సాధారణ పరిస్థితి నెలకొంది: అరుణ్ జైట్లీ
నగదు ఉపసంహరణ పరిమితుల ఎత్తివేతపై మౌనం
న్యూఢిల్లీ: వ్యవస్థలో నగదు సరఫరా చాలా వరకు మెరుగుపడిందన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ... మరి బ్యాంకులు, ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలపై విధించిన పరిమితులను ఎత్తివేసే విషయంలో మాత్రం ఎటువంటి సంకేతం ఇవ్వలేదు. వ్యవస్థలోకి మరింత మొత్తంలో నగదు సరఫరా చేసేందుకు వీలుగా ఆర్‌బీఐ వద్ద తగినన్ని నగదు నిల్వలు ఉన్నాయన్నారు. నగదు సరఫరా కొనసాగుతుందని చెప్పారు. ‘‘గురువారం నేను ఢిల్లీలో చాలా ప్రాంతాలకు వెళ్లాను. మాకు అందిన నివేదికల ప్రకారం దేశవ్యాప్తంగా బ్యాంకుల వద్ద రద్దీ చాలా వరకు తగ్గింది’’ అని జైట్లీ శుక్రవారం ఇక్కడ మీడియాకు తెలిపారు. శనివారం నుంచి బ్యాంకుల వద్ద కేవలం చట్టబద్ధమైన కరెన్సీయే ఉంటుందన్నారు. మరి నగదు ఉపసంహరణలపై నియంత్రణలను ఎత్తివేస్తారా...? అని విలేకరులు అడగ్గా... ‘‘కాస్త ఓపిక పట్టండి. మేము నిర్ణయం తీసుకున్నప్పుడు తెలియజేస్తాం’’ అని బదులిచ్చారు.
ఐటీ చట్ట సరళీకరణలపై జైట్లీకి రెండవ నివేదిక: ఆదాయపు పన్ను చట్టాల సరళీకరణలపై ఏర్పడిన కమిటీ జైట్లీకి గురువారం రెండవ విడత నివేదికను అందజేసింది. కాగా కమిటీ మొదట విడత ఇచ్చిన నివేదిక అంశాలు జనవరిలో విడుదలయ్యాయి. టీడీఎస్‌కు సంబంధించిన ప్రొవిజన్ల సరళీకరణ సిఫార్సు ఇందులో ఒకటి.