అపార్ట్‌మెంట్‌లో మంటలు
రూ. 50 లక్షల ఆస్తి నష్టం
మణికొండ: రిఫ్రిజిరేటర్‌లోని గ్యాస్ సిలిండర్ పేలి మంటలు రావడంతో అపార్ట్‌మెంట్‌లోని ఓ ఫ్లాట్ కిచెన్, హాల్, బెడ్రూం వరకు వ్యాపించడంతో అందులోని వ్యక్తులు హాహాకారాలు చేస్తూ కిందకు పరుగులు తీశారు. గేటెడ్ కమ్యూనిటీలో నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు స్థలంలో పార్కును అభివృద్ధి చేయటంతో అగ్నిమాపక వాహనాలు ప్రమాదం జరిగిన అపార్ట్‌మెంట్ వరకు సకాలంలో చేరలేక పోయాయి. మణికొండ మున్సిపాలిటీ, పుప్పాలగూడలోని గోల్డెన్ ఓరియల్ కమ్యూనిటీలోని బీ బ్లాక్ మూడో అంతస్తులోని 301 ఫ్లాట్‌లో శనివారం తెల్లవారుజామున ఒక్కసారిగా ఫ్రిడ్జిలోని గ్యాస్ సిలిండర్ పేలి మంటలు చెలరేగడంతో వంట గది మొత్తం అంటుకుని మిగతా గదులకూ వ్యాపించాయి. మంటలు వంట గ్యాస్ సిలిండర్‌కూ అంటుకోవటంతో పెద్ద శబ్దంతో పేలిపోయింది. దీంతో ఇంటి యజమాని వెంకటరమణతో పాటు మిగతా నలుగురు కుటుంబ సభ్యులు భయభ్రాంతులతో కిందకు వచ్చేశారు. చుట్టు పక్కల వారు సైతం నిద్రనుంచి మేల్కొని అగి్నమాపక శాఖకు సమాచారం ఇచ్చి మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేశారు.
అపార్ట్‌మెంట్ వరకూ వెళ్లలేక పోయిన ఫైరింజిన్..
గోల్డెన్ ఓరియల్‌లో రెండు బ్లాక్‌ల మధ్య ఉన్న రోడ్డును పార్కుగా మార్చారు. సకాలంలోనే గేటు వద్దకు చేరుకున్న మూడు ఫైరింజిన్‌లు ఫ్లాట్ వద్దకు చేరుకోలేక 300 మీటర్ల దూరంలోనే నిలిచిపోయాయి. దీంతో ఫ్లాట్ పూర్తిగా కాలిపోయిందని అగ్నమాపక శాఖ అధికారులు తెలిపారు. మంటలు ఫ్లాట్ మొత్తం వ్యాపించి విలువైన గృహోపకరణాలతో పాటు దుస్తులు, నగదు కాలిపోవటంతో రూ.50 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు ఫ్లాట్ యజమాని తెలిపారు. ఫ్లాట్ వద్దకు చేరుకునేందుకు అగ్నిమాపక శాఖ సిబ్బంది గంట పాటు ప్రయత్నం చేసినా సఫలం కాక పక్క బ్లాక్ నుంచి నీటిని చల్లి
మంటలను ఆర్పారు. కాగా.. స్థానికులు అంతలోపే పక్క ఫ్లాట్‌ల నుంచి పైపులను వేసి సాధ్యమైనంత వరకు మంటలను ఆర్పారు.
కేసు నమోదు
గోల్డెన్ ఓరియల్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై ఇంటి యజమాని వెంకటరమణ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment