
మూడో నెలా ఎగుమతులు డౌన్
జనవరిలో 2.38 శాతం క్షీణత
36.43 బిలియన్ డాలర్లకు పరిమితం
23 బిలియన్ డాలర్లకు పెరిగిన వాణిజ్య లోటు
గ్లోబల్ అనిశ్చితులు కారణం
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా అనిశ్చితి, పెట్రోలియం ధరల్లో తీవ్ర ఒడిదుడుకులతో వరుసగా మూడో నెలా భారత ఎగుమతులు క్షీణించాయి. జనవరిలో 2.38 శాతం తగ్గి 36.43 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. మరోవైపు, దిగుమతులు 10 శాతం పెరిగి 59.42 బిలియన్ డాలర్లకు చేరడంతో వాణిజ్య లోటు సుమారు 23 బిలియన్ డాలర్లుగా నమోదైంది. కేంద్ర వాణిజ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జనవరి మధ్య కాలంలో ఎగుమతులు 1.39 శాతం పెరిగి 358.91 బిలియన్ డాలర్లకు, దిగుమతులు 7.43 శాతం పెరిగి 601.9 బిలియన్ డాలర్లకు చేరాయి. వాణిజ్య లోటు 242.99 కోట్లుగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పటికీ ఇటు ఉత్పత్తులు, అటు సర్వీసుల ఎగుమతుల్లో భారత్ మెరుగ్గానే ఉంటోందని వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ బరత్‌వాల్ తెలిపారు. ఎలక్ట్రానిక్స్, ఫార్మా, బియ్యం, రత్నాభరణాల్లాంటి రంగాలు జనవరిలో మెరుగైన వృద్ధి రేటు సాధించినట్లు వివరించారు. 2024–25లో భారత్ ఎగుమతులు 800 బిలియన్ డాలర్ల స్థాయిని దాటగలవని ధీమా వ్యక్తం చేశారు. 2023–24లో ఇవి 778 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
పసిడి దిగుమతులు 41 శాతం అప్..
దేశీయంగా డిమాండ్ నెలకొనడంతో జనవరిలో బంగారం దిగుమతులు 41% పెరిగి 2.68 బిలియన్ డాలర్లకు చేరాయి. గత జనవరిలో వీటి విలువ 1.9 బిలియన్ డాలర్లు. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జనవరి మధ్య కాలంలో పసిడి దిగుమతులు 32 శాతం పెరిగి 37.85 బిలియన్ డాలర్ల నుంచి ఏకంగా 50 బిలియన్ డాలర్లకు చేరాయి. సురక్షిత సాధనంగా బంగారంపై నమ్మకం, అంతర్జాతీయంగా అనిశ్చితుల వల్ల ఇన్వెస్టర్లు డైవర్సిఫికేషన్‌కి ప్రాధాన్యం ఇస్తుండటం, బ్యాంకుల నుంచి డిమాండ్ పెరగడం, కస్టమ్స్ సుంకాల తగ్గింపు మొదలైన అంశాలు పసిడి దిగుమతులు పెరగడానికి కారణమయ్యాయి.
జనవరిలో క్రూడాయిల్ దిగుమతులు 16.56 బిలియన్ డాలర్ల నుంచి 13.43 బిలియన్ డాలర్లకు తగ్గాయి.
రత్నాభరణాల ఎగుమతులు 16 శాతం పెరిగి 3 బిలియన్ డాలర్లకు చేరగా, వెండి దిగుమతులు 83% పెరిగి 883 మిలియన్ డాలర్లకు చేరాయి.
జనవరిలో సర్వీసుల ఎగుమతుల విలువ 31.01 బిలియన్ డాలర్ల నుంచి 38.55 బిలియన్ డాలర్లకు పెరిగాయి. సర్వీసుల దిగుమతులు 14.84 బిలియన్ డాలర్ల నుంచి 18.22 బిలియన్ డాలర్లకు పెరిగాయి.
పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు 59 శాతం క్షీణించి 3.56 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి.
కమోడిటీలు, మెటల్ ధరల్లో హెచ్చుతగ్గులతో పాటు టారిఫ్ యుద్ధాలు తదితర అంశాల కారణంగా ఎగుమతులపై ప్రభావం పడినట్లు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్‌ఐఈవో) ప్రెసిడెంట్ అశ్వని కుమార్ తెలిపారు. అయితే, వాణిజ్య లోటు, దిగుమతులు పెరగడమనేది దేశీ పరిశ్రమపై ప్రతికూల ప్రభావం చూపవచ్చనే ఆందోళన నెలకొందని వివరించారు.
ఇదీ చదవండి: డిపాజిట్‌పై బీమా పెంపు!
వాణిజ్య శాఖ గణాంకాల ప్రకారం జనవరిలో కీలక వాణిజ్య భాగస్వామి అమెరికాకు ఎగుమతులు 39 శాతం పెరిగి 8.44 బిలియన్ డాలర్లకు చేరగా, దిగుమతులు 33 శాతం పెరిగి 3.57 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఏప్రిల్–జనవరి మధ్య కాలంలో ఎగుమతులు సుమారు 9 శాతం వృద్ధి చెంది 68.46 బిలియన్ డాలర్లకు ఎగిశాయి. 2023–24లో భారత్‌కి అమెరికా అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలి్చంది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 119.71 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇందులో 77.51 బిలియన్ డాలర్ల విలువ చేసే ఎగుమతులు ఉండగా, 42.19 బిలియన్ డాలర్ల దిగుమతులు నమోదయ్యాయి. అమెరికాతో భారత్‌కి 35.31 బిలియన్ డాలర్ల వాణిజ్య మిగులు నమోదైంది. ఇరు దేశాలు 2030 నాటికి 500 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment