న్యూఢిల్లీ: రూ. 2,000 నోటు ఉపసంహరణను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ఈ మొత్తం ప్రక్రియంతా సజావుగా పూర్తి కాగలదని ధీమా వ్యక్తం చేశారు. మార్పిడి, డిపాజిట్లకు తగినంత సమయం ఇచ్చినందున ఎక్కడా రద్దీ కనిపించడం లేదని పరిశ్రమల సమాఖ్య సీఐఐ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. రూ. 2వేల నోట్ల జీవితకాలం, వాటిని ప్రవేశపెట్టిన లక్ష్యం పూర్తయింది కాబట్టి ఉపసంహరిస్తున్నట్లు దాస్ వివరించారు. డెడ్‌లైన్ విధించడాన్ని సమర్థించుకుంటూ గడువంటూ లేకపోతే ఉపసంహరణ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించలేమని ఆయన పేర్కొన్నారు.
4.7 శాతం లోపునకు ద్రవ్యోల్బణం..
ద్రవ్యోల్బణం నెమ్మదించిందని, తదుపరి గణాంకాల్లో ఇది తాజాగా నమోదైన 4.7 శాతం కన్నా మరింత తక్కువగా ఉండవచ్చని దాస్ తెలిపారు. అలాగని, అలసత్వం ప్రదర్శించడానికి లేదని.. ద్రవ్యోల్బణంపై యుద్ధం కొనసాగించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. కొన్నాళ్ల క్రితం ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతున్నట్లుగా అనిపించిన సమయంలో రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ముంచుకొచ్చి అంతర్జాతీయంగా మొత్తం పరిస్థితి అంతా మారిపోయిందని దాస్ చెప్పారు.
ఈ నేపథ్యంలో ద్రవ్యోల్బణంపై పోరు కొనసాగుతుందని, ఎప్పటికప్పుడు మారే పరిస్థితులకు తగినట్లుగా ఆర్‌బీఐ స్పందిస్తుందని పేర్కొన్నారు. రేట్ల పెంపునకు విరామం ఇవ్వడమనేది క్షేత్ర స్థాయిలో పరిస్థితులను బట్టే ఉంటుంది తప్ప తన చేతుల్లో ఏమీ లేదని దాస్ చెప్పారు. స్థూలఆర్థిక పరిస్థితులు స్థిరపడుతుండటంతో వృద్ధి పుంజుకోవడానికి తోడ్పా టు లభిస్తోందని దాస్ వివరించారు. బ్యాంకింగ్ వ్యవస్థలో మొండి బాకీల సమస్య గణనీయంగా తగ్గిందన్నారు. బ్యాంకుల రుణ వితరణ పెరుగుతోందని చెప్పారు. భారత ఆర్థిక సుస్థిరతను కొనసాగించేందుకు ఆర్‌బీఐ సదా క్రియాశీలకంగా, అప్రమత్తంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు.
7 శాతం పైనే వృద్ధి..
గత ఆర్థిక సంవత్సరం మూడు, నాలుగో త్రైమాసికాల్లో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్న నేపథ్యంలో వృద్ధి రేటు ముందుగా అంచనా వేసిన 7 శాతం కన్నా అధికంగానే ఉండవచ్చని దాస్ చెప్పారు. 2022–23కి సంబంధించిన ప్రొవిజనల్ అంచనాలు మే 31న వెలువడనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 6.5 శాతంగా ఉండవచ్చని ఆర్‌బీఐ అంచనా వేసినట్లు దాస్ వివరించారు. అంతర్జాతీయ సవాళ్లను భారత ఎకానమీ దీటుగా ఎదురు నిల్చిందని.. భౌగోళికరాజకీయ, అంతర్గత సమస్యలను అధిగమించేందుకు అవసరమైనంతగా విదేశీ మారక నిల్వలను సమకూర్చుకుందని శక్తికాంత దాస్ చెప్పారు.
నగదు కొరత..
రూ. 2 వేల కరెన్సీ నోట్ల మార్పిడి రెండో రోజున కొన్ని బ్యాంకుల్లో నగదు నిల్వలు ఖాళీ అయిపోవడంతో తాత్కాలికంగా ప్రక్రియను ఆపివేయాల్సి వచ్చింది. తిరిగి కరెన్సీ చెస్ట్ నుంచి భర్తీ చేసేంత వరకూ వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, మార్పిడి కోసం కరెన్సీ కొరత ఉందంటూ పెద్దగా ఫిర్యాదులేమీ రాలేదని వివిధ బ్యాంకుల సీనియర్ అధికారులు తెలిపారు. తమ శాఖలన్నింటికీ నిరంతరాయంగా రూ. 500, రూ. 200, రూ. 100 నోట్లను సరఫరా చేస్తూనే ఉన్నామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment