
భారత కంపెనీలకు గొప్ప అవకాశాలు
పరస్పర ప్రయోజనాలు, రాయితీలకు చోటు
కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్
న్యూఢిల్లీ: అమెరికాతో భారత్ నిర్వహించే వాణిజ్య సంప్రదింపుల పట్ల దేశీ పరిశ్రమ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ భరోసా ఇచ్చారు. ఈ విషయంలో భారత్ బలమైన స్థానంలో ఉందన్నారు. వివిధ భాగస్వాములతో సంప్రదింపుల ద్వారా చర్చలకు సన్నద్ధం అవుతున్నామని, త్వరలోనే ఇవి మొదలవుతాయని చెప్పారు. ఇరు దేశాలూ పరస్పర రాయితీలతోపాటు, సుంకాల తగ్గింపును ఆఫర్ చేయనున్నట్టు స్పష్టం చేశారు.
దీంతో రెండు దేశాల మధ్య ఎగుమతులు, దిగుమతులు సులభతరంగా మారతాయన్నారు. ప్రధాని మోదీ ఇటీవలి అమెరికా పర్యటన సందర్భంగా.. రెండు దేశాలు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి రెట్టింపు చేసుకోవాలని (500 బిలియన్ డాలర్లు), పరస్పర ప్రయోజనాలతో మొదటి దశ వాణిజ్య ఒప్పందాన్ని వీలైనంత ముందుగా ఈ ఏడాది కుదుర్చుకోవాలని నిర్ణయించడం తెలిసిందే. ప్రస్తుతం రెండు దేశాల మధ్య వాణిజ్యం 200 బిలియన్ డాలర్లుగా ఉంది.
ఈ ఒప్పందం దేశీ పరిశ్రమలకు వ్యాపార అవకాశాలను విస్తృతం చేస్తుందని మంత్రి గోయల్ ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చెప్పారు. ‘‘భారత్‌ను మరింత పోటీతత్వంతో తీర్చిదిద్దడానికి దీన్నొక గొప్ప అవకాశంగా చూస్తున్నాం. నాణ్యమైన ఉత్పత్తులతో ముందుకు రండి. భారత్, అమెరికాకు పరస్పర ప్రయోజనం కల్పించే, ఆకర్షణీయమైన వాణిజ్య షరతులను గమనించండి’’అని గోయల్ పేర్కొన్నారు.
టారిఫ్‌లు మనం కూడా వేస్తాం..
ప్రతీకార సుంకాలపై మంత్రి గోయల్ మాట్లాడుతూ.. దిగుమతుల నుంచి దేశీ పరిశ్రమను కాపాడుకునేందుకు మన దగ్గరా సుంకాలు ఉన్నట్టు గుర్తు చేశారు. ‘‘ఈ అంశాలను పరిష్కరించుకునేందుకు, పరస్పన ప్రయోజనాలపై చర్చల్లో భాగంగా దృష్టి పెడతాం. ఈ విషయంలో దేశీ సంస్థలకు ఆందోళన అక్కర్లేదు. ఇదొక సువర్ణావకాశం. కొత్త వ్యాపార అవకాశాలకు తలుపులు తెరుచుకుంటాయి. ఈ రోజు ఆందోళన చెందుతున్న వారు రేపు పశ్చాత్తాపం చెందాల్సి వస్తుంది’’అని మంత్రి వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment