న్యూఢిల్లీ: ఆర్థిక సర్వే 2023ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన మంగళవారం సభ ముందుంచారు. ముఖ్య ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ సూచనల మేరకు కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని ఆర్థిక వ్యవహారాల విభాగం దీన్ని రూపొందించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23)తో పోలిస్తే వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2023–24) జీడీపీ వృద్ధి కొంత నిదానించే అవకాశాల్లేకపోలేదని అంచనా వేసింది. అయినా కానీ, 6–6.8 శాతం మధ్య నమోదు కావచ్చని పేర్కొంది.
సాధారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరు, చేపట్టాల్సిన చర్యలు, భవిష్యత్ అంచనాలను ఆర్థిక సర్వే తేటతెల్లం చేస్తుంది. ‘‘2020 నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మూడు షాక్‌లు తగిలాయి. కరోనా రాకతో ప్రపంచ ఉత్పత్తికి బ్రేక్ పడింది. తర్వాత రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా కమోడిటీ ధరలను పెంచేసింది. ఫలితంగా ద్రవ్యోల్బణం ఎగిసింది. దీనికి కట్టడి వేసేందుకు ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు కీలక వడ్డీ రేట్ల పెంపును చేపట్టాయి. యూఎస్ ఫెడ్ రేట్లను భారీగా పెంచడంతో పెట్టుబడులు అమెరికా మార్కెట్‌కు తరలేలా చేసింది. దీంతో ఎన్నో కరెన్సీలతో పోలిస్తే డాలర్ బలపడింది. ఫలితంగా మన దేశ కరెంటు ఖాతా లోటు విస్తరించింది. నికర దిగుమతి దేశమైన భారత్ వంటి వాటిపై ద్రవ్యోల్బణ ఒత్తిళ్లకు దారితీసింది. అయినప్పటికీ 2021–22లో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కోలుకుంది. అమెరికా కేంద్ర బ్యాంకు ఇక ముందూ రేట్లను పెంచే అవకాశాల నేపథ్యంలో రూపాయిపై ఒత్తిడి కొనసాగుతుంది. అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు గరిష్ట స్థాయిలోనే ఉన్నందున పెరిగిన కరెంటు ఖాతా లోటు (క్యాడ్) అదే స్థాయిలో కొనసాగొచ్చు’’ అని సర్వే వివరించింది.
జీడీపీకి ఢోకా లేదు..
దేశ జీడీపీ 2022–23లో 7 శాతం మేర ఉండొచ్చు. 2022–23లో నమోదైన 8.7 శాతం కంటే తక్కువ. 2023–24 ఆర్థిక సంవత్సరానికి 6–6.8 శాతం మధ్య ఉండొచ్చు. అంతర్జాతీయంగా ఆర్థిక, భౌగోళిక రాజకీయ పరిణామాల ప్రభావం దీనిపై ఉంటుంది. కరోనా మహమ్మారి నుంచి ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంది. రానున్న ఆర్థిక సంవత్సరంలో వృద్ధి అన్నది బలమైన డిమాండ్, మూలధన పెట్టుబడులు పుంజుకోవడంపై ఆధారపడి ఉంటుంది. ప్రైవేటు మూలధన నూతన చక్రం స్పష్టంగా కనిపిస్తోంది. కొనుగోలు శక్తి పరంగా భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. మారకం రేటు పరంగా ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థ. ప్రైవేటు వినియోగం పెరగడం, మూలధన పెట్టుబడులు అధికంగా ఉండడం, కార్పొరేట్ల బ్యాలన్స్ షీట్లు బలంగా మారడం, చిన్న వ్యాపార సంస్థలకు రుణ లభ్యత, వృద్ధికి మద్దతునిచ్చే అంశాలు. 2022–23 మొదటి ఎనిమిది నెలల్లో కేంద్ర సర్కారు మూలధన వ్యయాలు 63.4 శాతం పెరిగాయి. వృద్ధికి ఇది కూడా మద్దతునిచ్చే అంశం. దేశ ఆర్థిక వ్యవస్థ 2025–26 లేదా 2026–27 నాటికి 5 ట్రిలియన్ డాలర్లకు (రూ.410 లక్షల కోట్లు), 2030 నాటికి 7 ట్రిలియన్ డాలర్లకు (రూ.574 లక్షల కోట్లు) చేరుకోవచ్చు. దీని ప్రకారం ఆర్థిక వృద్ధి విషయంలో ఈ దశాబ్దం భారత్‌దేనని ఆర్థిక సర్వే తేల్చిచెప్పింది.
ద్రవ్యోల్బణం/రూపాయి
ద్రవ్యోల్బణం రేటు 2022 ఏప్రిల్‌లో 7.8 శాతానికి పెరిగింది. ఆర్‌బీఐ గరిష్ట పరిమితి 6 శాతానికంటే ఎక్కువ. అయినప్పటికీ ప్రపంచంలో అతి తక్కువ ద్రవ్యోల్బణం దేశాల్లో భారత్ ఒకటి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆర్‌బీఐ ద్రవ్యోల్బణ అంచనా 6.8 శాతం అన్నది గరిష్ట పరిమితి కంటే ఎక్కువ. కానీ వడ్డీ రేట్లు పెరుగుదల అన్నది ప్రైవేటు వినియోగాన్ని దెబ్బతీసేంత స్థాయిలో లేదు.
ఎగుమతులు: 2021–22లో దేశ ఎగుమతులు 422 బిలియన్ డాలర్ల ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరినప్పటికీ.. తదనంతర పరిస్థితులు ఎగుమతుల వృద్ధికి అవరోధం కలిగిస్తున్నాయి. ఎగుమతి దేశాలను విస్తరించుకోవడం, స్వేచ్చా వాణిజ్య ఒప్పందాల ద్వారా ఈ బలహీనతను అధిగమించొచ్చు.
► భారత్ ఇప్పటికే ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. మార్చి నాటికి 3.5 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుంటుంది.
► భారత్‌కు చెందిన స్టార్టప్‌లకు సులభతర పన్నుల విధానం, ప్రక్రియలు అవసరం.
► పీఎం గతిశక్తి (మౌలిక సదుపాయలు విస్తరణకు ఉద్దేశించినది), నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ, పీఎల్‌ఐ ప్రోత్సాహకాలు ఆర్థిక వృద్ధిని బలోపేతం చేస్తాయి. అంతర్జాతీయంగా జీడీపీలో రవాణా వ్యయాలు 8 శాతంగా ఉంటే, మనదేశంలో 14–18 శాతం మధ్య ఉన్నాయి.
► దేశ ఫార్మాస్యూటికల్ మార్కెట్ 2030 నాటికి 130 బిలియన్ డాలర్లకు విస్తరిస్తుంది. 2021 నాటికి 41 బిలియన్ డాలర్లుగా ఉంటే, 2024 నాటికి 65 బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. కరోనా సంవత్సరం 2020–21లో ఈ రంగం 24 శాతం వృద్ధిని చూసింది.
► షిప్పింగ్ కార్పొరేష్, ఎన్‌ఎండీసీ స్టీల్, బీఈఎంఎల్, హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్‌కేర్, కాంకర్, వైజాగ్ స్టీల్, ఐడీబీఐ బ్యాంక్ ప్రస్తుతం ప్రైవేటీకరణ దశలో ఉన్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో చాలా వరకు వీటి ప్రైవేటీకరణ పూర్తవుతుంది.
► ఫిజికల్, డిజిటల్ సదుపాయాల సమన్వయం భారత భవిష్యత్‌ను నిర్ణయించనుంది. కొత్త సేవలకు డిజిటల్ మాధ్యమం విస్తరించినందున తగిన నియంత్రణలు అవసరం. ఆధార్, యూపీఐ తదితర విజయవంతమైన విధానాలను సర్వే ప్రస్తావించింది.
► 5జీ మొబైల్ సేవల విస్తరణతో నూతన ఆర్థిక అవకాశాలు అందుబాటులోకి వస్తాయి.
స్టార్టప్‌లు, మరిన్ని వ్యాపార ఆవిష్కరణలు ఊపందుకుంటాయి.
► భారత ఆర్థికాభివృద్ధి, ఇంధన భద్రతకు గ్రీన్ హైడ్రోజన్ కీలకంగా మారనుంది.
సమగ్ర రూపం
భారత వృద్ధి పథం, భారత్ పట్ల ప్రపంచ దేశాల్లో నెలకొన్న ఆశావాదం, మౌలిక రంగంపై దృష్టి, సాగులో వృద్ధి, పరిశ్రమలు, భవిష్యత్ రంగాలపై దృష్టిని ఆర్థిక సర్వే సమగ్రంగా తెలియజేసింది.
– ప్రధాని మోదీ
కరెన్సీ, చమురుపైనే..
2025–26 లేదా 2026–27 నాటికి 5 ట్రిలియన్ డాలర్లకు మన ఆర్థిక వ్యవస్థ చేరుకోవచ్చు. 2030 నాటికి 7 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. కరెన్సీ మారకం రేట్లపైనే ఈ లక్ష్యాలను చేరుకోవడం ఆధారపడి ఉంటుంది. చమురు ధరలపై అంచనాలు ఇవ్వడం కష్టం. ఆర్‌బీఐ చెప్పినట్టు బ్యారెల్ 100 డాలర్లకు దిగువన ఉంటే, సర్వేలో పేర్కొన్న వృద్ధి గణాంకాలను చేరుకోవడం సాధ్యపడుతుంది. చమురు 100 డాలర్లకు దిగువన ఉన్నంత కాలం మన వృద్ధి లక్ష్యాలకు విఘాతం కలగదు.
– అనంత నాగేశ్వరన్, ముఖ్య ఆర్థిక సలహాదారు
ఉపాధి కల్పన.. ఓకే
రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోవడం, నిర్మాణ రంగ కార్యకలాపాలు పెరగడం ఉపాధి అవకాశాలను పెంచినట్టు ఆర్థిక సర్వే పేర్కొంది. కరోనా సమయంలో లాక్‌డౌన్‌లతో పట్టణాల నుంచి వలసపోయిన కార్మికులు తిరిగి వచ్చేలా చేశాయి. మహ్మాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో నేరుగా ఉపాధి అవకాశాల కల్పన జరుగుతోంది. పీఎం కిసాన్, పీఎం గరీబ్ కల్యాణ్ యోజన దేశంలో ఆహార భద్రతకు తోడ్పడుతున్నాయి. పట్టణాల్లో నిరుద్యోగం 7.2 శాతానికి తగ్గింది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్‌ఎంఈ) రుణాల వృద్ధి 2022 జనవరి–నవంబర్ మధ్య 30.6% ఉంది. దీనికి అత్యవసర రుణ హామీ పథకం తోడ్పడింది. దేశంలో 6 కోట్లకు పైగా ఎంఎస్‌ఎంఈలు ఉండగా, 12 కోట్ల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు.
ఈవీ విక్రయాలు@ కోటి..
2030 నాటికి ఏటా 1 కోటి విద్యుత్ వాహనాలు అమ్ముడవుతాయని ఎకనమిక్ సర్వే తెలిపింది. దీనితో ప్రత్యక్షంగా, పరోక్షంగా 5 కోట్ల పైచిలుకు ఉద్యోగాల కల్పన జరగగలదని పేర్కొంది. 2022–2030 మధ్య ఈవీల మార్కెట్ వార్షికంగా 49 శాతం వృద్ధి చెందగలదని వివరించింది. పరిశ్రమ వర్గాల ప్రకారం 2022లో సుమారు 10 లక్షల విద్యుత్ వాహనాలు అమ్ముడయ్యాయి. వాహన విక్రయాలపరంగా డిసెంబర్‌లో జపాన్, జర్మనీలను అధిగమించి భారత్ మూడో స్థానానికి చేరింది.
ఆరోగ్యం.. మెరుగు
ప్రభుత్వం తీసుకున్న పలు చర్యల వల్ల ప్రతీ వ్యక్తి ఆరోగ్యం కోసం తన పాకెట్ నుంచి చేసే ఖర్చు 2013–14లో 64.2 శాతంగా ఉంటే, 2018–19 నాటికి 48.2 శాతానికి తగ్గింది. శిశు మరణాల రేటు కూడా క్రమంగా తగ్గుతూ వస్తోంది. 2023 జనవరి 6 నాటికి 220 కోట్ల కరోనా టీకా డోస్‌లు ప్రజలకు ఇవ్వడం పూర్తయింది. 2023 జనవరి 4 నాటికి ఆయుష్మాన్ భారత్ పథకం కింద 22 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు.
వ్యవసాయం.. సవాళ్లు
సాగు రంగం మెరుగైన పనితీరు చూపిస్తున్నప్పటికీ.. వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కొంటోంది. అలాగే, పెరిగిపోతున్న సాగు వ్యయాలు కూడా సవాలుగా మారాయి. సాగులో యంత్రాల వినియోగం తక్కువగా ఉండడం, తక్కువ ఉత్పాదకత సవాళ్లుగా ఉన్నాయి. కనుక ఈ రంగంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. గడిచిన ఆరు సంవత్సరాలుగా సాగు రంగం వార్షికంగా 4.6 శాతం చొప్పున వృద్ధి సాధించింది. కానీ, 2020–21లో 3.3 శాతం, 2021–22లో 3 శాతమే వృద్ధి చెందింది.
ప్రపంచ తయారీ కేంద్రంగా..
ప్రపంచ తయారీ కేంద్రంగా మారేందుకు భారత్ ముందు ప్రత్యేక అవకాశం ఉంది. కరోనా అనంతరం ఎదురైన సవాళ్ల నేపథ్యంలో విదేశీ కంపెనీలు తమ తయారీ, సరఫరా వ్యవస్థలను బలంగా మార్చుకోవాలని కోరుకుంటున్నాయి. ప్రస్తుతం దేశ జీడీపీలో తయారీ వాటా 15–16%గా ఉంటే, రానున్న సంవత్సరాల్లో 25%కి చేరుకుంటుంది. భారత్‌లో తయారీ 2.0 కోసం 27 రంగాలపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే పీఎల్‌ఐ పథకాన్ని ప్రారంభించింది. ఇప్పటికి 14 రంగాలకు పీఎల్‌ఐ పథకాలను ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment