నెల్లూరు(టౌన్): జిల్లాలో సబ్సిడీతో గల వంటగ్యాస్‌ను ఏజెన్సీ నిర్వాహకుల సహకారంతో అక్రమ వ్యాపారులు యథేచ్ఛగా రీఫిల్లింగ్ చేపడుతున్నారు. సరిగ్గా పది రోజుల క్రితం కొత్తకాలువ సెంటర్లో అక్రమ రీఫిల్లింగ్ చేస్తున్న వ్యాపారుల నుంచి అధికారులు గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు పొదలకూరు రోడ్డులో స్వాధీనం చేసుకున్నారు. చిన్నబజారులో రీఫిల్లింగ్ గోడౌన్ ఉందని ప్రచారం సాగుతోంది.
ఇక్కడ గతంలో పలుమార్లు రీఫిల్లింగ్ చేస్తుండగానే అధికారులు పట్టుకున్నారు. తాజాగా గురువారం నెల్లూరు నగరం నడిబొడ్డున అత్యంత రద్దీ గల ములుముడి బస్టాండ్ సెంటర్లో అక్రమంగా రీఫిల్లింగ్ చేస్తుండగా అధికారులు గ్యాస్ సిలిండర్లన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇలా మొక్కుబడిగా దాడులు నిర్వహించడం తప్ప ‘అక్రమ రీఫిల్లింగ్’ను అధికారులు శాశ్వతంగా ఆపలేరా అని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు.
హైదరాబాద్ పరిస్థితి పునరావృతమైతే పరిస్థితి ఏంటి?
ఇటీవల కాలంలో హైదరాబాద్‌లో బీజేపీ కార్యాలయానికి సమీపంలో అక్రమంగా రీఫిల్లింగ్ చేస్తున్న సందర్భంలో గ్యాస్‌లీకై మంటలు వ్యాపించిన సంఘటనలో పలువురు మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. గతంలో అనంతపురం జిల్లాలో అదే పరిస్థితి త లెత్తింది. ఇప్పుడు నెల్లూరు ములుముడి బస్టాండ్ సెంటర్లో అత్యంత సన్నటి దారిలో మిద్దెమీద గ్యాస్‌ను రీఫిల్లింగ్ చేస్తూ అక్రమార్కులు దొరికారు. ఈ దుకాణాలున్న కాంప్లెక్స్‌లో ఒకే సారి ఇద్దరు నడిచేందుకు కూడా వీలు లేని సన్నటి దారి.
ఏదైనా ప్రమాదం జరిగితే ఆ కాంప్లెక్స్‌లోని మొత్తం దుకాణాలు, వాటిలో పనిచేస్తున్న వారు ప్రమాదానికి గురైతే దిక్కెవరు అనేది ప్రశ్నార్థకంగా మారింది. అధికారుల నిర్లక్ష్యం ఫలితంగానే అక్రమార్కులు గాలి, వెలుతురు లేని ఇలాంటి చోట్ల దొంగతనంగా రీఫిల్లింగ్ చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
జిల్లాలో పరిస్థితి
జిల్లాలో ప్రస్తుతం 4,78,091 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. 45 గ్యాస్ ఏజెన్సీల వారు ఈ వంటగ్యాస్‌ను వినియోగదారులకు పంపిణీ చేస్తున్నారు. వినియోగదారులకు అందాల్సిన సిలిండర్లను పక్కదారి పట్టిస్తూ ఏజెన్సీలు దండిగా సొమ్ము చేసుకుంటున్నాయనే ఆరోపణలున్నాయి.
చిన్న సిలిండర్లకు పెరిగిన గిరాకీ
జిల్లాలో బంగారం వ్యాపారం చేసేవారు, నగరంలో చదువుకుంటున్న విద్యార్థులు ఈ చిన్న గ్యాస్ సిలిండర్లను ఉపయోగిస్తున్నారు. ఇక గ్యాస్ లేని చిరుద్యోగులు, ప్రజలు అడపాదడపా ఈ చిన్న సిలిండర్లను కొనుగోలు చేస్తారు. దీంతో చిన్న సిలిండర్లకు గిరాకీ పెరిగింది. అయితే మార్కెట్‌లో ఈ చిన్న సిలిండర్లకు గ్యాస్ పట్టే అవకాశం లేదు. దీనిని ఆసరాగా చేసుకున్న వ్యాపారస్తులు బ్లాక్‌లో వంటగ్యాస్ సిలిండర్లను కొనుగోలు చేసి చిన్న సిలిండర్లకు గ్యాస్‌ను అక్రమంగా రీఫిల్లింగ్ చేసి సొమ్ము చేసుకుంటున్నారు. 3 కిలోలు, 5 కిలోల గ్యాస్‌రూపంలో అమ్ముతున్నారు.
సబ్సిడీతో కూడిన గ్యాస్ సిలిండర్ ధర రూ.450. అక్రమార్కులు అదే గ్యాస్ సిలిండర్‌ను ఐదు చిన్న సిలిండర్లలోనికి రీఫిల్లింగ్ చేస్తారు. ఒక్కొక్క సిలిండర్‌ను రూ.220 లెక్కన అమ్ముతున్నారు. అంటే ఒక సబ్సిడీ సిలిండర్ ద్వారా రూ.650 అదనంగా సంపాదిస్తారు. బ్లాక్‌లో కొనుగోలు చేసిన ఖర్చులు తీసేసినా కనీసంగా రూ.400 మిగులుతుంది. కాబట్టి ఈ వ్యాపారం మూడుపువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతోంది.
ఏజెన్సీ నిర్వాహకుల నుంచే కావాల్సినన్ని సిలిండర్లు వీరికి చేరుతుండటంతో ఈ వ్యాపారానికి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. గ్యాస్ ఏజెన్సీల నుంచి పౌరసరఫరాల అధికారులకు మామూళ్లు అందుతుండటంతో అధికారులు ఏజెన్సీలు జోలికి వెళ్లరు. అడపాదడపా ఇలాంటి చిన్న, చిన్న దాడులు నిర్వహించి ప్రచార ఆర్భాటాన్ని ప్రదర్శిస్తారు.
దాడులు ముమ్మమరం చేస్తాం
అక్రమంగా రీఫిల్లింగ్ చేస్తున్న వారి భరతం పట్టేందుకు ముమ్మరంగా దాడులు చేస్తాం. కేసులు నమోదు చేసి కఠినంగా వ్యవహరిస్తాం. గ్యాస్ ఏజెన్సీలపై కూడా దాడులు చేసి అక్రమార్కుల పనిబడుతాం. శాంతకుమారి,
పౌరసరఫరాల అధికారి
యథేచ్ఛగా గ్యాస్ రీఫిల్లింగ్
Published Fri, Aug 8 2014 3:38 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement
Advertisement