బ్రిటన్ ప్రధాని సంచలన ప్రకటన
లండన్: బ్రెగ్జిట్ పై బ్రిటన్ ప్రజల నిర్ణయం ప్రధాని డేవిడ్ కామెరాన్ పదవికి ఎసరు తెచ్చిపెట్టింది. యూరోపియన్ యూనిన్ లోనే బ్రిటన్ కొనసాగాలన్న ఆయన ఆకాంక్షకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇవ్వడంతో ప్రధాని పదవి నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. బ్రెగ్జిట్ పై ప్రజల తీర్పును గౌరవిస్తున్నానని చెప్పారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసమే పోరాడానని చెప్పారు.
దేశానికి కొత్త నాయకత్వం అవసరం ఉందని వ్యాఖ్యానించారు. అక్టోబర్ లో కొత్త ప్రధాని వస్తారని సంచలన ప్రకటన చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తవని భావిస్తున్నట్టు చెప్పారు. యూకే ఆర్థిక పునాదులు పటిష్టంగా ఉన్నాయన్నారు.
మొదటి నుంచి బ్రెగ్జిట్ ను వ్యతిరేకించిన ఆయన ప్రజాతీర్పుతో కంగుతిన్నారు. తన ఆకాంక్షకు వ్యతిరేకంగా ఫలితం రావడంతో ప్రధాని పదవిని వదులు కోవాలని నిర్ణయించారు. కన్జర్వేటివ్ పార్టీకి చెందిన కామెరాన్ 2010లో తొలిసారిగా ప్రధానిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. 2015లో రెండో పర్యాయం ప్రధానిగా ఎన్నికయ్యారు. బ్రెగ్జిట్ తీర్పుతో మరో నాలుగేళ్లు పదవీ కాలం ఉండగానే రాజీనామా ప్రకటన చేశారు.