నాలుగేళ్లనాడు జరిగిన బ్రిటన్ పార్లమెంటు ఎన్నికల్లో ఎలాగైనా గెలిచితీరాలన్న ఆత్రుతలో అప్పటి ప్రధాని డేవిడ్ కామెరాన్ ఇచ్చిన ఒక హామీ కన్సర్వేటివ్ పార్టీకి దండిగా సీట్లు సాధించిపెట్టింది. అంతక్రితం తమకున్న 306 స్థానాలనూ 331కి పెంచుకుని సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల సత్తా ఆ పార్టీకి లభించింది. కానీ ఆ హామీయే తమను క్రమేపీ సంక్షోభం వైపు నెడుతుందని పార్టీ నేతలు అనుకొని ఉండరు. ఆ వాగ్దానానికి అనుగుణంగా ఏడాదిలో నిర్వహించిన బ్రెగ్జిట్ రెఫరెండం మూడేళ్లకు ముగ్గురు ప్రధానుల్ని మార్చేలా చేసింది. కామెరాన్ తప్పుకున్నాక థెరిసా మే ప్రధాని కాగా, రెండేళ్లు గడిచేసరికి ఆమె కూడా రాజీనామా చేయాల్సివచ్చింది. తాజాగా ప్రధానిగా ఎన్నికైన బోరిస్ జాన్సన్ చేస్తున్న ప్రకటనలు కన్సర్వేటివ్ నేతలకు గుబులు పుట్టిస్తున్నాయి. బ్రిటన్‌కు మేలు చేకూరేవిధంగా ఈయూతో మాట్లాడి మెరుగైన బ్రెగ్జిట్ ఒప్పందానికి కృషి చేస్తాననడా నికి బదులు, అసలు ఏ ఒప్పందమూ అవసరం లేదంటూ జాన్సన్ చేస్తున్న ప్రకటనలు అయోమయాన్ని సృష్టిస్తున్నాయి.
బ్రెగ్జిట్ వ్యవహారం నిప్పుతో చెలగాటం వంటిది. ఈ సంగతి మొదట కామెరాన్, తర్వాత థెరిసా మే అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. ఈయూతో ఒప్పందంలో ఎన్ని సంక్లిష్టతలున్నాయో రెండేళ్లకు మే గ్రహించారు. ఈయూతో ఆమె కుదుర్చుకున్న ముసాయిదా ఒప్పందాన్ని ఈ ఏడాది జనవరిలో బ్రిటన్ పార్లమెంటు తోసిపుచ్చింది. ఆ తర్వాత మార్చిలో ఆమె మరో ముసా యిదా ఒప్పందానికి ఈయూను ఒప్పించారు. కానీ దాన్ని సైతం పార్లమెంటు తోసిపుచ్చింది. ఆమె వ్యవహారశైలిపై సొంత పార్టీలో అసంతృప్తి నానాటికీ తీవ్రమై చివరకు ఆమె రాజీనామా చేశారు. వచ్చే అక్టోబర్ 31నాటికి ఏదో ఒప్పందానికి రాకపోతే బ్రిటన్‌పై దాని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయన్న సంగతిని జాన్సన్ గ్రహించలేకపోతున్నారో లేక అప్పటివరకూ ఏదో రకంగా నెట్టుకు రావొచ్చునని భావిస్తున్నారో ఎవరికీ అర్ధంకావడం లేదు. ఒప్పందం కుదుర్చుకుని తప్పుకుంటే బ్రిటన్‌కొచ్చే లాభం ఒకటుంది.
అది కొత్త విధానంలోకి పరివర్తన చెందడానికి 21 నెలల సమ యాన్ని... అంటే దాదాపు రెండేళ్ల గడువు తీసుకోవచ్చు. ఈలోగా ఎదురయ్యే సమస్యలను ఒక్కొ క్కటిగా పరిష్కరించుకోవచ్చు. కానీ ఒప్పందం లేకుంటే ఒక్కసారిగా బ్రిటన్ అనిశ్చితిలోకి జారు కుంటుంది. బ్రిటన్, ఈయూల మధ్య తీవ్ర విభేదాలు ఏర్పడి దేశ పౌరులకు సమస్యలేర్పడతాయి. తమ సభ్య దేశం కాదు గనుక బ్రిటన్‌పై ఈయూ భారీ సుంకాలు విధిస్తుంది. ఫలితంగా దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతాయి. కొత్త నిబంధనలు రూపొందించుకునేవరకూ బ్రిటన్ నుంచి వచ్చే ఉత్పత్తులకు ఈయూ అనుమతి నిరాకరిస్తుంది. దేశం వెలుపలి నుంచి రావా ల్సిన విడి భాగాలు, ముడి సరుకు వగైరాల దిగుమతికి సమస్యలేర్పడతాయి గనుక ఉత్పత్తిదారులు బ్రిటన్ వదిలిపోవచ్చు. దానివల్ల లక్షలాదిమంది ఉపాధి దెబ్బతింటుంది. అటు ఈయూ, ఇటు బ్రిటన్ కొత్త విధానాలు రూపొందించుకునే వరకూ రెండు ప్రాంతాల్లోనూ వలసదారులకు తిప్పలు తప్పవు.
బ్రిటన్‌లో 37 లక్షలమంది యూరపియన్లు ఉంటే... ఈయూ దేశాల్లో 13 లక్షలమంది బ్రిటన్ పౌరులున్నారు. వీరంతా కొత్తగా రూపొందబోయే నిబంధనలకు అనుగుణంగా తమ స్థితి గతులను మార్చుకోవాల్సి ఉంటుంది. ఈయూ బడ్జెట్ కోసం ఏటా చెల్లించాల్సిన 1,300 కోట్ల పౌండ్ల భారం నుంచి బ్రిటన్ తప్పుకోవచ్చు. కానీ అటు నుంచి వచ్చే సబ్సిడీలన్నీ నిలిచిపోతాయి. ముఖ్యంగా ఉమ్మడి వ్యవసాయ విధానం కింద బ్రిటన్ రైతులకిచ్చే 300 కోట్ల పౌండ్లు ఆగిపోతాయి. ఇప్పటికే ఆమోదించిన ఈయూ బడ్జెట్‌కు, దానికింద పరస్పరం చేసుకునే చెల్లింపులకూ ఇరు దేశాలూ కట్టుబడి ఉండాలి. ఈయూ న్యాయస్థానం తీర్పులను బ్రిటన్ పాటించాల్సిన అవసరం ఉండదు. అయితే ఈయూ దేశాలతో బ్రిటన్ వేర్వేరుగా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవాల్సి వస్తుంది. అందుకు చాన్నాళ్లు పట్టే అవకాశం ఉంది. బ్రిటన్ ఇకపై ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) నిబంధనల ప్రకారం నడుచుకుంటుంది. ఇందువల్ల కొన్ని రంగాల్లో బ్రిటన్ మెరుగైన స్థితిలో ఉండే అవకాశం లేకపోలేదు. అదే సమయంలో మరికొన్ని అంశాల్లో సమస్యలేర్పడతాయి.
కన్సర్వేటివ్ ఎంపీల్లో బ్రెగ్జిట్‌పై స్పష్టత లేకపోవడమే ఈ సమస్యలన్నిటికీ మూల కారణం. ఆ పార్టీలో ఒప్పందం వద్దనే వారితోపాటే, దాన్ని గట్టిగా సమర్థిస్తున్నవారున్నారు. ఆ అస్పష్టతే పార్టీలో ప్రధాని పదవికి పోటీపడిన జెరిమీ హంట్‌కు బదులు జాన్సన్‌ను ఎన్నుకోవడానికి కారణ మైంది.
ఈయూతో సమర్థవంతంగా సంప్రదింపులు జరిపి దేశానికి లాభం చేకూర్చే ఒప్పందానికి వారిని ఒప్పిస్తానని హంట్ చెప్పినా అత్యధికులు ఆయన్ను విశ్వసించలేదు. కానీ జాన్సన్‌లో మరో డోనాల్డ్ ట్రంప్ ఉన్నారని వారు గ్రహించలేకపోయారు. అట్లాంటిక్ మహా సముద్రానికి అటున్న ట్రంప్, ఇటువైపున్న జాన్సన్ చూడటానికి కవలల్లా ఉంటారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో అప్పటికి లండన్ మేయర్‌గా ఉన్న జాన్సన్ న్యూయార్క్ వెళ్లినప్పుడు ఆయన్ను చాలా మంది ట్రంప్‌గా పొరబడ్డారు. అప్పట్లో ఆయన విపరీత వ్యాఖ్యలను తప్పుబట్టిన జాన్సన్ ఇప్పుడు అదే దారిలో వెళ్తున్నారు. జాత్యహంకార వ్యాఖ్యల్లో, మహిళలను కించేపరిచేలా మాట్లాడటంలో, ఇస్లాంను భూతంగా చూడటంలో ఆయన ట్రంప్‌కెక్కడా తీసిపోరు. ఈయూతో ఒప్పందం లేకపో యినా మిన్ను విరిగి మీద పడబోదని జాన్సన్ చేసిన వ్యాఖ్య కూడా ఆ కోవలోనిదే. ఈయూతో ఏ ఒప్పందమూ ఉండబోదన్న అనుమానం వస్తే పార్లమెంటులో జాన్సన్‌పై సొంత పార్టీవారే అవి శ్వాస తీర్మానం పెట్టే అవకాశం లేకపోలేదు. తాననుకున్నది సాధించడానికి పార్లమెంటును ఆయన సస్పెండ్ చేస్తే పార్టీ ఉనికికే ముప్పు ముంచుకొస్తుంది. ఎలా చూసినా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ స్థాయిలో బ్రిటన్ సంక్షోభం ఎదుర్కొనడం ఇదే తొలిసారి. దీన్నుంచి ఆ దేశం ఎలా బయటపడుతుందో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment