
ఓటమికి నాదే కారణం, నన్ను క్షమించండి!
లండన్: గతవారం జరిగిన ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీకి ఎదురైన ఘోర పరాభవానికి బాధ్యురాలిని తానేనని బ్రిటన్ ప్రధానమంత్రి థెరిసా మే అంగీకరించారు. ఈ ఓటమికి బాధ్యత తనదేనని, ఇందుకు తనను క్షమించాలని ఆమె పార్టీ ఎంపీలను కోరారు.
భారీ మెజారిటీని ఆశించి అవసరం లేకపోయినా ఎన్నికలకు వెళ్లి పార్లమెంటులో ఉన్న మెజారిటీని కూడా పోగొట్టుకున్న థెరిసా మేను బ్రిటన్ ప్రధాని పదవి నుంచి తప్పిస్తారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన నాయకత్వంపై ఎంపీల విశ్వాసాన్ని కూడగట్టేందుకు ఆమె సోమవారం కన్జర్వేటివ్ ఎంపీలతో వెస్ట్ మినిస్టర్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత గందరగోళానికి నేనే కారణం. నా వల్లే ఈ పరిస్థితి తలెత్తింది’ అని అన్నారు. యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలిగేందుకు ఉద్దేశించిన బ్రెగ్జిట్ చర్చల నేపథ్యంలో అనూహ్యంగా ఎన్నికలకు వెళ్లిన థెరిసా మేకు ఘోరమైన ఎదురుదెబ్బ తగిలింది.
దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్‌లో సాధారణ మెజారిటీకి 326 సీట్లు కాగా, గురువారం జరిగిన ఎన్నికల్లో థెరిసా మే నాయకత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ 318 స్థానాలకే పరిమితమైంది. 10 చోట్ల గెలిచిన డెమొక్రటిక్ యూనియనిస్ట్ పార్టీ (డీయూపీ)తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి థెరిసా మే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జరిగిన ఈ సమావేశంలో నాయకత్వ మార్పుపై ఎలాంటి చర్చ, అభిప్రాయాలు వెల్లువడలేదని ఎంపీలు తెలిపారు. మరోసారి ప్రధానిగా థెరిసా మేను కొనసాగించాలని పార్టీలోని ఎక్కువమంది ఎంపీలు కోరుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలినందువల్ల ఆమెను మార్చాలంటూ సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. థెరిసా మేను తొలగిస్తే.. తదుపరి ప్రధాని ఎవరన్న దానిపై కూడా ఊహగానాలు సాగుతున్నాయి. థెరిసా మేను ప్రధానిగా కొనసాగిస్తారా? లేక కొత్త వ్యక్తిని ప్రధానిగా నియమించే అవకాశముందా? అన్న దానిపై ఇంకా స్పష్టత రావాల్సిన అవసరముందని భావిస్తున్నారు.
చదవండి:‘థెరిసా మే’ను తప్పిస్తారా?