బ్రెగ్జిట్‌పై ఓటింగ్ సందర్భంగా సమావేశమైన బ్రిటన్ పార్లమెంటు
లండన్: బ్రిటన్ పార్లమెంటులో ప్రధాని థెరెసా మేకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆధునిక బ్రిటన్ చరిత్రలో ఇటువంటి అపజయం ఏ ప్రధానికీ ఎదురుకాలేదు. రెండేళ్లు చర్చలు జరిపి యూరోపియన్ యూనియన్ (ఈయూ)తో ఆమె కుదుర్చుకున్న బ్రెగ్జిట్ (ఈయూ నుంచి బ్రిటన్ నిష్క్రమించడం) ఒప్పందం బిల్లును బ్రిటన్ పార్లమెంటు భారీ ఆధిక్యంతో తిరస్కరించింది. థెరిసా మే కుదుర్చుకొచ్చిన ఒప్పందంపై సొంతపార్టీ ఎంపీల్లో కూడా తొలి నుంచి తీవ్ర వ్యతిరేకత ఉండటం తెలిసిందే. ఈ కారణంగా ఇటీవలే ఆమె సొంతపార్టీలోనే అవిశ్వాస తీర్మానాన్ని కూడా ఎదుర్కొన్నారు. తాజాగా ఒప్పందంపై మంగళవారం బ్రిటన్ పార్లమెంటులో ఓటింగ్ నిర్వహించగా 202 మంది ఈ ఒప్పందాన్ని సమర్థించగా, 432 మంది వ్యతిరేకించారు. అంటే బ్రెగ్జిట్ ఒప్పందం బిల్లు 230 ఓట్ల తేడాతో ఓడిపోయింది.
వంద మందికి పైగా సొంత పార్టీ ఎంపీలే థెరెసా కుదిర్చిన ఒప్పందానికి వ్యతిరేకంగా ఓటేశారు. పార్టీ ్టలోని అవిశ్వాస పరీక్షనే అతి కష్టం మీద గట్టెక్కిన థెరెసా మేకి తాజాగా పార్లమెంటులో మరో కఠిన పరీక్ష ఎదురైంది. ఓటింగ్‌లో బ్రెగ్జిట్ ఒప్పందం ఓడిన వెంటనే ప్రతిపక్ష లేబర్ పార్టీ నేత జెరెమీ కార్బిన్ ఆమెపై హాజ్ ఆఫ్ కామన్స్‌లో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. బ్రిటన్ కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 7 గంటలకు దీనిపై ఓటింగ్ జరగనుంది. బ్రెగ్జిట్ ఒప్పందాన్ని ఆమె సొంత పార్టీ ఎంపీలు కూడా తిరస్కరించినప్పటికీ ప్రతిపక్ష లేబర్ పార్టీ దృక్పథాన్ని కూడా వారు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి అవిశ్వాసంలో మే గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని బ్రిటన్ మీడియా అంచనా వేస్తోంది.
తర్వాత ఏం జరుగుతుంది?
బ్రిటన్ పార్లమెంటు నిబంధనల ప్రకారం ఏదైనా బిల్లు తిరస్కరణకు గురైతే మళ్లీ మూడు పార్లమెంటు పనిదినాల్లోగా ప్రత్యామ్నాయ బిల్లును సభలో ప్రవేశపెట్టాల్సిన బాధ్యత ప్రధానిపై ఉంటుంది. ఆ బిల్లుకు కూడా ఆమోదం లభించని పక్షంలో మరో ప్రత్యామ్నాయాన్ని సిద్ధం చేసేందుకు ప్రధానికి మూడు వారాల సమయం లభిస్తుంది. బ్రెగ్జిట్ బిల్లు పార్లమెంటులో తిరస్కరణకు గురవడంతో దీనిపై తదుపరి చర్చలు జరిపి తగు మార్పులు చేసేందుకు మే బుధవారం బ్రస్సెల్స్ వెళ్తారని ఇప్పటివరకు ఉన్న సమాచారం. అయితే ఒప్పందంలో మళ్లీ మార్పులు చేసేందుకు ఈయూ నేతలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. బ్రెగ్జిట్ బిల్లు తిరస్కరణకు గురవడంపై వారు విస్మయం వ్యక్తం చేశారు. ఇలా అయితే ఏ ఒప్పందమూ లేకుండానే ఈయూ నుంచి బ్రిటన్ నిష్క్రమించాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీంతో వారిని ఒప్పించి, కొన్ని రాయితీలు పొంది, మళ్లీ కొత్త బ్రెగ్జిట్ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం మేకి సవాలే. ఒకవేళ ఆమె గట్టిగా ప్రయత్నించి కొత్త ఒప్పందం చేసుకొచ్చినా దానిపై మళ్లీ పార్లమెంటులో ఓటింగ్ జరుగుతుంది. దీనిని కూడా పార్లమెంటు తిరస్కరిస్తే మేకి మరో మూడు వారాల సమయం లభిస్తుంది. బ్రెగ్జిట్ బిల్లును పార్లమెంటు ఎప్పటికీ ఆమోదించకపోతే ఇక ఏ ఒప్పందమూ లేకుండానే ఈయూ నుంచి బ్రిటన్ బయటకు రావాల్సి ఉంటుంది.
ఇంకో రెండు నెలలే మిగిలింది..
బ్రెగ్జిట్ ప్రక్రియ ఈ ఏడాది మార్చి 29న ప్రారంభం కానుంది. 21 నెలల పాటు ఇది సాగుతుంది. ఆ కాలంలో ఈయూ–బ్రిటన్‌ల మధ్య వాణిజ్య, పౌర సంబంధాలు ఎలా ఉండాలో తెలిపేదే ఈ బ్రెగ్జిట్ ఒప్పందం. ఈ ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు థెరెసా మే రెండేళ్లపాటు ఈయూ నేతలతో చర్చలు జరిపారు. మార్చి 29తో బ్రెగ్జిట్ ప్రారంభం కావాల్సి ఉండటంతో కొత్త ఒప్పందాన్ని కుదుర్చుకుని దాన్ని ఆమోదింపజేసుకునేందుకు బ్రిటన్‌కు దాదాపు ఇంకో రెండు నెలల సమయమే మిగిలి ఉంది. కానీ తర్వాత ఏం చేయాలో ఇప్పటికీ బ్రిటన్ నిర్ణయించుకోలేదు. తాను అవిశ్వాసంలో గెలిస్తే ప్రత్యామ్నాయ ప్రణాళికను వచ్చే వారం పార్లమెంటులో ప్రవేశపెడతానని మే వెల్లడించారు. మంగళవారం రాత్రి ఆమె మాట్లాడుతూ ‘సభ మాట్లాడింది. ప్రభుత్వం ఆలకించింది. ఏం చేయాలో నిర్ణయించేందుకు అన్ని పార్టీలతోనూ చర్చలు జరుపుతాం. ఎంపీలు తమకు ఏం వద్దో చెప్పారు. కానీ వారికి ఏం కావాలో ఎవరూ చెప్పలేదు. ఈ ఓటింగ్‌తో అది మనకు తెలియదు’అని అన్నారు. ‘అన్ని పార్టీల ఎంపీలను నేను కోరేది ఒక్కటే. బ్రిటిష్ ప్రజల మాట వినండి. ఈ అంశాన్ని త్వరగా పరిష్కరించాలని వారు కోరుకుంటున్నారు. అందుకోసం మా ప్రభుత్వానికి సహకరించండి’అని ఆమె అభ్యర్థించారు.
ఇంకా సమయం ఉంది: మెర్కెల్
బెర్లిన్: బ్రెగ్జిట్‌పై చర్చలు జరిపేందుకు ఇంకా సమయం ఉందని జర్మనీ చాన్స్‌లర్ ఎంజెలా మెర్కెల్ అన్నారు. ‘మనకు ఇంకా సమయం ఉంది అయితే బ్రిటిష్ ప్రధాని ఏ ప్రతిపాదన తెస్తారోనని మేం ఎదురుచూస్తున్నాం. ఒప్పందాన్ని బ్రిటిష్ దిగువసభ తిరస్కరించడం పట్ల నేను మిక్కిలి చింతిస్తున్నాను. నష్టాన్ని మేం పరిమితంగా ఉంచాలనుకుంటున్నాం. అందుకే ఒక పద్ధతి ప్రకారం ముందుకెళ్లాలనుకున్నాం. కానీ పద్ధతి లేకుండా అస్తవ్యస్తంగా చేసేందుకు మేం సిద్ధమే. ఇలా అయితే బాగా ఎక్కువ నష్టం జరుగుతుంది’అని ఆమె ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూ అన్నారు.
ఓటు కోసం కాన్పు వాయిదా
గర్భంతో ఉన్న ఓ మహిళా ఎంపీ బ్రెగ్జిట్ బిల్లుపై ఓటు వేసేందుకు తన కాన్పును వాయిదా వేసుకున్నారు. ఆమె బంగ్లాదేశ్ తొలి ప్రధాని షేక్ ముజీబుర్ రహ్మాన్‌కు మనవరాలు, ఈమె ప్రస్తుత బంగ్లాదేశ్ అధ్యక్షురాలు షేక్ హసీనాకు దగ్గరి బంధువు. ప్రతిపక్ష లేబర్ పార్టీ నుంచి ఎన్నికైన టులిప్ సిద్దిఖీ అనే మహిళా ఎంపీ ప్రస్తుతం రెండో బిడ్డకు జన్మనివ్వాల్సి ఉంది. ఫిబ్రవరి 4న సిద్దిఖీకి కాన్పు చేయాలని వైద్యులు అనుకున్నారు. అయితే మధుమేహం రావడంతో గత మంగళవారమే కాన్పు చేయాల ని నిర్ణయించారు. ఓటు వేసేందుకు వెళ్లాలని ఆమె చెప్ప డంతో అందుకు వైద్యులు అనుమతించి, కాన్పును గురువారానికి మార్చారు.
ఓడిపోతే మళ్లీ ఎన్నికలేనా?
బ్రిటన్ ప్రధాని థెరెసాపై ప్రతిపక్ష నేత జెరెమీ కార్బిన్ ప్రవేశపెట్టిన అవిశ్వాసంపై ఓటింగ్ భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి 12.30 గంటలకు మొదలు కానుంది. బ్రిటన్ పార్లమెంటులో అవిశ్వాసంపై ఓటింగ్ జరగనుండటం గత 26 ఏళ్లలో ఇదే ప్రథమం. బ్రెగ్జిట్ బిల్లు విషయంలో ఓడిపోయినా ఈ పరీక్షలో మే నెగ్గుతారనే అంచనాలున్నాయి. ఒకవేళ ఆమె ఓడిపోతే ఏమవుతుందో తెలుసుకుందాం.
స్థిర పదవీకాల పార్లమెంటు చట్టం–2011 ప్రకారం అవిశ్వాసంలో ఓడిపోతే అధికార పార్టీకి రెండు వారాల సమయం లభిస్తుంది. అప్పట్లోపు ప్రభుత్వం మళ్లీ మెజారిటీ సంపాదించుకుని, విశ్వాస తీర్మానం పెట్టి నెగ్గాలి. ఒకవేళ అలా చేయలేకపోతే ప్రధాన విపక్షమైన లేబర్ పార్టీ ఇతర పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు ప్రయత్నిస్తుంది. తగిన బలం సంపాదిస్తే అధికారం వస్తుంది. లేదంటే దిగువ సభ రద్దయ్యి మళ్లీ ఎన్నికలు వస్తాయి. బ్రిటన్‌లో చివరిసారిగా ఇలా 1979లో అవిశ్వాసంలో ప్రభుత్వం ఓడిపోయి ఎన్నికలు వచ్చాయి.
వ్యతిరేకత ఎందుకు?
- ఒప్పందంలోని కొన్ని అంశాలు ఈయూకి అనుకూలంగాను, వివాదాస్పదంగాను ఉన్నాయని ఈ డీల్‌ను విమర్శిస్తున్నవారు చెబుతున్నారు. యూరోపియన్ యూనియన్ నియమాలకు కట్టుబడేలా చేయడం ద్వారా ఈ ఒప్పందం దేశాన్ని ఈయూపై ఆధారపడే స్థితికి నెడుతుందని వారు వాదిస్తున్నారు. కాబట్టి ఒప్పందంలో మార్పులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఈయూ నుంచి కొన్ని రాయితీలు పొందేందుకు థెరిసా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఒప్పందంలో మార్పులు అంగీకరించబోమని ఈయూ నేతలు ప్రకటించారు.
- మరోవైపు, బ్రిటన్‌లోని ఈయూ అనుకూల రాజకీయవేత్తలు ఐరోపాతో మరింత దగ్గర ఆర్థిక సంబంధాలుండాలని కోరుతున్నారు. ఈయూలో వుండటం వల్ల సామాజిక భద్రతా హక్కులకు ముప్పు వుండబోదనే అభిప్రాయం వినవస్తోంది.
- బ్రిటన్‌లో భాగంగా వున్న ఉత్తర ఐర్లాండ్ – ఈయూలో భాగంగా వున్న ఐర్లాండ్ మధ్య ఎలాంటి సరిహద్దు ఏర్పాటు చేయరాదని ఈ ఒప్పందంలో పేర్కొనడం కూడా వివాదాస్పదమైంది.
థెరిసాపై విమర్శల వెల్లువ
ఒప్పందంపై అటు థెరిసా కేబినెట్‌లోనూ, ఇటు దేశంలోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అధికార కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలను ఒక్క తాటిపైకి తీసుకురావడానికి బదులు వారి మధ్య చీలికల్ని ఆమె ఇంకాస్త పెద్దవి చేశారని బ్రిటన్ రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆమె తన పక్షంతోనే చర్చించడం, భిన్నాభిప్రాయాలు గలవారితో చర్చలు జరపకపోవడం వల్ల పరిస్థితి మరింత గడ్డుగా మారిందంటున్నారు. ఈయూకు వ్యతిరేకంగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఇరు శిబిరాల మధ్య దూరాన్ని పెంచాయని, ఈయూలో ఏ ఒక్కరితోనూ ఆమె స్నేహాన్ని పెంపొందించుకోలేకపోయారని విశ్లేషిస్తున్నారు. ఒక రాజకీయవేత్తగా ఆమె ఇరుకు ఆలోచనా ధోరణి, కఠిన వైఖరి దేశానికి చెరుపు చేస్తోందంటున్నారు.
ఆర్థిక మాంద్యం తప్పదు
ఒప్పందం లేకుండా ఈయూ నుంచి విడిపోయినట్టయితే బ్రిటన్ తీవ్రంగా నష్టపోతుందనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. అదే జరిగితే బ్రిటన్ తీవ్ర ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయి ఓ శతాబ్ది కాలం వెనక్కి వెళుతుందని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ ఇప్పటికే హెచ్చరించింది. బ్రిటన్ ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోకుండా ఈయూ నుంచి బయటకు వస్తే – ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) నియమాలకు అనుగుణంగా వాణిజ్యం చేయాల్సివుంటుంది. ఒప్పందం కుదరకపోతే బ్రిటన్‌కు మంచిదేనని, ఆ విధంగా ఈయూ నియమాల నుంచి విముక్తి లభించినట్టవుతుందని, ఇతర దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి వీలవుతుందని మరికొందరి వాదన.
ఒప్పందం లేకుంటే నష్టమే..
ఒప్పందం లేకుండా, ఎలాంటి పరివర్తనా వ్యవధి లేకుండా (మార్చి 29 రాత్రి 11 గంటలకు యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ అధికారికంగా నిష్క్రమించాల్సివుంది. తర్వాత 21 మాసాల పరివర్తనా కాలం మొదలవుతుంది) బ్రిటన్ నిష్క్రమించడం వల్ల ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై, ప్రత్యేకించి ఐర్లాండ్ (ఈయూ)లోని పలు రంగాలపై తీవ్ర ఒత్తిడి పడే ప్రమాదముంది. తమ దేశంలో ఆహారానికి, మందులకు తీవ్ర కొరత ఏర్పడుతుందని ఐర్లాండ్ ఆందోళన చెందుతోంది. ఈయూకి బ్రిటన్ చేసే ఎగుమతుల్లో ఐర్లాండ్ వాటా 12.4 శాతం. పెట్రోలియం, మందుల కోసం ఐర్లాండ్ భారీ ఎత్తున యూకేపై ఆధారపడుతోంది.
ఒప్పందంలోని ముఖ్యాంశాలు
- 2019 మార్చి 29 రాత్రి 11 గంటలకు యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ అధికారికంగా నిష్క్రమిస్తుంది. తర్వాత మొదలయ్యే 21 మాసాల పరివర్తనా కాలంలో.. ఎటువంటి సుంకాలు లేకుండా ఈయూ – యూకే స్వేచ్ఛగా వాణిజ్యం చేసుకోవచ్చు. ఈయూ నిబంధనలను బ్రిటన్ అనుసరించాల్సివుంటుంది. ఈ కాలంలో ఈయూ వ్యవస్థలు తీసుకునే నిర్ణయాలకు యూకే కట్టుబడి వుండాలి. యూరోపియన్ కోర్టు ఆఫ్ జస్టిస్ (ఈసీజే) పరిధిలోనే కొనసాగాలి. అవసరమనుకుంటే, జాయింట్ కమిటీ 2020 జూలె ఒకటిలోగా పరివర్తనా కాలాన్ని పొడిగించవచ్చు. ఎంతకాలం పొడిగిస్తారనే విషయమై స్పష్టత లేదు.
- ఆర్థిక లావాదేవీలు పరిష్కరించుకోవడంలో భాగంగా.. విడిపోయేటప్పుడు ఈయూకి బ్రిటన్ 39 బిలియన్ పౌండ్లు (5,100 కోట్లు) నష్టపరిహారంగా చెల్లించాల్సివుంటుంది. పలువురు రాజకీయ వేత్తలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు.
- పౌరుల నివాస హక్కులకు ఈ ఒప్పందం గ్యారంటీ ఇస్తుంది. ఇప్పుడు వున్న చోటే చదువుకుని, ఉద్యోగాలు చేసే వీలుంటుంది.
- బ్రిటన్‌లో భాగంగా వున్న ఉత్తర ఐర్లాండ్ – ఈయూలో బాగంగా వున్న ఐర్లాండ్ మధ్య ప్రస్తుతానికి ఎలాంటి సరిహద్దు ఏర్పాటు చేయరు. రాకపోకలకు ఎలాంటి ఆంక్షలూ వుండవు.
Comments
Please login to add a commentAdd a comment