్రంగా ఉన్న దేశాలు గానీ నిజమైన రాజీకి వారిని ముందుకు నెట్టే ప్రయత్నం చేయడం లేదు.
ఇజ్రాయెల్–పాలస్తీనా వ్యవహారాలు నాకు ఏ విధంగానూ అంతుబట్టనివి. నిజానికి ఆ రెండు దేశాల మధ్య వివాదం గురించి నాకు తెలిసిన రవ్వంత కూడా నేను ఈ రెండు మూడు వారాలుగా తెలుసుకుంటూ వచ్చినదే. అయితే ఆ తెలివిడి నాకు ప్రశ్నలు అడిగేందుకు సరిపోయేదే తప్ప, జవాబులు ఇవ్వగలిగేటంతటిది కాదు. అయినప్పటికీ ఆ మాత్రపు జ్ఞానం నాలో ఒక అభిప్రాయాన్ని ఏర్పరచి దానిని నేను పూర్తిగా విశ్వసించేలా క్రమంగా నాలో నమ్మకాన్ని పెంచుతూ వచ్చింది. ఈ ఉదయం నేను మీతో పంచుకోవాలని అనుకుంటున్నది ఇదే.
ఇజ్రాయెల్, పాలస్తీనా రెండూ కూడా వేటికవి తామే బాధితు లమని సంకేత పరచుకునే ప్రభామండలాన్ని తమ శిరస్సుల వెనుక నేడు ధరించి ఉన్నాయి. అయితే బాధ కంటే కూడా గర్వమే తరచూ ఆ ప్రభామండలం చుట్టూతా కాంతిలా ప్రకాశిస్తూ కనిపిస్తోంది. చరిత్రపై తమ దృష్టికోణమే నరైనదనే నమ్మకంతో, ఎవరికివారు స్వీయ నైతిక వర్తనను కలిగి ఉన్నామన్న విశ్వాసాన్ని సమానంగా కలిగి ఉన్నారు.
వారు వర్తమానాన్ని ఎలా చూస్తున్నారన్న విషయంలోనూ ఇదే నిజం. ‘అవతలి’ దేశం తమ పట్ల ఘోరమైన తప్పిదాలకు ఒడిగట్టిందని ఆ రెండు దేశాలు ప్రగాఢంగా విశ్వసిస్తున్నాయి. అయితే వారు అంగీకరించలేని విషయం ఏమిటంటే... శత్రువు పట్ల తాము వ్యవహరిస్తున్న తీరులో ఇద్దరూ కూడా సరి సమానంగా దోషులేనన్నది!
తమకేదైతే జరిగిందో సరిగ్గా అదే తమ ప్రత్యర్థికీ జరిగిందని వారు అంగీకరించరు, అంగీకరించబోరు. ఆ విధమైన ‘సమాన త్వాన్నే’ వారు నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నారు.
అందుకే చాలా తక్కువ మినహాయింపులతో – వాస్తవానికి మీరు వాటిని బహుశా చేతి వేళ్లపైన కూడా లెక్కించవచ్చు – ఇంటర్వ్యూలన్నీ భయానకమైన ఏకపక్ష ధోరణితో ఉన్నాయి. మీరు ఏ విధంగా ప్రశ్న వేసినా మీకు ఇంటర్వ్యూ ఇస్తున్న ఆహ్వానిత పాలస్తీనీయుడు ఆ ప్రశ్నకు జవాబుగా ఇజ్రాయెల్‌ను తీవ్రంగా విమర్శిస్తూ తామెంత ధర్మ బద్ధులో, రుజు ప్రవర్తన కలిగినవారో చెప్పుకుంటారు. ఒక ఇజ్రాయె లీని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా కచ్చితంగా ఇదే విధమైన స్వీయ సమర్థన వైఖరి వ్యక్తం అవుతుంది. ప్రతి ఒక్క విషయంలోనూ!
ఇజ్రాయెల్, పాలస్తీనా సంక్షోభంపై పద్నాలుగు రోజులలో పది ఇంటర్వ్యూల తర్వాత... ఈ రెండు వర్గాల వారు ఒకే భూమిపై – నిస్సందేహంగా ఒకరితో ఒకరు ఘర్షణ పడుతూనే, గాయాల రక్తం ఓడుతూనే – కలిసి ఉంటూ కూడా భిన్న ప్రపంచాలలో జీవిస్తున్నారని నేను గ్రహించాను. పర్యవసానంగా తమ భిన్న చరిత్రల నుంచి మాత్రమే కాకుండా తాము పంచుకున్న చరిత్రల నుంచి కూడా వారు అంగీకరించిన కఠిన సత్యాలతో వారికొక జగమొండి ప్రాపంచిక దృష్టి కోణం ఏర్పడింది. తర్వాత అది వర్తమానంలోని విరుద్ధ కోణాలతో బలోపేతం అయింది. వాస్తవాలు ఒకేలా ఉన్నప్పటికీ వాటి అర్థ, వివరణలు పూర్తిగా భిన్నమైనవి.
విచారకరమైన వాస్తవం ఏంటంటే – ఈ రెండు దేశాల స్నేహి తులు, మిత్రపక్షాలు దేనికి దానిని విడిగా చూడటం అనే ఏక వైఖరి దృష్టి కోణానికి లోబడి ఉండటం. ‘ఏంటిది?!’ అని పశ్చిమ దేశాలు ఇజ్రాయెల్‌ను ఏమాత్రం నిలదీయకుండా భూత వర్తమానాలపై ఆ దేశపు దృష్టి కోణాన్ని అంగీకరిస్తుండగా, మధ్యప్రాచ్యంలోని అరబ్, ముస్లిం దేశాలు పాలస్తీనా పట్ల తమ తమ అవగాహనలపై ఒకే విధమైన నిబద్ధతతో నిలబడి ఉన్నాయి.
పర్యవసానంగా మీరు ఎవరికి మద్ధతు ఇస్తున్నారనేది మీరెలాంటి ఆలోచనను కలిగివున్నారన్న దానిని మాత్రమే కాక, జరుగుతున్న పరిణామాల పట్ల మీ స్పందనను కూడా నిర్ధారణగా తెలియజేస్తుంది. ఈ విధంగా ఇజ్రాయెల్ తోక పశ్చిమ కుక్కను ఊపుతుంది, అదే సమయంలో పాలస్తీనా తోక మధ్యప్రాచ్య కుక్కల్ని గుర్రుమని చూసేలా, మొరిగేలా ప్రేరేపించి వాటిని రెచ్చగొడుతుంది.
బహుశా అందుకే పాలస్తీనా–ఇజ్రాయెల్ వివాదం నేడు మనం ఎదుర్కొంటున్న వాటన్నింటిలోనూ కొంచెమైనా కొరుకుడు పడని అత్యంత కఠినమైన పరిస్థితిగా పరిణమించింది. ఆ ఇద్దరు ప్రత్యర్థులు రాజీ పడటానికి సిద్ధపడకపోవడం మాత్రమే కాదు, రాజీకి ప్రయత్నించినప్పుడు కూడా వారి వారి కరడుగట్టిన సమూహాలు ఆ సంశయా త్మక ప్రారంభ ఉద్దేశాన్ని పూర్తిగా వెనక్కు లాగిపడేయటం కూడా జరిగింది.
బహుశా అధ్వాన్నమైన విషయం ఏమిటంటే వారి స్నేహితులు, మిత్ర పక్షాలు... వారిని చెలిమి వైపు ప్రోత్సహించేందుకు ఇష్టపడే అవకాశం కనిపించకపోవడం! వాషింగ్టన్ లేదా లండన్ గానీ, అరబ్ కేంద్రంగా ఉన్న దేశాలు గానీ నిజమైన రాజీకి వారిని ముందుకు నెట్టే ప్రయత్నం చేయడం లేదు. శత్రుత్వ విరమణ కోసం, స్వల్పకాలిక అర్భక ఒప్పందాల కోసమైతేనే నెడతాయి. కానీ ఏదైనా – అసలు స్వరూపాలకు భిన్నంగా నిజాయితీతో అడుగు వేసినప్పుడు మాత్రమే సాధ్యం అయ్యే – దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం మాత్రం నెట్టవు.
అందుకే నేను చేసిన గత రెండు వారాల ఇంటర్వ్యూలు ఆసక్తికరంగా ఉన్నాయి తప్పితే, ఆశాజనకంగా ఏమీ లేవు. పైగా నిస్పృహను కలిగించేలా ఉన్నాయి. నిజానికి, చెరగని విధంగా వారు వేసిన ముద్రే ఇక ఎటువంటి ఆశల్నీ పెట్టుకోలేని మనఃస్థితికి కారణం అయింది. ఇజ్రాయెల్–పాలస్తీనా ఊబిని బాగు చేయడం, ఆ సమస్యను పరిష్క రించడం అసాధ్యంలా కనిపిస్తోంది. నా భయం ఏంటంటే అనంతంగా అది నిరంతరం సాగిపోతూనే ఉంటుందని! రేపన్నది మిగతా ప్రపంచానికి మరొక రోజు కావచ్చు కానీ ఇజ్రాయెల్–పాలస్తీనాలకు మార్పును వాగ్దానం చేయని రోజూ ఉండే ఒక రోజే!
కాబట్టి మనం ఎదుర్కొంటున్న పరిస్థితి గురించి ఆలోచించండి. భీకరమైన హమాస్ దాడి ఇజ్రాయెల్ ఆత్మవిశ్వాసాన్ని ఛిద్రం చేసి,ఆ దాడిని తిప్పి కొట్టాలన్న ఆగ్రహ జ్వాలల్ని రగిల్చినందువల్ల – సాధ్యమైతే – ఏకంగా హమాస్‌ను తుడిచిపెట్టాలన్న ఇజ్రాయెల్ ప్రతీకారం వల్ల తీవ్రమైన మనోవేదన, ఎంతకూ తరగని బాధ మాత్రమే మిగిలి అనివార్యంగా అది భవిష్యత్తులో అధ్వాన్న పరిస్థితికి పునాదులు వేస్తుంది. ఇది దేనిని సూచిస్తోంది? అత్యంత విచార కరమైన, శోచనీయమైన ముగింపు ఏమిటంటే ఈ అంతులేని కథలో మరొక విషాద అధ్యాయానికి పునాది పడబోతుండటం! భవిష్యత్తు ప్రతిసారీ కూడా తిరిగి మనల్ని గతంలోకే తీసుకెళుతున్నట్లుగా కనిపిస్తోంది.
కరణ్ థాపర్
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment