జిల్లాలో మంగళవారం నుంచి వంట గ్యాస్ కనెక్షన్ల సబ్సిడీకి సంబంధించి ‘నగదు బదిలీ పథకం’ అమల్లోకి వచ్చింది. జిల్లాలో ఇంత వరకు మొత్తం గ్యాస్ కనెక్షన్లలో 20 శాతం కూడా ఆధార్‌తో అనుసంధానం జరగకపోవడంతో లబ్ధిదారుల్లో అయోమయం, గందరగోళం నెలకొంది.
ఉదయగిరి, న్యూస్‌లైన్ : జిల్లాలో మంగళవారం నుంచి వంట గ్యాస్ కనెక్షన్ల సబ్సిడీకి సంబంధించి ‘నగదు బదిలీ పథకం’ అమల్లోకి వచ్చింది. జిల్లాలో ఇంత వరకు మొత్తం గ్యాస్ కనెక్షన్లలో 20 శాతం కూడా ఆధార్‌తో అనుసంధానం జరగకపోవడంతో లబ్ధిదారుల్లో అయోమయం, గందరగోళం నెలకొంది. ఇంత తక్కువ సంఖ్యలో ఆధార్ అనుసంధానం జరిగినా అధికారులు మాత్రం ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. అంతకుముందు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అక్టోబరు 1వ తేదీ నుంచి నగదు బదిలీ పథకం అమల్లోకి వచ్చినట్లు గ్యాస్ ఏజెన్సీలు ప్రకటిస్తున్నాయి.
నగదు బదిలీ అంటే ఏమిటి?
కేంద్ర ప్రభుత్వం గ్యాస్ లబ్ధిదారులకు ఇంత వరకు కొంత సబ్సిడీ ఇచ్చేది. ఆ సబ్సిడీని నేరుగా గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులకే ఇచ్చేది. ఇందులో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని భావించిన ప్రభుత్వం సబ్సిడీ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి బదలాయించాలని సంకల్పించింది. దీంతో ప్రతి గ్యాస్ కనెక్షన్ ఉన్న లబ్ధిదారుడు ఆధార్‌తో బ్యాంకులో ఖాతా తెరవాలని నిబంధన విధించింది. గ్యాస్ బుక్ చేసిన వెంటనే ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ మొత్తం లబ్ధిదారుని బ్యాంకు ఖాతాలో జమవుతుంది.
అయోమయంలో లబ్ధిదారులు
అక్టోబరు ఒకటో తేదీ నుంచి జిల్లాలో నగదు బదిలీ పథకం అమల్లోకి వస్తుందని ప్రకటించడంతో కొంతమంది లబ్ధిదారులు ఆధార్ నంబర్లను అటు గ్యాస్ ఏజెన్సీలకు, ఇటు బ్యాంకులకు అందజేశారు. జిల్లాలో మొత్తం 4.19 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉండగా, వాటిలో కేవలం 1.67 లక్షల మంది మాత్రమే ఆధార్ అనుసంధానం చేయించుకున్నారు. అంటే..మిగతా 2.5 లక్షల మంది ఇంత వరకు ఆధార్‌తో అనుసంధానం కాలేదు. దీంతో ఈ లబ్ధిదారుల్లో కొంత గందరగోళం నెలకొంది.
సబ్సిడీలో తికమక: ఆధార్ అనుసంధానం చేయించుకున్న ప్రతి లబ్ధిదారుడు సిలిండర్ డెలివరీ సమయంలో గ్యాస్ ఏజెన్సీకి రూ.1020 చెల్లించాలి. అందులో రూ.450 సబ్సిడీ రూపంలో బ్యాంకులో జమ చేస్తారు. ఇందులో వ్యాట్ రూపేణ రూ.171 కటింగ్ అవుతుంది. ఈ మొత్తాన్ని రెండో సారి సిలిండరు బుక్ చేసుకున్నప్పుడు ఆయా ఖాతాల్లో జమ చేస్తామని ఏజెన్సీలు చెబుతున్నాయి.
నగదు బదిలీ పథకం అమల్లో ఉన్న జిల్లాల్లో ఇప్పటికే ఖాతాల్లో సబ్సిడీ జమకావడం లేదని అక్కడి లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆధార్ అనుసంధానం చేయించుకున్న లబ్ధిదారులు ఒక్కో సిలిండరుకు రూ.650 చెల్లించాల్సి ఉండగా, ఆధార్ అనుసంధానం చేయించుకోని వారికి మాత్రం రూ.420 మాత్రమే సిలిండరు ఇస్తుండటంతో ఒక విధమైన గందరగోళ పరిస్థితి నెలకొంది. పూర్తిస్థాయిలో నగదు బదిలీ పథకం 2014 జనవరి నుంచి అమల్లోకి వస్తుందని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో డిసెంబరు 31వ తేదీ లోపు గ్యాస్ కనెక్షన్లు ఉన్న ప్రతి లబ్ధిదారుడు ఆధార్‌తో అనుసంధానం చేయించుకోవాల్సి ఉంటుంది.
సుప్రీం తీర్పు అమలు జరిగేనా : ప్రజా సంక్షేమం దృష్ట్యా అమలు జరిగే పథకాలకు ఆధార్ కార్డులతో బ్యాంకుల్లో ఖాతాలు తెరవాలని, అందుకు వచ్చే రాయితీ ఖాతాల్లో జమ చేస్తామని కేంద్ర ప్రభుత్వం పేర్కొనడాన్ని సుప్రీంకోర్టు ఇటీవల తప్పుపట్టింది. ఆధార్ అనేది తప్పనిసరి కాదని తేల్చి చెప్పింది. దీంతో గ్యాస్‌కు సంబంధించిన నగదు బదిలీ పథకానికి ఊరట లభించినట్టేనని భావిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. అంటే పథకం అమలుకు ఆధార్ కచ్చితంగా అవసరమని, అవసరం లేదనిగానీ స్పష్టమైన వివరణ ఇవ్వకపోవడంతో గందరగోళం నెలకొంది.
ఇండేన్ గ్యాస్ విజయవాడ విభాగం సేల్స్ మేనేజర్ సతీష్‌ను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా నగదు బదిలీ పథకం అక్టోబరు ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చిందన్నారు. ఆధార్ అనుసంధానం చేయించుకున్న ఖాతాదారులకు సబ్సిడీ బ్యాంకులో జమవుతుందన్నారు. ఆధార్ అందించని వారికి మరో రెండు నెలలు రూ.420కే ఇస్తామన్నారు. 2014 జనవరి నుంచి ఈ పథకం పూర్తి స్థాయిలో అమల్లోకి రానుందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు విషయమై ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుందన్నారు.