ప్రభుత్వ ఆదాయాలు – వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు వచ్చే ఆర్థిక సంవత్సరంలో కట్టు తప్పకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని పరిశ్రమల సంఘం సీఐఐ ప్రభుత్వానికి సూచించింది. మితిమీరిన దూకుడు లక్ష్యాలు భారతదేశ ఆర్థిక వృద్ధిపై ప్రతికూలత చూపుతాయని హెచ్చరించింది.
2024–25లో మొత్తం ద్రవ్యలోటును రూ.16,13,312 కోట్లకు కట్టడి చేయాలని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ నిర్ధేశించుకున్న సంగతి తెలిసిందే. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువలో ఇది 4.9 శాతం. 2023–24లో జీడీపీలో ద్రవ్యలోటు 5.6 శాతంగా నమోదైంది. 2025–26 ఆర్థిక సంవత్సరం నాటికి ద్రవ్యలోటును 4.5 శాతానికి కట్టడి చేయాలన్న లక్ష్యానికి కట్టుబడి ఉన్నట్లు ఆర్థికమంత్రి నిర్మాలా సీతారామన్ స్పష్టం చేస్తున్నారు. ద్రవ్యలోటు ప్రభుత్వానికి రుణ సమీకరణ అవసరాలను సూచిస్తుంది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ రూపకల్పనలో భాగంగా ఆర్థికమంత్రి ఇప్పటికే వివిధ వర్గాలతో సంప్రదింపులు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ రాబోయే కేంద్ర బడ్జెట్ కోసం కొన్ని సూచనలు చేశారు.
నెమ్మదిస్తున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిణామాల్లోనూ దేశం వేగంగా అభివృద్ధి చెందుతోంది. స్థూల ఆర్థిక స్థిరత్వం కోసం సమర్ధవంతమైన ఆర్థిక నిర్వహణ ఈ వృద్ధికి కీలకమైనది.
రుణ–జీడీపీ నిష్పత్తులు తగిన స్థాయిల్లో కొనసాగించడానికి ద్రవ్యలోటు కట్టడి ముఖ్యమైనది.
రాబోయే బడ్జెట్ కేంద్ర ప్రభుత్వ రుణాన్ని గణనీయంగా తగ్గించేలా ఉండాలి.
దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళిక సక్రమంగా అమలయ్యేందుకు కేంద్రం ఆర్థిక స్థిరత్వ రిపోర్టింగ్‌ను వెలువరించాలి.
తీవ్ర ఒత్తిడి పరిస్థితులలో ఆర్థిక స్థిరత్వం కోసం ఔట్‌లుక్‌ను అందించాలి.
రిపోర్టింగ్‌లో దీర్ఘకాల (10–25 సంవత్సరాలు) ఆర్థిక స్థితిగతులను అంచనా వేయడం, ఆర్థిక వృద్ధి, సాంకేతిక మార్పు, వాతావరణ మార్పు మొదలైన అంశాల ప్రభావానికి సంబంధించిన లెక్కలు ఉండాలి. పలు దేశాలు ఇదే ధోరణిని అవలంభిస్తున్నాయి. బ్రెజిల్ విషయంలో ఇవి 10 సంవత్సరాలు ఉంటే, బ్రిటన్ విషయంలో 50 ఏళ్లుగా ఉంది.
ఇదీ చదవండి: ఐదు లక్షల మంది సందర్శకులతో భారత్ బ్యాటరీ షో!
రాష్ట్రాలకు సంబంధించి ద్రవ్య క్రమశిక్షణ చాలా అవసరం. రాష్ట్ర స్థాయి ఫిస్కల్ స్టెబిలిటీ రిపోర్టింగ్‌ను ఏర్పాటు చేయడానికి రాష్ట్రాలను ప్రోత్సహించడం, 12వ ఆర్థిక సంఘం సిఫార్సులను అనుసరించి మార్కెట్ నుంచి నేరుగా రుణాలు తీసుకునేందుకు రాష్ట్రాలు అనుమతించడం, రాష్ట్ర ప్రభుత్వ రంగం సంస్థల ద్వారా రుణాలు తీసుకునే విషయంలో హామీలను అందించడం ఇందులో ఉన్నాయి. ద్రవ్య క్రమశిక్షణను కొనసాగించే విషయంలో రాష్ట్రాలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం స్వతంత్ర పారదర్శక క్రెడిట్ రేటింగ్ వ్యవస్థను రూపొందించాలి.
రుణాలు తీసుకోవడం, ఖర్చు చేయడం వంటి అంశాలు నిర్ణయించడంలో రాష్ట్రాలకు ఎక్కువ స్వయంప్రతిపత్తిని ఇవ్వడానికి రాష్ట్రాల రేటింగ్‌ను ఉపయోగించవచ్చు. అదనంగా మూలధన వ్యయం కోసం రాష్ట్రాలకు రుణంగా ప్రత్యేక సహాయం వంటి పథకాలు రూపొందించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment