Cash Withdrawal
-
డెబిట్ కార్డు లేకపోయినా డబ్బు విత్‌డ్రా
డెబిట్ కార్డు పోయిందా..ఏటీఎంకు కార్డు తెసుకెళ్లడం మర్చిపోయారా..డెబిట్ కార్డు లేకుండా దూరప్రాంతాలకు వెళ్లారా.. మరేం పర్వాలేదు. మీరు ఉన్న ప్రాంతంలో ఏటీఎం ఉంటే ఎలాంటి డెబిట్ కార్డు లేకుండానే నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే అందుకోసం మీ స్మార్ట్‌ఫోన్‌లో యూపీఐ యాప్ ఉంటే సరిపోతుంది. కార్డు అవసరం లేకుండా యూపీఐ ద్వారా ఎలా డబ్బు విత్‌డ్రా చేయాలో తెలుసుకుందాం.బ్యాంకింగ్ రంగ సేవల్లో టెక్నాలజీ విస్తరిస్తోంది. అందులో భాగంగా యూపీఐ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ఏ చిన్న లావాదేవీలు చేయాలన్నా స్మార్ట్పోన్లోని యూపీఐని వినియోగిస్తున్నారు. దీన్ని ఉపయోగించి డెబిట్ కార్డు లేకుండానే ఏటీఎంలో డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. అందుకోసం ఇంటర్ ఆపరబుల్ కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రావల్ (ఐసీసీడబ్ల్యూ) విధానం ఉపయోగపడుతుంది. ప్రస్తుతం చాలా బ్యాంకులు ఈ సర్వీసును అందిస్తున్నాయి.విత్‌డ్రా చేసుకోండిలా..ముందుగా మీ వద్ద యూపీఐ యాప్ ఇన్స్టాల్ చేసిన స్మార్ట్‌ఫోన్ ఉండాలి. ప్రస్తుతం చాలామంది గూగుల్‌పే, ఫోన్‌పే..వంటి యూపీఐ ధర్డ్‌పార్టీ యాప్‌లను వాడుతున్నారు.మీ బ్యాంకు ఐసీసీడబ్ల్యూ సేవలందిస్తుందో లేదో తనిఖీ చేసుకోవాలి.ఒకవేళ ఈ సర్వీసు అందుబాటులో ఉంటే ఏటీఎం వద్దకు వెళ్లి స్క్రీన్‌పై ‘యూపీఐ నగదు ఉపసంహరణ’ ఆప్షన్ ఎంచుకోవాలి.ఏటీఎం ప్రొవైడర్‌ను బట్టి ఈ ఎంపిక విభిన్నంగా ఉండవచ్చు. జాగ్రత్తగా గమనిస్తే సులువుగానే దాన్ని గుర్తించవచ్చు.యూపీఐ విత్‌డ్రా సెలక్ట్ చేసుకున్నాక క్యూఆర్ కోడ్ డిస్ప్లే అవుతుంది.మీ ఫోన్లోని యూపీఐ యాప్ ఓపెన్ చేసి ఏటీఎం స్క్రీన్‌పై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి.మీరు ఎంత డబ్బు విత్‌డ్రా చేయాలో ఎంటర్ చేసి, యూపీఐ పిన్ ప్రెస్ చేయాలి. (యూపీఐ ద్వారా ఏటీఎం రోజువారీ విత్‌డ్రా పరిమితి సాధారణంగా రూ.10,000గా ఉంటుంది)కొంత సమయం తర్వాత బ్యాంకు సిస్టమ్ సర్వర్‌తో కనెక్ట్ అయి డబ్బు విత్‌డ్రా అవుతుంది.ఇదీ చదవండి: కొత్త పెన్షన్ విధానంలోని కీలకాంశాలు..ఈ ప్రక్రియ వల్ల ఖాతాదారుల వ్యక్తిగత సమాచారానికి ఎలాంటి ప్రమాదం ఉండదు. క్యూఆర్ కోడ్ మీ సమాచారాన్ని రక్షించడానికి ఎన్క్రిప్షన్ని ఉపయోగిస్తుంది. మీకు మాత్రమే తెలిసిన యూపీఐ పిన్‌తో లావాదేవీని పూర్తి చేసుకోవచ్చు. -
‘ఆధార్ ఏటీఎం’ వచ్చేసింది..అదెలా పనిచేస్తుందంటే?
మీకు అత్యవసరంగా డబ్బులు కావాలా? బ్యాంక్ లేదంటే ఏటీఎంకు వెళ్లేందుకు సమయం లేదా? మరేం ఫర్లేదు. మీరు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) ద్వారా ఆన్లైన్ ఆధార్ ఏటీఎం( ఏఈపీఎస్) సేవను ఉపయోగించి ఇంటి నుంచే డబ్బులు డ్రా చేసుకోవచ్చు. మీ కనీస అవసరాల్ని తీర్చుకోవచ్చు. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ సోషల్ మీడియా పోస్ట్‌లో ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. అందులో ‘అత్యవసర నగదు కావాలి కానీ బ్యాంక్‌కు వెళ్లేందుకు సమయం లేదా? చింతించకండి! ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఆన్లైన్లో ఆధార్ ఏటీఎం(ఏఈపీఎస్) ద్వారా మీ ఇంటి నుంచే డబ్బుల్ని డ్రా చేసుకోవచ్చు. మీ పోస్ట్‌మాన్ ఇప్పుడు మీ ఇంటి వద్దే నగదును విత్‌డ్రా చేసుకునేందుకు మీకు సహాయం చేస్తారు.’ అంటూ ట్వీట్లో పేర్కొంది. ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (ఏఈపీఎస్) ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (ఏఈపీఎస్)తో ఒక వ్యక్తి తన బయోమెట్రిక్‌ని ఉపయోగించి నగదు తీసుకోవడానికి, ఆధార్-లింక్డ్ బ్యాంక్ అకౌంట్ నుంచి ఇతరులకు నగదు పంపుకోవచ్చు. కస్టమర్లు ఏటీఎం లేదా బ్యాంక్‌ని సందర్శించాల్సిన అవసరం లేకుండా ఏఈపీఎస్ని ఉపయోగించి చిన్న మొత్తాలను విత్‌డ్రా చేసుకోవచ్చు. దీని వల్ల సమయం కూడా ఆదా అవుతుంది. ఏఈపీఎస్ అంటే ఏఈపీఎస్ అంటే ‘ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (ఏఈపీఎస్) అనేది ఒక చెల్లింపు సేవ. ఈ సేవల ద్వారా ఒక బ్యాంక్ కస్టమర్ తన ఆధార్ లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్‌ను ఓపెన్ చేయడంతో పాటు ప్రాథమిక్ బ్యాంకింగ్ అవసరాలు అంటే బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసుకోవడం, కొద్ది మొత్తంలో డబ్బులు ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి మరో బ్యాంక్ అకౌంట్‌కు పంపుకోవచ్చు. ఏఈపీఎస్ సేవల్ని పొందడం ఎలా? ఏఈపీఎస్ సర్వీసుల్ని పొందాలనుకునే కస్టమర్‌కు తప్పని సరిగా బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఆ బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ లింక్ చేయాలి. బయోమెట్రిక్‌ను ఉపయోగించి డబ్బుల్ని పంపడం,విత్ డ్రాయిల్ వంటి సేవల్ని వినియోగించుకోవచ్చు. ఆధార్ నంబర్ ఉంటే సరిపోతుంది. ప్రస్తుతానికి క్యాష్ విత్‌డ్రా, ట్రాన్స్‌ఫర్‌కు లిమిట్ అనేది ఏం లేదు. కానీ గరిష్టంగా రూ. 10 వేల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. In need of urgent cash but don’t have time to visit the bank? Worry not! With @IPPBOnline Aadhaar ATM (AePS) service, withdraw cash from the comfort of your home. Your Postman now helps you to withdraw cash at your doorstep. Avail Now! 👉For more information Please visit:… pic.twitter.com/4NNNM6ccct — India Post Payments Bank (@IPPBOnline) April 8, 2024 -
ఈపీఎఫ్‌వో ఖాతాలో ఈ చిన్న పని చేశారా? లేదంటే క్యాష్ విత్‌డ్రా కష్టమే!
కారణాలేంటో? తెలియదు. గత కొన్ని నెలలుగా ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) ప్రాంతీయ కార్యాలయాల్లో పింఛనుదారులు పడరాని పాట్లు పడుతున్నారు. కాలేజీ ఫీజు కట్టాలని ఒకరు. కూతురు పెళ్లి చేయాలని మరొకరు. అమ్మకు వైద్యం చేయించాలని ఇంకొకరు. ఇలా పీఎఫ్ ఖాతాదారులు కాళ్లరిగేలా ప్రాంతీయ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. సమస్యల పరిష్కారం కోసం వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. కానీ అవి పరిష్కారానికి నోచుకోవడం లేదు. అయితే, ఈ క్రమంలో కాలేజీలు, స్కూళ్లు ప్రారంభం కావడంతో పాటు ఇతర కారణాల వల్ల ఎక్కువ మంది ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారిపోతున్నారు. ఇలాంటి సమాయాల్లో ఈపీఎఫ్‌వో పోర్టల్‌లో ఖాతాదారులు పాత సంస్థకు రిజైన్ చేశారో వివరాల్ని అప్ డేట్ చేయాల్సి ఉంటుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నిబంధనల ప్రకారం, ఒక ఉద్యోగి ఉద్యోగం మారితే, అతను తన పీఎఫ్ ఖాతాను కొత్తగా చేరుతున్న సంస్థలోకి ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. పీఎఫ్ ఖాతాను బదిలీ చేయడానికి ముందు, ఆ వ్యక్తి తనను తాను ఆ కంపెనీలో ఉద్యోగి అంటూ వివరాల్ని నమోదు చేయాలి. దీని తర్వాత మాత్రమే పీఎఫ్ ఖాతాను బదిలీ చేసే అవకాశం ఉంటుంది. కంపెనీని మార్చిన తర్వాత పాత సంస్థకు ఎప్పుడు రాజీనామా చేసిన తేదీని రెండు నెలలలోపు అప్డేట్ చేయాలి. ఒకవేళ ఎగ్జిట్ వివరాలు నమోదు చేయకుండా, సంస్థ మారే సమయంలో పీఎఫ్ విత్ డ్రా చేయడం మంచిది కాదు. పీఎఫ్ విత్ డ్రా రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక పీఎఫ్ పోర్టల్‌లో సంస్థకు ఎప్పుడు రాజీనామా చేశారో తెలుపుతూ తేదీని ఎలా అప్డేట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం స్టెప్ట్1 : https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ లో సభ్యుల సేవా పోర్టల్‌ని సందర్శించండి స్టెప్ట్2 : వారి యూఏఎన్ నెంబర్ పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వాలి. స్టెప్ట్3 : అనంతరం 'మేనేజ్' ట్యాబ్‌పై క్లిక్ చేసి, 'మార్క్ ఎగ్జిట్' సెలక్ట్ చేసుకోవాలి స్టెప్ట్4 : మీరు డ్రాప్‌డౌన్ జాబితా నుండి పీఎఫ్ అకౌంటర్ నంబర్‌ను ఎంపిక చేసుకోవాలి స్టెప్ట్ 5 : ఇక్కడ నిష్క్రమణ తేదీ, నిష్క్రమణకు గల కారణాన్ని నమోదు చేయాలి. స్టెప్ట్ 6 : ఆ తర్వాత క్లిక్ చేసి ఓటీపీ రిక్వెస్ట్ పంపండి స్టెప్ట్ 7 : మీ మొబైల్‌కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి స్టెప్ట్ 8 : చెక్‌బాక్స్‌ని ఎంచుకుని, 'అప్డేట్' క్లిక్ చేసి, ఆపై 'ఒకే' అని ఆప్షన్‌ను క్లిక్ చేస్తే మీ వివరాలు అప్డేట్ అవుతాయి. #Employees can now update their Date of Exit on their own. To know more about this process, watch this video. Follow these simple steps to update your #DateofExit.https://t.co/Ys5JgPiQEz#AmritMahotsav #epfowithyou #PF #पीएफ #epf #HumHaiNa@PMOIndia @byadavbjp @Rameswar_Teli — EPFO (@socialepfo) July 12, 2023 చదవండి👉 టెక్ దిగ్గజం టీసీఎస్‌కు భారీ షాక్.. ఇదేం పద్ధతంటూ కోర్టు చివాట్లు! -
సజావుగా రూ. 2వేల నోట్లు వెనక్కి..
న్యూఢిల్లీ: రూ. 2,000 నోటు ఉపసంహరణను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ఈ మొత్తం ప్రక్రియంతా సజావుగా పూర్తి కాగలదని ధీమా వ్యక్తం చేశారు. మార్పిడి, డిపాజిట్లకు తగినంత సమయం ఇచ్చినందున ఎక్కడా రద్దీ కనిపించడం లేదని పరిశ్రమల సమాఖ్య సీఐఐ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. రూ. 2వేల నోట్ల జీవితకాలం, వాటిని ప్రవేశపెట్టిన లక్ష్యం పూర్తయింది కాబట్టి ఉపసంహరిస్తున్నట్లు దాస్ వివరించారు. డెడ్‌లైన్ విధించడాన్ని సమర్థించుకుంటూ గడువంటూ లేకపోతే ఉపసంహరణ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించలేమని ఆయన పేర్కొన్నారు. 4.7 శాతం లోపునకు ద్రవ్యోల్బణం.. ద్రవ్యోల్బణం నెమ్మదించిందని, తదుపరి గణాంకాల్లో ఇది తాజాగా నమోదైన 4.7 శాతం కన్నా మరింత తక్కువగా ఉండవచ్చని దాస్ తెలిపారు. అలాగని, అలసత్వం ప్రదర్శించడానికి లేదని.. ద్రవ్యోల్బణంపై యుద్ధం కొనసాగించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. కొన్నాళ్ల క్రితం ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతున్నట్లుగా అనిపించిన సమయంలో రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ముంచుకొచ్చి అంతర్జాతీయంగా మొత్తం పరిస్థితి అంతా మారిపోయిందని దాస్ చెప్పారు. ఈ నేపథ్యంలో ద్రవ్యోల్బణంపై పోరు కొనసాగుతుందని, ఎప్పటికప్పుడు మారే పరిస్థితులకు తగినట్లుగా ఆర్బీఐ స్పందిస్తుందని పేర్కొన్నారు. రేట్ల పెంపునకు విరామం ఇవ్వడమనేది క్షేత్ర స్థాయిలో పరిస్థితులను బట్టే ఉంటుంది తప్ప తన చేతుల్లో ఏమీ లేదని దాస్ చెప్పారు. స్థూలఆర్థిక పరిస్థితులు స్థిరపడుతుండటంతో వృద్ధి పుంజుకోవడానికి తోడ్పా టు లభిస్తోందని దాస్ వివరించారు. బ్యాంకింగ్ వ్యవస్థలో మొండి బాకీల సమస్య గణనీయంగా తగ్గిందన్నారు. బ్యాంకుల రుణ వితరణ పెరుగుతోందని చెప్పారు. భారత ఆర్థిక సుస్థిరతను కొనసాగించేందుకు ఆర్బీఐ సదా క్రియాశీలకంగా, అప్రమత్తంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. 7 శాతం పైనే వృద్ధి.. గత ఆర్థిక సంవత్సరం మూడు, నాలుగో త్రైమాసికాల్లో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్న నేపథ్యంలో వృద్ధి రేటు ముందుగా అంచనా వేసిన 7 శాతం కన్నా అధికంగానే ఉండవచ్చని దాస్ చెప్పారు. 2022–23కి సంబంధించిన ప్రొవిజనల్ అంచనాలు మే 31న వెలువడనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 6.5 శాతంగా ఉండవచ్చని ఆర్బీఐ అంచనా వేసినట్లు దాస్ వివరించారు. అంతర్జాతీయ సవాళ్లను భారత ఎకానమీ దీటుగా ఎదురు నిల్చిందని.. భౌగోళికరాజకీయ, అంతర్గత సమస్యలను అధిగమించేందుకు అవసరమైనంతగా విదేశీ మారక నిల్వలను సమకూర్చుకుందని శక్తికాంత దాస్ చెప్పారు. నగదు కొరత.. రూ. 2 వేల కరెన్సీ నోట్ల మార్పిడి రెండో రోజున కొన్ని బ్యాంకుల్లో నగదు నిల్వలు ఖాళీ అయిపోవడంతో తాత్కాలికంగా ప్రక్రియను ఆపివేయాల్సి వచ్చింది. తిరిగి కరెన్సీ చెస్ట్ నుంచి భర్తీ చేసేంత వరకూ వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, మార్పిడి కోసం కరెన్సీ కొరత ఉందంటూ పెద్దగా ఫిర్యాదులేమీ రాలేదని వివిధ బ్యాంకుల సీనియర్ అధికారులు తెలిపారు. తమ శాఖలన్నింటికీ నిరంతరాయంగా రూ. 500, రూ. 200, రూ. 100 నోట్లను సరఫరా చేస్తూనే ఉన్నామని వివరించారు. -
ఈపీఎఫ్.. వెరీటఫ్..! మారిన రూల్స్.. ఈ విషయాలు తెలుసుకోకుంటే కష్టమే!
అమరేందర్‌రెడ్డి ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తూ పదవీ విరమణ పొందాడు. సర్వీసు పూర్తి కావడంతో కుటుంబ అవసరాల కోసం తన ఈపీఎఫ్ ఖాతాలోని రూ.8.75 లక్షల నగదు ఉపసంహరణకు, పెన్షన్ పొందేందుకూ ప్రయత్నించాడు. కానీ అతని వినతిని ఈపీఎఫ్ఓ తిరస్కరించింది. అతడి ఈపీఎఫ్ ఖాతాలో తండ్రిపేరు నమోదు కానందునే ఇలా జరిగింది. వాస్తవానికి తండ్రి పేరును ఆన్లైన్లో పొందుపర్చి... కోవిడ్ సమయంలో రెండుసార్లు నగదును ఉపసంహరించుకున్న అమరేందర్‌రెడ్డి.. తాజాగా తండ్రి పేరు లేదని వినతిని తిరస్కరించడంతో ఆందోళనకు గురయ్యాడు. ఆన్లైన్లో తండ్రిపేరు సవరణకు రిక్వెస్ట్ సమర్పించినప్పటికీ దాన్ని కూడా రిజెక్ట్ చేయడంతో తను చివరగా పనిచేసిన కంపెనీని ఆశ్రయించాడు. సంబంధిత డాక్యుమెంట్లు సమర్పించి ఆర్నెల్లు కావస్తున్నా ఇప్పటికీ ఆయనకు పీఎఫ్ డబ్బులు అందలేదు. సాక్షి, హైదరాబాద్: ఉద్యోగి భవిష్యనిధి (ఈపీఎఫ్) ఖాతాలో వివరాల సవరణ అత్యంత కష్టతరంగా మారింది. సాధారణంగా కొత్తగా సంస్థలో ఉద్యోగంలో చేరినప్పుడు ఉద్యోగి సమర్పించిన వాస్తవ వివరాలను కంపెనీ యాజమాన్యం ఉద్యోగి ఈపీఎఫ్ ఖాతాలో నమోదు చేస్తుంది. సరైన వివరాలు పొందుపరిచినప్పటికీ ఇటీవల పలువురు ఉద్యోగుల ఈపీఎఫ్ ఖాతాల్లో ఆ వివరాలు కనిపించడం లేదు. దీంతో అకస్మాత్తుగా నగదు అవసరమైనప్పుడు ఈపీఎఫ్ ఖాతా నుంచి తీసుకోవాలనుకున్న ప్రయత్నాలు ఫలించక ఖాతాదారులు నివ్వెరపోతున్న ఘటనలు ఇటీవల అనేకం కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వివరాల సవరణలోనే చాలామంది నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. కొందరు అన్ని వివరాలు సమర్పించి సరిచూసుకున్నప్పటికీ కొన్నాళ్ల తర్వాత తండ్రి పేరు, పుట్టినతేదీ, పాన్, ఆధార్, బ్యాంకు ఖాతా లింకు లేదని వెబ్సైట్లో సూచించడం గమనార్హం. ఇలాంటి వాటికి సాంకేతిక కారణాలను సాకుగా చూపి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. అంతా ఆన్లైన్లో అయినా... ప్రతి ఈపీఎఫ్ ఖాతాదారుడికి యూఏఎన్ (యూనివర్సల్ అకౌంట్ నంబర్) ఉంటుంది. ఉద్యోగి వివిధ కంపెనీలు మారినప్పటికీ యూఏఎన్ మాత్రం ఒకటే ఉంటుంది. ఈపీఎఫ్ వెబ్సైట్లో తమ వివరాలు సరిగ్గా లేవని గుర్తించిన పలువురు ఉద్యోగులు.. ఆన్లైన్లో సవరణల కోసం నమోదు చేసుకున్న వినతులు పెద్ద సంఖ్యలో తిరస్కరణకు గురవుతున్నాయి. చిన్నపాటి సవరణలకూ ఆధా రాలు సమర్పిస్తున్నప్పటికి వాటిని తిరస్కరించడం పట్ల ఖాతాదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొందరు రెండు, మూడుసార్లు దరఖాస్తులు సమర్పించుకుంటుండగా.. మరికొందరు నేరుగా ఈపీఎఫ్ కార్యాలయాలకు వెళ్లినప్పటికీ సవరణలు పొందలేకపోతున్నారు. నిబంధనలు కఠినతరం చేయడంతో పలువురి దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. యాజమాన్యం ధ్రువీకరణ తప్పనిసరి ఉద్యోగి ఈపీఎఫ్ ఖాతాలో వివరాల సవరణలో యాజమాన్యం ధ్రువీకరణను కేంద్రం తప్పనిసరి చేసింది. దీంతో ఎలాంటి అంశాలకైనా యాజమాన్యం అనుమతి కావాలంటూ తిరస్కరిస్తున్నారు. సర్వీసులో ఉన్న ఉద్యోగులకు ఈ నిబంధనతో పెద్దగా ఇబ్బంది లేనప్పటికీ... ఉద్యోగం మానేసిన, ఇతర కంపెనీకి మారి పీఎఫ్ పరిధిలోకి రాకున్నా, ఉద్యోగం ఊడి కొత్త ఉద్యోగం పొందలేని వారికి మాత్రం సవరణ ప్రక్రియ కత్తిమీద సాములా మారింది. ప్రధానంగా యాజమాన్యం సహకారం కొరవడటం, ఈపీఎఫ్ కార్యాలయాల్లోకి ప్రవేశం లేకుండా కేవలం ఇన్వార్డ్ సెల్ వరకే ఖాతాదారులకు అనుమతి ఉండటం లాంటి కారణాలతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ►ఉద్యోగి పేరు లేదా ఇంటి పేరు సవరణ చేయించాలంటే ప్రభుత్వ గెజిట్ తప్పనిసరి అయ్యింది. స్వల్ప మార్పులకైనా సరైన ఆధారాలు సమర్పించాల్సిందే. ►సవరణల కేటగిరీలో ఆధార్, పాన్ కార్డులను అప్లోడ్ చేసినప్పటికీ యాజమాన్యం ధ్రువీకరణ చేయాలి. సర్వీసులో లేని వారికి ఈ నిబంధన ప్రతిబంధకంగా మారింది. ►కొన్ని సందర్భాల్లో సవరణలకు ఒరిజినల్ పత్రాలు సమర్పించాలనే నిబంధన ఉంది. దీనికోసం ఉద్యోగి వ్యక్తిగతంగా ఈపీఎఫ్ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. ►సవరణలను యాజమాన్యాలు ధ్రువీకరించినప్పటికీ సంబంధిత అధికారులు సంతకాలు పెట్టకపోవడం వల్ల, కొన్నిసార్లు సంబంధిత అధికారులకు బదులు కిందిస్థాయి అధికారులు ధ్రువీకరించడం వల్ల సైతం వినతులు తిరస్కరణకు గురవుతున్నాయి. -
ఫోన్ చేసి వివరాలు పట్టి.. ఖాతాల్లో సొమ్ము కొల్లగొట్టి..
సాక్షి, పెనమలూరు: మహిళకు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి మాయమాటలు చెప్పి ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ.74,800 స్వాహా చేశాడు. వివరాల్లోకి వెళితే... తాడిగడప శ్రీనివాసానగర్ కాలువ కట్టకు చెందిన దోనేపూడి వరలక్ష్మి, ఆమె భర్త నాగరాజు ఉంటున్నారు. ఆమెకు విజయవాడ గురునానక్‌నగర్‌లో ఎస్బీఐలో ఖాతా ఉంది. అయితే బుధవారం ఉదయం ఆమెకు ఒక వ్యక్తి ఫోన్ చేసి, తాను ఎస్బీఐ ఆఫీసు నుంచి ఫోన్ చేస్తున్నానని, ఏటీఎం కార్డు కాలపరిమితి ముగిసిందని, రెన్యూవల్ చేయాలని నమ్మించాడు. అతని మాటలు నమ్మిన ఆమె కార్డు వివరాలు తెలిపింది. ఇంతలో ఫోన్‌కు ఓటీపీ రాగా ఆ వివరాలు కూడా ఆమె ఫోన్ చేసిన వ్యక్తికి చెప్పింది. కొద్ది క్షణాల్లో ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ.74,800 సొమ్ము డ్రా అయినట్లు ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. దీంతో మోసపోయానని గుర్తించి ఆమె బ్యాంకు అధికారులకు తెలిపి ఏటీఎం కార్డు బ్లాక్ చేయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పెనమలూరు సీఐ సత్యనారాయణ కేసు దర్యాప్తు చేపట్టారు. -
బ్యాంకుల్లో బారులు
సాక్షి, నిర్మల్: ఈనెల 10న ప్రారంభమైన రైతుబంధు పథకం జిల్లాలో ప్రశాంతంగా సాగుతోంది. సోమవారం వరకు సుమారు 64వేల మంది రైతులు చెక్కులు పొందారు. ఇందులో 4,855మంది రైతులు సంబంధిత బ్యాంకుల్లో చెక్కుల ద్వారా రూ.5.70కోట్లు తీసుకున్నారు. గ్రామాల్లో చెక్కులు పొందిన రైతన్నలు బ్యాంకుల బాట పడుతుండగా అవి ఇప్పుడు కిటకిటలాడుతున్నాయి. బ్యాంకుల వద్ద టెంట్లు, తాగునీటి వసతి కల్పించినా.. తరచూ కొన్ని బ్యాంకుల్లో సర్వర్ సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో గంటలపాటు నిరీక్షించాల్సి వస్తోంది. బ్యాంకుల్లో సందడి షురూ.. రైతుబంధు పథకం ఈనెల 10న ప్రారంభమైంది. రైతులు చెక్కులు పొందినప్పటికీ డబ్బులు తీసుకునే అవకాశం సోమవారం వరకు రాలేదు. రెండో శనివారం, ఆదివారం బ్యాంకులకు వరుస సెలవులు వచ్చాయి. అధికారులు కూడా చాలా గ్రామాల రైతుల చెక్కులపై ఈనెల 14 తర్వాత తీసుకునే తేదీలను వేశారు. ఈనేపథ్యంలో సోమవారం నుంచే బ్యాంకుల్లో సందడి ప్రారంభమైంది. జిల్లాలో నిర్మల్ అర్బన్ మండలంలో కార్పొరేషన్ బ్యాంకు ద్వారా, తానూరు, కుంటాల, కుభీర్, దస్తురాబాద్, మామడ మండలాల్లో తెలంగాణ గ్రామీణ బ్యాంకు ద్వారా, లోకేశ్వరం, దిలావర్పూర్ మండలాల్లో ఆంధ్రాబ్యాంకు ద్వారా, మిగతా 11మండలాల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా రైతులకు చెక్కులను పంపిణీ చేస్తున్నారు. పొద్దున్నుంచే బారులు.. జిల్లాకేంద్రంతో పాటు వివిధ మండలాల్లో ఉన్న బ్యాంకుల వద్ద సోమవారం ఉదయం నుంచే రైతులు బారులుతీరారు. ఐదురోజులుగా పంపిణీ పూర్తిచేసిన గ్రామాలకు చెందిన రైతులు బ్యాంకులకు తరలివస్తున్నారు. బ్యాంకు అధికారులు టెంట్లతో పాటు, వారి కోసం తాగునీటి వసతులు ఏర్పాటు చేస్తున్నారు. క్యూలైన్ పాటిస్తూ.. వరుసక్రమంలో చెక్కులను అందజేస్తూ డబ్బులు తీసుకుంటున్నారు. జిల్లాకేంద్రంలోని సంబంధిత బ్యాంకులు కిక్కిరిసిపోతున్నాయి. రైతులతో పాటు రోజువారీగా వచ్చే ఖాతాదారులతో నిండిపోతున్నాయి. ఈక్రమంలో రైతులకు ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేసి చెక్కులను అందజేస్తున్నారు. కొన్ని బ్యాంకుల్లో మాత్రం సర్వర్ సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో గంటల పాటు రైతులు వేచిచూడాల్సి వస్తోంది. నమ్మి మోసపోవద్దు.. బ్యాంకుల వద్ద చెక్కులు డ్రా చేసుకునేప్పుడు రైతులు ఎవరి మాటలను నమ్మి మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. అన్నదాతల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారి వద్ద నుంచి డబ్బులు కాజేసే ప్రయత్నం చేసేవాళ్లూ ఉంటారని హెచ్చరిస్తున్నారు. జిల్లాకేంద్రంలోని పలు బ్యాంకులను సోమవారం పట్టణ సీఐ జాన్‌దివాకర్ పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా క్యూలైన్ల ద్వారా వెళ్లేలా సిబ్బందిని ఉంచామని చెప్పారు. అలాగే అపరిచిత వ్యక్తులను నమ్మి మోసపోవద్దని అవగాహన కల్పిస్తున్నామని సీఐ పేర్కొన్నారు. ప్రశాంతంగా సాగుతున్న పంపిణీ.. జిల్లావ్యాప్తంగా రైతుబంధు చెక్కులు, పాసుపుస్తకాల పంపిణీ ప్రశాంతంగా సాగుతోంది. కార్యక్రమంలో భాగంగా సోమవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్‌అలీ, మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి, వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్మోహన్ తదితరులు సారంగపూర్ మండలం జామ్ గ్రామానికి వచ్చారు. పలువురు రైతులకు చెక్కులు, పాసుబుక్కులు అందించడంతో పాటు స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. యాసంగికి సంబంధించి నవంబర్ నెలలో ఎకరాకు రూ.4వేల చొప్పున చెల్లించనున్నట్లు వెల్లడించారు. జిల్లాలో మొత్తం రైతులు : 1, 65, 670 మొత్తం చెక్కులు : 1,67,153 పెట్టుబడి సాయం : రూ.175.01కోట్లు ఐదురోజుల్లో చెక్కుల పంపిణీ : 64,000 డబ్బులు పొందిన రైతులు : 4,855 డ్రా చేసుకున్న మొత్తం : రూ.5,70,07,830 పైసల కోసం అచ్చిన సార్లు ఊరికి అచ్చి చెక్కు ఇచ్చిండ్రు. మా దగ్గర బ్యాంకు లేదు. పైసల కోసం నిర్మల్ అచ్చిన. సర్కారు చేస్తున్న సాయం మంచిగున్నది. కొంచెం పైసలు తీసుకునతందుకే తిప్పలైతుంది. – లింగన్న, గోపాల్పేట్, సారంగపూర్ మండలం వేచిచూడాల్సి వస్తోంది రైతుబంధు చెక్కులు డ్రా చేసుకునేందుకు వచ్చిన రైతుల కోసం బ్యాంకుల్లో ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. ఒక్కోసారి సర్వర్ పని చేయడం లేదని చెబుతున్నారు. దీంతో చాలాసేపు వేచిచూడాల్సి వస్తోంది.– లోకమాన్య, భాగ్యనగర్, నిర్మల్‌రూరల్ మండలం అపరిచితులను నమ్మవద్దు చెక్కులు డ్రా చేసుకునేందుకు వచ్చే రైతులు బ్యాంకుల వద్ద ఎవరినీ నమ్మవద్దు. గుర్తు తెలియని వ్యక్తులతో సంబంధం లేకుండా నేరుగా బ్యాంకు అధికారుల నుంచే డబ్బులు తీసుకోవాలి. ఏదైనా సమస్య ఉంటే పోలీసులను సంప్రదించాలి.– జాన్‌దివాకర్, పట్టణ సీఐ, నిర్మల్ -
నగదు విత్ డ్రా పై ఆంక్షలు ఎత్తివేత!
ముంబై : పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన నగదు కొరత నేపథ్యంలో బ్యాంకుల్లో, ఏటీఎంలలో విధించిన ఆంక్షల నుంచి ఇక ప్రజలకు పూర్తి విముక్తి లభించనుంది. ఈ ఆంక్షలను సేవింగ్స్ అకౌంట్స్‌కు 2017 మార్చి 13 నుంచి పూర్తిగా ఎత్తివేయనున్నట్టు రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్ తెలిపారు. రెండు విడతల్లో నగదు విత్ డ్రా పరిమితి పై ఆంక్షలు తొలగిస్తామన్నారు. తొలుత 2017 ఫిబ్రవరి 20న ప్రస్తుతం వారానికి రూ.24వేలుగా ఉన్న విత్ డ్రా పరిమితిని రూ.50వేలకు పెంచుతామని ఉర్జిత్ తెలిపారు. ఆరవ ద్వైపాక్షిక సమీక్షను బుధవారం ప్రకటించిన ఉర్జిత్ నేతృత్వంలోని మానిటరీ పాలసీ కమిటీ నగదు విత్ డ్రాపై విధించిన ఆంక్షలపై కూడా గుడ్‌న్యూస్ ప్రకటించింది. కాగ, నేటి ప్రకటనలో ఎలాంటి సర్ప్రైజ్ లేకుండా వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతున్నట్టు కీలక నిర్ణయం వెలువరించింది. దీంతో రెపో రేటు 6.25 శాతం, రివర్స్ రెపో రేటు 5.75 శాతంగా ఉన్నాయి. పెద్ద నోట్ల రద్దు అనంతరం ఆర్బీఐ నిర్వహించిన పాలసీలో ఇది రెండవది. బ్యాంకుల్లో వడ్డీరేట్లు కూడా కిందకి దిగిరానున్నట్టు ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. -
నగదు విత్‌డ్రాలపై ఇంకా ఆంక్షలెందుకు?
రద్దయిన నోట్ల డిపాజిట్లకు ఇచ్చిన గడువు డిసెంబర్ 30తో ముగిసింది. అయినా నగదు కొరత సమస్య ఇంకా ప్రజలను వెన్నాడుతూనే ఉంది. ఏటీఎల నుంచి రోజుకు విత్‌డ్రా చేసుకునే నగదు పరిమితిని ఆర్బీఐ కొంత సవరించి రూ.2500 నుంచి రూ.4500కు పెంచింది. ఈ విషయంపై మాజీ ఆర్థికమంత్రి పి చిదంబరం, నరేంద్రమోదీ ప్రభుత్వంపై మండిపడ్డారు. డీమానిటైజేషన్ డెడ్ లైన్ ముగిసినప్పటికీ ఇంకెందుకు నగదు విత్‌డ్రాలపై ఆంక్షలు కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు. డిసెంబర్ 30వరకు ఆగండి సమస్యలన్నీ తీరిపోతాయని ప్రధాని మోదీ హామిలిచ్చారని, మరి ఇంకెందుకు విత్‌డ్రాలపై పరిమితులు కొనసాగిస్తున్నారని ట్వీట్ చేశారు. జనవరి 2 తర్వాత అన్ని ఏటీఎంలు సరిగా పనిచేస్తున్నాయా? సరిపడ నగదు అందుబాటులోకి వస్తుందా? అని ప్రశ్నించారు. ఒకవేళ రాకపోతే, ఎందుకు అందుబాటులోకి తేవడంలేదో సమాధానం చెప్పాల్సిందేన్నారు. జనవరి 2 తర్వాత అసలు అవినీతి అసలు జరగదా? అంటూ పలు సూటి ప్రశ్నలను చిదంబరం మోదీ ప్రభుత్వానికి సంధించారు. పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోదీ నవంబర్ 8న నిర్ణయం ప్రకటించిన అనంతరం తమకు 50 రోజుల గడువు ఇవ్వాలని ప్రజలను కోరారు. ప్రధాని మోదీ అడిగిన గడువు కూడా ముగిసింది. కానీ పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన నగదు కొరత మాత్రం వీడలేదు. ఈ నేపథ్యంలో నేటి రాత్రి 7.30 గంటలకు మోదీ మళ్లీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. -
సాధారణ పరిస్థితి నెలకొంది: అరుణ్ జైట్లీ
నగదు ఉపసంహరణ పరిమితుల ఎత్తివేతపై మౌనం న్యూఢిల్లీ: వ్యవస్థలో నగదు సరఫరా చాలా వరకు మెరుగుపడిందన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ... మరి బ్యాంకులు, ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలపై విధించిన పరిమితులను ఎత్తివేసే విషయంలో మాత్రం ఎటువంటి సంకేతం ఇవ్వలేదు. వ్యవస్థలోకి మరింత మొత్తంలో నగదు సరఫరా చేసేందుకు వీలుగా ఆర్బీఐ వద్ద తగినన్ని నగదు నిల్వలు ఉన్నాయన్నారు. నగదు సరఫరా కొనసాగుతుందని చెప్పారు. ‘‘గురువారం నేను ఢిల్లీలో చాలా ప్రాంతాలకు వెళ్లాను. మాకు అందిన నివేదికల ప్రకారం దేశవ్యాప్తంగా బ్యాంకుల వద్ద రద్దీ చాలా వరకు తగ్గింది’’ అని జైట్లీ శుక్రవారం ఇక్కడ మీడియాకు తెలిపారు. శనివారం నుంచి బ్యాంకుల వద్ద కేవలం చట్టబద్ధమైన కరెన్సీయే ఉంటుందన్నారు. మరి నగదు ఉపసంహరణలపై నియంత్రణలను ఎత్తివేస్తారా...? అని విలేకరులు అడగ్గా... ‘‘కాస్త ఓపిక పట్టండి. మేము నిర్ణయం తీసుకున్నప్పుడు తెలియజేస్తాం’’ అని బదులిచ్చారు. ఐటీ చట్ట సరళీకరణలపై జైట్లీకి రెండవ నివేదిక: ఆదాయపు పన్ను చట్టాల సరళీకరణలపై ఏర్పడిన కమిటీ జైట్లీకి గురువారం రెండవ విడత నివేదికను అందజేసింది. కాగా కమిటీ మొదట విడత ఇచ్చిన నివేదిక అంశాలు జనవరిలో విడుదలయ్యాయి. టీడీఎస్‌కు సంబంధించిన ప్రొవిజన్ల సరళీకరణ సిఫార్సు ఇందులో ఒకటి. -
ఓలా క్యాబ్స్‌లో క్యాష్ విత్‌డ్రాయల్
న్యూఢిల్లీ: ఓలా క్యాబ్స్‌లో రైడింగే కాదు అవసరమైతే కార్డులను స్వైప్ చేసి నగదు పొందవచ్చు. ఇందుకు వీలుగా ఓలా క్యాబ్స్ ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఆంధ్రా బ్యాంకులతో టై అప్ అరుుంది. హైదరాబాద్, కోల్‌కతా నగరాల్లో ప్రయోగాత్మకంగా ఈ సేవలు ప్రారంభమయ్యాయని ఓలా తెలిపింది. ట్యాక్సీలో ఓ బ్యాంకు అధికారి ఉంటారని, వివిధ ప్రాంతాలకు పీఓఎస్ మెషీ న్ను తీసుకెళ్లడం ద్వారా ఓ కార్డుపై రూ.2,000 వరకు నగదు అందించనున్నట్టు వివరించింది. -
ఫోన్ కాల్ : రూ. 5.1 లక్షలు హాంఫట్
కాకినాడ: ఫోన్ కాల్‌తో రూ. 5.1 లక్షలు హాంఫట్ చేసిన వైనమిది. బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామంటూ ఓ అజ్ఞాత వ్యక్తి ఏటీఏం వివరాలు తెలుసుకుని కొద్ది గంటల వ్యవధిలోనే మొత్తం సొమ్ములు డ్రా చేశాడు. ఈ ఘటనపై బాధితుడు పట్టణ పోలీసులను ఆశ్రయించాడు. శుక్రవారం పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. మారేడుబాక ఫైర్‌స్టేషన్ సమీపంలో నివసిస్తున్న శీలం వీరబాబు అనపర్తిలోని ఓ ప్రైవేటు బ్యాంకులో రూ. 5.1 లక్షలు డిపాజిట్ చేశాడు. గత నెల 26 ఉదయం వీరబాబుకు ఫోన్‌కాల్ వచ్చింది. బ్యాంకు నుంచి ఫోన్ చేసున్నాం.. మీ ఏటీఎం కార్డు బ్లాకు అయ్యింది. ఫిన్ నంబరు, కార్డు వెనుక వైపున ఉన్న నంబరు, మీ వివరాలు చెప్పాలంటూ అడిగిన ప్రశ్నలన్నింటి కీ వీరబాబు సమాధానమిచ్చాడు. కొద్ది వ్యవధిలోనే వీరబాబు సెల్‌కు పాస్ వర్డ్‌లతో కూడిన నంబర్లు రావడం, ఏటీఎం కార్డు వినియోగంలోకి తీసుకు వస్తున్నాం మెసేజ్లోని పాస్ వర్డ్ చెప్పమంటూ ఆజ్ఞాత వ్యక్తి కోరాడు. ఈ విధంగా దాదాపు 13 సార్లు వీరబాబుకు వచ్చిన పాస్వర్డ్ వివరాలను అజ్ఞాత వ్యక్తి తెలుసుకున్నాడు. రాత్రికి చార్జింగ్ లేక సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. చార్జింగ్ పెట్టుకుని మరుసటి రోజు ఉదయం ఆన్ చేసుకుని చూసేసరికి అకౌంట్లో నగదు డ్రా చేసినట్టు మెసేజ్‌లు ఉన్నాయి. ఆందోళనకు గురైన వీరబాబు అనపర్తి వెళ్లి బ్యాంకు సిబ్బందిని సంప్రదించగా ఆన్లైన్లో అకౌంట్ క్లోజ్ చేసుకుని నగదు డ్రా చేసుకున్నారు కదా అంటూ ఎదురు ప్రశ్నించడంతో తాను మోసపోయానని గుర్తించి ఫిర్యాదు చేసినట్టు పోలీసులు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు హెచ్‌సీ సత్యనారాయణ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నగదు విత్‌డ్రా పైనా పన్ను!
రోజుకు రూ. 50,000 మించితే విధించాలని కమిటీ సిఫార్సు న్యూఢిల్లీ: వ్యక్తిగత ఖాతాదారులు బ్యాంకుల నుంచి రోజుకి రూ. 50,000కు మించి నగదు ఉపసంహరించుకుంటే పన్ను విధించాలంటూ పార్థసారథి షోమ్ కమిటీ సిఫార్సు చేసింది. తద్వారా బ్లాక్‌మనీకి చెక్ పెట్టవచ్చునని అభిప్రాయపడింది. గత యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కమిటీ రూపొందించిన నివేదికను మంగళవారం విడుదల చేశారు. బ్యాంకు ఖాతాల నుంచి జరిగే నగదు విత్‌డ్రాయల్స్ వివరాల్ని సమీకరించే సాధనమేదీ ప్రస్తుతం లేదని, ఈ సాధనం వల్ల నల్లధనం వినియోగానికి సంబంధించిన సమాచారం ఆదాయపన్ను శాఖకు తెలుస్తుందని కమిటీ అభిప్రాయపడింది. అలాగే సంపన్న రైతులను పన్ను పరిధిలోకి తీసుకురావాలని కమిటీ ప్రతిపాదించింది. పన్ను ఎగవేతదారులకు సెటిల్మెంట్ అవకాశాలను కల్పించే ఆమ్నెస్టీ పథకాలపట్ల కమిటీ వ్యతిరేకతను వ్యక్తం చేసింది. బ్యాంకు ఖాతాల నుంచి నగదు ఉపసంహరణలకు సంబంధించిన వివరాలను అందించేందుకు ప్రస్తుతం సరైన వ్యవస్థ లేదని, ఇలాంటివి ఏర్పాటు చేస్తే ఆదాయపన్ను శాఖకు ప్రయోజనకారిగా ఉంటుందని వ్యాఖ్యానించింది. వ్యవసాయ ఆదాయానికి సంబంధించి రూ. 5 లక్షల వరకూ పన్ను మినహాయింపు ఉన్నదని, ఇంతకు మించి భారీగా ఆదాయం పొందుతున్న రైతులను పన్ను పరిధిలోకి తీసుకురావలసి ఉందని పేర్కొంది. ఇది పన్ను చెల్లింపుదారుల పరిధిని పెంచుతుందని తెలిపింది.