![Bharat Battery Show 2025 set to be a major event showcasing cutting edge innovations in battery technology](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/12/10/batterry01.jpg.webp?itok=5kI7jmvs)
100 పైగా అంతర్జాతీయ సంస్థలు పాల్గొనే అవకాశం
రెండో విడత ‘భారత్ బ్యాటరీ షో 2025’ జనవరి 19 నుంచి 21 వరకు న్యూఢిల్లీలో నిర్వహించనున్నారు. ఇందులో భారత్‌తో పాటు అమెరికా, జపాన్, చైనా తదితర దేశాల నుంచి 100కు పైగా కంపెనీలు పాల్గోనున్నాయి. ఈ రంగంలో అధునాతన ఉత్పత్తులను ప్రదర్శించనున్నట్లు ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.
సుమారు 50 దేశాల నుంచి 5,00,000 మంది పైగా సందర్శకులు దీన్ని సందర్శించనున్నట్లు ప్రభుత్వం వివరించింది. ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్ (ఐఈఎస్‌ఏ) ఈ మెగా కార్యక్రమానికి భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఇందులో ప్రధానంగా లిథియం అయాన్ బ్యాటరీలు, బ్యాటరీ విడిభాగాలు, టెస్టింగ్ సొల్యూషన్స్, తయారీ పరికరాలు, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు, బ్యాటరీ స్వాపింగ్ సొల్యూషన్స్ మొదలైన వాటిని ప్రదర్శించనున్నారు. బ్యాటరీ టెక్ పెవిలియన్, సప్లై చెయిన్ పెవిలియన్, ఛార్జింగ్ ఇన్‌ఫ్రా పెవిలియన్ మొదలైన ప్రత్యేక పెవిలియన్లు ఉంటాయని ఐఈఎస్‌ఏ ప్రెసిడెంట్ దేవి ప్రసాద్ దాష్ తెలిపారు. ఐఈఎస్‌ఏ జనవరి 16–17 మధ్య ఇండియా బ్యాటరీ మాన్యుఫ్యాక్చరింగ్ అండ్ సప్లై చెయిన్ సదస్సును (ఐబీఎంఎస్‌సీఎస్), జనవరి 18న ఇండియా బ్యాటరీ రీసైక్లింగ్ అండ్ రీ–యూజ్ సదస్సును నిర్వహించనున్నట్లు వివరించారు.
ఇదీ చదవండి: ఏడేళ్లలో 600 ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు
వ్యాపార విస్తరణపై ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్ దృష్టి
ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్ కార్యకలాపాలు ప్రారంభించి మూడు దశాబ్దాలు పూర్తయిన నేపథ్యంలో రుణ లభ్యత, ఆర్థిక అక్షరాస్యత పెంపు, వ్యాపార విస్తరణపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు సంస్థ ఎండీ సుదీప్త రాయ్ తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంత కస్టమర్లకు ఆర్థిక సేవలు అందించేందుకు సాంకేతికతను వినియోగించుకుంటున్నట్లు వివరించారు. ప్రస్తుతం 20 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో 35,000 పైగా సిబ్బందితో కార్యకలాపాలు సాగిస్తున్నట్లు రాయ్ పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కంపెనీ రూ. 696 కోట్ల నికర లాభం నమోదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment