విశ్లేషణ
లాటిన్ అమెరికా, ఆసియా, ముఖ్యంగా ఆఫ్రికా దేశాల నుంచి యూరప్‌కు సాగుతున్న వలసలు అక్కడ ఒత్తిడి పెంచుతున్నాయి. ఫ్రాన్స్‌లోలా అల్లర్లు చెలరేగడం, పలురకాల నేరాలు జరగడం లాంటివి. వీటికి విరుగుడుగా యూరోపియన్ దేశాలు ఆఫ్రికాలో పెట్టుబడులు పెంచితే, అక్కడే అభివృద్ధి జరిగి, వారు యూరప్‌కు వలస రాకుండా ఉంటారని జీ–7 సమావేశాల్లో ఇటలీ ప్రధాని మెలోని చేసిన ప్రతిపాదన వినడానికి అద్భుతంగా ఉంటుంది. వాస్తవానికి యూరోపియన్లు, అమెరికన్లు వందల ఏళ్లుగా అనుసరించిన విధానాల పర్యవసానమే ఈ వలసలు. ఇప్పుడు ప్రత్యక్ష వలస పాలన నుంచి ఉపసంహరించుకున్నా, పరోక్షంగా నియంత్రిస్తూనే ఉన్నారు. వలసలు ఆగాలన్న చిత్తశుద్ధి వారికి ఉంటే చేయవలసింది పరోక్ష దోపిడీని మానివేయటం.
ప్రపంచంలోని పేద దేశాలన్నింటిని ఆరు వందల సంవత్సరాల నుంచి తమ వలసలుగా, నయా వలసలుగా మార్చుకుని అదుపులేని దోపిడీ సాగిస్తూ వస్తున్న పాశ్చాత్య దేశాలు, వారి బాగోగుల కోసం అంటూ మరొకమారు నటనలు చేస్తున్నాయి. ఇటలీలో గత వారాంతంలో జరిగిన జీ–7 సమావేశాలలో ఆ దేశపు ప్రధాని జార్జియో మెలోనీ చేసిన ప్రతిపాదనలను గమనిస్తే, ఈ విషయం స్పష్టమవుతుంది.
మెలోనీ చేసిన ప్రతిపాదనలు తమకు తక్షణ సమస్యగా మారిన ఆఫ్రికన్ వలసల గురించి. ఆఫ్రికా ఖండంలోని ఉత్తర భాగాన గల అరబ్ దేశాల నుంచి, దక్షిణాన సహారా ఎడారికి దిగువన గల అనేక ఇతర దేశాల నుంచి ఇటలీతో పాటు యూరప్ అంతటికీ వలసలు పెద్ద ఎత్తున సాగుతుంటాయి. వాటిలో చట్ట ప్రకారం జరిగేవాటి కన్నా, అక్రమంగా జరిగేవి అనేక రెట్లు ఎక్కువ. వారంతా ఆఫ్రికా, యూరప్‌ల మధ్య గల మధ్యధరా సముద్రం మీదుగా చిన్న చిన్న పడవలలో రహస్యంగా ప్రయాణిస్తారు.
యూరోపియన్ దేశాల గస్తీ బోట్లు పట్టుకునేది కొందరినైతే, అనేక మంది పట్టుబడకుండా యూరప్ తీరానికి చేరతారు. అక్కడి నుంచి తమ మిత్రుల ద్వారానో, లేక స్థానిక అధికారులకు, ఏజెంట్లకు డబ్బు ఇచ్చుకునో వివిధ దేశాలకు వెళ్ళిపోతారు. యథాతథంగా ఇదే తమకు సమస్య అని యూరోపియన్ ప్రభుత్వాలు భావిస్తుండగా, మధ్యధరా సముద్రంపై ప్రయాణ సమయంలో పరిస్థితులు అనుకూలించక పడవలు మునిగి ప్రతి యేటా కొన్ని వందలమంది దుర్మరణం పాలవుతుంటారు.
ఈ నేపథ్యంలో, జీ–7 సమావేశాలు ముగిసిన రెండురోజులకే ‘బీబీసీ’ ప్రసారం చేసిన ఒక కథనం సంచలనంగా మారింది. మధ్యధరా సముద్రాన్ని ఆనుకుని ఉన్న యూరోపియన్ దేశాలలో ఇటలీ, గ్రీస్ ముఖ్యమైనవి. వాటి మీదుగానే వలసదారులు ఇతర చోట్లకు వెళుతుంటారు. అటువంటి స్థితిలో గ్రీస్ తీరప్రాంత గస్తీ అధికారులు వలసదారులను తరచు తిరిగి సముద్రంలోకి బలవంతాన తీసుకుపోయి మునిగిపోయేటట్లు చేస్తున్నారట. గత మూడేళ్ళలో జరిగిన ఇటువంటి ఘటనలలో కొన్నింటిని ‘బీబీసీ’ బయటపెట్టింది.
వలసల నివారణకు ఇటలీ ప్రధాని మెలోనీ చేసిన సూచనల ప్రకారం, యూరోపియన్ దేశాలు ఆఫ్రికాలో పెట్టుబడులు పెంచాలి. ఆ విధంగా అక్కడ అభివృద్ధి జరిగితే అక్కడి ప్రజలకు ఉపాధి లభించి వారు యూరప్‌కు వలస రాకుండా ఉంటారు. ఈ విధమైన ప్రతిపాదనలు చరిత్ర తెలియని వారికీ, అమాయకులకూ అద్భుతంగా తోస్తాయి. అటువంటి పెట్టుబడులంటూ నిజంగా జరిగితే, అవి సహజంగా ప్రైవేటువి అవుతాయి.
వాటి యాజమాన్యాలు తమ ‘జాబ్‌లెస్ గ్రోత్ టెక్నాలజీ’ వల్ల కొద్దిపాటి ఉపాధులు కల్పించి, వాటికి నికరమైన దీర్ఘకాలిక హామీ ఏదీ లేకుండా చేసి, తమ దృష్టినంతా అక్కడి వనరులను, మార్కెట్లను కొల్లగొట్టటంపై కేంద్రీకరిస్తాయి. ఈ తరహా విధానాల వల్ల వలసల సమస్య, ఆఫ్రికా పేదరికం సమస్య ఎంతమాత్రం పరిష్కారం కావు. యూరోపియన్లు మాత్రం తమ కొత్త పెట్టుబడులకు రాయితీలు సంపాదించి మరింత లాభపడతారు.
వాస్తవానికి యూరోపియన్లు, అమెరికన్లు వందల సంవత్సరాలుగా ఈ తరహా ఆర్థిక నమూనాలను అనుసరించిన దాని పర్యవసానమే ఈవిధంగా సాగుతున్న వలసలు. ఈ విషయం ఇటలీ ప్రధాని మెలోనీకి తెలియదని భావించలేము.
అసలు మొత్తం పాశ్చాత్య దేశాల చరిత్రే ప్రపంచాన్ని తమ వలసలుగా మార్చుకోవటం; అక్కడి నుంచి లక్షలాది మందిని బానిసలుగా తెచ్చి తమ వాణిజ్య పంటల ఎస్టేట్లలో, ఇతరత్రా భయంకరమైన రీతిలో చాకిరీ చేయించుకోవటం; ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆసియా సహజ వనరులను యథేచ్ఛగా దోపిడీ చేయటం; తమ ఉత్పత్తులను అక్కడి మార్కెట్లలో బలవంతంగా అమ్మి స్థానిక ఉత్పత్తులను ధ్వంసం చేయటం; స్థానిక పాలకులను రకరకాలుగా లొంగదీసుకుని తుదముట్టించటాలతో నిండిపోయి ఉంది.
ఇది అక్కడి నిష్పాక్షికులైన చరిత్రకారులు, మేధావులు నేటికీ ధృవీకరిస్తున్న విషయం. అంతెందుకు, ప్రముఖ వలస రాజ్యాలలో ఒకటైన ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు జాక్వెస్ షిరాక్ కొద్దికాలం కిత్రం యూరోపియన్ దేశాల ప్రస్తుత సిరి సంపదలకు తమ వలస దోపిడీలు ఒక ప్రధాన కారణమని అంగీకరించారు.
యూరోపియన్ వలసల దశ 1940ల నుంచి 1970ల మధ్య దాదాపు ముగిసిపోయింది. వారి దోపిడీలు కూడా అంతటితో ఆగితే ఈరోజున అక్కడి ప్రజలు యూరప్‌కు గానీ, అమెరికాకు గానీ వలస వెళ్ళవలసిన అగత్యమే ఉండేది కాదు. అక్కడ గల అపారమైన సహజ వనరులు, మానవ నైపుణ్యాలతో వారు స్వయంగా అభివృద్ధి చెంది ఉండేవారు. కానీ పాశ్చాత్యులు ప్రత్యక్ష రాజకీయ వలస పాలన నుంచి ఉపసంహరించుకున్నా, స్థానిక నాయకులను, సైనికాధికారులను, సివిలియన్ అధికారులను, ఆర్థిక రంగానికి చెందిన ప్రముఖులను పరోక్షంగా నియంత్రిస్తూనే వచ్చారు.
తమ పెట్టుబడులు, టెక్నాలజీలు, మార్కెటింగ్ వ్యవస్థల ద్వారా మొత్తం ఆర్థిక వ్యవస్థలు వారి ఆధీనంలోనే ఉంటూ వస్తున్నాయి. ఆసియా కొంత మెరుగుపడినా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలలో మార్పులు స్వల్పమే. ఇది మంచి చదువులు, ఉద్యోగాల కోసం వెళుతున్న వారి గురించి అంటున్న మాట కాదు. దిగువ స్థాయి వారికి సంబంధించిన విషయం.
ఈ విధంగా వలస వెళుతున్న వారి కారణంగా పాశ్చాత్య దేశాలలో సమస్యలు తలెత్తుతున్న మాట నిజమే. అట్లా వెళ్ళేవారికి ఉపాధి అవకాశాలు ఎక్కువ ఉండవు. వారు మురికి వాడలలో నివసిస్తుంటారు. వారి వల్ల తక్కిన సమాజంపై రకరకాల ఒత్తిడిలు ఏర్పడుతుంటాయి. ఫ్రాన్స్‌లో వలె ఒక్కోసారి తీవ్రమైన అల్లర్లు, హింస చెలరేగుతాయి. పలురకాల నేరాలు జరుగుతాయి. వారికోసం ఏ ప్రభుత్వమైనా కొన్ని సహాయ చర్చలు తీసుకున్నా అవి ఎంతమాత్రం సరిపోవు. మరొకవైపు వలసలు కొనసాగుతూనే ఉంటాయి. ఇటలీ ప్రధాని మెలోనీ మాటలను ‘చీమా, చీమా ఎందుకు కుట్టావు?’ అన్న నీతికథలో వలె శోధిస్తూపోతే, పైన చెప్పుకున్న వందల ఏళ్ళ పాశ్చాత్య వలస దోపిడీ చరిత్ర ముందుకు వస్తుంది.
విచిత్రం ఏమంటే, ఇన్నిన్ని జరుగుతున్నా వారు తమ గత స్వభావాలను, విధానాలను మార్చుకోవటం లేదు. వారికి ఇప్పటికీ చిన్న చిన్న వలస భూభాగాలు, వందలాది సైనిక స్థావరాలు ఉన్నాయి. ఉదాహరణకు ఇటీవలి కాలానికే వస్తే, ఆఫ్రికాలోని మాజీ ఫ్రెంచి వలసలు సుమారు ఆరింటిలో, అక్కడి ఫ్రెంచ్ అనుకూల పాలకులపై తిరుగుబాట్లు జరిగాయి. కొత్తగా అధికారానికి వచ్చిన వారు అక్కడి ఫ్రెంచ్ సైనిక స్థావరాలను ఖాళీ చేయించి వెళ్ళగొట్టారు. దీనిపై ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ నానా రభస సృష్టించి కొత్త పాలకులపై ఒత్తిడి తెచ్చారు. కానీ వారు ససేమిరా లొంగలేదు.
ఇటలీ అధ్యక్షురాలు మెలోనీ నుంచి, అమెరికా అధ్యక్షుడు బైడెన్, మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ల వరకు పాశ్చాత్య నాయకులకు ఇటువంటి వలసలను ఆపాలనే చిత్తశుద్ధి నిజంగా ఉందా? వలసలు యూరప్ అంతటా పెద్ద సమస్య అయినట్లు గత వారమే జరిగిన యూరోపియన్ యూనియన్ ఎన్నికలలో మితవాదుల ఓటు గణనీయంగా పెరగటం రుజువు చేసింది కూడా.
వలసలు, జాతివాదమే అక్కడ ముఖ్యమైన అజెండాగా మారుతున్నాయి. అందువల్ల ఆ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే చేయవలసింది ఆఫ్రికా, లాటిన్ అమెరికా, కరీబియన్, ఆసియా దేశాల దోపిడీని త్వరగా మానివేయటం. అక్కడి వనరులను, మార్కెట్లను అక్కడి ప్రజల నియంత్రణకు, ఉపయోగానికి వదిలి వేయటం. వారితో అన్ని సంబంధాలను సమతులనంగా, పారదర్శకంగా, ప్రజాస్వామికంగా మార్చుకోవటం.
టంకశాల అశోక్
వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు
Comments
Please login to add a commentAdd a comment