
‘థెరిసా మే’ను తప్పిస్తారా?
భారీ మెజారిటీని ఆశించి అవసరం లేకపోయినా ఎన్నికలకు వెళ్లి పార్లమెంటులో ఉన్న మెజారిటీని కూడా పోగొట్టుకున్న థెరిసా మేను బ్రిటన్ ప్రధాని పదవి నుంచి తప్పిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. 650 స్థానాలున్న పార్లమెంటు దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్‌లో సాధారణ మెజారిటీకి 326 సీట్లు గెలవాలి. కానీ గురువారం జరిగిన ఎన్నికల్లో థెరిసా మే నాయకత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ 318 స్థానాలకే పరిమితమైన విషయం తెలిసిందే.
10 చోట్ల గెలిచిన డెమొక్రటిక్ యూనియనిస్ట్ పార్టీ (డీయూపీ)తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి థెరిసా మే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలినందువల్ల ఆమె నాయకత్వ సామాజిక మాధ్యమాల ద్వారా ఈమేరకు ప్రచారం చేస్తున్నారు. తదుపరి ప్రధాని ఎవరన్న దానిపై కూడా ఊహగానాలు సాగుతున్నాయి. బ్రిటన్‌లో అత్యంత ప్రభావంతమైన టాబ్లాయిడ్‌లలోనూ ఈ మేరకు కథనాలు వెలువడుతున్నాయి. కొందరు ఎంపీలతో మంతనాలు సాగిస్తూ లాబీయింగ్ సైతం చేస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద థెరిసా మే తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు.
యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోయేందుకు ఉద్దేశించిన బ్రెగ్జిట్ చర్చలు మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఈ ప్రక్రియ సాఫీగా సాగి ఈయూతో ఒప్పందం కుదిరేదాకా... థెరిసా మేను కొనసాగించాలని కన్జర్వేటివ్ పార్టీలోని కొందరు పెద్దలు భావిస్తున్నారు. ఆరునెలలు సమయమిచ్చి... బ్రెగ్జిట్ కొలిక్కి వచ్చాక క్రిస్మస్ అనంతరం కొత్త నాయకుడిని ఎన్నుకోవడం మంచిదనేది వారి అభిప్రాయం. అవతలివైపు లేబర్ పార్టీ బలపడుతుండటం (గత ఎన్నికలతో పోలిస్తే గురువారం లేబర్ పార్టీ 29 స్థానాలు అధికంగా నెగ్గింది.
ఆ పార్టీ బలం 261కి చేరింది) కూడా కన్జర్వేటివ్ పార్టీ సీనియర్లకు ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడు థెరిసా మే నాయకత్వాన్ని సవాల్ చేసి... అంతర్గత కుమ్ములాటలతో ప్రభుత్వాన్ని నడపలేక చివరకు లేబర్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి రానివ్వకూడదనేది వీరి వాదన. నాయకులను అనూహ్యంగా సాగనంపుతుందనే పేరు కన్జర్వేటివ్ పార్టీకి ఉంది. కాబట్టి పరిణామాలు ఏ మలుపు తీసుకుంటాయో చూడాలి.
ప్రధాని పదవికి పోటీపడే వారిని ఎన్నుకోవడానికి మొదట కన్జర్వేటివ్ పార్టీ ఎంపీల్లో ఓటింగ్ నిర్వహిస్తారు. ప్రతి రౌండ్‌లో పోటీదారులందరిలోకి తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని రేసు నుంచి తప్పిస్తారు. ఇలా చివరకు ఇద్దరు మిగిలేదాకా ఎంపీలు ఓటింగ్ చేస్తారు. ఈ ఇద్దరిలో ప్రధాని పదవి ఎవరు చేపట్టాలనే దాన్ని దాదాపు లక్షా యాభై వేల మంది పార్టీ సభ్యులు ఓటింగ్ ద్వారా నిర్ణయిస్తారు. థెరిసా మేను తప్పించే పరిస్థితి వస్తే రేసులో ముందుండేదెవరు? వారి బలాబలాలేమిటో చూద్దాం.
బోరిస్ జాన్సన్
52 ఏళ్ల జాన్సన్ ‘బ్రెగ్జిట్’’కు అనుకూలంగా నిలబడి పూర్తి శక్తియుక్తులు ఒడ్డిన వాడు. ప్రస్తుతం విదేశాంగ మంత్రి. కన్జర్వేటివ్ ఎంపీల్లో జాన్సన్ నాయకత్వంపై అపనమ్మకం. పార్టీ సిద్ధాంతాలను కూడా కాదనే స్వతంత్ర భావాలున్న వ్యక్తిగా పరిగణిస్తారు. కుండబద్దలు కొట్టినట్లుగా మాట్లాడతారీ లండన్ మాజీ మేయర్. బ్రెగ్జిట్‌లో ఓడిపోయి డేవిడ్ కామెరూన్ రాజీనామా చేశాక... బోరిస్ జాన్సన్‌యే తదుపరి ప్రధాని అవుతాడని అత్యధికులు విశ్వసించారు. అయితే బ్రెగ్జిట్ సహచరుడు, తనకు గట్టి మద్దతుదారుగా ఉన్న మైకేల్ గోవ్ అనూహ్యంగా ప్రధాని రేసులోకి రావడంతో జాన్సన్ తాను పోటీ నుంచి తప్పుకున్నాడు. ప్రధానిగా థెరిసా మేను తప్పిస్తారనే వార్తల నేపథ్యంలో... తాను ఆమెకు మద్దతు ఇస్తున్నట్లు జాన్సన్ ట్వీట్ చేశారు.
ఫిల్ హమండ్
కన్జర్వేటివ్ పార్టీలో బలమైన నాయకుడు. ఆర్థికమంత్రిగా ఉన్న ఈయన ఎన్నికల్లో ఎదురుదెబ్బ తర్వాత మేకు వ్యతిరేకంగా గళమెత్తారు. డిప్యూటీ ప్రధానమంత్రిని నియమించాలని, థెరిసాకు సన్నిహితులైన ఇద్దరు మంత్రులను తప్పించాలని డిమాండ్ చేశారు. ఆ ఇద్దరు శనివారం రాజీనామా చేయడం పార్టీలో పెరుగుతున్న హమండ్ పలుకుబడికి నిదర్శనంగా భావిస్తున్నారు. బ్రెగ్జిట్‌ను పూర్తిచేసేందుకు కావాల్సిన అనుభవం ఈయనకు ఉందని నిపుణుల అభిప్రాయం. అయితే థెరిసా మేను ఎన్నికలకు వెళ్లమని ప్రోత్సహించిన వారిలో ఈయన ముఖ్యుడు.
అంబర్ రూడ్
హోంశాఖను చూస్తున్న 53 ఏళ్ల అంబర్ రూడ్‌కు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పరిశీలకుల అంచనా. ఇటీవలి కాలంలో బ్రిటన్‌లో జరిగిన ఉగ్రదాడుల సందర్భంగా ఈమె తన పనితీరుతో ప్రశంసలు అందుకున్నారు. కామెరూన్ రాజీనామా చేశాక ప్రధాని రేసులో థెరిసా మే పేరు పెద్దగా వినపడలేదు. కానీ నాటకీయ పరిణామాల మధ్య ఆమె ప్రధాని పదవి చేపట్టారు. నాడు థెరిసా మే ఉన్న స్థానంలో ఇప్పుడు అంబర్ రూడ్ ఉన్నారనేది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. అయితే గురువారం నాటి ఎన్నికల్లో ఆమె అతితక్కువ మెజారిటీ (346 ఓట్లు)తో బయటపడ్డారు. ఇది ఆమెకు ప్రతికూలంగా కావొచ్చు. అలాగే ప్రధాని పదవిని చేపట్టడానికి కావాల్సిన అనుభవం, అర్హత ఆమెకు లేవని కన్జర్వేటివ్ పార్టీలోని ఓ వర్గం వాదన.
డేవిడ్ డేవిస్
2005లో ప్రధాని పదవికి ఫేవరెట్‌గా బరిలోకి దిగి అనూహ్యంగా కామెరూన్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు బ్రెగ్జిట్ మంత్రిత్వశాఖను చూస్తున్నారు. ప్రధాని పదవికి రేసులో ఉంటానని మద్దతుదారుల ద్వారా ఎంపీలకు సంకేతాలు పంపుతూ లాబీయింగ్ చేస్తున్నారు.