Petroleum companies
-
పెట్రోలియం ధరల్లో హెచ్చుతగ్గులు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా అనిశ్చితి, పెట్రోలియం ధరల్లో తీవ్ర ఒడిదుడుకులతో వరుసగా మూడో నెలా భారత ఎగుమతులు క్షీణించాయి. జనవరిలో 2.38 శాతం తగ్గి 36.43 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. మరోవైపు, దిగుమతులు 10 శాతం పెరిగి 59.42 బిలియన్ డాలర్లకు చేరడంతో వాణిజ్య లోటు సుమారు 23 బిలియన్ డాలర్లుగా నమోదైంది. కేంద్ర వాణిజ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జనవరి మధ్య కాలంలో ఎగుమతులు 1.39 శాతం పెరిగి 358.91 బిలియన్ డాలర్లకు, దిగుమతులు 7.43 శాతం పెరిగి 601.9 బిలియన్ డాలర్లకు చేరాయి. వాణిజ్య లోటు 242.99 కోట్లుగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పటికీ ఇటు ఉత్పత్తులు, అటు సర్వీసుల ఎగుమతుల్లో భారత్ మెరుగ్గానే ఉంటోందని వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ బరత్వాల్ తెలిపారు. ఎలక్ట్రానిక్స్, ఫార్మా, బియ్యం, రత్నాభరణాల్లాంటి రంగాలు జనవరిలో మెరుగైన వృద్ధి రేటు సాధించినట్లు వివరించారు. 2024–25లో భారత్ ఎగుమతులు 800 బిలియన్ డాలర్ల స్థాయిని దాటగలవని ధీమా వ్యక్తం చేశారు. 2023–24లో ఇవి 778 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. పసిడి దిగుమతులు 41 శాతం అప్..దేశీయంగా డిమాండ్ నెలకొనడంతో జనవరిలో బంగారం దిగుమతులు 41% పెరిగి 2.68 బిలియన్ డాలర్లకు చేరాయి. గత జనవరిలో వీటి విలువ 1.9 బిలియన్ డాలర్లు. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జనవరి మధ్య కాలంలో పసిడి దిగుమతులు 32 శాతం పెరిగి 37.85 బిలియన్ డాలర్ల నుంచి ఏకంగా 50 బిలియన్ డాలర్లకు చేరాయి. సురక్షిత సాధనంగా బంగారంపై నమ్మకం, అంతర్జాతీయంగా అనిశ్చితుల వల్ల ఇన్వెస్టర్లు డైవర్సిఫికేషన్‌కి ప్రాధాన్యం ఇస్తుండటం, బ్యాంకుల నుంచి డిమాండ్ పెరగడం, కస్టమ్స్ సుంకాల తగ్గింపు మొదలైన అంశాలు పసిడి దిగుమతులు పెరగడానికి కారణమయ్యాయి. జనవరిలో క్రూడాయిల్ దిగుమతులు 16.56 బిలియన్ డాలర్ల నుంచి 13.43 బిలియన్ డాలర్లకు తగ్గాయి. రత్నాభరణాల ఎగుమతులు 16 శాతం పెరిగి 3 బిలియన్ డాలర్లకు చేరగా, వెండి దిగుమతులు 83% పెరిగి 883 మిలియన్ డాలర్లకు చేరాయి. జనవరిలో సర్వీసుల ఎగుమతుల విలువ 31.01 బిలియన్ డాలర్ల నుంచి 38.55 బిలియన్ డాలర్లకు పెరిగాయి. సర్వీసుల దిగుమతులు 14.84 బిలియన్ డాలర్ల నుంచి 18.22 బిలియన్ డాలర్లకు పెరిగాయి.పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు 59 శాతం క్షీణించి 3.56 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. కమోడిటీలు, మెటల్ ధరల్లో హెచ్చుతగ్గులతో పాటు టారిఫ్ యుద్ధాలు తదితర అంశాల కారణంగా ఎగుమతులపై ప్రభావం పడినట్లు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్ఐఈవో) ప్రెసిడెంట్ అశ్వని కుమార్ తెలిపారు. అయితే, వాణిజ్య లోటు, దిగుమతులు పెరగడమనేది దేశీ పరిశ్రమపై ప్రతికూల ప్రభావం చూపవచ్చనే ఆందోళన నెలకొందని వివరించారు. ఇదీ చదవండి: డిపాజిట్‌పై బీమా పెంపు! వాణిజ్య శాఖ గణాంకాల ప్రకారం జనవరిలో కీలక వాణిజ్య భాగస్వామి అమెరికాకు ఎగుమతులు 39 శాతం పెరిగి 8.44 బిలియన్ డాలర్లకు చేరగా, దిగుమతులు 33 శాతం పెరిగి 3.57 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఏప్రిల్–జనవరి మధ్య కాలంలో ఎగుమతులు సుమారు 9 శాతం వృద్ధి చెంది 68.46 బిలియన్ డాలర్లకు ఎగిశాయి. 2023–24లో భారత్‌కి అమెరికా అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలి్చంది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 119.71 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇందులో 77.51 బిలియన్ డాలర్ల విలువ చేసే ఎగుమతులు ఉండగా, 42.19 బిలియన్ డాలర్ల దిగుమతులు నమోదయ్యాయి. అమెరికాతో భారత్‌కి 35.31 బిలియన్ డాలర్ల వాణిజ్య మిగులు నమోదైంది. ఇరు దేశాలు 2030 నాటికి 500 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే. -
చమురు కంపెనీలకు భారీ షాక్!, బాబోయ్..ఈ నష్టాలు భరించలేం
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలు (హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐవోసీ) ఎనిమిది నెలల నుంచి విక్రయ ధరలు సవరించకపోవడంతో భారీ నష్టాలను మూటగట్టుకున్నాయని, వాటిని సర్దుబాటు చేయాలంటూ ఆర్థిక శాఖను పెట్రోలియం శాఖ కోరనుందని తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఆరు నెలల కాలంలో ఈ మూడు కంపెనీలు రూ.21,201 కోట్ల నష్టాలను ప్రకటించడం గమనార్హం. గత కొన్ని సంవత్సరాలకు సంబంధించి ఎల్పీజీ సబ్సిడీ రూ.22,000 కోట్లు కూడా వాటికి రావాల్సి ఉంది. విక్రయ ధరలు పెంచకపోవడం వల్ల అప్పటికే పెరిగిపోయిన ద్రవ్యోల్బణం దృష్ట్యా, ఆర్థిక వ్యవస్థకు మేలు జరిగినట్టు ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఈ దృష్ట్యా వాటికి పరిహారం అందించాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రణల పరిధి నుంచి తొలగించారు. కనుక ఓఎంసీలు అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా రోజువారీ రేట్లను నిర్ణయించొచ్చు. కానీ, అవి తమ ఇష్టానుసారం అవే రేట్లను కొనసాగించాయి’’అని వివరించారు. కనుక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తానికి ధరల పెంచకపోవడం వల్ల పడే భారంపై అంచనాకు వచ్చిన, ఆ తర్వాత ఆర్థిక శాఖను సంప్రదించొచ్చని చెప్పారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు గతంతో పోలిస్తే కొంత దిగొచ్చినప్పటికీ, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇప్పటికీ నష్టాలను ఎదుర్కొంటూనే ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 6 నుంచి అవి రేట్ల సవరణను నిలిపివేశాయి. -
చమురు ఉత్పత్తికి ఒపెక్ కోత, దేశంలో మళ్లీ పెట్రో ధరల మంట?
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ విక్రయాలపై లాభాలు కళ్లచూద్దామన్న ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్) ఆశలు ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు. పెట్రోల్ ఉత్పత్తుల ధరలు దేశంలో ఆరు నెలలుగా ఒకే స్థాయిలో ఉండిపోయాయి. కేంద్ర ప్రభుత్వ పరోక్ష ఆదేశాలతో ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలు రోజువారీ రేట్ల సవరణను నిలిపివేశాయి. చమురు ఉత్పత్తికి కోత పెట్టాలని చమురు ఉత్పత్తి దేశాల సమాఖ్య (ఒపెక్) తాజాగా తీసుకున్న నిర్ణయంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు మళ్లీ పెరిగాయి. దీంతో రేట్ల సవరణ కూడా ఇప్పట్లో చేపట్టే అవకాశాల్లేవని తెలుస్తోంది. చమురు ధరలు ఇటీవలి గరిష్టాల నుంచి కొంత తగ్గుముఖం పట్టాయి. దీంతో చమురును ఉత్పత్తి చేస్తున్న దేశాల కూటమి ఒపెక్ రోజువారీగా 2 మిలియన్ బ్యారెళ్ల మేర తగ్గించుకోవాలని బుధవారం నిర్ణయం తీసుకుంది. ఇటీవల ధరలు తగ్గడంతో ఊపిరి పీల్చుకుంటున్న మన ఆర్థిక వ్యవస్థకు ఓపెక్ తాజా నిర్ణయం ప్రతికూలం కానుంది. మన దేశ ముడి చమురు అవసరాల్లో 85 శాతాన్ని దిగుమతి చేసుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా ధరలను సవరించకపోవడం వల్ల చమురు మార్కెటింగ్ కంపెనీలు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఇటీవల ధరలు తగ్గడంతో డీజిల్ మినహా పెట్రోల్, గ్యాస్‌పై అవి ఎదుర్కొంటున్న నష్టాలు సున్నా స్థాయికి చేరాయి. లీటర్ డీజిల్‌పై నష్టం రూ.5కు తగ్గింది. కానీ, తాజా పరిణామంతో తిరిగి ఆయిల్ కంపెనీలకు నష్టాలు పెరిగిపోనున్నాయి. మరోవైపు రూపాయి మారకం విలువ క్షీణించడం కూడా చమురుపై నష్టాలను పెంచనుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. నష్టాల బాట.. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయాలన్న కేంద్ర సర్కారు లక్ష్యానికి అనుగుణంగా పెట్రోలియం ఉత్పత్తుల విక్రయ ధరలను సవరించకపోవడంతో ఆయిల్ కంపెనీల నష్టాలు పెరిగిపోతున్నాయి. ఫలితంగా జూన్ త్రైమాసికంలో మూడు ప్రభుత్వరంగ చమురు కంపెనీలు ఉమ్మడిగా రూ.18,480 కోట్ల నష్టాలను నమోదు చేశాయి. భారత్ దిగుమతి చేసుకునే బ్యారెల్ ముడి చమురు ధర సెప్టెంబర్ 27 నాటికి 84.75 డాలర్లకు తగ్గగా, అక్టోబర్ 5 నాటికి తిరిగి 92.17 డాలర్లకు పెరిగిపోయింది. చమురు ధరల క్షీణత ఇలానే కొనసాగితే, ఏప్రిల్ నుంచి ఎదుర్కొన్న నష్టాల భారం నుంచి గట్టెక్కొచ్చన్న చమురు కంపెనీల ఆశలు తాజా పరిణామంతో చెదిరిపోయాయి. 2021 నవంబర్ 4 నుంచి ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ పెట్రోల్, డీజిల్ ధరల సవరణను నిలిపివేయడం గమనార్హం. మార్చి 22 తర్వాత తిరిగి ఇవి రేట్లను సవరించాయి. ఫలితంగా లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ.10 మేర పెరిగింది. తిరిగి ఏప్రిల్ 7 నుంచి రేట్ల సవరణ నిలిచిపోయింది. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62 చొప్పున ఉంది. -
ఇక పెట్రోలు బంకుల్లో వంటగ్యాస్
అందుబాటులోకి 5 కిలోల సిలిండర్లు హైదరాబాద్‌లో ప్రారంభించిన పనబాక సాక్షి, హైదరాబాద్: ఉద్యోగవేటలో హైదరాబాద్‌కు చేరుకున్నవారికి వెంటనే వేధించే సమస్య ‘వంటగ్యాస్’. కష్టపడి కనెక్షన్ పొందినా గ్యాస్‌సిలిండర్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇంటికి తాళం వేసి ఆఫీస్‌కు వెళ్లాక వస్తే అదో సమస్య... ఈ సమస్యలకు పరిష్కారంగా నేరుగా పెట్రోలు బంకుకు వెళ్లి వంట గ్యాస్ పొందే విధానం నగరవాసుల దరిచేరింది. 5 కిలోల సిలిండర్‌ను పెట్రోలియం కంపెనీలు అందుబాటులోకి తెచ్చాయి. ఇప్పటికే దేశంలోని నాలుగు ప్రధాన మెట్రో నగరాల్లో మంచి స్పందన పొందిన ఈ పథకాన్ని నాన్‌మెట్రో నగరాల్లోనూ అమలు చేయాలని చమురు కంపెనీలు తొలి ప్రయత్నంగా హైదరాబాద్‌ను ఎంపిక చేశాయి. కేంద్ర పెట్రోలియం, జౌళి శాఖల సహాయ మంత్రి పనబాక లక్ష్మి బుధవారం కుషాయిగూడలోని హెచ్‌పీసీఎల్ పెట్రోలు బంకులో ప్రారంభించారు. కాగా, పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెడతారని పనబాక తెలిపారు. మహిళా కమిషన్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ఇదీ విధానం: కనెక్షన్ కావాల్సినవారు ఈ విధానం అందుబాటులో ఉన్న పెట్రోలు బంకుకు వెళ్లి చెల్లుబాటు అయ్యే గుర్తింపు ధ్రువపత్రం ప్రతిని జతచేస్తూ సిలిండర్ కోసం రూ.1,655 చెల్లించాల్సి ఉంటుంది. రెగ్యులేటర్ కావాలంటే మరో రూ.263 చెల్లించాలి. ఆ తర్వాత అవసరమైనప్పుడల్లా 5 కిలోల సిలిండర్ కావాలంటే రూ.510 చొప్పున చెల్లించి కొనుక్కోవాల్సి ఉంటుంది.