సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి, శ్రీధర్‌బాబు, ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సర్కారు మరో రెండు గ్యారంటీలను అమల్లోకి తీసుకువచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే వంట గ్యాస్ సిలిండర్ అందించే పథకాలను ఈ నెల 27 లేదా 29వ తేదీ నుంచి ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ మేరకు గురువారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఆరు గ్యారంటీల అమలుకోసం ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా రెండు పథకాల అమలు, విధివిధానాలపై సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నారు.
జీరో బిల్లింగ్.. ఏజెన్సీలకు సబ్సిడీ సొమ్ము
మార్చి మొదటివారం నుంచి జారీచేసే విద్యుత్ బిల్లులకు సంబంధించి.. 200యూనిట్లలోపు వాడే అర్హులైన వినియోగదారులకు జీరో బిల్లులు ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. అలాగే రూ.500కే గ్యాస్ సిలిండర్ అందించేందుకు వీలుగా విధివిధానాలను సిద్ధం చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని కల్పించిందని.. ఆరోగ్యశ్రీ వైద్య చికిత్సల పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచిందని సీఎం గుర్తు చేశారు.
ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులందరికీ లబ్ధి జరిగేలా చూడాలని సూచించారు. రూ.500కు గ్యాస్ సిలిండర్ అందించే పథకంలో.. ‘ప్రభుత్వ సబ్సిడీని నేరుగా లబ్ధిదారుల ఖాతాకు బదిలీ చేయాలా? లేక ఏజెన్సీలకు చెల్లించాలా? ఈ క్రమంలో వచ్చే అడ్డంకులు, ఇబ్బందులేమిట’న్న అంశాలపై సివిల్ సప్లైస్, ఆర్థిక శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అయితే ఎలాగైనా సరే లబ్ధిదారు రూ.500 చెల్లిస్తే సిలిండర్ అందించేలా చూడాలని, ప్రజలకు అనువైన విధానాన్ని అనుసరించాలని సూచించారు. దీనికి సంబంధించి గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేసే ఏజెన్సీలతో చర్చించాలన్నారు. ప్రభుత్వమిచ్చే సబ్సిడీ నిధులను వెంటవెంటనే చెల్లించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇక 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ ఇచ్చే ‘గృహజ్యోతి’ పథకాన్ని అనుమానాలు, అపోహలకు తావులేకుండా పారదర్శకంగా అమలు చేయాలని విద్యుత్తు శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. తెల్లరేషన్ కార్డు ఉండి, 200యూనిట్లలోపు వాడే గృహ విద్యుత్ వినియోగదారులందరికీ ఈ పథకం వర్తింపజేయాలని స్పష్టం చేశారు.
తప్పుల సవరణకు అవకాశం
ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తుల్లో కార్డు నంబర్లు, విద్యుత్ కనెక్షన్ నంబర్ల తప్పుల కారణంగా జీరో బిల్లుకు అర్హత కోల్పోయిన వారెవరైనా ఉంటే.. సవరించుకునే అవకాశం ఇవ్వాలని సీఎం రేవంత్ సూచించారు. విద్యుత్ బిల్లుల కలెక్షన్ సెంటర్లు, సర్వీస్ సెంటర్లన్నింటా ఈ సవరణ ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. ఈ విషయంలో ప్రజలందరికీ తెలిసేలా ప్రతి గ్రామంలో విద్యుత్ శాఖ తగినంత ప్రచారం కూడా చేపట్టాలని సూచించారు.
తప్పులను సవరించుకున్న అర్హులందరికీ తదుపరి నెల నుంచి పథకం వర్తింపజేయాలన్నారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోనివారు ఇప్పుడు కూడా ఎంపీడీవో, తహసీల్దార్ ఆఫీసుల్లో దరఖాస్తు చేసుకునేలా.. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సీఎస్ శాంతికుమారి, ఆర్థికశాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రామకృష్ణారావు, సివిల్ సప్లైస్ కమిషనర్ డీఎస్ చౌహాన్, ట్రాన్స్‌కో, జెన్‌కోల సీఎండీ రిజ్వీ, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment