బ్రిటన్‌తో విడిపోతాం | We will not be in Britain have to move separate | Sakshi
Sakshi News home page

బ్రిటన్‌తో విడిపోతాం

Published Sat, Jun 25 2016 2:49 AM | Last Updated on Mon, Sep 4 2017 3:18 AM

బ్రిటన్‌తో విడిపోతాం

బ్రిటన్‌తో విడిపోతాం

- ఈయూతో కలిసుంటాం
- బ్రెగ్జిట్‌ ఫలితాల నేపథ్యంలో స్కాట్లాండ్ అడుగులు
- ఉత్తర ఐర్లాండ్‌లోనూ ఇవే డిమాండ్లు
 
 ఎడిన్‌బర్గ్: ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా చూసిన బ్రెగ్జిట్ ఫలితాలు వచ్చేశాయి.. యురోపియన్ యూనియన్(ఈయూ) నుంచి బ్రిటన్ విడిపోవడం ఖాయమైంది.. మరి బ్రిటన్ అధీనంలో ఉన్న స్కాట్లాండ్ పరిస్థితి ఏంటి? మొదట్నుంచీ ఈయూలో ఉండేందుకే మొగ్గుచూసిన స్కాట్లాండ్ ఇప్పుడు ఏం చేస్తుంది? బ్రెగ్జిట్‌పై నిర్వహించిన ఎన్నికల్లో స్కాట్లాండ్‌లో మెజారిటీ ప్రజలు ఈయూలో కొనసాగేందుకే మొగ్గుచూపారు. ఏకంగా 62 శాతం మంది ఈయూకే జైకొట్టారు. 38 శాతం మంది మాత్రమే బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ఓటేశారు. దేశంలో ఎక్కువ మంది ఈయూలో ఉండేందుకే మొగ్గుచూపారు కాబట్టి భవిష్యత్తులో తమ అడుగులు అటువైపే ఉంటాయని స్కాట్లాండ్ ఫస్ట్ మినిస్టర్, స్కాటిష్ నేషనల్ పార్టీ(ఎన్‌ఎన్‌పీ) అధినేత నికోలా స్టర్జియన్ ప్రకటించారు. ‘‘ఈయూలోనే కొనసాగుతామంటూ స్కాట్లాండ్ ప్రజలు విస్పష్ట తీర్పు ఇచ్చారు. నేను దాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా’’ అని ఆమె పేర్కొన్నారు.

బ్రిటన్ నుంచి విడిపోవాలా వద్దా అన్న అంశంపై 2014లో స్కాట్లాండ్ కూడా ప్రజాభిప్రాయ సేకరణ జరిపింది. అయితే మెజారిటీ ప్రజలు బ్రిటన్‌లో ఉండేందుకే మొగ్గుచూపారు. అయితే ప్రస్తుతం ఈయూ నుంచి బయటకు వచ్చే బ్రిటన్‌తో కలిసి ఉండాల్సిన అవసరం లేదన్న డిమాండ్లు స్కాట్లాండ్‌లో వెల్లువెత్తుతున్నాయి. బ్రెగ్జిట్ తీర్పు నేపథ్యంలో స్కాట్లాండ్‌లో రెండోసారి ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని మాజీ ఫస్ట్ మినిస్టర్ అలెక్స్ సాల్మాండ్ డిమాండ్ చేశారు. ఒకవేళ స్కాట్లాండ్ బ్రిటన్ నుంచి విడిపోతే మూడు శతాబ్దాల చారిత్రక బంధాన్ని తెంచుకున్నట్టు అవుతుంది. అయితే బ్రిటన్‌తో విడాకులు అంత సులువు కాదని, ఒకవేళ విడిపోతే నిలదొక్కుకోవడం కష్టమని మరికొందరు వాదిస్తున్నారు. బ్రిటన్‌లేని ఈయూతో ఉండడం స్కాట్లాండ్‌కు పెద్దగా లాభించదని వారు చెబుతున్నారు. అటు ఉత్తర ఐర్లాండ్‌లో కూడా మెజారిటీ ప్రజలు బ్రెగ్జిట్‌కు వ్యతిరేకంగా, ఈయూలో కొనసాగేందుకు అనుకూలంగా ఓటేశారు. దీంతో అక్కడ కూడా బ్రిటన్ నుంచి బయటకు వచ్చేసి, ఐర్లాండ్‌తో కలిసిపోవాలన్న డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి.

 ‘మాకు స్వాతంత్య్రం కావాలి’: యూకే రాజధాని లండన్‌ను యురోపియన్ యూనియన్లో ఉంచాలనే కొత్త ఉద్యమం మొదలైంది. మేయర్ సాదిక్ ఖాన్ నేతృత్వంలో దాదాపు 40వేల మంది లండన్ ప్రజలు తమ నగరాన్ని యూకే నుంచి స్వతంత్య్రం చేసి యురోపియన్ యూనియన్లో కలపాలంటూ సంతకాలు సేకరించారు. గురువారం నాటి రెఫరెండంలో 60 శాతం మంది లండన్ ప్రజలు బ్రెగ్జిట్‌కు వ్యతిరేకంగా ఓటేశారు.
 
 1958 నుంచి 58 ఏళ్లు...
 ప్రస్తుతం మనం చూస్తున్న యూరోపియన్ యూనియన్ మాస్ట్రిచ్ ఒప్పందం ద్వారా 1993 నవంబర్ 1న ఏర్పడింది.  క్లుప్తంగా చెప్పాలంటే ఇది ఒక రాజకీయ, ఆర్థిక కూటమి. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత యూరోప్... సోవియట్, పశ్చిమ దేశాల ప్రభావిత ప్రాంతాలుగా చీలిపోయింది.  యూరోప్ దేశాల మధ్య యుద్ధాల నివారణ, ఆర్థికాభివృద్ధి ఉద్దేశంతో 1945లో ప్రారంభమైన ‘ఏకీకరణ’ ఆలోచన... ఎన్నో పరిణామ దశలు దాటుకుంటూ ప్రస్తుతం 28 దేశాల స్థాయికి విస్తరించింది. 28 ఈయూ దేశాల్లో 19 ఉమ్మడి కరెన్సీ ‘యూరో’ను అనుసరిస్తున్నాయి.

 1958: యూరోపియన్ ఎకనమిక్ కమ్యూనిటీ (ఈఈసీ) ఏర్పాటు.
 1963: కామన్ మార్కెట్‌లో చేరడానికి బ్రిటన్ దరఖాస్తు. ఫ్రాన్స్ వీటో. 1967లోనూ ఇదే పరిస్థితి.
 1973: ఎట్టకేలకు కామన్ మార్కెట్‌లోకి బ్రిటన్ ప్రవేశం.
 1975: జూన్ 5న ఈఈసీలో కొనసాగాలా? వద్దా? అన్న అంశంపై బ్రిటన్‌లో రెఫరెండమ్. కొనసాగడానికే 67 శాతంమంది అనుకూలం.
 1992: ఎక్స్ఛేంజ్ రేట్ వ్యవస్థ నుంచి తప్పుకున్న బ్రిటన్. దీనితో బ్రిటన్ పౌండ్ భారీ పతనం. యూనియన్‌లో కొన్ని దేశాల మధ్య ఏకైక కరెన్సీ ‘యూరో’ ఏర్పాటుకు దారితీసిన పరిణామం.
 1996: మ్యాడ్ కౌ వ్యాధి నేపథ్యంలో... బ్రిటన్ బీఫ్‌ను నిషేధించిన ఈయూ
 2002:  12 ఈయూ దేశాలు యూరోలోకి ప్రవేశం. బ్రిటన్ దూరం.
 2008: ప్రపంచ ఆర్థిక సంక్షోభం. గ్లోబల్ బెయిల్ అవులవుట్ ఫండ్ ఏర్పాటు. బ్రిటన్ భాగస్వామ్యం.
 2011: రెండవ బ్యాంకింగ్ సంక్షోభం. బ్రిటన్‌సహా మరొక యూరోప్ ఇంటర్నేషనల్ బెయిలవుట్.
 2016: ఈయూ నుంచి విడిపోవాలని బ్రిటన్ ప్రజల నిర్ణయం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement