తక్కువ ధరల వద్ద క్రూడ్ స్థిరపడాలి
పెట్రోలియం శాఖ కార్యదర్శి పంకజ్ జైన్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మూడేళ్ల కనిష్టానికి పడిపోవడంతో పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై అంచనాలు పెరిగిపోయాయి. ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రేట్లను తగ్గించొచ్చన్న అంచనాల నేపథ్యంలో దీనిపై పెట్రోలియం శాఖ సెక్రటరీ పంకజ్ జైన్ స్పష్టతనిచ్చారు.ముడి చమురు ధర కనిష్ట స్థాయి వద్ద స్థిరంగా కొనసాగితేనే పెట్రోల్, డీజిల్ రేట్ల సవరణకు అవకాశం ఉంటుందన్నారు.
బ్రెంట్ చమురు బ్యారెల్ ధర మంగళవారం 70డాలర్ల దిగువకు పడిపోవడం గమనార్హం. 2021 డిసెంబర్ తర్వాత ఇంత కనిష్టానికి రావడం ఇదే మొదటిసారి. గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో చమురు సరఫరాపై హరీకేన్ ఫ్రాన్సిన్ ప్రభావం చూపించడంతో చమురు ధర గురువారం మళ్లీ 71 డాలర్లకు ఎగిసింది. ఈ ఏడాది కీలకమైన సార్వత్రిక ఎన్నికల ముందు పెట్రోల్, డీజిల్ ధరలను స్వల్పంగా తగ్గించడం తెలిసిందే. అంతకుముందు రెండేళ్లుగా ధరల్లో ఎలాంటి సవరణ చేయలేదు. ఢిల్లీలో ఓ కార్యక్రమం సందర్భంగా మీడియా ప్రతినిధులతో పంకజ్ జైన్ ఈ అంశంపై మాట్లాడారు.
అంతర్జాతీయ చమురు ధరలు కనిష్టాల వద్ద స్థిరపడితే అప్పుడు ఆయిల్ కంపెనీలు ధరల తగ్గింపుపై తగిన నిర్ణయం తీసుకుంటాయని స్పష్టం చేశారు. మరోవైపు చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై మెరుగైన లాభాలు ఆర్జిస్తున్నాయని.. రేట్లపై నిర్ణయానికి ముందు మరికొంత కాలం పాటు ఇదే విధానం కొనసాగాలని కోరుకుంటున్నట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇప్పుడే రేట్లను తగ్గిస్తే.. మళ్లీ అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగిపోతే నష్టపోవాల్సి వస్తుందన్న అభిప్రాయంతో ఆయిల్ కంపెనీలు కొంత కాలం పాటు వేచి చూసే ధోరణిని అనుసరించాలనుకుంటున్నట్టు చెప్పాయి.
మహారాష్ట్ర ఎన్నికల ముందు?
ప్రభుత్వరంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం (హెచ్‌పీసీఎల్) మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు రేట్లను తగ్గించొచ్చని బ్రోకరేజ్ సంస్థ ఎమ్‌కే గ్లోబల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ ఓ నివేదికలో తెలిపింది. ‘‘రాష్ట్రాల ఎన్నికల ముందు పెట్రోలియం రేట్లను తగ్గిస్తారన్న అంచనాలు ఉన్నాయి. మేము కూడా దీన్ని తోసిపుచ్చడం లేదు. జమ్మూ కశ్మీర్, హర్యానాకు సంబంధించి ఎన్నికల ప్రవర్తనా నియమావళి మరో నెల రోజుల పాటు అమల్లో ఉంటుంది. దీంతో దీపావళి లేదా మహారాష్ట్ర ఎన్నికల ప్రవర్తా నియమావళి అమల్లోకి రావడానికి ముందు రేట్లను తగ్గించొచ్చు.
లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ.2 వరకు తగ్గించొచ్చు. వచ్చే నెల రోజుల పాటు ఆయిల్ కంపెనీలు అసాధారణ మార్కెటింగ్ మార్జిన్లను సంపాదిస్తాయి. ఎల్‌పీజీపై నష్టాలను కూడా భర్తీ చేసుకోగలుగుతాయి. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో మార్కెటింగ్ మార్జిన్ లీటర్ పెట్రోల్/డీజిల్‌పై రూ.4.7/3.8 గా ఉంటే, జూలై–సెప్టెంబర్ కాలంలో మార్కెటింగ్ మార్జిన్లు లీటర్ పెట్రోల్/డీజిల్‌పై రూ.9.7/8గా ఉండొచ్చు’’అని ఎమ్‌కే గ్లోబల్ వివరించింది. దేశ చమురు అవసరాల్లో 85 % దిగుమతులపైనే ఆధారపడడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment