ఇక పెట్రోలు బంకుల్లో వంటగ్యాస్
అందుబాటులోకి 5 కిలోల సిలిండర్లు
హైదరాబాద్‌లో ప్రారంభించిన పనబాక
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగవేటలో హైదరాబాద్‌కు చేరుకున్నవారికి వెంటనే వేధించే సమస్య ‘వంటగ్యాస్’. కష్టపడి కనెక్షన్ పొందినా గ్యాస్‌సిలిండర్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇంటికి తాళం వేసి ఆఫీస్‌కు వెళ్లాక వస్తే అదో సమస్య... ఈ సమస్యలకు పరిష్కారంగా నేరుగా పెట్రోలు బంకుకు వెళ్లి వంట గ్యాస్ పొందే విధానం నగరవాసుల దరిచేరింది. 5 కిలోల సిలిండర్‌ను పెట్రోలియం కంపెనీలు అందుబాటులోకి తెచ్చాయి.
ఇప్పటికే దేశంలోని నాలుగు ప్రధాన మెట్రో నగరాల్లో మంచి స్పందన పొందిన ఈ పథకాన్ని నాన్‌మెట్రో నగరాల్లోనూ అమలు చేయాలని చమురు కంపెనీలు తొలి ప్రయత్నంగా హైదరాబాద్‌ను ఎంపిక చేశాయి. కేంద్ర పెట్రోలియం, జౌళి శాఖల సహాయ మంత్రి పనబాక లక్ష్మి బుధవారం కుషాయిగూడలోని హెచ్‌పీసీఎల్ పెట్రోలు బంకులో ప్రారంభించారు. కాగా, పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెడతారని పనబాక తెలిపారు. మహిళా కమిషన్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు.
ఇదీ విధానం: కనెక్షన్ కావాల్సినవారు ఈ విధానం అందుబాటులో ఉన్న పెట్రోలు బంకుకు వెళ్లి చెల్లుబాటు అయ్యే గుర్తింపు ధ్రువపత్రం ప్రతిని జతచేస్తూ సిలిండర్ కోసం రూ.1,655 చెల్లించాల్సి ఉంటుంది. రెగ్యులేటర్ కావాలంటే మరో రూ.263 చెల్లించాలి. ఆ తర్వాత అవసరమైనప్పుడల్లా 5 కిలోల సిలిండర్ కావాలంటే రూ.510 చొప్పున చెల్లించి కొనుక్కోవాల్సి ఉంటుంది.