లండన్: యూరోపియన్ యూనియన్ ఏర్పడాలనే ఆకాంక్ష సాకారమైంది 1993, నవంబర్ ఒకటవ తేదీనే కావచ్చు. ఆకాంక్షకు అంకురార్పణ జరిగింది మాత్రం 1948లోనే. నెదర్లాండ్స్‌లోని ఫ్రాగ్ సిటీలో జరిగిన యూరప్ కాంగ్రెస్‌లో బ్రిటిన్ మాజీ ప్రధాన మంత్రి విన్‌స్టన్ చర్చిల్ ప్రసంగిస్తూ యూరప్ దేశాలన్నీ ఒకటి కావాలని, ‘యూనెటైడ్ యూరప్’ అంటూ తొలిసారిగా పిలుపునిచ్చారు. అందుకు యూరప్ దేశాల నుంచి కాంగ్రెస్‌కు హాజరైన 20 మంది దేశాధినేతల్లో ఎక్కువ మంది అందుకు అంగీకరించారు. ‘యూరప్ దేశాలన్నీ ఒకటికావాలంటే అందుకు బలమైన ఆకాంక్ష ఉండాలి. స్వేచ్ఛను ప్రేమించే అన్ని దేశాల ప్రజలు, రాజకీయ పార్టీల్లో మెజారిటీ సభ్యులు మనస్ఫూర్తిగా ఐక్యతకు కోరుకోవాలి. ఓటు ఎటు వేస్తారన్నది అప్రస్తుతం.
యూరప్ అంతా ఒక్కటి కావాలనే లక్ష్యం విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదు. అప్పుడే ఏదోరోజు మనమంతా ఒక్కటవుతాం. ఆ రోజు కోసం నిరీక్షిద్దాం’ అని చర్చిల్ సభా ముఖంగా మాట్లాడారు. యూరప్ ఒకటికావాలనే ఆకాంక్ష వ్యక్తం కావడమే కాకుండా కార్యరూపం దాల్చింది కూడా నెదర్లాండ్స్‌లోనే అవడం ఓ విశేషం.
వాస్తవానికి ఆ నాటి యూరప్ సభను ప్రత్యేకంగా ఏ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. దానికి అధికారిక గుర్తింపు కూడా లేదు. కొన్ని యూరప్ దేశాలు అప్పటికప్పుడు అనుకొని సమావేశమయ్యాయి. భారత్ నుంచి 1948లో బ్రిటీష్ సైన్యాన్ని ఉపసంహరించుకున్న నేపథ్యంలోనే ఈ సమావేశం జరిగింది. భారత్ నుంచి ఈ సైనిక ఉపసంహరణ యూరప్ కాంగ్రెస్‌పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకునేందుకే ‘బ్రిటీష్ పాతే’ అనే బ్రాడ్‌క్యాస్టింగ్ సంస్థ చర్చిల్ ప్రసంగాన్ని రికార్డు చేసింది. భారత్ నుంచి బ్రిటీష్ సైన్యాన్ని ఉపసంహరించుకున్న చారిత్రక నేపథ్యం లేకపోయినట్లయితే చర్చిల్ ప్రసంగాన్ని వీడియో తీసేవారే కాదు. అప్పుడు చర్చిల్ యూరోపియన్ యూనియన్ గురించి ఏమన్నారో కూడా మనకు తెలిసేకాదు. ఇప్పుడు బ్రిటన్ పౌరులు బ్రెక్జిట్‌కు ఓటేసిన సందర్భంలో చర్చిల్ బతికి ఉంటే ఆయన ఎలా స్పందించేవారో!