అమరేందర్‌రెడ్డి ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తూ పదవీ విరమణ పొందాడు. సర్వీసు పూర్తి కావడంతో కుటుంబ అవసరాల కోసం తన ఈపీఎఫ్ ఖాతాలోని రూ.8.75 లక్షల నగదు ఉపసంహరణకు, పెన్షన్ పొందేందుకూ ప్రయత్నించాడు. కానీ అతని వినతిని ఈపీఎఫ్‌ఓ తిరస్కరించింది. అతడి ఈపీఎఫ్ ఖాతాలో తండ్రిపేరు నమోదు కానందునే ఇలా జరిగింది.
వాస్తవానికి తండ్రి పేరును ఆన్‌లైన్‌లో పొందుపర్చి... కోవిడ్ సమయంలో రెండుసార్లు నగదును ఉపసంహరించుకున్న అమరేందర్‌రెడ్డి.. తాజాగా తండ్రి పేరు లేదని వినతిని తిరస్కరించడంతో ఆందోళనకు గురయ్యాడు. ఆన్‌లైన్‌లో తండ్రిపేరు సవరణకు రిక్వెస్ట్ సమర్పించినప్పటికీ దాన్ని కూడా రిజెక్ట్ చేయడంతో తను చివరగా పనిచేసిన కంపెనీని ఆశ్రయించాడు. సంబంధిత డాక్యుమెంట్లు సమర్పించి ఆర్నెల్లు కావస్తున్నా ఇప్పటికీ ఆయనకు పీఎఫ్ డబ్బులు అందలేదు.
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగి భవిష్యనిధి (ఈపీఎఫ్) ఖాతాలో వివరాల సవరణ అత్యంత కష్టతరంగా మారింది. సాధారణంగా కొత్తగా సంస్థలో ఉద్యోగంలో చేరినప్పుడు ఉద్యోగి సమర్పించిన వాస్తవ వివరాలను కంపెనీ యాజమాన్యం ఉద్యోగి ఈపీఎఫ్ ఖాతాలో నమోదు చేస్తుంది. సరైన వివరాలు పొందుపరిచినప్పటికీ ఇటీవల పలువురు ఉద్యోగుల ఈపీఎఫ్ ఖాతాల్లో ఆ వివరాలు కనిపించడం లేదు.
దీంతో అకస్మాత్తుగా నగదు అవసరమైనప్పుడు ఈపీఎఫ్ ఖాతా నుంచి తీసుకోవాలనుకున్న ప్రయత్నాలు ఫలించక ఖాతాదారులు నివ్వెరపోతున్న ఘటనలు ఇటీవల అనేకం కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వివరాల సవరణలోనే చాలామంది నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. కొందరు అన్ని వివరాలు సమర్పించి సరిచూసుకున్నప్పటికీ కొన్నాళ్ల తర్వాత తండ్రి పేరు, పుట్టినతేదీ, పాన్, ఆధార్, బ్యాంకు ఖాతా లింకు లేదని వెబ్‌సైట్‌లో సూచించడం గమనార్హం. ఇలాంటి వాటికి సాంకేతిక కారణాలను సాకుగా చూపి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు.
అంతా ఆన్‌లైన్లో అయినా...
ప్రతి ఈపీఎఫ్ ఖాతాదారుడికి యూఏఎన్ (యూనివర్సల్ అకౌంట్ నంబర్) ఉంటుంది. ఉద్యోగి వివిధ కంపెనీలు మారినప్పటికీ యూఏఎన్ మాత్రం ఒకటే ఉంటుంది. ఈపీఎఫ్ వెబ్‌సైట్‌లో తమ వివరాలు సరిగ్గా లేవని గుర్తించిన పలువురు ఉద్యోగులు.. ఆన్‌లైన్‌లో సవరణల కోసం నమోదు చేసుకున్న వినతులు పెద్ద సంఖ్యలో తిరస్కరణకు గురవుతున్నాయి.
చిన్నపాటి సవరణలకూ ఆధా రాలు సమర్పిస్తున్నప్పటికి వాటిని తిరస్కరించడం పట్ల ఖాతాదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొందరు రెండు, మూడుసార్లు దరఖాస్తులు సమర్పించుకుంటుండగా.. మరికొందరు నేరుగా ఈపీఎఫ్ కార్యాలయాలకు వెళ్లినప్పటికీ సవరణలు పొందలేకపోతున్నారు. నిబంధనలు కఠినతరం చేయడంతో పలువురి దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
యాజమాన్యం ధ్రువీకరణ తప్పనిసరి
ఉద్యోగి ఈపీఎఫ్ ఖాతాలో వివరాల సవరణలో యాజమాన్యం ధ్రువీకరణను కేంద్రం తప్పనిసరి చేసింది. దీంతో ఎలాంటి అంశాలకైనా యాజమాన్యం అనుమతి కావాలంటూ తిరస్కరిస్తున్నారు. సర్వీసులో ఉన్న ఉద్యోగులకు ఈ నిబంధనతో పెద్దగా ఇబ్బంది లేనప్పటికీ... ఉద్యోగం మానేసిన, ఇతర కంపెనీకి మారి పీఎఫ్ పరిధిలోకి రాకున్నా, ఉద్యోగం ఊడి కొత్త ఉద్యోగం పొందలేని వారికి మాత్రం సవరణ ప్రక్రియ కత్తిమీద సాములా మారింది. ప్రధానంగా యాజమాన్యం సహకారం కొరవడటం, ఈపీఎఫ్ కార్యాలయాల్లోకి ప్రవేశం లేకుండా కేవలం ఇన్‌వార్డ్ సెల్ వరకే ఖాతాదారులకు అనుమతి ఉండటం లాంటి కారణాలతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు.
►ఉద్యోగి పేరు లేదా ఇంటి పేరు సవరణ చేయించాలంటే ప్రభుత్వ గెజిట్ తప్పనిసరి అయ్యింది. స్వల్ప మార్పులకైనా సరైన ఆధారాలు సమర్పించాల్సిందే.
►సవరణల కేటగిరీలో ఆధార్, పాన్ కార్డులను అప్‌లోడ్ చేసినప్పటికీ యాజమాన్యం ధ్రువీకరణ చేయాలి. సర్వీసులో లేని వారికి ఈ నిబంధన ప్రతిబంధకంగా మారింది.
►కొన్ని సందర్భాల్లో సవరణలకు ఒరిజినల్ పత్రాలు సమర్పించాలనే నిబంధన ఉంది. దీనికోసం ఉద్యోగి వ్యక్తిగతంగా ఈపీఎఫ్ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది.
►సవరణలను యాజమాన్యాలు ధ్రువీకరించినప్పటికీ సంబంధిత అధికారులు సంతకాలు పెట్టకపోవడం వల్ల, కొన్నిసార్లు సంబంధిత అధికారులకు బదులు కిందిస్థాయి అధికారులు ధ్రువీకరించడం వల్ల సైతం వినతులు తిరస్కరణకు గురవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment