ద్రవ్యలోటు తగ్గింది | AP debt burden grew to Rs 3.72L cr CAG Report | Sakshi
Sakshi News home page

ద్రవ్యలోటు తగ్గింది

Published Sat, Mar 25 2023 3:40 AM | Last Updated on Sat, Mar 25 2023 2:51 PM

AP debt burden grew to Rs 3.72L cr CAG Report - Sakshi

సాక్షి, అమరావతి: గత ఆర్థికసంవత్సరం (2021–22)­లో.. అంతకుముందు ఆర్థిక ఏడాదితో పోలిస్తే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణం 1.46 శాతం తగ్గిందని భారత కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదిక వెల్లడించింది. 2022 మార్చి 31తో ముగిసిస సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కాగ్‌ ఇచ్చిన నివేదికను ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ శుక్రవారం అసెంబ్లీకి సమర్పించారు. రాష్ట్ర బడ్జెట్‌ లోపల అప్పులు, బడ్జెట్‌ బయట అప్పుల వివరాలను కాగ్‌ నివేదికలో విశ్లేషించింది. 2021–22 బడ్జెట్‌ అంచనాల్లో పేర్కొన్న దానికన్నా ద్రవ్యలోటు గణనీయంగా తగ్గిందని, దీంతో తీసుకున్న రుణాలు కూడా తగ్గినట్లు పేర్కొంది.

2021–22 నాటికి రాష్ట్ర మొత్తం రుణబకాయిలు జీఎస్‌డీపీ లక్ష్యంలోపలే ఉన్నా­య­ని తెలిపింది. ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనల మేరకు 2021–22 నాటికి రాష్ట్ర రుణబకాయిలు జీఎస్‌డీపీలో 35.60 శాతం ఉండాల్సి ఉండగా అంతకన్నా తక్కువగా 31 శాతమే ఉన్నాయని పేర్కొంది. అప్పటికి రాష్ట్ర రుణాలు రూ.3,72,503 కోట్లుగా ఉన్నాయి. ఇక 2020–21లో జీఎస్‌డీపీలో రుణాలు 34.35 శాతం ఉండగా 2021–22లో రుణాలు జీఎస్‌­డీపీలో 31 శాతానికి తగ్గినట్లు కాగ్‌ తెలిపింది. 2021–22లో బడ్టెట్‌ ప్రతిపాదించిన అంచనాలకన్నా వాస్తవ పరిస్థితులు వచ్చేనాటికి ద్రవ్యలో­టు, రెవెన్యూ లోటు గణనీయంగా తగ్గినట్లు కాగ్‌ పేర్కొంది.

ద్రవ్యలోటు రూ.38,224 కోట్లు ఉంటుందని అంచనా వేయగా దానిని రూ.25,013 కోట్ల్లకే పరిమితం చేసినట్లు కాగ్‌ పేర్కొంది. ఇలా ద్రవ్యలోటు 2.08 శాతానికే పరిమితమైంది. బడ్జెట్‌లో రెవెన్యూ లోటు రూ.19,546 కోట్లు ఉంటుందని ప్రతిపాదించగా వాస్తవంగా రెవెన్యూ లోటు రూ 8,611 కోట్లకు పరిమితం చేశారు. ఇక 2021–22లో రెవెన్యూ రాబడులు 28.53 శాతం పెరిగాయని, దీని ఫలితంగా 2021–22లో రెవెన్యూ, ద్రవ్యలోటు గణనీయంగా మెరుగుపడినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొందని కాగ్‌ వివరించింది. మరోవైపు.. 2021–22 నాటికి బడ్జె్జటేతర రుణాలు రూ.1,18,393.81 కోట్లు ఉన్నా­యి.

ఈ రుణాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే రాష్ట్ర మొత్తం రుణాలు జీఎస్‌డీపీలో 40.85 శాతంగా ఉంటుందని పేర్కొంది.  అశాస్త్రీయ రాష్ట్ర విభజన కార­ణంగా ఆర్థికవ్యవస్థ నిర్మాణాత్మక లోటును ఎదుర్కొంటోందని రాష్ట్ర ప్రభుత్వం సమాధానమి­చ్చినట్లు కాగ్‌ తెలిపింది. భౌగోళిక ప్రాతిపదికన ఏపీ తెలంగాణకు ఆస్తులను కోల్పోయిందని, కానీ.. జనాభా ప్రాతిపది­కన చెల్లింపుల బాధ్యతను పొందిందని, బకాయిలు తీర్చడానికి ఏపీకి వనరులు కూడా లేవని ప్రభుత్వం సమాధానం ఇచ్చిందని వివరించింది.

రాష్ట్ర ప్రభు­త్వం ప్రత్యేక కేటగిరి హోదా, 2014–15 రెవెన్యూ లోటుగ్రాంట్‌ వంటి విభజన హామీల అమలుకు కేంద్రంతో నిరంతరాయంగా ప్రయత్నిస్తోందని.. కోవిడ్‌ మహమ్మారి ఆర్థికపరమైన ఒత్తిడిని మరింత పెంచిందని తెలిపింది. ఈ కారణంగా రుణంగా తీసుకున్న నిధులలో కొంతభాగాన్ని లోటు ఫైనాన్సింగ్‌ కోసం, బాకీలను తీర్చేందుకు ఉపయోగించుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని కాగ్‌ వెల్లడించింది.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement