ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ప్రమాదం | direct democracy in Britain is dangerous | Sakshi
Sakshi News home page

ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ప్రమాదం

Published Sat, Jun 25 2016 1:21 AM | Last Updated on Mon, Sep 4 2017 3:18 AM

ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ప్రమాదం

ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ప్రమాదం

జాతిహితం
పిరికితనంతో డేవిడ్ కామెరాన్... ఈయూలో ఉండాలా, వైదొలగాలా? అనే చర్చపై తన సొంత పార్టీనే చీలిపోయేలా చేసే ప్రజాభిప్రాయ సేకరణను చేపట్టారు. తన దేశాన్ని, యూరప్‌ను విఫలం చేశారు, మొత్తం ప్రపంచమే కదలిపోయేలా చేశారు. ఆ అంశంపై తన పార్టీలోనే ఓటింగును చేపట్టి, మెజారిటీ ‘‘వదిలిపెట్టాలి’’ అంటే... ఆ అంశంతో కొత్త ప్రణాళికను రూపొందించి తాజాగా ఎన్నికలను నిర్వహించడం మెరుగైనదై ఉండేది. ఇప్పుడాయన ఆపరేషన్ థియేటర్‌లో పేషంట్‌ను నిలువునా కోసేసి పారిపోయారు.
 
బ్రెగ్జిట్ పర్యవసానాలు ద్రవ్య మార్కెట్లపై చూపే ప్రభావం పట్ల ఆందో ళనకు పరిమితమై మనం ఆ పరిణామాన్ని సంకుచితమైన, ఏక ముఖ దృష్టితో చూస్తూ తప్పు చేస్తున్నాం. లేదా, ప్రపంచీకరణను తిరగదోడి, తిరిగి పాత జాతీయవాదానికి తిరిగి పోవడంగా మాత్రమే దీన్ని చూస్తున్నాం. కానీ బ్రెగ్జిట్ (ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగడం) రాజకీయ పర్యవసానాలు అంతకంటే చాలా ప్రబలమైనవి, తీవ్రమైనవి. ఆగ్రహభరితమైన నేటి కాలంలో ఈ పరిణామం... శతాబ్దాలుగా అభివృద్ధి చెందిన ఆధునిక, ప్రజాస్వామ్య రాజ్యపు అసలు పునాదినే సవాలు చేస్తుంది. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం కావాలని గావుకేకలుపెట్టే కొత్త ధోరణి ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉంది. కీలక నిర్ణయా లపై, సమస్యలపై తరచుగా ప్రజాభిప్రాయ సేకరణలను చేపట్టడం, ప్రజా ప్రతినిధులను తిరిగి పిలిచే హక్కు, దామాషా పద్ధతి ప్రాతినిధ్యం, వ్యవస్థ సాధికారతను బలహీనపరచడం వంటివి ఇందులో ఉన్నాయి. ఇది అరాచ కానికి మాత్రమే దారి తీస్తుంది. ఢిల్లీకి రాష్ట్ర ప్రతిపత్తిపై ప్రజాభిప్రాయ సేక రణ జరపాలని అరవింద్ కేజ్రీవాల్ కోరడం గురించి కాదు నా ప్రధానమైన ఆందోళన. అదృష్టవశాత్తూ మన రాజ్యాంగం అందుకు అవకాశం కల్పించ లేదు లేదా మనం మొట్టమొదటిసారిగా ఆ భావనను కశ్మీర్‌లో పరీక్షించాలనీ అనుకోలేదు. ఆధునిక రాజ్యం విశ్వసనీయతను దెబ్బతీసే అంతకంటే పెద్ద ముప్పే ఇలాంటి ప్రజాభిప్రాయ సేకరణల వల్ల ఉంది.

ప్రజాస్వామ్యం పునాదికే చేటు
ప్రజాభిప్రాయసేకరణ ద్వారా ప్రత్యక్ష ఓటింగును నిర్వహించడం ప్రధానంగా యూరోపియన్ వ్యామోహం. అయితే అత్యంత కీలకమైన ఒక అంశాన్ని నిర్ణయించడానికే కాదు, సర్వసత్తాకశక్తిగా దేశం కట్టుబడి ఉండాల్సిన అంశా లను నిర్ణయించడానికి కూడా దాన్ని ప్రయోగించడం ఇదే మొదటిసారి. పాఠశాల బోధనాంశాలకు, కొన్ని వివాదాస్పదమైన జాతీయ స్థాయి పన్ను లకు పరిమితమైతే ప్రజాభిప్రాయ సేకరణలు గమ్మత్తుగానూ, ముద్దుగానూ ఉంటాయి. ఇటీవల స్విట్జర్లాండ్ ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా మినార్‌ల వంటి నిర్మాణాలను నిషేధించడం పూర్తి అధికసంఖ్యాకవాదం, జాత్యహం కార పూరితం కాకున్నా మొరటుదనం. స్విట్జర్లాండ్ పలు రంగాలలో ప్రపంచ స్థాయిలో అత్యుత్తమ ప్రమాణాలను నెలకొల్పి ఉండవచ్చు. కానీ అక్కడి ప్రజాస్వామ్యం స్త్రీలకు 1971లోగానీ ఓటు హక్కును ఇవ్వలేక పోయింది. అది కూడా పార్లమెంటు అలా నిర్ణయించాక 12 ఏళ్లకు గానీ అది జరగలేదు. బహుశా అంతా పురుషులతోనే జరిపే ప్రజాభిప్రాయ సేకరణ దాన్ని అడ్డు కుంటుందని భయపడటమే అందుకు కారణం కావచ్చు.

అతి భయంకరమైన వైరస్‌ల కంటే ఎక్కువ త్వరగా సోకే అంటు వ్యాధులు  చెడు భావాలు. ఇప్పటికే నెదర్లాండ్‌లో ఈయూపై ప్రజాభిప్రాయ సేకరణ జరపాలనే డిమాండు ఊపందుకుంటోంది. క్యుబెక్, స్కాట్లండ్‌ల వేర్పాటువాద ఒత్తిడులను కెనడా, బ్రిటన్‌లు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి అపకేంద్రక ధోరణులు మరింత సంక్లిష్టమైన, వైవిధ్యభరితమైన ఇతర దేశాలకు కూడా విస్తరించగలుగుతాయి. సుస్థిరత, నమ్మకం ఉన్న ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం నిర్ణీత కాలంపాటూ అధికారంలో ఉండటం అనే పునాదిపై ఆధునిక ప్రజాస్వామ్యం నిర్మితమైంది. తరచుగా ప్రజాభి ప్రాయ సేకరణల పేరిట జరిగే ఓటింగులు, అనూహ్యమైన అంతరాయాలు ఆ పునాదిని  పూర్తిగా ధ్వంసం చేస్తాయి. ఏ ప్రభుత్వమైనాగానీ విశాల దేశ లేదా ప్రజా ప్రయోజనాల కోసం కఠిన నిర్ణయాలను తీసుకోవడాన్ని అసాధ్యం అయ్యేలా చేస్తాయి. తమను ఎవరు పరిపాలించాలనే విషయంలో ఓటర్లకు అత్యున్నత నిర్ణయాధికారం ఉండగా... రాజ్యాంగం, చట్టాలు, ప్రాథమిక సూత్రాలకు ఒక మేరకు స్థిరత్వం, ఉల్లంఘనీయత ఉండటమే ఆధునిక ప్రజాస్వామ్యం గొప్పదనం. కాబట్టి ఆధిక్యతావాద అతిక్రమణలకు ప్రత్యక్ష ఓటు సాకుగా మార రాదు.

మన దేశానికి అన్వయిస్తే...
అతిగా సరళీకరించిన ఉదాహరణలతో దీన్ని మరింత వివ్లవకరంగా భారత దేశానికి అన్వయిద్దాం. ఢిల్లీ పూర్తి రాష్ట్ర స్థాయి అధికారాల కోసం ఓటిం గ్‌ను నిర్వహిస్తుంది. తమిళనాడు తనను ఆర్టికల్ 370 జాబితా కిందకు తేవాలని లేదా 2010 నాటి రాళ్లు రువ్విన కాలపు ఆగ్రహావేశపూరిత క్షణాల్లో జమ్మూ కశ్మీర్ తనకు సర్వసత్తాకత కావాలని, పాకిస్తాన్‌లో భాగం కావాలని  ‘ఎంచు కుంటే’నో? విదర్భ, బుందేల్‌ఖండ్ వాటికవే రాష్ట్రాలుగా ప్రకటించుకో వచ్చు. ఢిల్లీ దేశ రాజధాని కాబట్టి, యావద్భారతం దానికి ఒకప్పటి పూర్తి కేంద్రపాలిత రాష్ట్ర స్థాయిని పునరుద్ధరించాలని కచ్చితంగా ఓటు చేస్తుంది. ప్రజల మానసిక స్థితులలోని ఊగిసలాటల వల్ల కలిగే అస్థిరత్వాన్ని నివా రించడం కోసమే రాజ్యం అధికారాన్ని కచ్చితంగా నిర్వచించారు, సువ్యవ స్థితం చేశారు. వాటికి పరిమితులున్నాయి. పక్షపాతరహిత సంస్థలైన కోర్టులు, ఎన్నికల కమిషన్, కాగ్, సీఐసీ, తదితరాల ద్వారా ప్రధానంగా అవి అమలవుతుంటాయి. ప్రభుత్వం తమకు ఓటు చేయని, లేదా లెక్కలోకి రాని ఓట్లున్న వారిపట్ల వివక్ష చూపకుండా నివారించడం వాటి లక్ష్యం.

ప్రత్యక్ష  ప్రజాస్వామ్యం నేడు ఉదారవాద ఉద్యమపు ప్రధాన నినా దంగా అవతరించింది. కాబట్టి ఇదీ ప్రశ్న: మీరు కోర్టు తీర్పును ఎంచు కుంటారా? అది జరగకపోతే భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 377లోని కాల దోషంపట్టిన అంశాలకు పార్లమెంటరీ సవరణ కావాలా? లేక అయోధ్యలో ఆలయ నిర్మాణ ం కోసమూ, 370 అధికరణాన్ని, సింధు లోయ ఒప్పందా లను, సిమ్లా ఒప్పందాన్ని, తాష్కెంట్ ప్రకటనను రద్దుచేస్తూ ఓటింగ్‌ను నిర్వహించడం కావాలా? ఇవన్నీ ఒక పక్షానికి మొగ్గుచూపేలా ప్రేరేపించేవే. ఓటింగుకు పెడితే, రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు విధించిన 50 శాతం పరిమితి అండతో అగ్రకుల ఉన్నత వర్గాలు తమకు కల్పించుకున్న విశేషహక్కులను కోల్పోవాల్సి వస్తుంది.  మొత్తం జనాభాలో 20 నుంచి 25 శాతంగా ఉన్న అగ్రకులాలకు తమకు తాముగా శాశ్వత ‘ప్రతిభ’ను అంటగట్టేసుకుని అను భవిస్తున్న అవకాశాలలో సగం మాత్రమే వారికి మిగులుతాయి.

అవునూ, మీరు... 2001 డిసెంబర్‌లో పార్లమెంటుపై దాడి తర్వాత లేదా 26/11 ముంబై దాడుల తర్వాత వారంలోగా పాకిస్తాన్‌పై యుద్ధానికి పోవాలా, లేదా? అని జాతీయ స్థాయి ఓటింగ్‌ను నిర్వహించేవారా? ఆ రెండు సంద ర్భాల్లోనూ నాటి ప్రభుత్వాలు ప్రజాగ్రహాన్ని విస్మరించి వివేకవంతమైన మార్గాన్ని అనుసరించాయి. నిర్ణీత పదవీ కాలంపాటూ మనల్ని పరిపాలిం చాలని ప్రభుత్వంపై మనం విశ్వాసం ఉంచడమే సరిగ్గా అందుకు కారణం. ఈ అసంబద్ధత  ఇలాగే సాగిపోతూ ఉండగలదు. ఓ సీనియర్ బీజేపీ ఎంపీ ట్విటర్లో రఘురామ్ రాజన్‌కు రెండో దఫా పదవి ఇవ్వాలా, వద్దా? అని ఓటింగ్ నిర్వహించారు. ‘‘ఓటర్లు’’ అంతా ఆయన అనుచరులే. ‘‘వద్దు’’ అంటూ అత్యధిక ఆధిక్యతతో వారంతా ఓటింగ్ చేశారు. మరొక బీజేపీ రాష్ట్ర మంత్రి కూడా అలాగే పులికి బదులుగా ఆవును మన జాతీయ జంతువుగా గుర్తించాలంటూ ట్విటర్/సోషల్ మీడియాలో ఓటింగ్ చేపట్టారు. భారీ ఆధిక్యతతో ‘‘ప్రజాభిప్రాయం’’ ఆవును ఎన్నుకుంది. వెర్రిబాగుల పులికి తాను తన స్థానాన్ని కోల్పోయానని తెలియనైనా తెలియదు.

అరాచకం పరిష్కారం కాదు
ప్రపంచ అర్థిక వ్యవస్థలు ప్రతిష్టంభలో పడి, నిరుద్యోగం పెరుగు తుండగా పాత వ్యవస్థ పట్ల కొత్త అసంతృప్తి పెల్లుబుకుతోంది. కానీ పరిష్కారం అరాచకం కాదు. గతం పట్ల, ప్రత్యేకించి  ‘‘ప్రాచీనులు’’ చేసిన గొప్ప పనుల పట్ల కొత్త ఆకర్షణ పెరుగుతోంది. రోమన్ చక్రవర్తులు తమ నిర్ణయాలకు సమంజసత్వాన్ని కల్పించడం కోసం అలాంటి సర్కస్‌లను మహా సొగసుగా నిర్వహించగలిగినా కొంతవరకు ఈ ప్రత్యక్ష ప్రజాస్వామ్యాన్ని అమలు చేశారు. అయితే అంతకంటే ప్రాచీన కాలంనాటి వాటి గురించి కూడా చాలానే చెప్పారు. ప్రత్యేకించి మన వైశాలి అలాంటిదే. బిహార్‌లోని ముజ ఫర్‌పూర్‌కు కార్లో పయనిస్తుంటే ప్రపంచంలోనే అత్యంత పురాతన ప్రజా స్వామ్యమైన వైశాలి ఆహ్వానం పలుకుతున్న బోర్డులు కనిపి స్తాయి. మగధ సైన్యాలు దండెత్తగా వైశాలి వారితో యుద్ధం చేయాలా, చేస్తే ఎప్పుడు, ఎక్కడ చేయాలని చర్చిస్తూ ఉండగానే... మగధ సేనలు వైశాలిని ధ్వంసం చేసి ప్రజలను ఊచకోత కోశాయని చరిత్రకారులు చెబుతారు.

క్రీడలలో తరచుగా మనం విజయం చేతికి అందిందనగా కూడా ఓటమిని వరిస్తుండవచ్చు. భారతీయులకు ఇతరుల చర్చను లాగేసుకోవడం అనే ప్రత్యేకమైన, దీర్ఘకాలిక బలహీనత ఉంది. కష్టాలను ఎదుర్కొనే ధైర్యంలేని పిరికితనంతో బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్... ఈయూలో ఉండాలా, వైదొలగాలా? అనే చర్చపై తన సొంత పార్టీనే చీలిపోయేలా చేసే ప్రజాభిప్రాయ సేకరణను చేపట్టారు. తన దేశాన్ని, యూరప్‌ను విఫలం చేశారు, మొత్తం ప్రపంచమే  కదలిపోయేలా చేశారు. ఆయన ఆ అంశంపై తన పార్టీలోనే ఓటింగ్‌ను చేపట్టి, మెజారిటీ ‘‘వదిలిపెట్టాలి’’ అంటే... ఆ అంశంతో కొత్త ప్రణాళికను రూపొందించి తాజాగా ఎన్నికలను నిర్వ హించడం మెరుగైనదై ఉండేది. ఇప్పుడాయన ఆపరేషన్ థియేటర్‌లో పేషం ట్‌ను పడుకోబెట్టి నిలువునా కోసేసి పారిపోయారు. ఇది ఏవిధంగానూ అనుసరించకూడని ఉదాహరణ.  

తాజా కలం: 1974 పోఖ్రాన్-1 అణు పరీక్షకు ‘‘బుద్ధుడు నవ్వు తున్నాడు’’ అనే పేరు ఎందుకు పెట్టారు? చూడబోతే ఇందిరా గాంధీకి, ఆమె సలహాదారులకు కూడా మగధ, వైశాలిని ధ్వంసం చేసిన చరిత్ర తెలిసే ఉండాలి. బుద్ధుడు దాని పట్ల చాలా కలత చెందాడని, ఎవరూ కఠిన నిర్ణయాలను తీసుకోలేని ప్రత్యక్ష ప్రజాస్వామానికి బదులు వైశాలికి కూడా ప్రతినిరోధకంగా పనిచేయగల సైనిక శక్తి ఉండివుంటే అది ఈ విధ్వంసాన్ని నివారించగలిగేదని ఆయన భావించారనే గాథ ప్రచారంలో ఉంది. సైనిక శక్తిలోని అసమతూకం వల్ల కలిగే ప్రమాదాల గురించి బుద్ధుడు కలత చెందారు. భారత్ ఎట్టకేలకు సైనికపరమైన ప్రతినిరోధక శక్తిని సాధించిదని విన్నప్పుడు ఆయన నవ్వకపోతే ఏంచేస్తాడు?


శేఖర్ గుప్తా
 twitter@shekargupta

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement