న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ విక్రయాలపై లాభాలు కళ్లచూద్దామన్న ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్) ఆశలు ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు. పెట్రోల్ ఉత్పత్తుల ధరలు దేశంలో ఆరు నెలలుగా ఒకే స్థాయిలో ఉండిపోయాయి. కేంద్ర ప్రభుత్వ పరోక్ష ఆదేశాలతో ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలు రోజువారీ రేట్ల సవరణను నిలిపివేశాయి.
చమురు ఉత్పత్తికి కోత పెట్టాలని చమురు ఉత్పత్తి దేశాల సమాఖ్య (ఒపెక్) తాజాగా తీసుకున్న నిర్ణయంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు మళ్లీ పెరిగాయి. దీంతో రేట్ల సవరణ కూడా ఇప్పట్లో చేపట్టే అవకాశాల్లేవని తెలుస్తోంది. చమురు ధరలు ఇటీవలి గరిష్టాల నుంచి కొంత తగ్గుముఖం పట్టాయి. దీంతో చమురును ఉత్పత్తి చేస్తున్న దేశాల కూటమి ఒపెక్ రోజువారీగా 2 మిలియన్ బ్యారెళ్ల మేర తగ్గించుకోవాలని బుధవారం నిర్ణయం తీసుకుంది.
ఇటీవల ధరలు తగ్గడంతో ఊపిరి పీల్చుకుంటున్న మన ఆర్థిక వ్యవస్థకు ఓపెక్ తాజా నిర్ణయం ప్రతికూలం కానుంది. మన దేశ ముడి చమురు అవసరాల్లో 85 శాతాన్ని దిగుమతి చేసుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా ధరలను సవరించకపోవడం వల్ల చమురు మార్కెటింగ్ కంపెనీలు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఇటీవల ధరలు తగ్గడంతో డీజిల్ మినహా పెట్రోల్, గ్యాస్‌పై అవి ఎదుర్కొంటున్న నష్టాలు సున్నా స్థాయికి చేరాయి. లీటర్ డీజిల్‌పై నష్టం రూ.5కు తగ్గింది. కానీ, తాజా పరిణామంతో తిరిగి ఆయిల్ కంపెనీలకు నష్టాలు పెరిగిపోనున్నాయి. మరోవైపు రూపాయి మారకం విలువ క్షీణించడం కూడా చమురుపై నష్టాలను పెంచనుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.
నష్టాల బాట..
ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయాలన్న కేంద్ర సర్కారు లక్ష్యానికి అనుగుణంగా పెట్రోలియం ఉత్పత్తుల విక్రయ ధరలను సవరించకపోవడంతో ఆయిల్ కంపెనీల నష్టాలు పెరిగిపోతున్నాయి. ఫలితంగా జూన్ త్రైమాసికంలో మూడు ప్రభుత్వరంగ చమురు కంపెనీలు ఉమ్మడిగా రూ.18,480 కోట్ల నష్టాలను నమోదు చేశాయి. భారత్ దిగుమతి చేసుకునే బ్యారెల్ ముడి చమురు ధర సెప్టెంబర్ 27 నాటికి 84.75 డాలర్లకు తగ్గగా, అక్టోబర్ 5 నాటికి తిరిగి 92.17 డాలర్లకు పెరిగిపోయింది. చమురు ధరల క్షీణత ఇలానే కొనసాగితే, ఏప్రిల్ నుంచి ఎదుర్కొన్న నష్టాల భారం నుంచి గట్టెక్కొచ్చన్న చమురు కంపెనీల ఆశలు తాజా పరిణామంతో చెదిరిపోయాయి. 2021 నవంబర్ 4 నుంచి ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ పెట్రోల్, డీజిల్ ధరల సవరణను నిలిపివేయడం గమనార్హం. మార్చి 22 తర్వాత తిరిగి ఇవి రేట్లను సవరించాయి. ఫలితంగా లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ.10 మేర పెరిగింది. తిరిగి ఏప్రిల్ 7 నుంచి రేట్ల సవరణ నిలిచిపోయింది. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62 చొప్పున ఉంది.
Comments
Please login to add a commentAdd a comment