ఇక నచ్చిన చోట ‘గ్యాస్’
5 నుంచి ‘గ్యాస్’ కనెక్షన్ పోర్టబిలిటీ
దేశవ్యాప్తంగా 30 నగరాల్లో అమలు
సాక్షి, న్యూఢిల్లీ: వంట గ్యాస్ వినియోగదారులకు ఓ శుభవార్త! గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ సేవలు నచ్చకున్నా.. గతిలేక అక్కడే కనెక్షన్ కొనసాగించుకుంటున్న వారు.. ఇకమీదట అలా ఉండాల్సిన పనిలేదు. ఇకపై వెంటనే అదే కంపెనీలోని మరో డిస్ట్రిబ్యూటర్‌కు లేదా వేరే కంపెనీకి కనెక్షన్ మార్చేసుకోవచ్చు. ‘‘మొబైల్ నంబర్ పోర్టబిలిటీ పథకం’’ తరహాలోనే ‘‘ఇంటర్ కంపెనీ వంటగ్యాస్ కనెక్షన్ పోర్టబిలిటీ’’ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ నెల 5న కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి వీరప్ప మొయిలీ కర్ణాటక రాజధాని బెంగళూరులో దీన్ని ఆరంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని హైదరాబాద్/సికింద్రాబాద్ జంటనగరాలు, విశాఖపట్నం సహా దేశవ్యాప్తంగా మొత్తం 30 ముఖ్య నగరాల్లో ఈ పథకాన్ని తొలివిడతగా ప్రవేశపెడుతున్నారు. ఈ నగరాల జాబితాలో దేశంలోని ఐదు ప్రధాన మహానగరాలైన ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా ఉన్నాయి. ఈ పథకంతోపాటు 5 కిలోల వంటగ్యాస్ సిలిం డర్ల విక్రయాలకు కూడా ఆయన అదేరోజు బెంగళూరులో శ్రీకారం చుట్టనున్నారు.
ఇప్పుడు ఉన్న విధానం ఇదీ...: ప్రస్తుత విధానంలో ఒక కంపెనీలో కనెక్షన్ తీసుకున్న వినియోగదారు... ఆ కంపెనీ సేవలు నచ్చినా నచ్చకున్నా అదే గ్యాస్ వాడక తప్పడం లేదు. ఉదాహరణకు హెచ్‌పీ గ్యాస్ వాడే వినియోగదారులు ఇండేన్ గ్యాస్ లేదా భారత్ గ్యాస్‌కు మళ్లడానికి వీలు లేదు. అలాగే, హెచ్‌పీ గ్యాస్ పంపిణీదారు నుంచి గ్యాస్‌బండ అందుకుంటున్నవారు హెచ్‌పీకి చెందిన మరో పంపిణీదారు నుంచి గ్యాస్‌బండ పొందే అవకాశం కూడా లేదు. తమకు దగ్గరగా ఏజెన్సీ ఉన్నా దూరంగా ఉన్న ఏజెన్సీ నుంచి దగ్గరి ఏజెన్సీకి గ్యాస్ సేవలను మార్చుకునే వీలూ లేదు. ఇకమీదట ఈ పరిస్థితి మొత్తం మారనుంది.
కొత్త విధానంలో ఇలా...
పోర్టబిలిటీ పథకం కింద ఓ కంపెనీ సేవలు లేదా ఆ కంపెనీ పంపిణీదారు సేవలు నచ్చకుంటే వెంటనే ఆ కంపెనీ వెబ్‌సైట్లో తమ అయిష్టతను ప్రకటించి వేరే కంపెనీ లేదా పంపిణీదారును ఎంచుకోవచ్చు. తాము నివాసమున్న ప్రాంతానికి చేరువలోని పంపిణీదారుల్లో ఇష్టమైన పంపిణీదారుణ్ని వినియోగదారులు ఎంపికచేసుకోవచ్చు.
కంపెనీ సేవలే నచ్చనిపక్షంలో వేరే కంపెనీ సేవలకు మారవచ్చు. అలా కాకుండా ఓ కంపెనీకి చెందిన ఒక నిర్దిష్ట పంపిణీదారు సేవలే ఇష్టం లేకుంటే అదే కంపెనీకి చెందిన పంపిణీదారుల జాబితానుంచి తమకు నచ్చిన పంపిణీదారు నుంచి సేవలు స్వీకరించవచ్చు.
{పతి చమురు మార్కెటింగ్ కంపెనీ వెబ్‌సైట్‌లో ప్రతి ప్రాంతంలోని గ్యాస్ పంపిణీదారుల సేవలకు ఇచ్చిన రేటింగ్స్‌ని వినియోగదారులు చూడవచ్చు. సేవలస్థాయి ఆధారంగా తమకు నచ్చిన పంపిణీదారుణ్ని ఎంచుకోవచ్చు. కంపెనీ వెబ్‌సైట్‌లో వినియోగదారు పోర్టబిలిటీ కోసం పేరును నమోదుచేసుకున్న వెంటనే దాన్ని పరిశీలించి తగిన చర్యలు చేపడతారు.
సేవల్లో మెరుగుదల తథ్యం...: గ్యాస్ పోర్టబిలిటీ పథకం అమలుతో వంటగ్యాస్ కంపెనీలు, పంపిణీదారులు వినియోగదారులకు అందిస్తున్న సేవల్లో గణనీయంగా మార్పు వస్తుందని, సేవలు మెరుగుపడటం తథ్యమని పెట్రోలియం మంత్రిత్వశాఖ అధికారులు చెబుతున్నారు. కంపెనీల మధ్య, పంపిణీదారుల మధ్య పోటీతత్వాన్ని ఈ పథకం పెంచనున్నందున ప్రతి కంపెనీ లేదా పంపిణీదారు తమ సేవలను ఇతరులకు దీటుగా మార్చుకోక తప్పదని వారంటున్నారు.
మార్కెట్లోకి ఇక 5 కిలోల సిలిండర్లు..
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఎంపిక చేసిన పెట్రోల్ బంకుల్లో 5 కిలోల ఎల్‌పీజీ సిలిండర్లు మార్కెట్ ధరకు అందుబాటులోకి రానున్నాయి. మొదటగా ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, చెన్నైల్లోని ఎంపిక చేసిన పెట్రోల్ బంకుల్లో 5 కిలోల గ్యాస్ సిలిండర్లను విక్రయిస్తారు. తర్వాత క్రమేపీ ఇతర నగరాలకు, ప్రాంతాలకు ఈ విక్రయాలను విస్తరిస్తారు. విద్యార్థులు, ఐటీ నిపుణులు, బీపీఓ ఉద్యోగులు, సాధారణానికి భిన్నంగా ఇతర సమయాల్లో పనిచేసేవారికి ఈ 5 కిలోల సిలిండర్లు ఉపకరిస్తాయన్నది కేంద్రం ఉద్దేశం. తమకిష్టమైన సమయంలో ఖాళీ సిలిండర్‌ను ఇచ్చి కొత్త సిలిండర్‌ను పొందే వెసులుబాటు ఉంటుంది కనుక వారి కష్టాలు తీరతాయని కేంద్రం భావిస్తోంది. పెట్రోల్ బంకుల్లో సిలిండర్ల విక్రయం రోజూ ఎక్కువ గంటలపాటు సాగుతుందని పెట్రోలియం మంత్రిత్వశాఖ తెలిపింది.