కేంద్ర ఆర్థిక సర్వే (2023–24)లో వెల్లడి
అప్పుల భారం, ద్రవ్యలోటు తగ్గుతోంది.. వ్యయంలో నాణ్యత పెరిగింది
పథకాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు, వసతులు పెరిగాయి
ఎఫ్‌ఆర్‌బీఎంకు లోబడే అప్పులు..
పరోక్షంగా వైఎస్ జగన్ పాలనకు కితాబు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా బలోపేతమవుతోందని కేంద్ర ప్రభుత్వం 2023–24 ఆర్థిక సర్వేలో వెల్లడించింది. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడాన్ని కొనసాగిస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటని స్పష్టం చేసింది. ఆర్‌బీఐ నివేదికలతో పాటు కాగ్ గణాంకాల ఆధారంగా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను అంచనా వేసినట్లు సర్వే నివేదిక తెలిపింది. ఏపీ సహా 23 పెద్ద రాష్ట్రాలు ఆర్థికంగా బలోపేతమవుతున్నాయని.. ద్రవ్య లోటు, అప్పులు భారం తగ్గుతోందని సర్వే నివేదిక స్పష్టం చేసింది.
అలాగే ఏపీ సహా పలు రాష్ట్రాల వ్యయంలో నాణ్యత పెరిగిందని.. మూలధన వ్యయంపై ప్రభుత్వాలు దృష్టి సారించడం మెరుగుపడిందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో వివిధ పథకాల ద్వారా గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలను పెంచడంతో పాటు మౌలిక సదుపాయాలను కల్పించారని వెల్లడించింది. మహిళల సాధికారత, సామాజిక భద్రత, ఆరోగ్యం, పారిశుద్ధ్యం తదితర సౌకర్యాలను కల్పించినట్లు తెలిపింది. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు పాలనాపరమైన సమస్యలకు సాంకేతిక పరిష్కారాలను చూపించిందని నివేదిక పేర్కొంది.
వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రజల జీవన నాణ్యతను మెరుగుపడుతోందని.. తద్వారా గ్రామీణ ప్రాంతాలు పురోగతి సాధిస్తున్నాయని నివేదిక స్పష్టం చేసింది. వ్యవసాయ రంగంలో సాంకేతికత ఆధారంగా దిగుబడి అంచనాలను ఏపీతో పాటు తొమ్మిది రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని.. తద్వారా రైతులకు ప్రయోజనం కలుగుతోందని నివేదిక తెలిపింది. మొత్తంగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనకు కేంద్ర ప్రభుత్వం పరోక్షంగా కితాబిచి్చంది.
ఏపీ అప్పు రూ.4.85 లక్షల కోట్లు
ఆంధ్రప్రదేశ్ సహా అన్ని రాష్ట్రాలు తమ ఆర్థిక బాధ్యత, బడ్జెట్ నిర్వహణ చట్టానికి(ఎఫ్‌ఆర్‌బీఎం) అనుగుణంగా పరిమితికి లోబడి అప్పులు చేస్తున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం పార్లమెంట్‌లో వెల్లడించారు. కేంద్ర ఆర్థిక శాఖతో పాటు ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులకు లోబడి రాష్ట్రాల అప్పులు ఉంటాయని ఆయన తెలిపారు. 2024 మార్చి నాటికి ఆంధ్రప్రదేశ్ అప్పు రూ.4,85,490 కోట్లుగా ఉందని కేంద్ర మంత్రి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment