బ్రెగ్జిట్కు బ్రేక్!?
- యూరోపియన్ కమ్యూనిటీస్ చట్ట సవరణ బిల్లుపై 'రాజకీయ' మేఘాలు
- ఆమోదం పొందకుండా ఎంపీల వ్యూహాలు.. అదే జరిగితే ప్రభుత్వ పతనం ఖాయం
లండన్: బ్రెగ్జిట్ కథ ఇంకా ముగియలేదు. మరో మలుపు తీసుకుని పూర్తిగా బ్లాక్ అయ్యే అవకాశమూ లేకపోలేదు! అవును. శుక్రవారం వెల్లడైన బ్రెగ్జిట్ రెఫరెండంకు సంబందించిన బిల్లును పార్లమెంట్ లో అడ్డుకుని, వీగిపోయేలా అన్ని పార్టీల ఎంపీలు వ్యూహరచనలు చేస్తున్నట్లు హౌస్ ఆఫ్ కామన్స్ వర్గాల సమాచారం.
బ్రిటన్ లో అధికార కంజర్వేటివ్ పార్టీ సహా ప్రతిపక్ష లేబర్ పార్టీ, స్కాటిష్ నేషనల్ పార్టీ, లిబరల్ డెమోక్రటిక్ పార్టీలకు చెందిన ఎంపీల్లో అత్యధికులు మొదటి నుంచి బ్రెగ్జిట్ ను వ్యతిరేకిస్తున్నారు. అంతేకాదు.. వీరిలో కొందరు బ్రిటన్ ఈయూలోనే కొనసాగేలా 'రిమెయిన్' కు ఓటు వేయాల్సిందిగా పెద్ద ఎ్తతున ప్రచారం చేశారు. లేబర్ పార్టీ ఎంపీ జో కాక్స్ బ్రెగ్జిట్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న సమయంలోనే హత్యకు గురయ్యారు. గత వారం బిర్ స్టల్ లో ఆమెను హత్యచేసిన దుండగుడు.. బ్రెగ్జిట్ పై కాక్స్ అభిప్రాయం నచ్చకే హత్యచేశానని పేర్కొనడం గమనార్హం. 'బ్రెగ్జిట్ ను అడ్డుకునే క్రమంలో సహచర ఎంపీ ప్రాణాలు పణంగా పెట్టినప్పుడు మనం పదవులను పణంగా పెట్టలేమా?' అనే వాదన ప్రస్తుతం ఎపీల మధ్య నడుస్తున్నట్లు సమాచారం.
ప్రజాతీర్పు (రెఫరెండం)నకు వ్యతిరేకంగా వెళ్లాలనుకోవడం అన్ని పార్టీలకూ రాజకీయ ఆత్మహత్య వంటిదే. ఎంపీలుగానీ బ్రెగ్జిట్ బిల్లును ఆమోదించకుంటే దేశంలో అలజడి మొదలవుతుంది. తద్వారా ప్రభుత్వం కుప్పకూలుతుంది. ఎంపీలు తిరిగి ప్రజా తీర్పు కోరాల్సి ఉంటుంది. అప్పుడు జనం చేత చీత్కారం ఎదుర్కోవాల్సిఉంటుంది. ఇదంతా ఓ ప్రహాసనం. అయితే ఎంపీలు రెఫరెండంను కాదనే దుస్సాహసం చేయబోరని, బిల్లు తప్పక ఆమోదం పొందుతుందని బ్రిగ్జిట్ ను బలంగా సమర్థిస్తోన్న యూకే ఇండిపెండెంట్ పార్టీ నేతలు అంటున్నారు.
బ్రిగ్జిట్ రిఫరెండం ఫలితాలపై చర్చించేందుకు అతి త్వరలోనే సమావేశం కానున్న బ్రిటన్ పార్లమెంట్.. 1972నాటి యూరోపియన్ కమ్యూనిటీస్ చట్టానికి సవరణలు చేయనుంది. ఈ చట్టానికి సవరణలు చేస్తేనేగానీ 28 దేశాల కూటమి(ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలిగే మార్గం సుగమంకాదు. వైదొలిగే ప్రక్రియ పూర్తయ్యేందుకు దాదాపు రెండేళ్ల కాలం పడుతుంది. అయితే ఆదిలోనే ఎంపీలు బ్రెగ్జిట్ కు వ్యతిరేకంగా ఓటువేస్తే ప్రభుత్వం కూలిపోయి 2020లో జరగాల్సిన సార్వత్రిక ఎన్నికలు ఈ ఏడాదే జరిగే అవకాశం ఉంది.