gas agencey
-
గ్యాస్ కోసం పడిగాపులు
కావలిఅర్బన్, న్యూస్‌లైన్ : స్థానిక జెండాచెట్టు సమీపంలో ఉన్న శ్రీభవాని ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ వద్ద బుధవారం గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు బారులు దీరారు. గ్యాస్ కోసం వచ్చిన వృద్ధులు, చంటి బిడ్డలను తీసుకు వచ్చిన మహిళలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.గ్యాస్ సిలిండర్ కోసం ఉదయం ఏజెన్సీ వద్దకు వచ్చిన వినియోగదారులు సాయంత్రం వరకు పడిగాపులు కాశారు. ఏజెన్సీలో విద్యుత్ లేని కారణంగా కంప్యూటర్లు పని చేయకపోవడంతో సిలిండర్లను పంపిణీకి అంతరాయం ఏర్పడిందని నిర్వాహకులు తెలిపారు. మధ్యాహ్నం సుమారు 1 గంట ప్రాంతంలో ప్రత్యామ్నాయంగా జనరేటర్ ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ప్రారంభమైన సిలిండర్ల పంపిణీ సాయంత్రం వరకు సాగింది. -
ఇక పెట్రోలు బంకుల్లో వంటగ్యాస్
అందుబాటులోకి 5 కిలోల సిలిండర్లు హైదరాబాద్‌లో ప్రారంభించిన పనబాక సాక్షి, హైదరాబాద్: ఉద్యోగవేటలో హైదరాబాద్‌కు చేరుకున్నవారికి వెంటనే వేధించే సమస్య ‘వంటగ్యాస్’. కష్టపడి కనెక్షన్ పొందినా గ్యాస్‌సిలిండర్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇంటికి తాళం వేసి ఆఫీస్‌కు వెళ్లాక వస్తే అదో సమస్య... ఈ సమస్యలకు పరిష్కారంగా నేరుగా పెట్రోలు బంకుకు వెళ్లి వంట గ్యాస్ పొందే విధానం నగరవాసుల దరిచేరింది. 5 కిలోల సిలిండర్‌ను పెట్రోలియం కంపెనీలు అందుబాటులోకి తెచ్చాయి. ఇప్పటికే దేశంలోని నాలుగు ప్రధాన మెట్రో నగరాల్లో మంచి స్పందన పొందిన ఈ పథకాన్ని నాన్‌మెట్రో నగరాల్లోనూ అమలు చేయాలని చమురు కంపెనీలు తొలి ప్రయత్నంగా హైదరాబాద్‌ను ఎంపిక చేశాయి. కేంద్ర పెట్రోలియం, జౌళి శాఖల సహాయ మంత్రి పనబాక లక్ష్మి బుధవారం కుషాయిగూడలోని హెచ్‌పీసీఎల్ పెట్రోలు బంకులో ప్రారంభించారు. కాగా, పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెడతారని పనబాక తెలిపారు. మహిళా కమిషన్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ఇదీ విధానం: కనెక్షన్ కావాల్సినవారు ఈ విధానం అందుబాటులో ఉన్న పెట్రోలు బంకుకు వెళ్లి చెల్లుబాటు అయ్యే గుర్తింపు ధ్రువపత్రం ప్రతిని జతచేస్తూ సిలిండర్ కోసం రూ.1,655 చెల్లించాల్సి ఉంటుంది. రెగ్యులేటర్ కావాలంటే మరో రూ.263 చెల్లించాలి. ఆ తర్వాత అవసరమైనప్పుడల్లా 5 కిలోల సిలిండర్ కావాలంటే రూ.510 చొప్పున చెల్లించి కొనుక్కోవాల్సి ఉంటుంది. -
ఇక నచ్చిన చోట ‘గ్యాస్’
5 నుంచి ‘గ్యాస్’ కనెక్షన్ పోర్టబిలిటీ దేశవ్యాప్తంగా 30 నగరాల్లో అమలు సాక్షి, న్యూఢిల్లీ: వంట గ్యాస్ వినియోగదారులకు ఓ శుభవార్త! గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ సేవలు నచ్చకున్నా.. గతిలేక అక్కడే కనెక్షన్ కొనసాగించుకుంటున్న వారు.. ఇకమీదట అలా ఉండాల్సిన పనిలేదు. ఇకపై వెంటనే అదే కంపెనీలోని మరో డిస్ట్రిబ్యూటర్‌కు లేదా వేరే కంపెనీకి కనెక్షన్ మార్చేసుకోవచ్చు. ‘‘మొబైల్ నంబర్ పోర్టబిలిటీ పథకం’’ తరహాలోనే ‘‘ఇంటర్ కంపెనీ వంటగ్యాస్ కనెక్షన్ పోర్టబిలిటీ’’ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ నెల 5న కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి వీరప్ప మొయిలీ కర్ణాటక రాజధాని బెంగళూరులో దీన్ని ఆరంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని హైదరాబాద్/సికింద్రాబాద్ జంటనగరాలు, విశాఖపట్నం సహా దేశవ్యాప్తంగా మొత్తం 30 ముఖ్య నగరాల్లో ఈ పథకాన్ని తొలివిడతగా ప్రవేశపెడుతున్నారు. ఈ నగరాల జాబితాలో దేశంలోని ఐదు ప్రధాన మహానగరాలైన ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా ఉన్నాయి. ఈ పథకంతోపాటు 5 కిలోల వంటగ్యాస్ సిలిం డర్ల విక్రయాలకు కూడా ఆయన అదేరోజు బెంగళూరులో శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పుడు ఉన్న విధానం ఇదీ...: ప్రస్తుత విధానంలో ఒక కంపెనీలో కనెక్షన్ తీసుకున్న వినియోగదారు... ఆ కంపెనీ సేవలు నచ్చినా నచ్చకున్నా అదే గ్యాస్ వాడక తప్పడం లేదు. ఉదాహరణకు హెచ్‌పీ గ్యాస్ వాడే వినియోగదారులు ఇండేన్ గ్యాస్ లేదా భారత్ గ్యాస్‌కు మళ్లడానికి వీలు లేదు. అలాగే, హెచ్‌పీ గ్యాస్ పంపిణీదారు నుంచి గ్యాస్‌బండ అందుకుంటున్నవారు హెచ్‌పీకి చెందిన మరో పంపిణీదారు నుంచి గ్యాస్‌బండ పొందే అవకాశం కూడా లేదు. తమకు దగ్గరగా ఏజెన్సీ ఉన్నా దూరంగా ఉన్న ఏజెన్సీ నుంచి దగ్గరి ఏజెన్సీకి గ్యాస్ సేవలను మార్చుకునే వీలూ లేదు. ఇకమీదట ఈ పరిస్థితి మొత్తం మారనుంది. కొత్త విధానంలో ఇలా... పోర్టబిలిటీ పథకం కింద ఓ కంపెనీ సేవలు లేదా ఆ కంపెనీ పంపిణీదారు సేవలు నచ్చకుంటే వెంటనే ఆ కంపెనీ వెబ్సైట్లో తమ అయిష్టతను ప్రకటించి వేరే కంపెనీ లేదా పంపిణీదారును ఎంచుకోవచ్చు. తాము నివాసమున్న ప్రాంతానికి చేరువలోని పంపిణీదారుల్లో ఇష్టమైన పంపిణీదారుణ్ని వినియోగదారులు ఎంపికచేసుకోవచ్చు. కంపెనీ సేవలే నచ్చనిపక్షంలో వేరే కంపెనీ సేవలకు మారవచ్చు. అలా కాకుండా ఓ కంపెనీకి చెందిన ఒక నిర్దిష్ట పంపిణీదారు సేవలే ఇష్టం లేకుంటే అదే కంపెనీకి చెందిన పంపిణీదారుల జాబితానుంచి తమకు నచ్చిన పంపిణీదారు నుంచి సేవలు స్వీకరించవచ్చు. {పతి చమురు మార్కెటింగ్ కంపెనీ వెబ్సైట్లో ప్రతి ప్రాంతంలోని గ్యాస్ పంపిణీదారుల సేవలకు ఇచ్చిన రేటింగ్స్‌ని వినియోగదారులు చూడవచ్చు. సేవలస్థాయి ఆధారంగా తమకు నచ్చిన పంపిణీదారుణ్ని ఎంచుకోవచ్చు. కంపెనీ వెబ్సైట్లో వినియోగదారు పోర్టబిలిటీ కోసం పేరును నమోదుచేసుకున్న వెంటనే దాన్ని పరిశీలించి తగిన చర్యలు చేపడతారు. సేవల్లో మెరుగుదల తథ్యం...: గ్యాస్ పోర్టబిలిటీ పథకం అమలుతో వంటగ్యాస్ కంపెనీలు, పంపిణీదారులు వినియోగదారులకు అందిస్తున్న సేవల్లో గణనీయంగా మార్పు వస్తుందని, సేవలు మెరుగుపడటం తథ్యమని పెట్రోలియం మంత్రిత్వశాఖ అధికారులు చెబుతున్నారు. కంపెనీల మధ్య, పంపిణీదారుల మధ్య పోటీతత్వాన్ని ఈ పథకం పెంచనున్నందున ప్రతి కంపెనీ లేదా పంపిణీదారు తమ సేవలను ఇతరులకు దీటుగా మార్చుకోక తప్పదని వారంటున్నారు. మార్కెట్లోకి ఇక 5 కిలోల సిలిండర్లు.. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఎంపిక చేసిన పెట్రోల్ బంకుల్లో 5 కిలోల ఎల్పీజీ సిలిండర్లు మార్కెట్ ధరకు అందుబాటులోకి రానున్నాయి. మొదటగా ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, చెన్నైల్లోని ఎంపిక చేసిన పెట్రోల్ బంకుల్లో 5 కిలోల గ్యాస్ సిలిండర్లను విక్రయిస్తారు. తర్వాత క్రమేపీ ఇతర నగరాలకు, ప్రాంతాలకు ఈ విక్రయాలను విస్తరిస్తారు. విద్యార్థులు, ఐటీ నిపుణులు, బీపీఓ ఉద్యోగులు, సాధారణానికి భిన్నంగా ఇతర సమయాల్లో పనిచేసేవారికి ఈ 5 కిలోల సిలిండర్లు ఉపకరిస్తాయన్నది కేంద్రం ఉద్దేశం. తమకిష్టమైన సమయంలో ఖాళీ సిలిండర్‌ను ఇచ్చి కొత్త సిలిండర్‌ను పొందే వెసులుబాటు ఉంటుంది కనుక వారి కష్టాలు తీరతాయని కేంద్రం భావిస్తోంది. పెట్రోల్ బంకుల్లో సిలిండర్ల విక్రయం రోజూ ఎక్కువ గంటలపాటు సాగుతుందని పెట్రోలియం మంత్రిత్వశాఖ తెలిపింది. -
సబ్సిడీ అయోమయం
ఉదయగిరి, న్యూస్‌లైన్ : జిల్లాలో మంగళవారం నుంచి వంట గ్యాస్ కనెక్షన్ల సబ్సిడీకి సంబంధించి ‘నగదు బదిలీ పథకం’ అమల్లోకి వచ్చింది. జిల్లాలో ఇంత వరకు మొత్తం గ్యాస్ కనెక్షన్లలో 20 శాతం కూడా ఆధార్‌తో అనుసంధానం జరగకపోవడంతో లబ్ధిదారుల్లో అయోమయం, గందరగోళం నెలకొంది. ఇంత తక్కువ సంఖ్యలో ఆధార్ అనుసంధానం జరిగినా అధికారులు మాత్రం ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. అంతకుముందు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అక్టోబరు 1వ తేదీ నుంచి నగదు బదిలీ పథకం అమల్లోకి వచ్చినట్లు గ్యాస్ ఏజెన్సీలు ప్రకటిస్తున్నాయి. నగదు బదిలీ అంటే ఏమిటి? కేంద్ర ప్రభుత్వం గ్యాస్ లబ్ధిదారులకు ఇంత వరకు కొంత సబ్సిడీ ఇచ్చేది. ఆ సబ్సిడీని నేరుగా గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులకే ఇచ్చేది. ఇందులో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని భావించిన ప్రభుత్వం సబ్సిడీ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి బదలాయించాలని సంకల్పించింది. దీంతో ప్రతి గ్యాస్ కనెక్షన్ ఉన్న లబ్ధిదారుడు ఆధార్‌తో బ్యాంకులో ఖాతా తెరవాలని నిబంధన విధించింది. గ్యాస్ బుక్ చేసిన వెంటనే ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ మొత్తం లబ్ధిదారుని బ్యాంకు ఖాతాలో జమవుతుంది. అయోమయంలో లబ్ధిదారులు అక్టోబరు ఒకటో తేదీ నుంచి జిల్లాలో నగదు బదిలీ పథకం అమల్లోకి వస్తుందని ప్రకటించడంతో కొంతమంది లబ్ధిదారులు ఆధార్ నంబర్లను అటు గ్యాస్ ఏజెన్సీలకు, ఇటు బ్యాంకులకు అందజేశారు. జిల్లాలో మొత్తం 4.19 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉండగా, వాటిలో కేవలం 1.67 లక్షల మంది మాత్రమే ఆధార్ అనుసంధానం చేయించుకున్నారు. అంటే..మిగతా 2.5 లక్షల మంది ఇంత వరకు ఆధార్‌తో అనుసంధానం కాలేదు. దీంతో ఈ లబ్ధిదారుల్లో కొంత గందరగోళం నెలకొంది. సబ్సిడీలో తికమక: ఆధార్ అనుసంధానం చేయించుకున్న ప్రతి లబ్ధిదారుడు సిలిండర్ డెలివరీ సమయంలో గ్యాస్ ఏజెన్సీకి రూ.1020 చెల్లించాలి. అందులో రూ.450 సబ్సిడీ రూపంలో బ్యాంకులో జమ చేస్తారు. ఇందులో వ్యాట్ రూపేణ రూ.171 కటింగ్ అవుతుంది. ఈ మొత్తాన్ని రెండో సారి సిలిండరు బుక్ చేసుకున్నప్పుడు ఆయా ఖాతాల్లో జమ చేస్తామని ఏజెన్సీలు చెబుతున్నాయి. నగదు బదిలీ పథకం అమల్లో ఉన్న జిల్లాల్లో ఇప్పటికే ఖాతాల్లో సబ్సిడీ జమకావడం లేదని అక్కడి లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆధార్ అనుసంధానం చేయించుకున్న లబ్ధిదారులు ఒక్కో సిలిండరుకు రూ.650 చెల్లించాల్సి ఉండగా, ఆధార్ అనుసంధానం చేయించుకోని వారికి మాత్రం రూ.420 మాత్రమే సిలిండరు ఇస్తుండటంతో ఒక విధమైన గందరగోళ పరిస్థితి నెలకొంది. పూర్తిస్థాయిలో నగదు బదిలీ పథకం 2014 జనవరి నుంచి అమల్లోకి వస్తుందని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో డిసెంబరు 31వ తేదీ లోపు గ్యాస్ కనెక్షన్లు ఉన్న ప్రతి లబ్ధిదారుడు ఆధార్‌తో అనుసంధానం చేయించుకోవాల్సి ఉంటుంది. సుప్రీం తీర్పు అమలు జరిగేనా : ప్రజా సంక్షేమం దృష్ట్యా అమలు జరిగే పథకాలకు ఆధార్ కార్డులతో బ్యాంకుల్లో ఖాతాలు తెరవాలని, అందుకు వచ్చే రాయితీ ఖాతాల్లో జమ చేస్తామని కేంద్ర ప్రభుత్వం పేర్కొనడాన్ని సుప్రీంకోర్టు ఇటీవల తప్పుపట్టింది. ఆధార్ అనేది తప్పనిసరి కాదని తేల్చి చెప్పింది. దీంతో గ్యాస్‌కు సంబంధించిన నగదు బదిలీ పథకానికి ఊరట లభించినట్టేనని భావిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. అంటే పథకం అమలుకు ఆధార్ కచ్చితంగా అవసరమని, అవసరం లేదనిగానీ స్పష్టమైన వివరణ ఇవ్వకపోవడంతో గందరగోళం నెలకొంది. ఇండేన్ గ్యాస్ విజయవాడ విభాగం సేల్స్ మేనేజర్ సతీష్‌ను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా నగదు బదిలీ పథకం అక్టోబరు ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చిందన్నారు. ఆధార్ అనుసంధానం చేయించుకున్న ఖాతాదారులకు సబ్సిడీ బ్యాంకులో జమవుతుందన్నారు. ఆధార్ అందించని వారికి మరో రెండు నెలలు రూ.420కే ఇస్తామన్నారు. 2014 జనవరి నుంచి ఈ పథకం పూర్తి స్థాయిలో అమల్లోకి రానుందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు విషయమై ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుందన్నారు.