బ్రెగ్జిట్ బాంబు!
అందరూ భయపడిందే నిజమైంది. బ్రెగ్జిట్ బాంబు పేలింది. యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి నిష్ర్కమణే తమ అభీష్టమని 51.9 శాతంమంది బ్రిటన్ పౌరులు తేల్చిచెప్పారు. ఈయూలోనే కొనసాగాలని భావించినవారు 48.1 శాతం మాత్రమే ఉన్నారని శుక్రవారం వెల్లడైన రెఫరెండం ఫలితాలు తేల్చి చెప్పాయి. రెఫరెండం హడావుడి మొదలైన నాలుగు నెలలనాడు బ్రెగ్జిట్ అనుకూల వాదుల కంటే ఎంతో ముందున్న యధాతథవాదులు రోజులు గడుస్తున్నకొద్దీ బలహీనపడుతున్న వైనాన్ని వరస సర్వేలు వెల్లడిస్తూనే ఉన్నాయి. చిట్టచివరి దశలో సేకరించిన సర్వేల్లో యధాతథవాదులు 51 శాతంగా ఉన్నారు. ప్రత్యర్థుల బలం 49 శాతం మాత్రమే. అయితే ఇది పోలింగ్ రోజున తిరగబడవచ్చునని కూడా సర్వేలు జోస్యం చెప్పాయి.
ముఖ్యంగా ఓటింగ్ శాతం తగ్గిన పక్షంలో విడిపోదామనేవారి గెలుపే ఖాయమన్నాయి. అయితే ఓటింగ్ ముమ్మరంగా జరిగినా అంతిమ విజయం బ్రెగ్జిట్‌వాదులకే దక్కింది. ఫలితాలు వెలువడ్డ కాసేపటికే ప్రధాని డేవిడ్ కామెరాన్ రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. బ్రిటన్... ఆ దేశంతోపాటు పాశ్చాత్య దేశాలూ, అటుపై మొత్తం ప్రపంచ దేశాలూ ఎదుర్కొనబోయే అనేకానేక ఉత్పాతాలతో పోలిస్తే కామెరాన్ రాజీనామా ఓ చిన్న కుదుపు మాత్రమే. చూడటానికిది ఈయూలో ఉండటమా, బయటికి రావడమా అన్న అంశంపై జరిగిన హోరాహోరీ పోరుగా మాత్రమే కనబడుతున్నా... సారాంశంలో అంతకు మించిన వైరుధ్యాలు ఎన్నో ఇందులో దాగున్నాయి. అవి రాగలకాలంలో బ్రిటన్‌లో ఎలాంటి విపత్తులను సృష్టించగలవో ఎవరూ నిర్దిష్టంగా చెప్పలేరు. ఆ వైరు ద్యాలతో పాలకులు వ్యవహరించే తీరుతెన్నులు వాటిని నిర్ణయిస్తాయి.
రెండో ప్రపంచ యుద్ధానంతరం యూరప్ ఖండ దేశాలను ఏకం చేయడానికి సుదీర్ఘకాలం సాగిన చర్చోపచర్చలు 1958లో యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీ (ఈఈసీ)కి జన్మనిస్తే ఆ తర్వాత అది ఈయూగా రూపుదిద్దుకోవడం 1973లో సాధ్యపడింది. ఉచ్ఛస్థితిలో ఉన్న 60వ దశకంలో ఈఈసీ సభ్యత్వ విస్తరణను ఫ్రాన్స్ గట్టిగా వ్యతిరేకిస్తే అనంతరకాలంలో అందుకు భిన్నమైన వాదనలకు బలం చేకూరింది. యూరప్ ఖండంలోని చిన్నా చితకా దేశాలను కూడా కలుపుకుంటేనే తిరుగులేని శక్తిగా ఎదగగలమన్న అభిప్రాయానిది పైచేయి అయింది. 90వ దశకం మొదట్లో తూర్పు యూరప్ దేశాల్లో సోషలిస్టు రాజ్యాల పతనం దీనికి తోడైంది. పర్యవసానంగా ఈయూలో కొత్త దేశాలు చేరుతూ వచ్చాయి.
ప్రపంచవ్యాప్తంగా మితవాదులు, ఛాందసవాదులు ఇటీవలి సంవత్సరాల్లో బలపడుతున్న జాడలు కనబడుతూనే ఉన్నాయి. అమెరికాలో రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్, ఫ్రాన్స్‌లో నేషనల్ ఫ్రంట్ నాయకురాలు లీ పెన్, నెదర్లాండ్స్‌లో పార్టీ ఫర్ ఫ్రీడం నాయకుడు గిర్ట్ వైల్డర్స్, ఇటలీలో నార్తర్న్ లీగ్ నేత మేటియో సాల్విని వంటి మితవాదులు జాతీయవాదాన్ని నూరిపోస్తున్నారు. మన దేశం, మన ఉద్యోగాలు, మన జాతి అనే నినాదాలిస్తున్నారు. ఇప్పుడు యూరప్‌కు గుదిబండగా మారిన శరణార్థుల సమస్య, అక్కడక్కడ చోటుచేసుకుంటున్న ఉగ్రవాద ఘటనలు ఇందుకు మూల కారణాలని వస్తున్న విశ్లేషణల్లో అర్ధ సత్యం మాత్రమే ఉంది. అవి తక్షణ కారణం అయితే కావొచ్చుగానీ అంతకుమించి దశాబ్దాలుగా అమలవుతున్న ప్రపంచీకరణ విధానాల్లో ఇందుకు సంబంధించిన బీజాలున్నాయి. ప్రపంచీకరణ తళుకుబెళుకులు చూసి మూర్ఛిల్లి దాన్ని పెట్టుబడి దారీ విధాన విజయంగా అభివర్ణించినవారు ఆ విధానాలు పెంచుతూ పోతున్న అసమానతలను విస్మరించారు.
అన్ని దేశాల్లోనూ స్వల్ప సంఖ్యాకులైన కార్పొరేట్ దిగ్గజాల చేతుల్లో సంపదంతా కేంద్రీకృతమవుతున్నదన్న వాస్తవాన్ని దాచడానికి ప్రయత్నించారు. కింది వర్గాల బాగోగుల్ని, సంక్షేమాన్ని పట్టించుకోని విధానాలు అసంతృప్తికీ... చివరకు తిరుగుబాటుకు దారితీస్తాయని గ్రహించలేకపోయారు. పాశ్చాత్య దేశాల్లో చాలాచోట్ల కార్మికుల వేతనాలు 2008 తర్వాత స్తంభించి పోయాయని, ఉపాధి కల్పన అంతంతమాత్రమేనని గుర్తిస్తే ప్రపంచీకరణ సామాన్య పౌరుల జీవితాలను ఎంతగా దిగజార్చిందో అర్ధమవుతుంది. అమె రికాలో బెర్నీ శాండర్స్ వంటివారు సంక్షేమ పథకాలను ప్రతిపాదించి, సహజ వనరులపై కార్పొరేట్ దిగ్గజాల ఆధిపత్యాన్ని తొలగించడమే సమాజం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారమని సూచించారు. ఇందుకు భిన్నంగా మితవాదులు దేశ సరిహద్దుల్ని మూసేయడం, ముస్లింలను వెళ్లగొట్టడం, జాతి ఔన్నత్యాన్ని పునరుద్ధరించడం అన్ని సమస్యలకూ పరిష్కారమార్గాలుగా చెబుతు న్నారు. ఉగ్రవాద భూతాన్ని చూపి విద్వేషాలను రెచ్చగొడుతున్నారు.
ప్రస్తుత రెఫరెండంలో ఇంగ్లండ్, వేల్స్‌లు రెండూ బ్రెగ్జిట్ వైపు బలంగా నిల బడ్డాయి. ఈయూ నుంచి వైదొలగాలన్న వాదనకు ఇంగ్లండ్‌లో 53.2 శాతంమంది అంగీకరిస్తే...వేల్స్‌లో 51.7 శాతంమంది మద్దతుగా నిలిచారు. అందుకు భిన్నంగా స్కాట్లాండ్‌లో 62శాతంమంది, నార్తర్న్ ఐర్లాండ్‌లో 55.7 శాతంమంది ఈయూలో ఉండటానికే మొగ్గు చూపారు. నిరాదరణకు గురైన వర్గాలు, శ్వేతజాతీయులు అధికంగా ఉండే ఇంగ్లండ్ ప్రాంతంలో బ్రెగ్జిట్‌కు అనుకూలత వ్యక్తం కావడంలో వింతేమీ లేదు. వేల్స్‌లోనూ అదే స్థితి. ఈయూలో కొనసాగడానికి మొగ్గుచూపిన స్కాట్లాండ్, నార్తర్న్ ఐర్లాండ్‌లలో సైతం కార్మికవర్గ ప్రాబల్యం ఉన్న చోట్ల బ్రెగ్జిట్‌కు అనుకూలత రావడం కింది వర్గాల్లో వర్తమాన స్థితిపై ఉన్న అసంతృప్తిని వెల్లడిస్తుంది. ఈయూలో కొనసాగడమే సురక్షితమని లేబర్ పార్టీ అగ్రనేతలంతా కలిసికట్టుగా ప్రకటించినా ఈ వర్గాలు ఏమాత్రం ఖాతరు చేయలేదు.
సమస్యలపట్ల సూత్రబద్ధ వైఖరిని ప్రదర్శించడం కాక అధికారమే పరమావధిగా స్వరం మార్చడం వల్ల అంతిమంగా నష్టపోక తప్పదని ప్రధాని కామెరాన్ ఈపాటికి గ్రహించి ఉంటారు. నిరుడు జరిగిన బ్రిటన్ ఎన్నికల్లో రెఫరెండం ప్రతిపాదన తెచ్చిందీ, ఈయూనుంచి వైదొలగడానికి అనుకూలమని చెప్పిందీ ఆయనే. ఇది ఎలాగూ అయ్యేది కాదనుకుని ఆయన ఈ హామీ ఇచ్చారు. తీరా ఆ పరిస్థితి ఎదురయ్యేసరికి స్వరం మార్చారు. మొత్తానికి రెఫరెండం ఉదారవాద పక్షాలకు ఒక హెచ్చరిక. పౌరుల్లో ఇప్పుడు నెలకొన్న అసంతృప్తిని చల్లార్చే చర్యలు చేపట్టకపోతే అది అంతి మంగా బ్రిటన్ విచ్ఛిన్నానికి దారితీయొచ్చునని ఫలితాలు చాటిచెబుతున్నాయి.